Tuesday, January 15, 2019

కనుమ

ముగ్గుడబ్బా, రంగుల డబ్బాలన్నీ తీసుకొచ్చి అరుగుమీద పెడుతున్నా. "పాపా, ఈ రోజు రంగులు బళ్ళా, లోపల బెట్టెయ్" చెప్పింది పిన్ని.
"ఎందుకు పిన్నీ"?
"ఈ రోజు కనప్పండగ్గదా రధం ముగ్గెయ్యాల. రంగులుబళ్ళా, సందులోకి బొయ్యా రొన్ని కారబ్బంతులు, చావంతులూ దీసకరా."
"రథం ముగ్గే ఎందుకెయ్యాలి పిన్నీ"
"దానికో కతుంది చెప్తానుండు.ఈ పండక్కి బల్చక్రవొర్తి పాతాళం నుండి బూలోకానికొస్తాడు."
"బల్చక్రవర్తంటే మూడు వరాలిచ్చాడు. ఆయనేనా?"
"ఆ ఆయనే, ఈ రోజు పండగైపోతళ్ళా మళ్ళాయన పాతాళానికి బొయ్యేదానికీ రధం" చెప్పింది.
"ఒకవేళ మనం రధం ముగ్గు వెయ్యకపోతే మనింట్లోనే ఉండిపోతాడా?"
", వుండి పొయ్యా మనింట్లో బిందెలూ, గంగాళాలు దానం జేసేస్తాడు."
"అమ్మో, అయితే మనం ఎప్పుడూ రథం ముగ్గే వేద్దాం కనుమ రోజు."
నేను పూలు తీసుకుని వచ్చేసరికి చకచకా చుక్కలు పెట్టేసింది పిన్ని. ముగ్గుతో చుక్కల చుట్టూ మెలికలు తిప్పి చివరగా రెండు చక్రాలు వేసి పసుపు కుంకుమలు పూలరెక్కలు చల్లగానే అచ్చంగా పూలరథమే మా వాకిట ముందర.

*                *             *                 *                *             *                 *           
వడ్లకొట్టు మీద కూర్చుని నేనూ తమ్ముడూ నిప్పట్లు తింటున్నాం. "జోతా, అమ్మమ్మ నడిగి పసూకుంకుం తీసకరా" పురమాయించాడు మామయ్య.
"ఎందుకు మావయ్యా?" అంటూ చెంగున కిందకు దూకాడు తమ్ముడు.
"ఇవాళ కనప్పండగ కదా పశూల్ని కడిగి పసుంకుంకాలు బెట్టాల"
"బర్రెలకా?" ఆశ్చర్యపోయాడు తమ్ముడు.
"ఆ బర్లెకీ, ఎద్దలగ్గూడా" అంటూ పశువుల కొట్టం వైపు వెళ్ళాడు. వెనకే తమ్ముడు.
నేనూ, పిన్ని కొట్టంలోకి వెళ్ళేసరికి మామయ్యలిద్దరూ గడ్డి చుట్ట తీసుకుని పశువులను శుభ్రంగా తోమి, చెంబుతో నీళ్ళు పోస్తున్నారు. ముత్తయ్య కొట్టంలో అప్పటికే గడ్డి గాదం లేకుండా శుభ్రంగా చిమ్మి నీళ్ళు జల్లాడు. పిన్ని ఒక పక్కగా ముగ్గేసి ముగ్గు ముందు ఇటుకరాళ్ళతో పొయ్యి చేసి అందులో ఎండుకట్టెలు పెట్టింది.
"ఎందుకు పిన్నీ ఇక్కడ పొయ్యి?"
"పొంగలి బెట్టి పశూలకు నైవేద్దం బెట్టేదానికి." చెప్పింది.
"ఇక్కడా.. కొట్టంలోనా?" ఆశ్చర్యపోయాను.
"ఆ ఇక్కడే."
మాటలల్లోనే అమ్మమ్మ వచ్చింది. పొయ్యి రాజేసి పసుపురాసి కుంకుమ బెట్టిన పొంగలి గిన్నె పొయ్యిమీద పెట్టింది. మామయ్య పశువులను కడగడం పూర్తిచేసి కొమ్ములకు పచ్చని పసుపు, ఎరుపు రంగులు వేసి ఆరాక కొమ్ముల చివరలో కుచ్చులు కట్టాడు.
"పాపా కుంకుం బెడ్డువురా" పిలిచాడు మామయ్య.
భయంగా చూశాను. అదసలే డిల్లీ బర్రె. "రా జోతా, యేం జైదులే నేనుళ్ళా" అంటూ దాని గంగడోలు నిమురుతూ పిలిచాడు. రెండు చెవుల మధ్యగా తలపైన పసుపురాసి కుంకమ పెట్టాను. ఈలోగా మిగిలిన బర్రెలకు, ఎద్దులకు పిన్ని పసుపురాసి బొట్లు పెట్టింది. ఎద్దుల మెడలో కొత్త పట్టెడలు వేసారు. అలికి ముగ్గులు పెట్టిన కొట్టం రంగుల కొమ్ములు, మువ్వల పట్టెడలు, పసుపు కుంకుమలతో పశువులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. పశువులకు నమస్కారం చేసుకుని పొంగలి నైవేద్యం పెట్టింది అమ్మమ్మ. అమ్మమ్మ చేసినట్టే నమస్కారం చేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి ఘుమఘుమలు.

పొయ్యి మీద మాంసం కూర ఉడుకుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద పెద్ద బాండలి పెట్టింది అమ్మ వడలు వెయ్యడానికి.
"నాకాకలేస్తంది అన్నం బెట్టుమా." అమ్మ పక్కన కూర్చుంటూ అడిగాడు తమ్ముడు.
"రొంత తాల్నాయినా అమ్మ వడలేస్తళ్ళా. అయిపోయినంక వడలు, అన్నం అన్నీ తిందువుగాని" చెప్పింది అమ్మ.
"నాకు వడలొద్దు. అన్నం బెట్టు."
"అట్టనగూడదు నాయినా. కనుమనాడు మినుము కొరకాల." చెప్పింది అమ్మమ్మ.
"వడలు గాల్నియ్ గానా మిగతా పిలకాయిల్ని గూడా బిలువ్. అట్నే బాయి కాడ కాళ్జేతులు కడుక్కుని రండి. అందరొక్కసారే తిందురు." పిలిచింది అమ్మ.
ఈ రోజుతో బడి సెలవలైపోయాయి. రేపే ఊరికి ప్రయాణం. 

*                *             *                 *                *             *                 *        

నాతో ప్రయాణం చేస్తూ పండగ సంబరాన్ని పంచుకున్న మిత్రులకు పెద్దలకు ధన్యవాదాలు. "అవీ ఇవీ రాయడం కాదు ఈసారి రాస్తే నెల్లూరి భాషలోనే రాయాలి" అని దబాయించి ప్రోత్సహించిన ప్రియనేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. 


2 comments:

  1. మీతో పాటు నేనూ పండగ చేసేసుకున్నాను. భలే మంచి సిరీస్!

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.