Saturday, December 16, 2023

వెనిస్ -2

వెనిస్ కు వెళ్ళిన రోజు రాత్రి ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం కురిసింది. తెల్లవారేసరికి తగ్గిపోయింది కానీ కిరణాలు మాత్రం మబ్బుల పరదా దాటి బయటకే రాలేదు. తొలిసంధ్యలో వెనిస్ అందాలు చూడాలని ఉదయం లేచేసరికి అదీ పరిస్థితి. సరే ఎలాగూ లేచాం కదా అని ఏడు గంటలకల్లా సెయింట్ మార్క్ స్క్వేర్ కు వెళ్ళాం. 

ముందు రోజు అక్కడ ఇసుక వేస్తే రాలనంతమంది ఉన్నారా ఆ పూట చాలా ఖాళీగా ఉంది. వెనిస్ ను ఎవరో మాకు ధారాదత్తం చేసినంత ధీమాగా తిరిగేసి ఆకలేసిన వేళకు ఒక రెస్టరెంట్‌ కు వెళ్ళి ఆరు బయట వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. కొంచెం దూరంగా గ్రాండ్ కెనాల్ లోని డాక్ దగ్గర వేపరెట్టో నుండి పియాజ్జా శాన్ మార్కో చూడడానికి టూరిస్ట్ లు ఒకరొకరుగా వేపరెట్టో దిగుతున్నారు. బండ్ల వాళ్ళు హేట్స్, షాల్స్, లేస్ లాంటివన్నీ బయటకు తీసి అమ్మకాలకు తయారవుతున్నారు. 
 
మా పక్క టేబుల్ దగ్గర ఒక పెద్దావిడ కూర్చున్నారు, తనకు దాదాపుగా డెబ్బైయ్యేళ్ళు ఉండొచ్చు. తను వాషింగ్టన్ డీసీ యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ అట. రిటైర్ అయ్యారా అంటే ఆ అప్పుడేనా అన్నారు. ఆవిడ వెనిస్ ను చూడడానికి అప్పటికి మూడు సార్లు వచ్చారట. ఒకసారైతే ఏకంగా రెండు నెలలు అక్కడే ఉండి పోయారట. మాకు డోజెస్ ప్యాలస్‌, బసిల్లికాలో ఆర్ట్ గురించి చెప్పి బసిల్లికా ఫ్లోరింగ్ చూడడం మాత్రం మరచిపోకండి అన్నారు. బ్రేక్ ఫస్ట్ అయ్యాక ఆవిడకు వీడ్కోలిచ్చి పియజ్జా దగ్గరకు వెళ్ళాం. ఆవిడను అక్కడే వదిలి వచ్చామనుకున్నాం కానీ ఇంతకాలం అయినా "ఆ అప్పుడే రిటైర్ మెంటా" అన్న ఆవిడ మాట తనను కలకాలం గుర్తుండేలా చేసింది.

వెనిస్ లో చూడవలసిన వాటిలో డోజ్ ప్యాలస్ ఒకటి. ఆ ప్యాలస్ ను మొదట కట్టింది పద్నాలుగవ శతాబ్దంలో, ఆ తరువాత కాలంలో చాలా మార్పులు చేస్తూ వచ్చారు. ఆ ప్యాలస్ ఆర్కిటెక్చర్ ను గమనిస్తే కింద భాగం, మధ్య భాగం, పై భాగం వేరు వేరుగా ఉంటుంది. మేము ఆ ప్యాలస్ చూడడానికి “ది సీక్రెట్ ఐటెనరీ ఆఫ్ డోజెస్ ప్యాలస్” టూర్ తీసుకున్నాము. డోజ్ అంటే మన భాషలో రాష్ట్రపతి అనుకోవచ్చు. డోజ్ నివాసం, ఆఫీస్, జైలు అన్నీ ఆ ప్యాలస్ లోనే.
టూర్ కు అరగంట ముందే పియజ్జా దగ్గరకు రమ్మన్నారు. వెళ్ళగానే మాకు స్టిక్కర్స్, హెడ్ ఫోన్స్, ఆడియో డివైజ్ లు ఇచ్చారు. గైడ్ పక్కనే ఉన్నా చెప్పేది స్పష్టంగా వినిపించాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలట. కవన్నీ ఇచ్చినతను తెలుగు అబ్బాయి, మాటల్లో తెలిసింది తనది మా ఊరే అని. అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నాడట. అది తన పార్ట్ టైమ్ ఉద్యోగం అని చెప్పాడు. ఎక్కడ ప్రకాశం జిల్లా ఎక్కడ వెనిస్, ఈ యూనివర్సిటీలన్నీ ఈ పిల్లలకు ఎలా తెలుస్తాయో.

టూర్ బుక్ చేసినప్పుడు ఇంగ్లీష్ గైడ్ ను ఎంచుకున్నా వాళ్ళ ఇంగ్లీష్ ఇటాలియన్ యాక్స్౦ట్ లో ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం. మాకు ఆ సమస్య రాలేదు. ఎందుకంటే మా గైడ్ అమెరికన్, తనకు వెనిస్ నచ్చేసి అక్కడే సెటిల్ అయ్యారట. గైడ్ మాకు వెనిస్ చరిత్ర చెప్తూ డోజెస్ ప్యాలస్ కు తీసుకుని వెళ్ళారు. 
 
 
మా టూర్ జైల్ నుండి మొదలైంది. ఆ జైల్ లో పెద్ద నేరాలు చేసిన ఖైదీలను, ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళను ఉంచేవారట. ఆ ఇరుకు గదుల్లో మనిషి గట్టిగా కాళ్ళు చాపుకుని పడుకునే వీలు కూడా లేదు. ప్రతి గదికీ ఒక చిన్న కిటికీ ఉంది కానీ వాటిలో నుండి పెద్దగా వెలుతురు రాదు. గాలి వెలుతురు లేని ఆ గదుల్లో రోజుకు ఒక్కసారి కూడా బయటకు వచ్చే అవకాశం లేక ఏళ్ళ తరబడి ఎలా ఉండేవాళ్ళో మరి. అక్కడ కనీసం టాయిలెట్స్ కూడా లేవు. దాంతో వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేవట. అక్కడి, ఖైదీలు, ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ వివరంగా చెప్పారు.
   
అంత కట్టుదిట్టమైన జైల్ నుండీ కాసనోవా అనే ఖైదీ తప్పించుకున్నాడట. అతను దాని గురించి ఒక పుస్తకం కూడా రాసాడని మా గైడ్ చెప్పారు. ఖైదీలు నేరాలే చేసి ఉండొచ్చు కాక, ఎన్ని జీవితాలు ఆ గోడల మధ్య అంతమయ్యాయో అని ఆలోచిస్తే బాధనిపించింది. ఆ జైలు లోకి తీసుకువెళ్ళే టప్పుడు ఒక బుల్లి బ్రిడ్జ్ ని దాటి వెళతారు. దాని పేరు బ్రిడ్జ్ ఆఫ్ సైస్. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇంతవరకు చదివిన మీకు అర్థం అయ్యే ఉంటుంది.
జైల్ చూసిన తరువాత ఆయుధాలు బధ్రపరిచిన రూమ్, రికార్డ్ కీపింగ్ రూమ్ కు  తీసుకుని వెళ్ళారు. అబ్బో చాలానే ఉన్నాయి, అప్పట్లో అవి అవసరమే. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అన్నీ యుద్దాలు చేసే సంపాదించుకోవాల్సి రోజాలవి. అవనీ అందుబాటులో ఉన్నా ఇప్పుడు వాటికి వంద రెట్లు క్రూరమైన ఆయుధాల తయారు చేసుకుంటున్నాం. అప్పటి వాళ్ళు కనుక మళ్ళీ బతికి వస్తే మనల్ని చూసి సుఖంగా బ్రతుకుతూ కూడా కొట్టుకు చస్తున్నారు మీ తెలివి తెల్లారినట్లే ఉందని నవ్వి పోతారేమో! రికార్డ్ కీపింగ్ రూమ్ లో ఒక్కొక్క కాబినెట్ మీద ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ వివరాలు ఉన్నాయి. బాగానే దాచారు అన్నీ.
   
   
ఆ తరువాత మొదలైంది ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆ ఇరవై అడుగుల గోడలను, పైకప్పునూ నింపేస్తూ అందమైన ఖళాఖండాలు, నేల మీద మొజాయిక్ తో వేసిన డిజైన్లు, ఖరీదైన షాండ్లియర్స్ అప్పటి వెనిస్ వైభవాన్ని చాటుతున్నాయి. అవన్నీ ఏ శతాబ్దంలో వేసినవో వాటిని ఏ పెయింటర్స్ వేసారో ఆ వివరాలన్నీ గైడ్ చెప్పారు.
    
ప్యాలస్ చూసిన తరువాత, దానికి అనుకునే ఉన్న సెయింట్ మార్క్ బసిల్లికాకు వెళ్ళాము. దానిని పదకొండవ శతాబ్దంలో కట్టారు. మాకు అ ప్రొఫెసర్ చెప్పినట్లు ఫ్లోరింగ్ అంతా మొజాయిక్ తో వేసిన నెమళ్ళు, లతలు, పువ్వులతో చాలా అందంగా ఉంది. సెయింట్ మార్క్ భౌతిక కాయాన్ని, కాన్స్టాంటినోపుల్ నుండి నాలుగు కంచు గుర్రాలను దొంగతనంగా తీసుకుని వెనిస్ లో ఉంచారట. గైడ్ ఇవన్నీ చెప్తుంటే అప్పట్లో కళలకు ఇచ్చిన ప్రాధాన్యత, అధికారం కోసం జరిగిన యుద్దాలు, వాటితో ప్రజా జీవనంలో ఎదురైన ఇబ్బందులు, అభద్రత అన్నీ అవగతమయ్యాయి. 
   
రెండు గంటల పాటు హిస్టరీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అన్నీ బుర్రలో కలసి పోయాయి. ఒక మంచి కాఫీ తాగుదామని అనుకుంటూ దగ్గరలో ఉన్న రెస్టరెంట్ కు వెళ్ళాము. తను కాఫీ నేను తిరామసు ఆర్డర్ చేసాం. ఏదో రెస్టారెంట్ అనుకున్నాము కానీ దానికీ చరిత్ర ఉంది. పంతొమ్మిది వందల నలభైయ్యేడులో మొదలైందట ఆ రెస్టరెంట్, అంటే దానికి డెభైయైదు సంవత్సరాలన్నమాట. “ఇచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవ, గాలైనా కదలాడు సరిగమల త్రోవ” అన్న సిరివెన్నెల గారి పాట గుర్తొచ్చింది. వెనిస్ లో ప్రతి గోడకూ, స్తంభానికీ ఒక చరిత్ర ఉన్నట్లు౦ది.

ఆ రెస్టరెంట్ లో అమెరికా నుండి వెనిస్ కు వచ్చి యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయి, తనను చూడడానికి వచ్చిన వాళ్ళ అమ్మ గారు కలిసారు. ఆ పెద్దావిడ కూడా తన కాలేజ్ రోజుల్లో అదే యూనివర్సిటీలో చదవడానికి వచ్చారట. నలభైయేళ్ళ క్రితం ప్రపంచ దేశాలన్నీ అమెరికా యూనివర్సిటీలో చదవడమే గొప్ప అనుకుంటే అమెరికా నుండి వెనిస్ యూనివర్సిటీకి వచ్చేవారని తెలిసి ఆశ్చర్యం వేసింది.
 
సెయింట్ మార్క్ స్క్వేర్ లోని కేంపనెల్, అదేనండీ బెల్ టవర్ పై నుండి చూస్తే వెనిస్ అంతా కనిపిస్తుంది. ఆ టవర్ పైకి ఎక్కడానికి మెట్లున్నాయి, ఎలివేటర్ కూడా ఉంది. అయితే అక్కడ చాంతాడంత క్యూ ఉంది. ఆ ఐలెండ్ ఎదురుగా ఉన్న శాన్ జోర్జో మజోరీ ఐలెండ్ లో ఉన్న బెల్ టవర్ ఎక్కితే కూడా వెనిస్ కనిపిస్తుంది. అక్కడకు రోడ్ కనుక ఉన్నట్లయితే ఐదు నిముషాల్లో నడిచి వెళ్ళిపోవచ్చు. లేదు కాబట్టి వేపరెట్టో ఎక్కడానికి డాక్ దగ్గరకు వెళ్ళాం. ఐదు నిముషాలలోనే వచ్చింది వేపరెట్టో.
శాన్ జోర్జో మజోరీ చర్చ్ ను పదహారవ శతాబ్దంలో కట్టారు. లోపలకు వెళ్ళి చూస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో భలే ఉంది. దాని వెనుకే ఉన్న చాపెల్, మిగిలిన గదులు చూస్తూ ఉంటే గంట సేపు ఎలా గడిచిందో తెలియనే లేదు.
 
 
అప్పటికి సమయం ఒకటిన్నర అవుతోంది. భోజనం చేద్దామని శాన్ జోర్జో మజోరీ కఫేకి వెళ్ళాము. వెళ్ళగానే మా దగ్గర ఒక బ్రెడ్ బాస్కెట్ పెట్టారు. పోలెంటా, టర్మరిక్ కార్న్ బ్రెడ్ అట. వింటున్నారా టర్మరిక్ బ్రెడ్. అంత గొప్పగా ఏమీ లేదుగానీ రంగు మాత్రం బావుంది. వెనిస్ లో సీ ఫుడ్ చాలా బావుంటుందని విన్నాను, ఒక్కసారి చూద్దామని ష్రిమ్ప్ న్నోకి ఆర్డర్ చేసాను, తను మాత్రం గ్రిల్డ్ వెజిటబుల్ సలాడ్ చెప్పారు. ఆర్డర్ వచ్చింది. చూస్తే అహ నా పెళ్ళంటలో కోట శ్రీనివాస రావు చికెన్ గుమ్మనికి కట్టి ఒట్టి అన్నం తింటుంటాడు చూడండి ఆ సీన్ గుర్తొచ్చింది. ఎందుకంటే నా ప్లేట్ లోని న్యోకిలో వెతికినా ష్రిమ్ప్ కనిపించలేదు ఆ వాసన తప్ప.
 
ఆ తరువాత బెల్ టవర్ దగ్గరకు వెళ్ళాం. అక్కడొక నలుగురైదుగురు ఉన్నారంతే. లిఫ్ట్ లో పైకి వెళితే అక్కడ నుండి వెనిస్ ఐలెండ్ అంతా కనిపిస్తోంది.  
 
 
ఆ ఐలెండ్ నుండి హోటల్ కు వస్తూ ఉంటే ఒక దగ్గర లాండ్రోమాట్ కనిపించింది. మాకు అప్పటికి బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు కానీ ఎవరికైనా ఈ సమాచారం అవసరం అవుతుందేమో అని చెప్తున్నాను.

ఆ రోజు సాయంత్రానికి చూడాలని అనుకున్నవన్నీ దాదాపుగా చూసేసాము. ఇక మిగిలింది గండోలా రైడ్. గండోలాను పడవ నడిపినట్లు కూర్చుని రెండు తెడ్లతో కాక నిలబడి ఒక్క తెడ్డుతో నడుపుతారు. ఎన్నో మలుపులు తిరుగుతూ చిన్న చిన్న బ్రిడ్జ్ ల కిందుగా ఎదురొచ్చే గాండోలాలను చూసుకుంటూ పడవ నడపడం అంతా తేలికైన పని కాదు. దాని డిజైన్ కూడా ఒక వైపు సన్నగా, మరొక వైపు వెడల్పుగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే కెనాల్స్ వెడల్పు తక్కువ. పడవ వెడల్పుగా ఉంటే కెనాల్ లో పట్టదు.
ఏడు గంటల ప్రాంతంలో ఒక కెనాల్ దగ్గర గండోలా ఎక్కి చిన్న కెనాల్స్ లో తీసుకుని వెళ్ళమని చెప్పాము. సాయంత్రం అవడం వలన చల్లగా హాయిగా ఉంది వాతావరణం. సన్నని కెనాల్స్, చిన్న బ్రిడ్జ్ లు, ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని గండోలాలను చూస్తున్న ప్రయాణీకులు, పక్కనే ఎత్తైన భవనాలు వాటి కిటికీలో పువ్వుల మొక్కలు, ఎదురొచ్చే గండోలాలు బావుంది రైడ్. బ్రిడ్జ్ ఆఫ్ సైస్ వరకూ వెళ్ళి వెనక్కి వచ్చాం.
   
ఆఖరి మజిలీ రియల్టో బ్రిడ్జ్, పదహారవ శతాబ్దంలో కట్టిన బ్రిడ్జ్ ఇది. పడవలు ఆ బ్రిడ్జ్ కింద నుండి వెళ్ళడానికి వీలుగా మధ్యలో పైకి లేచి ఉంటుంది. ఆ రోజు రాత్రి పదకొండు వరకూ గ్రాండ్ కెనాల్ లో వెళ్తున్న వేపరెట్టో లను, నీళ్ళ మీద కనిపిస్తున్న వెలుగులు చూస్తూ గడిపాం.
   
రవీ సర్ మొహం చాటేయడం వలన వెనిస్ ను తొలి సంధ్యలో ఫోటోస్ తియ్యాలనే కోరిక మిగిలిపోయిందిగా అందుకుని తరువాత రోజు ఉదయాన్నే నేరుగా సెయింట్ మార్క్ స్క్వేర్ కు వెళ్ళాను. తొలిపొద్దు వెలుగుల్లో బంగారు రంగులో మెరిసిపోతుంది వెనిస్. రియాల్టో బ్రిడ్జ్ మీద నిలబడి నిద్ర లేస్తున్న వెనిస్ ను చూడడం బావుంది. రిక్ స్టీవ్స్ చెప్పింది నిజమే ఏ ఊరైనా చూడాలంటే ఆ ఊరిలో కనీసం ఒక్క రాత్రయినా ఉండే చూడాలి, ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళడం కాదు.  

వెనిస్ లో మేము చూడాలని అనుకున్నవన్నీ చూసేసాము. ఒకటిన్నర రోజులో ఇన్ని చూడగలమని అస్సలు ఊహించలేదు. ముందుగా ఏమేమి చూడాలో లిస్ట్ రాసుకోవడం, వాటి దూరాలు, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడం, వేపరెట్టో పాస్ తీసుకోవడం వీటన్నింటి వలనే ఇది సాధ్యమయింది. మేము మొదట అనుకున్నట్లు మిలాన్ నుండి వెనిస్ కు డే ట్రిప్ కి వచ్చి ఉంటే ఇవన్నీ కుదిరేవి కాదు. మొత్తానికి వెనిస్ అంతా టీనేజర్స్ లా తిరిగేశాం. అక్కడి నుండి మా తరువాత మజిలీ ఫ్లోరెన్స్.  

మురానో బూరానో కబుర్లు ఇక్కడ . ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

No comments:

Leave your Comment

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.