Wednesday, December 27, 2023

చిన్క్వె టెర్రె

చిన్క్వె టెర్రె(Cinque Terre) ఇటాలియన్ రివియరాలోని ప్రాంతం. చిన్క్వె అంటే ఇటాలియన్ లో ఐదు, టెర్రె అంటే లాండ్. సముద్రం ఒడ్డున కొండ అంచులో ఉన్న ఐదు అందమైన ఇటాలియన్ ఊర్లు, రియోమెజోరె(Riomaggiore ), మనరోలా(Manarola), కోర్నీలియా(Carniglia), వెర్నజ్జా(Vernazza), మౌంటరోసో(Monterosso) లను చిన్క్వె టెర్రె అంటారు. యునెస్కో వోర్ల్డ్ హెరిటేజ్ సైట్ లో చిన్క్వె టెర్రె కూడా ఒకటి.
   
చిన్క్వె టెర్రె లోని ఒక ఊరికి మరో ఊరు నడిచేంత దగ్గరలో ఉన్నాయి. అన్ని ఊర్లు కొండ వాలులో ఉన్నాయి కాబట్టి ఆ నడక హైకింగ్ లాగానే ఉంటుంది. ఒక ఊరి నుండి మరో ఊరికి ట్రైన్ లో కానీ ఫెర్రీ లో కానీ వెళ్ళే సదుపాయం ఉంది. మొదట అక్కడ ఏదో ఒక ఊరిలో ఒక్క రాత్రయినా ఉండి ఉదయాన్నే హైకింగ్ చేయాలని మా ఆలోచన. 

అయితే మా ఐటెనరీలో ఆ ఒక్కరాత్రిని పట్టించలేక పోయాము. రాత్రి అక్కడ ఉండకపోయినా ఫరవాలేదు ఆ ఊర్లు చూసి వద్దామని ముందు టూర్ బుక్ చేసుకున్నాం. ఫ్లోరెన్స్(Florence) నుండి చిన్క్వెటెర్రె కు నేరుగా వెళ్ళే ట్రైన్ గానీ బస్ కానీ లేదు. టూర్ వాళ్ళు మినీ బస్ లో లాస్పెట్జ్యా(La Spezia) వరకూ తీసుకుని వెళ్ళి అక్కడి నుండి చిన్క్యు టెర్రె కు లోకల్ ట్రైన్ లో తీసుకుని వెళతారట. ప్రతి ఊర్లోనూ దిగి ఊరు చూడడానికి కొంత టైమ్ ఇస్తారట. ఒక ఊరిలో కాసేపు హైకింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ సేపు కాదు. మళ్ళీ తిరిగి రాత్రి ఏ తొమ్మిది గంటల ప్రాంతంలోనే ఫ్లోరెన్స్ కు తీసుకొచ్చేస్తారట. 

మిలాన్(Milan), వెనిస్ (Venice)లలో ట్రైన్ ప్రయాణాలు, వెనిస్ లో వేపరెట్టో(Vaporetto) ఎక్కడం లాంటివి చేసాక మేము స్వంతంగా ఎక్కడికైనా వెళ్ళగలమనే నమ్మకం వచ్చి ఆ టూర్ కాన్సిల్ చేసాం. మేం చేసిన మంచి పనుల్లో అది ఒకటి. ఆన్లైన్ లో లాస్పెట్జ్యా కు టికెట్ టీసుకున్నాం కానీ ఆ ట్రైన్ నేరుగా లాస్పెట్జ్యా కు వెళ్ళదు. పీసా దగ్గర ఫ్లాట్ ఫార్మ్ మారి వేరే ట్రైన్ ఎక్కాలి. అందువలననేమో టూర్ వాళ్ళు మినీ బస్ లో తీసుకుని వెళ్ళేది. అక్కడి నుండి చిన్క్వె టెర్రెకు ట్రైన్ లో వెళితే రష్ గా ఉంటుందని ఫెర్రీలో వెళ్ళాలని అనుకున్నాము.

ఉదయం ఆరుగంటలకు ఫ్లోరెన్స్ లోని అపార్ట్ మెంట్ నుండి ట్రైన్ స్టేషన్ కు బయలుదేరితే, ముందు రోజు హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా ఉంటుందో అలా ఉన్నాయి ఫ్లోరెన్స్ వీధులు.
 
స్టేషన్ లోని కఫేలో కాఫీ, క్రొషంట్ తీసుకుని ట్రైన్ ఎక్కాము. మా పక్కన ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయి కూర్చున్నాడు, తను పీసా యూనివర్సిటీలో చదువుతున్నాడట, పరీక్షలు ఉన్నాయని ఏదో రాసుకుంటూ ఉన్నాడు. మా ఎదురుగా కూర్చున్న అమ్మాయి వాళ్ళది ఫ్లోరెన్స్ దగ్గరలోని ఉన్న పల్లెటూరట, వ్యవసాయ కుటుంబం. తాను ఫ్లోరెన్స్ లో ఏదో ఆఫీస్ లో పని చేస్తోందట. తన ఫ్రెండ్ తో గడపడానికి లూకా వెళ్తోంది. తను ఇటాలియన్ లైఫ్ గురించి చెప్తుంటే భాషే తేడా కానీ అంతా మన తెలుగు వాళ్ళ జీవితంలాగే ఉంది అనుకున్నాము.

ఫోరెన్స్ నుండి పీసాకు గంట ప్రయాణం, పీసా(Pisa)లో ట్రైన్ ఆగగానే బయటకు వచ్చిచూస్తే మెమున్నదొక్కటే ఫ్లాట్ ఫారం మరొకటి కనిపించలేదు. అందరూ అక్కడ మెట్లు దిగి అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. మేమూ కిందకు వెళ్ళి చూస్తే అర్థం అయింది ఆ స్టేషన్ లో ప్లాట్ ఫార్మ్ మారాలంటే అండర్ గ్రౌండ్ నుండే వెళ్ళాలని. ప్లాట్ ఫార్మ్ మారి లాస్పెట్జ్యా కు వెళ్ళే ట్రైన్ ఎక్కాము. పీసా వెళ్ళినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పీసా టవర్ చూడలేకపోయాము, ఊరిలోకి వెళితే చిన్క్యు టెర్రా చూసి వెనక్కు వచ్చే టైమ్ ఉండదని.
పీసా నుండి గంటా పదిహేను నిముషాలు ప్రయాణం తరువాత తొమ్మిదిన్నరకు లాస్పెట్జ్యా కు చేరాం. ట్రైన్ స్టేషన్ నుండి పోర్ట్ కు వెళ్తుంటే కొండ దిగుతున్నట్లుగా ఉంది, దారంతా షాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్క ఇరవై నిముషాలలోనే పోర్ట్ కు చేరుకున్నాం. 
 
మేము పోర్ట్ దగ్గరకు వెళ్ళేసరికి చిన్క్వె టెర్రెకు వెళ్ళే ఫెర్రీ రెడీగా ఉంది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ టికెట్ తీసుకున్నాము, ఆ టికెట్ తో ఏ ఊరి దగ్గరైన దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. లోపలకు వెళితే ఫెర్రీ డబుల్ డెక్కర్ బస్ లాగా ఉంది, కింద ఒక్క నలుగురైదుగురు తప్ప అంతా ఖాళీగా ఉంది. ఎక్కువ మంది పైకి వెళ్ళి కూర్చున్నారు. 

మేం ఎక్కిన వెంటనే ఫెర్రీ బయలుదేరింది. లాగేరియన్ సముద్రపు గాలి చల్లగా వీస్తోంది, అక్కడక్కడా కొండల మీద ఇళ్ళు, కొండ వాలుల్లో ఊర్లు కనిపిస్తున్నాయి. ఒక్క చిన్క్యు టెర్రాలోనే కాదు, అక్కడ చాలా ఊర్లు అలా కొండ వాలుల్లోనే ఉంటాయని అర్ధం అయింది. ట్రైన్ కాకుండా ఫెర్రీ తీసుకుని మంచి పనే చేసామనిపించింది.
 
ఫెర్రీ వెర్నజ్జా(Vernazza) వెళ్ళేసరికి పన్నెండు గంటలయ్యింది. ఫెర్రీ దిగి అ ఊర్లోకి అడుగు పెట్టే టప్పటికి ఠంగు ఠంగున చర్చ్ బెల్స్ మోగుతున్నాయి. ఒకవైపు కొండ మీద చిన్న కోట, మరో వైపు చర్చ్, మధ్యలో ఇళ్ళు. భలే ఉంది ఆ ఊరు.

ఊరిలోకి వెళ్ళగానే బుల్లి షాప్స్, రెస్టరెంట్స్ లు ఉన్నాయి. ఊరిలోకి వెళ్ళడం అంటే అక్కడ ఇళ్ళ మధ్యలో తిరగడమే, ఎటువైపు వెళ్ళినా కొండ పైకి ఎక్కినట్లే ఉంది. ఆ రోజు మా లంచ్ పెస్తో ఫొకేషియా. అక్కడే పండిన బేసిల్(తులసి), ఆలివ్ ఆయిల్ లతో పేస్ట్ చేసి, అప్పుడే చేసిన బ్రెడ్ మీద ఆ పేస్ట్ వేసి, పైన చీజ్ చల్లి బేక్ చేస్తారు. అది అక్కడ పాపులర్ ఫుడ్. భోజనం అయ్యాక ఒక గంట అక్కడే గడిపి వేరే ఊరు వెళ్ళడానికి పోర్ట్ దగ్గరకు వచ్చాము.
 
 
ఫెర్రీలో ఈసారి మౌంటరోసో(Monterosso) కు వెళ్ళాము. ఇది కొంచెం పెద్ద ఊరు. ఇక్కడ బీచ్ కూడా బావుంది. ఇక్కడ కూడా ఎటు వెళ్ళాలన్నా కొండ ఎక్కే వెళ్ళాలి. హైక్ చేద్దామని కొంతదూరం వెళ్ళాము కానీ, మధ్యాహ్నం ఎండలో వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది.
 
 
ఆ ఊర్లు బావున్నాయి, అక్కడే ఉండి హైక్ చేయగలిగితే ఇంకా బావుంటుంది. బీచ్ దగ్గర రిలాక్స్ అవ్వొచ్చు. అవి రెండూ కాకపోతే కుకింగ్ క్లాస్ అక్కడ యాక్టివిటీ. మేము వెళ్ళిన రోజు ఎండ ఎక్కువగా ఉంది, కుకింగ్ క్లాస్ మీద మాకు పెద్ద ఆసక్తి లేదు. రెండు ఊర్లు చూసినా టైమ్ రెండే అవుతోంది, అంటే ఇంకా సగం రోజు ఉంది.
 
అంటే మరో ప్రాంతానికి వెళ్ళేంత సమయం ఉంది. టస్కనీ ప్రాంతంలోని సియన్నా, లూకా, పీసా, శాన్ జిమిన్యానో, మాంటేపుల్చియానో టూరిస్ట్ లు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలు. మ్యాప్ లో చూస్తే లూకా లాస్పెట్జ్యా కు దగ్గరగా ఉంది. పైగా యూరప్ ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు  మాకు లూకా వెళ్ళాలని ఉన్నది కానీ మా ఐటనరీ లో అది ఫిట్ అవలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది అనుకుని లాస్పెట్జ్యా వెళ్ళడానికి ట్రైన్ స్టేషన్ కు వెళ్ళాము. 

ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు, తరువాత పోస్ట్ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

2 comments:

  1. హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా ఉంటుందో....


    తల్లి మనసు ఎక్కడికెళ్ళినా .....

    :)
    అద్బుతః పీసాటవర్ వెళ్లక పోవడమా!



    బావుంది

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు థాంక్యు. అవునండీ, పీసా టవర్ దగ్గర కామా పెట్టాము, మరెప్పుడైనా వెళ్ళగలమేమో చూద్దాం.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.