నవంబర్ నెల మొదటి వారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొచ్చి విమానాశ్రయంలో దిగాం. కొట్టకల్ కు వెళ్ళడానికి కాలికట్ విమానాశ్రయం దగ్గర. మేము బెంగుళూరు నుండి బయల్దేరడంతో, అక్కడి నుండి కాలికట్ వెళ్ళే విమానాలు ఉదయం ఏడు లోపల లేదా సాయంత్రం ఏడు తరువాత మాత్రమే ఉన్నాయి. హాస్పిటల్ లో చేరాలి అంటే సాయంత్రం ఐదు లోపల అక్కడ ఉండాలి. అందుకే మధ్యాహ్నానికి కొచ్చికి వచ్చి అక్కడ నుండి టాక్సీ బుక్ చేసుకుని కొట్టకల్ కు బయలుదేరాం.
Image courtesy Google |
Image courtesy Google |
ప్రయాణం అంతా ఊర్ల మధ్యలోనే సాగింది. దారి పొడవునా షాపులు, ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పళ్ళ దుకాణాలు, కొబ్బరి బోండాలు, చెరకు రసం అమ్మే బండ్లు అయితే చెప్పనే అక్కర్లేదు. ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళే పది, పదిహేను నిముషాల వ్యవధిలో మాత్రమే పచ్చని పొలాలు, దూరంగా కొండలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, అక్కడక్కడా చిన్న కాలువలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కేరళ చాలా అందంగా ఉంది. సాయంత్రం నాలుగున్నరకు ఆర్యవైద్యశాలకు చేరుకున్నాం. ఆయుర్వేద వైద్యశాల అంటే పట్టణానికి దూరంగా పొలాల మధ్య ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా ఊరి మధ్యలో బిజీ రోడ్ పక్కనే ఉంటుందని అస్సలు ఊహించలేదు.
కొట్టకల్ కు వెళ్ళే ముందే అక్కడ డాక్టర్‌కు ఫోన్ చేసి మన సమస్యేమిటో చెప్పి, మెడికల్ రికార్డ్స్ మెయిల్ లో పంపిస్తే ఎన్ని వారాలు ట్రీట్‌మెంట్ అవసరమో చెప్తారు. ట్రీట్‌మెంట్ సాధారణంగా రెండు లేక మూడు వారాలు ఉంటుంది. అయితే అక్కడ రూమ్ దొరకడానికి మాత్రం దాదాపుగా నాలుగు నెలలు వెయిటింగ్ ఉంటుంది. ఆ హాస్పిటల్ లో ఏసీ, నాన్ ఏసీ, సింగల్, డబుల్ రూమ్స్, విల్లాస్ ఉన్నాయి. కొన్ని గదులలో వంటగది, మసాజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తే మాకు రెండు నెలల లోపే రూమ్ దొరికింది. రిసెప్షన్ కి వెళ్ళి అకౌంటెంట్ దగ్గర డిపాజిట్ కట్టి అడ్మిషన్ పూర్తి చేసుకున్నాం.
స్టాఫ్ మెంబర్ ఒకరు మాకు కేటాయించిన గదికి తీసుకుని వెళ్ళారు. అనెక్స్ బ్లాక్ లో ఐదవ అంతస్తులో ఉందా గది. ఒక చిన్న సోఫా సెట్, దాని ఎదురుగా గోడకు టీవీ, ఒక పక్కగా చిన్న డైనింగ్ టేబుల్, సోఫా వెనుక నున్న పార్టిషన్ పక్కన ట్విన్ సైజ్ మంచాలు రెండు, మంచాలకు ఎదురుగా స్టాండ్ మీద మరో టీవీ, గదికి చివర ఒక పెద్ద బీరువా దాని ఎదురుగా చిన్న డెస్క్ గోడకు ఒక అద్దం, బీరువా, అవీ గదిలో ఉన్న వస్తువులు. అటాచ్డ్ బాత్ రూమ్ ఉంది. గదికి ఒక వైపున గోడకు బదులుగా పెద్ద అద్దాలు ఉన్నాయి. అందులో నుండి ఒక వైపు పచ్చని చెట్లు వెనుకగా ఎత్తైన కొండలు మరో వైపు రోడ్డు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గదికి బాల్కనీ లే దు. గదిలో ఒక టవల్, సోపు, టిష్యూ పేపర్ బాక్స్, టాయిలెట్ పేపర్ ఉన్నాయి.
గదిలో సామాను సర్దుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఒక నేపాలీ అతను తన పేరు బహద్దూర్ అనీ తాను అక్కడ కాంటీన్ లో పని చేస్తున్నానని మాకు ఏమి కావాలన్నా తెచ్చి పెడతానని చెప్పాడు. సాయంత్రం కాబట్టి బజ్జీలు, పకోడీలు, కాఫీ ఉంటాయని అన్నాడు. ఆశ్చర్యం వేసింది, నేను విన్నదాని ప్రకారం అక్కడ ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు తప్ప ఇలా పకోడీలు, బజ్జీలు దొరుకుతాయని అనుకోలేదు. అరగంటలో ప్లాస్టిక్ ప్లేట్ లో వేడివేడి పకోడీలు, సాస్ పాకెట్స్, ఫ్లాస్క్ లో టీ తెచ్చాడు. పకోడీలు చాలా బాగున్నాయి. మాకు టీ పెద్దగా నచ్చలేదు.
ఈలోగా హాస్పిటల్ అడ్మిషన్ డిపార్ట్‌మెంట్ నుండి రేఖ అట ఆవిడ వచ్చి మాకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయో లేదో కనుక్కుని, రేపటి నుండి ట్రీట్‌మెంట్ మొదలు పెడతారని, ఏమైనా అవసరమైతే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బుక్ లో ఉన్న సర్వీస్ నంబర్లకు ఫోన్ చేయమని చెప్పి వెళ్ళారు.
స్నాక్స్ తీసుకున్నాక హాస్పిటల్ చూడడానికి బయలుదేరాం. మొత్తం నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయి. ఆదిశంకర, సెంటినెల్, గోల్డెన్ జూబ్లీ, అనెక్స్ వాటి పేర్లు. హాస్పిటల్ లోనే ఒక స్టోర్ ఉంది మందులు, సబ్బులు, షాంపూ లాంటివి అక్కడ దొరుకుతాయి. లైబ్రరీ ఉంది కానీ సాయంత్రం ఐదు దాటడంతో అది మూసేసి ఉంది. సెంటెనల్ బిల్డింగ్ లో ఒక కాంటీన్, మేము ఉంటున్న అనెక్స్ బ్లాక్ ఏడవ అంతస్తులో మరో కాంటీన్ ఉన్నాయి.హాస్పిటల్ వెనుక పార్క్ ఉంది. ఇటుకలు పరిచిన చక్కని దారి, ఎత్తైన కొబ్బరి చెట్లు, రకరకాల మొక్కలతో చాలా అందంగా ఉంది. దారి పక్కన, చెట్ల మొదట్లో మాత్రం పాచి కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఆసుపత్రి గోడల మీద బిల్డింగ్ పైన అంతా కూడా పాచి పట్టి ఉంది. అది శుభ్రం చేయడంలో లోపం కాదు, కేరళ లో ఎప్పుడూ కురిసే వర్షాలు వలన అని అర్థమైంది. సాయంత్రం ఆరవుతున్నా బాగా ఉక్కగా ఉన్నది, తిరిగి రూమ్ కి వచ్చేసాము. కేరళలో చాలా చల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ అక్కడ అలా లేదు.
ఏడు గంటలకు కాంటీన్ కు వెళ్ళాము. కాంటీన్ అనడం కన్నా పెద్ద డైనింగ్ హాల్ అనొచ్చేమో. ఎనిమిది టేబుల్స్, చుట్టూ చెక్కలతో గోడలు, వెలుతురు తక్కువగా ఉంది ఆ గదిలో. మేము కాక ఆ కాంటీన్ లో మరొకతను మాత్రమే ఉన్నాడు. మరీ త్వరగా వచ్చా మేమో ఎవరూ భోజనానికి వచ్చినట్లు లేరు. బహద్దూర్ నిండుగా నవ్వుతూ వచ్చి ఒక టేబుల్ చూపించాడు. కూర్చోగానే మెనూ ఇచ్చాడు. ఎక్కువగా చైనీస్, నార్త్ ఇండియన్ డిషెస్, మరో సారి ఆశ్చర్యపోయాము. ఆయుర్వేద హాస్పిటల్ భోజనంతో చక్కగా బరువు తగ్గాలని అనుకున్నాను, ఈ మెనూ చూస్తే బరువు పెరిగేలా ఉన్నానే అనిపించింది.
తరువాత భాగం ఇక్కడ
ఈ పాటి దానికి అంత దూరం నుండి రావాలాండి ? మీ ఊరిలోనే ఇట్లాంటి వి దీనికన్నా మరింత విశాలమైన ఆయుర్వేద శాలలు ఉంటాయేమో ?
ReplyDeleteహలో అండి, ఆయుర్వేద హాస్పిటల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ దీనికో ప్రత్యేకత ఉంది. తరువాత పోస్ట్ లలో ఆ వివరాలు చెప్తాను.
DeletePrice details share chesthe baguntundi, ivvagalara
ReplyDeleteYou can find the details here. https://aryavaidyasala.com/ckeditor-ckfinder-integration/uploads/files/room%20tariff%20WEF%2001-04-21%20AHRCKKL.pdf
ReplyDelete