Monday, March 16, 2015

సందడే సందడి

       “ఏమిటంత అలసటగా వున్నావ్?” వాడిపోయిన తంతి మొహం చూస్తూ అడిగింది విద్య. నాకూ విద్యాలయానికీ రోజుకోసారైనా కలసి కబుర్లు చెప్పుకోకపోతే తోచదు. ఈ వేళ పాఠశాల మెయిల్ కూడా మాతో కలసింది. 
“ఏం చెప్పమంటావ్, ఆ టీచర్లేవో "ఈ వారం ఈ పాఠం చెప్పాం, ఇదిగో ఈ కొత్త పద్యం నేర్పించాం." అంటూ అడపాదడపా ఓ కబురు పంపిస్తుండేవాళ్ళు. తీరగ్గా హాయిగా ఉండేది. ఇదిగో ఇప్పుడీ వార్షికోత్సవం వస్తోందిగాపగలూ రాత్రీ తీరక లేదంటే నమ్ము” మొరపెట్టుకుంది తంతి.  
“అవున్లే, మరి వార్షికోత్సవం అంటే బోలెడు పనులుంటాయిగా!” సానుభూతి చూపించింది విద్య.
“అయితే నీకేమిటి? నువ్వేమన్నా దానికోసం ఊరూ, వాడా తిరిగి పన్లు చేస్తున్నావా?” ఆశ్చర్యంగా అడిగాను.   
“నీకేం తెలీదు శర్కరీ. వార్షికోత్సవానికి బోలెడుమంది కార్యకర్తలు కమీటీలుగా ఏర్పడి పని చేస్తారు. భోజనం ఏర్పాట్లకో కమిటీ, జ్ఞాపికల తయారీకో కమిటీ, అలంకరణకొకటి, ఆహ్వానాలకొకటి, ఫోటోలకొకటి, వీడియోలకొకటి,...ఇలా చాలా చాలా ఉంటాయి” వివరించింది విద్య.
“అయితే?” 
“అయితే ఏమిటీ వాళ్ళందరూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరో ఒకరు అది కావాలనో ఇది కావాలనో ఓ కబురు పంపడం, దానికి మరొకరు వెంటనే సమాధానం చెప్పడం.”
“అవన్నీ నీక్కూడా చెప్తారా?” సందేహంగా అడిగాను.
“ఆవన్నీ నా ద్వారానేగా మరీ. ఫుడ్ కమిటీ గురించి చెప్తా విను. "ఇదిగోనండి వార్షికోత్సవానికి నాలుగొందల మంది వస్తున్నారు, మనం వంటలవీ ఇంట్లోనే చేద్దాం, ఇవి ఇవి చేస్తే బావుంటుంది. ఇందులో మీరేం చేస్తారు? అని అడిగారు." దానికి పులిహోర చేస్తామని కొందరు, దద్దోజనమని కొందరు, గొంగోర పచ్చడిని, బంగాళ దుంప కుర్మా అని ఇలా ఒకటేమిటి బోలెడు మంది అవీ ఇవీ చేస్తామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు”
“అబ్బో భలేగా ఉందే! ఈ జ్యోతసలే నాకేమీ చేసి పెట్టదు. అప్పుడెప్పుడో ఓ మూడేళ్ళ క్రితం చెక్కలు, ఆ తరువాతేదో గులాబ్ జామున్ తప్ప మరేమీ రుచి చూసి ఎరగను. నువ్వా పేర్లు చెప్తుంటేనే నూరూరిపోతోంది.”
"అవునూ...వార్షికోవత్సవానికి ఈ వంటలవీ ఎందుకు?" సందేహం వ్యక్తపరిచాను.
     
"పాఠశాల విద్యార్ధులను అభినందిస్తూ వారికి  ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందజేసే ఉత్సవాన్ని మీరెల్లరూ కనులారా తిలకించి చందన తాంబూలాలు స్వీకరించ ప్రార్ధన." అంటూ అందర్నీ ఆహ్వానించారు. 

“ఇంకా ఏమేం కార్యక్రమాలున్నాయో అవీ చెప్పు” ఉత్సాహంగా అడిగింది విద్య.
"పాటలు, పద్యాలు, నాటికలూ, బుఱ్ఱ కథ, సోది .." 
"ఏమిటేమిటీ బుఱ్ఱ కథ సోదీనా" సంబర పడింది విద్య. 
"బుఱ్ఱ కథ స్క్రిప్ట్ ఎంత బావుందనుకున్నావు?" మరింత ఊరించింది తంతి. 
"మరివన్నీ తెలుగురాని ఆ పిల్లలతో చేయించాలంటే బోలెడు శ్రమ కదూ!" అడిగాను.
"చిన్నగా అంటున్నారా? ఆ టీచర్లు మీ పిల్లలకీ డైలాగులు నేర్పించండి, ఈ పాటలు ఈ ట్యూన్ లో పాడించండి, మీరు ఇంటి దగ్గర చెప్పిస్తే స్పష్టంగా చెప్పగాలగుతారు. అని తల్లిదండ్రులతో ఎంతో ఇదిగా చెప్తున్నారు."
"నిజమేలే పాపం టీచర్లకా మాత్రం తాపత్రయం ఉంటుందిగా. అవన్నీ చక్కగా చేస్తే వాళ్ళ విద్యార్ధులను బోలెడు మంది మెచ్చుకుంటారని, ఆ ఉత్సాహంతో ఆ పిల్లలు ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకుంటారనీ వీళ్ళా శ్రమ తీసుకోవడం". వివరించింది విద్య.

"మరో విషయం చెప్తా వినూ! పిల్లలు చెప్పిన పద్యాలు, పాటలు, తెలుగులో సరదాగా మాట్లాడిన వీడియోలు పంపని అడుగుతున్నారు"
"ఎందుకవన్నీ?" ఆశ్చర్యంగా అడిగాను.
"వాటితో సరదాగా వీడియో చేసి అందరికీ చూపిస్తారు" ఎంతో ఇష్టంగా చెప్పిందా మాట.
“వీటన్నింటిలో పాలుపంచుకోవడానికి అదృష్టం ఉండాలి” మనస్ఫూర్తిగా అన్నానా మాట. ఏ కార్యక్రమమైన జరిగేది ఓ రెండు గంటలు లేదా ఒక పూట మాత్రమే. అదీ బోలెడు హడావిడిగా జరిగిపోతుంది. ముందుగా నలుగురు కలసి సంతోషంగా చేసుకునే ఏర్పాట్లలోనే ఉంటుంది సరదా అంతానూ. అప్పటికి తంతి మూడ్ మారినట్లుంది. ఇక ఇక్కడి నుండి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టింది. 
“ఇంకా వినూ. జ్ఞాపికలేవో అచ్చేయిస్తారట. వాటికి అచ్చ తెలుగులో పేర్లు వ్రాసి పంపించాలట" అంటూ పకాపకా నవ్వింది. 
"అందులో అంత నవ్వాల్సిందేముంది?" అడిగింది విద్య. 
మా క్లాసులో కొన్ని ఇంటి పేర్లు తప్పుగా పడ్డాయి, బారటం కి బారతం, తేళ్ళ బదులు తెల్ల, వడమాలకు బదులు వాదముల అని పడింది. అని ఓ టీచర్ చెప్పారు." వస్తున్న నవ్వు ఆపుకుని చెప్పింది.
“ఇంకా?” నాకా కబుర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.
“మాకు తోకలు కావాలని ఓ టీచర్..."  అంటూ ఫక్కున నవ్వింది తంతి.  
"ఎందుకట?" తనూ నవ్వింది విద్య.
"వాళ్ళ తరగతి విద్యార్ధులు అడవి జంతువుల వేషాలు వేస్తున్నారట” 
"ఉపాధ్యాయుల సంగతి సరే మరి కార్యకర్తలు ఏం చేస్తున్నారు?" గతస్మృతులేవో గుర్తొచ్చినట్లున్నాయి విద్యకి. 
“వారానికో మీటింగ్ పెట్టి "ఎవరే పని చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?" అంటూ ఒకటే ప్రశ్నలు. దానికేదో సమాధానమొస్తుందా. వెంటనే "మీకేమన్నా సహాయం కావాలంటే మేం చేస్తామంటూ" మరొకరు చటుక్కున ముందుకొస్తారు”
"కొంతమంది కార్యకర్తలయితే రెండు మూడు కమిటీలలో కూడా పనిచేస్తున్నారు"
"అవునా?"
"అప్పుడెప్పుడో శ్రీరామ నవమికి పందిళ్ళు వేసి వూరు ఊరంతా సందడి చేసేవారు చూడండి. అలా వీరు ఈ ఉగాదికి అంతా ఒక కుటుంబంలా కలసిపోయి ఏర్పాట్లు చేసుకుంటున్నారు."
"వాళ్ళ పేర్లూ అవీ చెప్పకూడదా?" ఆసక్తిగా అడిగాను. 
"వార్షికోత్సవమయ్యాక ఆ విశేషాలన్నీ నాకు తెలుస్తాయి. అప్పుడు నీకూ చెప్తాలే" అంటూ వెళ్ళడానికి తయారయింది విద్య.
"అక్కడ నాకోసం ఏమేమి కబుర్లు ఎదురుచూస్తున్నాయో! నేనూ వస్తాను" అంటూ లేచింది తంతి.
"అవునా ఆ ఫోటోలు, వీడియోలవీ తీసుకుని త్వరలో మీరిటు రావాలి మరి" అంటూ వీడ్కోలు పలికాను. 


6 comments: 1. >>>>“నీకేం తెలీదు శర్కరీ. వార్షికోత్సవానికి బోలెడుమంది కార్యకర్తలు కమీటీలుగా ఏర్పడి పని చేస్తారు. భోజనం ఏర్పాట్లకో కమిటీ, జ్ఞాపికల తయారీకో కమిటీ, అలంకరణ కోకటి, ఆహ్వానాల కోకటి, ఫోటోల' కొకటి', వీడియోల 'కొకటి',...ఇలా చాలా చాలా ఉంటాయి” వివరించింది విద్య.>>>>

  అమ్మాయ్! బడి పనిలో ఉన్నావని తెలిసింది కాని ఈ కోకటి ఏంటో తెలీలేదుస్మీ :)

  ReplyDelete
  Replies
  1. :)
   ఎన్నిసార్లు వెతికినా యిట్టె తప్పించుకుంటాయి కొన్ని. బాగా పట్టుకున్నారు. మార్చాను బాబాయి గారు. ధన్యవాదాలు.

   Delete
 2. baavundandi :) mii photo lu vedeo lo tonadaragaa chupinchandi .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాధిక గారు.

   Delete
 3. వార్షికోత్సవ ఏర్పాట్లు బాగున్నాయి. మీ స్కూల్ చక్కగా వర్దిల్లాలి .

  ReplyDelete
  Replies
  1. మీవంటి ఉపాధ్యాయుల శుభాశీస్సులుంటే పాఠశాల ప్రగతి బాటలోనే నడుస్తుంది. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.