Wednesday, March 4, 2015

పెళయ కావేరి కతలు

        ఆ పొద్దు నిదర లేసే యాళకి సందమామ పరంటికి వాలతా వుండాడు. పిలకాయలు, ఇంటాయినా గుర్రుపెడతా పొణుకోనుండారు. అట్టిట్ట తిరిగి యేదన్నా సదూదామని 'కినిగె' తట్టు యెతుకులాడితే 'ప్రళయ కావేరి కథలు' పొస్తకం ఔపడింది. ఇదేందో కవేరమ్మకు వొరదొచ్చిన కతలాగుండాదే అనుకుంటా పేజీలు దిప్పినాను. మద్దినేళదాకా వొకదానమ్మట వొకటి కతలు సదూతానే వుండిపోయినా. అయ్యేం కతలు... అదేం కతా... సల్ది పొద్దేళదాకా వాకిట్లో ముక్కర్ర గీలా, సుట్టింట్లో సట్టి పొయ్యి మిందకెక్కీలా.

      అసలీ కతలేందీ? ఎవురు రాసినారు? అనుకుంటా వుణ్ణ్యారా. 

"అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మ బాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడా" అన్యాడంట ఓ తాత. ఆ మాటను గుండెల్లో యెట్టుకుని ఆయన మనవడు స. వెం. రమేశ్ పది కాలాల పాటు పెళయ కావేరి మన గాపకల్లో నిలిసిపోయేలా ఈ కతలు రాసినాడు. ఈయన్నీ రాగన్న పట్టెడ, జల్లల దొరువు, కాళాస్తిరి, గొల్లపాళెం, శిరసనంబేడ, ఓటుకుప్పం, నిమ్మాడి తిప్ప, నిడిగుర్తి, నలగామూల, ఓడ పాళెం ఇంకా శానా శానా వూర్లున్యాయి. ఆ వూర్లల్లోని కతలే. 
      
             

          ముంతమావిడాకుల యిస్తట్లో ఇంత అన్నంబెట్టుకుని  బెండలం గెడ్డల పులుసు, వంకాయ బజ్జి యేసుకుని కడుపునిండా తిని ఈ వూర్లన్నీ ఓ సుట్టు సుట్టి వచ్చినా.  

     'ఉత్తర పొద్దు' కత చదవతా "ఈ పొద్దు యీడ్నేవుండి రేపు బయదేలిపోండి నయినా. ఉత్తర పొద్దు పెయానం మంచిది కాదు"  అన్నా యినకుండా ఆ ముకుపచ్చలారని పిలకాయలు పెయానం పెట్టుకుంటిరే...పళయ కవేరమ్మ సూరీడుతో కలసే మందల యెరగరే..నీళ్ళలో యెట్ట  యీదులాడతారా... యెట్ట 'జల్లల దొరువు' జేరతారా అని వొకటే యోచన జేస్తిని.

    "ఇంట్లో మొగోడు లేనపుడొచ్చి ఆడకూతుర్ని ఎత్తుకోని పోతావంట్రా ముండమోపి నాయాలా, అడిగే వోళ్ళు లేరనా నీ కంత పోత్రం? నీ యిష్టమొచ్చినట్లు చేస్తే చూస్తా వుండే దానికి మేము పరంటోళ్ళం కాదు, ఈ దామరాయ కాశెమ్మ గొంతులో వూపిరుండగా సీతమ్మ మింద చెయ్యెయ్యి, ఆనేక తెలస్తాది మందల" అని 'కాశెవ్వ బోగాతం' యింటా పకపకా నవ్వినా. యీ నవ్వులినబడితే సెకలు బడతన్నానని కాశెవ్వ నన్ను కూడా తాటి బరకతో వొక్క పెరుకు పీకుతాదేమో!

     నిండెన్నల రెయ్యిలో 'ఎచ్చలకారి సుబ్బతాత' చెప్పే కతలు ఇంటా బక్కోడితో బాటే నేనుగూడా మచ్చు కత్తి పొట్టుకొని గెనాల మింద నడిసినాను.

      అటిక మామిడాకులో పెసల పొప్పేసి యెణిపిన కూరతో అవ్వ ముద్దలు గలిపి పెడతావుంటే ఒకో ముద్దా నోటిలో యేసుకుంటా..."అయ్య మీరెవరయ్యా యింత ఆగడములా కోస్తిరీ, యెవరూ లేని వేళా మీరిపుడు యేకాంతములా కొస్తిరీ" అని అల్లెవ్వ ఊరిందేవి నిద్దర పాట యిణ్యాను.

     యెన్నిట గుడ్లాట ఆడతా బొయ్యి శంకరవ్వోళ్ళ సందులో వుండే "మామిడి చెట్టు కింద కొరివి దెయ్యం" జూసి బెదురు జెరం దెచ్చుకున్న బక్కోడికి, లోలాకులోడికి తిప్పతీగ కషాయం కాసిచ్చినాను.

     "ఆడపిలకాయలు కూడా మగరాయుళ్ళ మాదిర ఆడేదానికి  బయల్దేర్నారు" అని చెంగత్త మూత్తిప్పడం జూసి ఈ మాటగాని ఫెమినిస్టు లెవురన్నా ఇన్యారేమో! ఇపుడేం జగడమౌతదో అని జడుసుకున్నా. అంతట్లోకే "మేం మటుకు ఆడుకోబళ్యా" అని గుండు పద్న అనేసింది. "ఎందిమే ఆడేది, ఇట్నేనా? ఆడపిలకయులు ఆడుకోవాలంటే వామనగుంటలు, అచ్చంగాయలు, గెసికపుల్లలు, గుడుగుడు గొంజెం చికుచికు పుల్ల, బుజ్జిల కూడు, బుడిగీలాట ఇట్టాంటి ఆడుకోవాలగానీ మగపిలకాయిల యెనకాల బొయ్యి బావుల్లో దూకి ఈత కొట్టేదేంది ఆగిత్తం కాకపోతే "అనేసింది చెంగత్త.  దానికి అవ్వ "మేయ్ చెంగమ్మా, వోళ్ళని బోనీ. ఆడేవొయిసులో ఆడాల పాడే వొయిసులో  పాడాల"  అన్యాక చెంగత్త ఊరుకునింది.  
  
       ఆ గాణమ్మ అట్టొచ్చిందో లేదో 'కత్తిరి గాలి' ని గూడా లెక్కజేయకుండా వొంటి చేత్తో సమస్తం సక్కబెట్టేసింది. ఆ యక్కకు ఫేస్ బుక్ అకౌంటోటి సేసి పెడితే నేనిద్జేసినానని ఆ యక్క గోడ మింద బెట్టనూ మనం లైకులు గొట్టనూ.... గోడ కొనాకి ఆ ముచ్చటే నిండి పోయ్యేట్ది.

       ఓ నాడు "అల్లి సుదుగులకని పొయ్యి ఆవు దూడను దెచ్చినారు యాడదిది?" అనిందవ్వ. "యెనకటికి నీ బోటోడొకడు  యెండి బంగారు పోగొట్టుకొని పిడకల కూచి కోసరం యేడిసినాడంట" అని అవ్వని యెగతాళి బట్నాడు తాత." కర్రి వన్నె, మొహం మింద నామం తీసినట్టు తెల్లటి మచ్చ, నడీపన, సట్టుమిందా పుల్ల సారలు, పొందికయిన కొమ్ముల్తో" అందంగా వున్న 'కొత్త సావాసగోడ్ని' జూసి మురుసుకుంటిని.

     'నల్లబావ తెంపు' కతలో "పులింజేది మాది డా, ఇరకం మాది దా. పళవేర్కాడే మాది దా" అని నొచ్చుకుప్పం పట్టపోళ్ళు మాట్లాడతా అమ్మిడికి రాంగానే, నల్ల బావ "ఏందాన్నో, మాటలు బద్దరంగా రానీ. మేము దురాయి కట్టల్నా? మేమేమ్మన్నా పట్టపోల్లమా? ఎల దాటి చేపల యాత కోచ్చినామా? దేనికి కట్టాల దురాయి? అని అరవంగనే బిత్తరతో గుండె దడదడ లాడతా వసంతక్కతో పాటు చెల్లాతమ్మకి మొక్కినా.

      "ఎప్పుడొచ్చినావు పండో" అని పిట్టకి పల్లాయిలు పాడతా ఓటుకుప్పానికి పోయి వొంటి కంబం మిద్దికి బోయినా. జల్లల దొరువుకు 'పద్దినాల సుట్టం'గా వొచ్చి, కడుపులో పెట్టుకొని సాకిన ఆవ్వకు ఊపిరినే బొదులిచ్చిన మిద్దోడు కోసరం కంట తడిపెట్టినాను.

     'తెప్పతిరనాళ'లో మందు కాలేతపుడు ఆకాశ సువ్వలు జనం మిందకి వచ్చేతలికి తోపుడు మొదలవ్వంగనే  ఆ జనంలో లోలాకు  యేడకు బొయ్యినాడో యేందో ఇపిటికీ అయిపులేడు.

     రామనాటకం చూసేదానికి పొద్దు పరంటకీ వొంగి, తూరుపు తట్టు నీడలు లేసె యాళకి మొత్తం తొమ్మిది మంది బయిలుదేలినారు. "ఇంతింతాకు తగును బాలింతకు తగును, మందలో మేకకు తగును, సందులో ఆకుకు తగును, కలుగులో ఎంట్రకాయికి తగును. ఎలుగులో కాకక్రకాయికి తగును, కర్రిపిల్ల మూతి కళింగు మనును" అని అల్లెవ్వ కత అల్లంగనే "రయిక ముడి బీమారం అమ్మగారు, రాకుంటే పీకులాడు అత్తగారు" అంటూ చెంగత్త పైకత అల్లేసింది. ఈ కతలినే 'పుబ్బ చినుకులు' వాళ్లెంట బడినట్టుండాయి.

      పిలకాయిలు కూట్నీల్లూ, పెద్దోళ్ళు కల్లునీళ్ళతో దాహం అణుసు కుంటుండిన వయ్యాశి ఎండల కాలంలోవసంతక్క చేసిన పనికి కళ్ళు తడిశాయి. 


       "అబయా లేసి సూడరా ఎంత బావుండాయో " అన్న అక్క మాటతో అక్క సూపించిన తలికి సూసినాను. "ఆకాశానుండే సుక్కలన్నీ అడివిలోకి వోచ్చేసుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకూ మినమిన మెరిసి పోతుండాది. అడివిమ్మ వొళ్ళంతా తళుకులు అంటుకొని తళతళ వుండాయి. మింట యెగరతా కొమ్మకొమ్మకీ రెమ్మరమ్మకీ యాలాడతా, గుంపులు గుంపులుగా లెక్కలేనన్ని మిణకర బూసులు."  కొంచెపటికి  బావ ఈత కొట్టేది సాలిచ్చి "వసంతా చెవుల పిల్లులు యెట్ట బోయినాయి మే" అని అరస్తా అడిగినాడు. "ఎరగం, సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, చూసేసోస్తాము అంటే కట్టు ముళ్ళు యిప్పినాము. అమాసకాలం గదా, సందమామని యెతకతా యెట్నో పోయినట్టు వుండాయి" అక్కతో పాటు ముసిముసిగా నవ్వేసినాను.

     ఓ నాడు "రాత్రి ఒక పోద్దుకాడ నెప్పులు మొదలయినాయి నా. కుమ్మరోళ్ళ యాగాతక్క కి  పురుడు పోసే దానికి పిలుసుకో నొచ్చినాము ఆయమ్మ యింతసేపూ పోరకాడింది. యిందాకనే బిడ్డ అడ్డం తిరిగింది నా వల్లగాదు పేటకు తోడ్కొని పొండి అనేసింది. బిన్నా బండి కట్టునా" అంటానే కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుబ్బవ్వ"సినమ్మికి తోడుగా దాపటెద్దుని పంపించిందిరా మన పెళయకావేరమ్మ" తాత మాటతో గుండె బరువెక్కిపోయ్యింది. 

       "అత్త పిండిని వుంటచేసి, తట్టి నూన్లో యేసికాల్చి, యెత్తి నిప్పట్ల పీటమింద యేస్తా వుంటే, మామ నిప్పట్లలో నూని కారిపోయ్యేటట్టు వొత్తి ఇంకొక తట్టలో యేస్తా ఉండేది." ఆ నిప్పట్లను పరంటింట్లో పరిసిపెట్టిన యెండు కసువుమింద వరసగా పరిసినాను.

      అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి... ఆ నలుగురు ఆడపొడుసులు వదినని చూసేదానికి ఉరుకులు పరుగులతో వచ్చినారు. కొత్త చేటలో పసుపు, కుంకం, గాజులూ, పూలూ, రైక గుడ్డలూ పెట్టుకొని పెళయకావేరమ్మ ఆడపొడుసులకు సాంగెం పెట్టిచ్చినాను. 
  
     "తాతా ఎన్నాళ్ళిట్ట చేతులు కాల్చుకుంటావు. కంటి సూపు గూడా సదరంగా లేదంటివి. నా మాటిని పేటకు పోదాం రా తాతా. ఎవురికీ లేని పాశం నీకు మటుకు దేనికి తాతా?" అని అడిగినాను. "ఇది అమ్మపాశం. నేను పుట్టిన మూడోనాడే మాయమ్మ జన్నెక్కి సచ్చి పోయిందంట అపిట్నించీ ఈ ప్రళయకావేరమ్మ వొళ్ళోనే నేను పెరిగింది. ఆట ఆడేది, పాట పాడేది, మడక కట్టేది, మాను కొట్టేది, సేద్దం చేసేది, మద్దిస్తం చూసేది అన్నీ ఈయమ్మ వొళ్ళోనే నేర్సుకునింది. అట్టాంటి మాయమ్మని నేనెట్ట మర్సిపోతాను చెప్పు" బొదులిచ్చినాడు తాత. 

 "అబయా, మీ తాత  యెట్ట బోయినాడు రా ?" అని నల్లబావ అనడిగే తలికి ఉలిక్కిపడి లేచినాను. "ఇల్లూ, వాకిలీ, కొట్టామూ, కసువామీ చూసి, బోడోడి  దిబ్బ,పీతిరి దొరువు, ఆరేటమ్మ కయ్యిలు, బాడవ చేను యెతికేటపితికి ఎలుగు పడింది. మీ తాత ప్రళయకావెట్లో పడుండాడు" అని గసబోసుకుంటా చెప్పిన కుమ్మరోళ్ళ రవణన్న మాటతో ఆత్రంగా పరిగెత్తినాను. తాత వోళ్ళమ్మ వొళ్ళో పొణుకోని వొళ్ళెరగని నిదర పోయేది చూసి కళ్ళొత్తుకుంటా యెనిక్కి దిరిగినాను.

    ఆ పంటరంగస్వామి రమేసన్నను సల్లంగా జూడాలి. ఆయన్న యిట్టాంటి కతలెన్నో మనకినిపియ్యాల.

         *           *          *            *      

       స. వెం. రమేశ్ గారు తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివుద్ది కోసం నిరంతర కృషి చేస్తూ, తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్రేతర ప్రాంతాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన తమిళనాడులో తెలుగు భాషా పరిశోధన బోధనా ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగు వాణి' ట్రస్టు సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నారు.22 comments:

 1. చాలా బావుందండి..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు తృష్ణ గారు.

   Delete

 2. చప్పట్లండీ!! మాండలీకాన్ని మీరెంత బాగా ఆస్వాదించారో పటం కట్టారు. అభినందనలు!!

  ReplyDelete
  Replies
  1. ఈ పుస్తకం చదువుతున్నట్లుగా అనిపించలేదు. ప్రళయ కావేరిలో నడుస్తున్నట్లు, వాళ్ళతో ఉన్నట్లుగానే అనిపించింది. ధన్యవాదాలు కొత్తావకాయ గారు.

   Delete
 3. Replies
  1. మీరు Absolutely అని కూడా చేర్చారంటే గొప్ప ప్రశంసే. ఇలా రాయగలిగానంటే ఆ పుస్తకంలోని అక్షరాల మహిమేనండి. ధన్యవాదాలు నారాయణస్వామి గారు.

   Delete
 4. Pustakaanni meeru parichayam chesina teeru valla ventane koni chadiveyyaalani anipistunnadi.chalabaagaa raasaaru.

  ReplyDelete
  Replies
  1. ఆ పుస్తకమే అలా ఉందండి. నేను చదివిన మంచి పుస్తకాలలో ముందు వరసలో ఉండదగిన పుస్తకం. మీకో గొప్ప అనుభూతినిస్తుంది. తప్పకుండా చదవండి. ధన్యవాదాలు ఇందిర గారు.

   Delete
 5. ఇదేం భాషండి? తెగులు భాషలా వుంది :)
  మా చిక్కోలే నయ్యం, కాస్త కోయ, వడ్డేర కలిపినా అర్థం చేసుకోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. అది నెల్లూరు యాస అనుకుంటాను.
   శర్కరిగారు, నేను సరిగ్గానే గుర్తుపట్టానా?

   భాషతో పాటు మాండలీకాన్ని/యాసని అర్ధం చేసుకుని ఆస్వాదించడానికి అదృష్టం వుండాలి!

   Delete
  2. అదృష్టం పట్టాలా!!! దురదృష్టమంతా సరైన భాష మాటాడేవాళ్ళదే అంటారా? కెవ్వ్వ్వ్వ్ మీ అడృష్టానికి అభినందనలు. అదే భాషలో కామెంట్లు రాయరెందుకో మీ అదృష్టవంతులు?!!

   Delete
  3. పూర్తిగా నెల్లూరు భాష కాదండి. పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలలోని భాష. నెల్లూరికి దగ్గరగా ఉండడం వలన ఎక్కువగా సారూప్యం కనిపిస్తుంది. భాషతో పాటు మాండలీకాన్ని/యాసని అర్ధం చేసుకుని ఆస్వాదించడానికి అదృష్టం సంగతి నాకు తెలియదు కాని ఇష్టం వుండాలి! మీ పేరు చెప్తే బావుండేదండి. ధన్యవాదాలు.

   Delete
 6. పుట్టిన మట్టికి గల రుచి
  మట్టిని పెనవేసుకున్న మాటల రుచులున్
  చుట్టూరా బతుకుల రుచి
  గట్టు దిగిన పుట్ట తేనె గద ! జ్యోతమ్మా !

  ReplyDelete
  Replies
  1. చాలా రోజులకు కనిపించారు రాజారావుగారు. నా బ్లాగు హారానికి మరో మణిపూస మీ పద్యం. నిస్వార్ధంగా మీరిస్తున్న ఈ ప్రోత్సాహం మరువలేనిది. ధన్యవాదాలు.

   Delete
 7. శర్కరి గారికి నమస్కారం!

  "తాత వోళ్ళమ్మ వొళ్ళో పొణుకోని వొళ్ళెరగని నిదర పోయేది చూసి కళ్ళొత్తుకుంటా యెనిక్కి దిరిగినాను."
  ఈ వాక్యం చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత చక్కగా రాశారండీ?

  నాకు పరిచయమైన యాసలు: అనంతపూరు, చిత్తూరు, కడప, నెల్లూరు, బెజవాడ/గుంటూరు, గోదావరి జిల్లాలు, విజయనగరం/శ్రీకాకుళం మరియు తెలంగాణా!

  ఈ యాసలు వేటికవే సాటి! నేను మొట్టమొదటిసారి 'సినబ్బ కతలు ' చదవడం నాకు బాగా గుర్తు. ఒక్కో వాక్యాన్ని మూడేసి సార్లు చదివేవాడిని - యెక్కడ ఆ మట్టివాసన మిస్ అవుతానో అని :) దర్గామిట్ట కతలు కూడా అలాగే!

  ఈరోజు ఈ టపాతో పాటు, మీరు నెల్లూరు యాసలో రాసిన మిగతా టపాలు వెతికి మరీ చదివాను.

  మీరు, విజయనగరం వూరిని కళ్ళకు కట్టినట్లు రాసే 'కొత్తావకాయ'గారు - మళ్ళీ మళ్ళీ చదివేలా మరెన్నో టపాలు మాకోసం రాయాలి!

  ReplyDelete
 8. నమస్కారం వైజె గారు.

  ఇలాంటి ప్రోత్సాహం వుంటే రాయడానికి కొత్త ఉత్సాహం కలుగుతుంది.

  మిట్టూరోడి కతలు, దర్గామిట్ట కతలు కతలు చదువుతున్నప్పుడు నాకూ మీలానే అనిపించింది. మీరన్నట్లు ఏ యాస చదివినా ఆ మట్టిలో తిరిగిన అనుభూతి కలుగుతుంది. 'కొత్తావకాయ' గారి బ్లాగే ఓ అద్భుతం. మీరు నెమలికన్ను మురళి గారి 'కృష్ణవేణి' చదివారా?

  ధన్యవాదాలు.

  ReplyDelete
 9. మీ పరిచయం చాలా బావుందండి.నేను చదవాల్సిన పుస్తకాల జాబితా పెరిగిపోతునే ఉంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు.
   ఈ మధ్యే పుస్తక వ్రతం పట్టి వరుసగా చదివేస్తున్నానండి.:)

   Delete
 10. నిజంగా చాలా మంచి పుస్తకం అండీ...మనసు బాగోనప్పుడు చదివితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో ఈపుస్తకాన్ని

  ReplyDelete
  Replies
  1. ఎవరికైనా ఇవ్వడానికి కూడా మంచి బహుమతి ఈ పుస్తకం.

   మీ బ్లాగు పేరు చాలా బావుందండి.

   Delete

 11. ఇక్కడేదో 'టపా' వణ్ణం బాగా ఉడకతా ఉండాదే ! !!

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. వణ్ణం దినామూ వుండేటిదే. రాగిముద్ద గెలికినాను. కాల్లూ, మొగం గడుక్కోకా యేడేడి ముద్దా, గోవాకు వురుబిండి రొంత దినేసి బోదుగాని.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.