Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts

Tuesday, January 24, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 6

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5 
హాస్పిటల్ కు వచ్చిన రెండవ వారం తనకు మరో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఉదయం చేసే ట్రీట్‌మెంట్ పేరు పొట్లి. మూలికలు, దినుసులు వేసి వేడిచేసి మూటలా కట్టి నూనెలో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో పొట్లితో కాపడం పెడతారు.
Picture courtesy - Google

Picture courtesy - Google
సాయంత్రం చేసే ట్రీట్‌మెంట్ శిరోవస్తి, తల మీద బ్రిడ్జి లాగా కట్టి వెచ్చని నూనెతో నింపుతారు. వెన్నెముక గట్టిపడడానికి, లేదా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఈ ట్రీట్‌మెంట్ వలన తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే బీపీ చూడడానికి ఒకరు, మందులు ఇవ్వడానికి మరో నర్స్ వచ్చే వాళ్ళు. ఆ తరువాత డాక్టర్స్ వచ్చేవారు. సాధారణంగా హాస్పిటల్స్ లో డాక్టర్స్ రౌండ్ కు వస్తున్నారంటే ఒకలాంటి హడావిడి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ అలాంటిదేమీ ఉండదు, స్టాఫ్ అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం మరో డాక్టర్ వచ్చి పేషంట్ ఎలా ఉన్నారో కనుక్కుని వెళ్ళే వారు.

హాస్పిటల్ ఎదురుగా గుడి ఉందన్నాను కదా అది విశ్వంభర గుడి. దానిని పి.యస్.వారియర్ కట్టించారు. గుడి ముందున్న ప్రవేశ ద్వారం పైన అల్లా, క్రీస్తు, కృష్ణుడి చిహ్నాలు ఉన్నాయి. అస్పృశ్యతను పాటించే అప్పటి రోజుల్లో కూడా కులం, మతం అనే పక్షపాతం లేక ఆ గుడిలోకి అందరికీ ప్రవేశం ఉండేది.
అయ్యప్ప స్వామి దీక్ష మొదలు పెట్టే రోజు, గుడి బయట, లోపల అంతా దీపాలు పెట్టి, పువ్వులతో అందంగా అలంకరించారు. 



గుడికి ఎదురుగా ఒక స్టేజ్ కట్టి ఉంది. పి.వి.యస్ నాట్య సంఘం లోని కళాకారులు మేము అక్కడ ఉన్న మూడు వారాలలో మూడుసార్లు ప్రదర్శన ఇచ్చారు. మాకు ఆ విధంగా కథాకళి నృత్యాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఈ నృత్యంలో కళ్ళు, కనుబొమల కదలికలతో నాట్యం చేయడం గమ్మత్తుగా ఉంది. ఈ నాట్యంలో కళాకారులకు వేసే రంగులలో కూడా చాలా అర్థం ఉంటుందట.ఈ నాట్య సంఘం జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చైనా, కొరియా, ఇండోనేషియా ఇలా పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.                                          
           

ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఆ గుడి ప్రాంగణంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కేరళలోని చాలా ప్రాంతాల నుండి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తారు. ఆ వేదిక మీద యేసుదాస్, పద్మ సుబ్రమణియం, ఎమ్. ఎస్, సుబ్బలక్ష్మి గారు అలాంటి ప్రముఖులు ప్రదర్శన ఇచ్చారు.   

 
రోజూ సాయంత్రాలు ఏడు గంటల తరువాత గుడికి వెళ్ళే వాళ్ళం. మాలాగా ట్రీట్‌మెంట్ కి వచ్చిన వారు కలిసేవారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండే కాక, ఇతరదేశాల నుండి కూడా పేషెంట్స్ వచ్చారు. అక్కడకు విదేశీయులు రావడం విశేషం అనిపించింది. 

ఒక్కొక్కళ్ళది ఒక్కో సమస్య. ఆర్థరైటిస్, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జ్, సాయటికా, వర్టిగో, సోరియాసీస్, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ ఇలా. అందులో కొంతమంది పది సంవత్సరాల నుండీ వస్తున్నవాళ్ళు ఉన్నారు. మాకొక సందేహం వచ్చింది. ఒకసారి ట్రీట్‌మెంట్ తీసుకున్నాక వ్యాధి నయమైతే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని. దానికి వాళ్ళ సమాధానం ఏమిటంటే "సర్జరీ తప్పనిసరి అని అల్లోపతి డాక్టర్స్ చెప్పినా ఇక్కడ ట్రీట్‌మెంట్ తో సర్జరీ అవసరం లేకుండా మామూలు జీవితం గడపుతున్నాము. ఏడాదికి ఒకసారి ఇక్కడకు మెయింటెనన్స్ కు వస్తూ ఉన్నాము" అని.

సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిన వెంటనే కాక అల్లోపతి వైద్యంలో నయమవనప్పుడు చివర ప్రయత్నంగా ఆయుర్వేదం, హోమియోపతీ వైద్యానికి వెళ్తాం. అప్పటికే జరగవలసిన అనర్ధం జరిగిపోతుంది. మొదట్లోనే వస్తే తగ్గే అవకాశం ఉంటుందట.

విజయవాడ నుండి ఒకళ్ళు ఏడు సంవత్సరాల నుండీ వస్తున్నారు. "విజయవాడలో లో కొట్టకల్ క్లినిక్ ఉంది, ఈ మసాజ్ లు, ట్రీట్మెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా, మరి ఇంత దూరం వస్తున్నారే" అని అడిగాము. "ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నన్ని రోజులు విశ్రాంతి చాలా ముఖ్యం, అక్కడే ఉంటే రోజు వారీ పనులతో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫలితం కనిపించడం లేదు" అని చెప్పారు.

ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఫైబ్రోమైయాల్జా. హైదరాబాద్ లో ఎందరో డాక్టర్స్ కు చూపించారట,  తొమ్మిది నెలల పాటు ఎన్నో సార్లు హాస్పటిల్ లో జాయిన్ అయిందట. అక్కడ డాక్టర్స్ ఇక తగ్గదు అని చెప్పినప్పుడు పెన్ కూడా పట్టుకోలేని స్థితిలో కొట్టకల్ కు వచ్చారట. వచ్చిన వారంలోనే ఆ అమ్మాయి మామూలుగా అయిందట. ఆ పాపను ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడుసార్లు రమ్మన్నారట. అది మూడవ సారి వాళ్ళు రావడం. 

ఆర్యవైద్యశాలకు వైద్యం కోసం వచ్చిన ప్రముఖులలో రాష్ట్రపతి వి.వి.గిరి, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, జయప్రకాష్ నారాయణ్, ఇంకా సినీ నటులు ఉన్నారు.

Saturday, January 21, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4 వ భాగం 

పి.యస్.వారియర్ వ్రాసిన విల్లు ప్రకారం ఆయన మేనల్లుడు పి.ఎమ్.వారియర్ మానేజింగ్ ట్రస్టీ అయ్యారు. మందులు తాయారీలో విద్యుత్ తో పనిచేసే యంత్రాలను ఉపయోగించడం ఈయన ఆధ్వర్యంలోనే మొదలైంది. ఆర్యవైద్యశాల అభివృద్దికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు కానీ బాధ్యత తీసుకున్న పది సంవత్సరాలలోపే విమాన ప్రమాదం వలన అకాలమరణం పాలయ్యారు. 

ఆ తరువాత చీఫ్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న పి.ఎమ్. వారియర్ చిన్న తమ్ముడు పొన్నియంబల్లి కృష్ణన్కుట్టి వారియర్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యత తీసుకున్నారు. 
ప్రతి రోజూ ఉదయం కైలాస మందిరంలో ఉన్న విశ్వంభర స్వామిని దర్శించుకోవడం, పి.యస్.వారియర్ సమాధి దగ్గర దీపం వెలిగించడం, అష్టాంగ హృదయం చదవడం, ఆ తరువాత హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన వారిని చూడడం ఇది ఆయన దినచర్య. ఆ హాస్పిటల్ ను, ఛారిటబుల్ హాస్పిటల్ ను చూసుకుంటూ, కావలసిన మందులేవో తయారు చేసుకుంటూ ఉంటే కొట్టకల్ పేరు మరెక్కడా వినిపించేది కాదేమో! 
పి.కె.వారియర్ హస్తవాసి మంచిదనే పేరు రావడంతో వైద్యం కోసం ఎక్కడెక్కడి నుండో ప్రజలు రావడం మొదలు పెట్టారు. అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి కొట్టకల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.  

వైద్యం అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డిల్లీ, మరియు కొచ్చిలో ఆయుర్వేద హాస్పిటల్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్, ఇరవై ఆరు ప్రాంతాలలో క్లినిక్ లు ఏర్పాటు చేసారు. హాస్పిటల్ లో పెరిగిన రోగులకు సరిపడా ఔషదాలు తయారుచేయడం కోసం పాలక్కాడ్ లో, నంజన్గుడిలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించారు. 

చూర్ణాల రూపంలో ఉన్న ఔషదాలను టాబ్లెట్స్ రూపంలోకి తీసుకుని వచ్చారు. రీసెర్చ్ చేస్తూ ఎన్నో కొత్త మందులు తయారు చేయడం కూడా మొదలు పెట్టారు. కెనడాలోని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IDRC) తో కలసి పనిచేసి మెడిసినల్ ప్లాంట్స్ మీద పుస్తకాలు వ్రాసారు. 

మందుల తయారీ పెరిగింది. నాణ్యత చూడడానికి గాను సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ద (CCRAS), AYUSH, DST, DAE, IIT సంస్థల సహకారంతో క్లినికల్ రీసెర్చ్ సెంటరు ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ AYUSH, DSIR, KSPCB సంస్థల గుర్తింపు పొందింది. ఈ రీసెర్చ్ సెంటర్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు మందు కనిపెట్టారు. ప్రస్తుతం అక్కడ కాన్సర్ కు మందు కనిపెట్టడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. 

పి.కె.వారియర్ ఆయుర్వేదం మీద ఎన్నో వ్యాసాలు వ్రాసారు. రష్యా, అమెరికా వంటి దేశాలలో ఆయుర్వేదం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. 
ఆయుర్వేదంలో ఈయన చేసిన సేవలకు, సాధించిన ప్రగతికి పద్మశ్రీ, పద్మభూషణ్, ధన్వంతరి, కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ ఎలా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. 



ఇన్ని అవార్డ్ లు అందుకున్నా తన జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు "జీవితం మీద ఆశ వదిలేసుకున్న పేషెంట్స్ ను తిరిగి ఆరోగ్యవంతులుగా చూడడం" అనే చెప్పారట. ఆర్యవైద్యశాల వంటి సంస్థను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం దొరకడం తన అదృష్టం అంటారు.  

ఎన్ని పనులు చేస్తున్నా వైద్యునిగా తన బాధ్యత మరువలేదు. పేద, గొప్ప తారతమ్యం చూపించక అందరినీ ఒకేలా చూసేవారు. డెభై సంవత్సరాల పాటు సమర్ధవంతంగా ఆ బాధ్యతలను నిర్వర్తించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 2021 వ సంవత్సరం జులై 10 వ తారీఖున దివంగతులయ్యారు. 

తరువాత రోజు పార్క్ లో నడుస్తుంటే అనిపించింది, ఆయుర్వేదంలో ఎంతో ప్రగతిని సాధించిన మహానుభావులు ఒకప్పుడు ఇదే దారిలో నడిచే వారనీ, వారి జీవితాశయం, ఆ ఆశయ సాధన కోసం వారు చేసిన కృషికి నిదర్శనమే ఈ వైద్యశాల అని అర్థమైనప్పుడు, అంతవరకు ఏ భావం కలగనటువంటి ఆ ఊరు, ఆ హాస్పిటల్, ఆ దారిపై ఎనలేని గౌరవం కలిగింది. 

డాక్టర్ పి. కె. వారియిర్ గురించి ఇక్కడ చదవొచ్చు. 

Tuesday, January 17, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4

కొట్టకల ఆర్యవైద్యశాల - 3 

లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కేరళ లోని ఒక మామూలు గ్రామమైన కొట్టకల్, ఆయుర్వేదానికి పుట్టినిల్లుగా నిలిచిందంటే దానికి కారణం డాక్టర్ పి.ఎస్.వారియర్. అతని కలే ఈ ఆర్యవైద్యశాల. ఆ కలకు ఆయన ప్రాణం పోస్తే దానిని ఈ మధ్య కాలం వరకూ నడిపినవారు ఆయన మేనల్లుడు డాక్టర్ పి.కె.వారియర్.
బ్రిటిష్ పాలనలో ఆయుర్వేదం మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్న రోజులు. 1902 వ సంవత్సరంలో ముప్పై రెండేళ్ళ పొన్నియంబల్లి సంకుణ్ణి వారియర్, కొట్టకల్ లో ఆర్యవైద్యశాల ప్రారంభించారు. ఈయన అతి చిన్న వయస్సులో ఆయుర్వేదం నేర్చుకోవడమే కాక ఒక డాక్టర్ దగ్గర మూడేళ్ళ పాటు అల్లోపతి కూడా అభ్యసించి, చిన్న చిన్న సర్జరీలు చేయడం కూడా నేర్చుకున్నారు. 
అప్పటికి ఆయుర్వేదం గురించి సరైన పుస్తకాలు లేవు. వైద్యులు అనుసరించే విధానాలు వేరువేరుగా ఉండేవి, ఒక్కొక్క వైద్యుడు ఒక్కో విధంగా చికిత్స చేసేవారు. పి.యస్.వారియర్ 1907 వ సంవత్సరంలో ‘చికిత్స సంగ్రహం’ అనే పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకంలో ఏ వ్యాధులకు ఏ మందులు, ఎంత మోతాదులో వాడాలి, పంచకర్మ ఎలా చేయాలి, ఇంకా  ప్రత్యేక చికిత్సా విధానాలు, ఫిజిచల్ కోర్సులు ఇవన్నీ కూడా అందరికీ అర్థమైయ్యేలా తేలిక భాషలో వ్రాసారు. ఆ పుస్తకం ఎన్నో ఇతర భాషలలోకి అనువదించబడింది. 
1925 వ సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ కి సంబంధించిన ‘అష్టాంగశరీరం’ అని పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకాన్ని కాలేజ్ సిలబస్ లో చేర్చడం జరిగింది. ఆయుర్వేదంలో మొదటి పత్రిక ‘ధన్వంతరి’ కూడా ఈయనే ప్రారంభించారు. సాధారణ ప్రజానీకానికి కూడా ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి దోహద పడిన ఈ పత్రిక ఇరవై మూడు సంవత్సరాల పాటు నడిచింది .  

అల్లోపతి లో టాబ్లెట్స్ రూపంలో మందులు దొరుకుతున్న కాలంలో ఆయుర్వేదంలో మందుల తయారీ లేదు. వైద్యులు, రోగులకు ఏ మందులు వాడాలో వాటిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తే, రోగులు లేదా వారికి సంబంధించిన వారు మూలికలు, ఆకులు సేకరించి మందులు తయారు చేసుకునే వారు. దీని వలన మందు సరైన మోతాదులో లేకపోవడమో, ఒకటో అరో మూలికలు వేయకపోవడమో జరిగేది. దాని వలన జబ్బు నయం అయ్యేది కాదు. ఆయుర్వేదంలో ఈ విధానమే కనుక కొనసాగితే ప్రజలకు ఆ వైద్య విధానం పట్ల నమ్మకం పోతుందని పి.యస్.వారియర్ భావించారు. 

ఆయుర్వేద వైద్యులు మందులు తయారుచేసి అందరూ అవే వాడినట్లయితే ఆ సమస్య తీరుతుందని భావించి పి.ఎస్.వారియర్ ఆర్యవైద్యసమాజాన్ని ప్రారంభించారు.  

అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో 1924 సంవత్సరంలో చారిటబుల్ హాస్పిటల్ ప్రారంభించారు. ఇక్కడ వైద్యం, భోజనం, వసతి అన్నీ ఉచితం. ఈ హాస్పిటల్ లో ఆయుర్వేదంతో పాటు అల్లోపతి వైద్యం కూడా ఇస్తారు. 

ఆయుర్వేదం అభివృద్ది చెందడానికి పుస్తకాలు, మందులే కాదు, ముఖ్యంగా కావలసింది వైద్యులు. అందుకోసంగా పి.యస్.వారియర్ 1917 సంవత్సరంలో కాలికట్ లో ఆయుర్వేద పాఠశాల ప్రారంభించారు. ఆ తరువాత ఈ పాఠశాలను కొట్టకల్ కు మార్చారు. ఆ పాఠశాల తరువాత కళాశాలయై, ప్రస్తుతం విద్యార్థులకు ఆయుర్వేదంలో డిగ్రీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 

ఆ విధంగా ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, మందులు తయారు చేయడానికి కావలసిన ఫార్ములా, వైద్యం చేయడం నేర్పించే పాఠశాల ఏర్పడ్డాయి. ఇక కావలసింది మందులు తయారు చేసే మాన్యుఫాక్చరింగ్ యూనిట్. అది కూడా కొట్టకల్ లోనే ప్రారంభమైంది. మందుల తయారీకి అవసరమైన మొక్కలను ఫామ్స్ లో పెంచుతున్నారు. 



ప్రస్తుతం ఈ యూనిట్ లో ఐదు వందల రకాల మందులు తయారవుతున్నాయి. ఏడాదికి ఎనభై ఐదు కోట్ల రూపాయల మందులు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. దాదాపుగా 1000 మంది ఏజంట్స్ ఉన్నారు. ఇన్ని ఉన్నా ఆయుర్వేద మెడిసిన్స్ అని గూగుల్ లో వెతికితే డాబర్, హిమాలయ లాంటి బ్రాండ్స్ కనిపిస్తాయి కానీ కొట్టకల్ కనిపించదు, దానికి కారణం వారు మార్కెటింగ్ గురించి ఖర్చు పెట్టకపోవడమే.
పి.యస్.వారియర్ ఆయుర్వేద వైద్యం పెంపొందించడానికి చేసిన కృషిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు వైద్యరత్న బిరుదు ఇచ్చి సత్కరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో సభ్యునిగా చేర్చుకోవడమే కాక ఆయుర్వేద వైద్య విధానాల పట్ల వారి వైఖరిని మార్చుకున్నారు. పి.ఎస్.వారియర్ జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం 2002 వ సంవత్సరంలో కొట్టకల్, పి.యస్.వారియర్ స్టాంప్ విడుదల చేసింది.
పి.యస్.వారియర్ కు వైద్యమే కాదు కళల పట్ల కూడా ఆసక్తి మెండు. ఆయన 1909 లో ‘పరమ శివ విలాసం’ అనే నాటక కంపెనీ ప్రారంభించారు. తాను స్వయంగా కొన్ని నాటకాలు కూడా వ్రాసి వేయించే వారు. తరువాత కాలంలో అది పి.యస్.వి నాట్య సంఘంగా మారింది. కేరళలోని ప్రఖ్యాతి గాంచిన నాట్య సంఘాలలో ఇది కూడా ఒకటి.

ఏ సంస్థ అయినా ప్రారంభించిన వారు కనుమరుగవగానే రూపురేఖలు మార్చుకుంటుంది, చాలా సందర్భాలలో శిథిలమైపోతుంది కూడా. అయితే ఆర్యవైద్యశాల మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ సంస్థ ఇంత సమర్ధవంతంగా నడవడానికి కారణం పి.ఎస్.వారియర్ ముందు చూపు ఆయన వ్యవహార దక్షత. 

పి.యస్.వారియర్ ఆర్యవైద్యశాల ట్రస్ట్ ఏర్పాటు చేసారు. ఈ ట్రస్టులోని ఏడుగురు సభ్యలలో  ఐదుగురు వారి కుటుంబ సభ్యలు, ఇద్దరు హాస్పిటల్ లో పనిచేసే వైద్యులు ఉంటారు. కేరళలో కొన్ని కుటుంబాలలో మాతృస్వామ్య విధానం ఆచరిస్తూ ఉంటారు. అంటే వారసులు అన్నతమ్ముల పిల్లలు కాక మేనల్లుళ్ళు అవుతారు. వారియర్ కుటుంబం అదే విధానం అనుసరిస్తోంది. 

ఆర్యవైద్యశాల సంస్థకు మేనేజింగ్ ట్రస్టీ అవ్వాలంటే పి.యస్.వారియర్ మేనల్లుడు అవడమే కాక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండాలి. ఫౌండర్ కుటుంబ సభ్యలకు కూడా ఆ సంస్థలో పనిచేస్తేనే జీతం. ఒక్క హాస్పిటలే కాక, మందులు తయారుచేసే కర్మాగారం, ఉచిత హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, హెర్బల్ గార్డెన్స్ ఇవన్నీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయంలో నలభై ఐదు శాతం ఛారిటబుల్ హాస్పిటల్ కు, నలభై ఐదు శాతం ఆయుర్వేద అభివృద్దికి, పది శాతం కాలేజ్ అభివృద్దికి వాడాలని పి.యస్.వారియర్ విల్లులో వ్రాసారు.
పి.ఎస్.వారియర్ కు ప్రతిరోజూ డైరీ వ్రాసే అలవాటు ఉంది. ఆయన డైరీ చదివితే ఆనాటి కాలమాన పరిస్థితులు కూడా తెలుస్తాయి. 1944 వ సంవత్సరం జనవరి 30వ తేదీ ఉదయాన తెరిచిన డైరీ, వ్రాయడానికి సిధ్ధం చేసుకున్న పెన్, వెలిగించిన దీపం అలానే ఉన్నాయి కానీ వైద్యరత్నం పి.యస్.వారియర్ మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

Friday, January 13, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 3

కొట్టకల్ ఆర్యవైద్యశాల - 2 

మూడవ రోజు ఉదయం ఆరు గంటలకు పార్క్ కు వెళ్ళాం. కొంతమంది పార్క్ లో నడుస్తున్నారు, ఒకరిద్దరు యోగా చేస్తున్నారు, ఇద్దరు ఫారినర్స్ గడ్డిలో చెప్పులు లేకుండా వట్టి కళ్ళతో నడుస్తున్నారు. అన్నట్టు అక్కడ వారానికి మూడు రోజులు యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చి యోగా నేర్పిస్తారు. ఎక్కువగా పేషంట్స్ ఉంటారు కాబట్టి చిన్న చిన్న స్ట్రెచస్ మాత్రమే చేయిస్తున్నారు. 

అక్కడ ఒక గంటసేపు ఉండి ఈసారి సెంటినెల్ లో ఉన్న కాంటీన్ కు వెళ్ళాం. అది అనెక్స్ లోని కాంటీన్ కంటే పెద్దది, కొంచెం రష్ గా ఉంది. ఖాళీ టేబుల్ చూసి కూర్చున్నాం. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మెనూలో వడ కూడా ఉంది. రాగి పుట్టు, తట్టు దోశ తీసుకున్నాం. రాగి పుట్టుతో శనగల కూర ఇచ్చారు, బావుంది. పుట్టు అదే మొదటిసారి తినడం. ఆవిరితో ఉడికిన పుట్టు ఆరోగ్యానికి మంచిదట. తట్టు దోశలు, పలుచని కొబ్బరి పచ్చడితో ఇచ్చారు, మెత్తగా బావున్నాయి.  
సాయంత్రం హాస్పిటల్ దాటి బయటకు వెళ్ళాం. హాస్పిటల్ కు కుడి వైపున చాలా షాప్స్, బేకరీస్ ఉన్నాయి. దగ్గరలోనే ఒక షాప్ లో అన్నిరకాల పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయి. అక్కడ పర్సిమన్స్ చూసి ఆశ్చర్యపోయాము, ఎందుకంటే అవి ఇండియాలో దొరుకుతాయని తెలియదు. సీతాఫలాలు, థాయ్ లాండ్ జామకాయలు, పర్సిమన్స్ తీసుకున్నాము. వంట చేసుకోవడానికి కావలసిన సరుకులు కూడా దొరుకుతున్నాయి. హాస్పిటల్ కు ఎడమ వైపున కొంచెం దూరంలోనే బట్టల షాప్, స్పైసెస్ షాప్, కొరియర్ సర్వీస్, కొబ్బరి బోండాలు అమ్మే షాప్ కనిపించాయి. 



అన్నట్లు మరిచే పోయాను, హాస్పిటల్ లో ప్లాస్టిక్ బాగ్ లు నిషిద్దం. మేము ఇంటి నుండి వచ్చేటప్పుడే హైకింగ్ కు వెళ్తే పనికొస్తాయని రెండు డ్రా స్ట్రింగ్ బాగ్స్ తెచ్చుకున్నాం. హైకింగ్ కాదు కదా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ సేపు వాకింగ్ కూడా చేయకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. మా బాగ్స్ అలా పండ్లు తీసుకుని రావడానికి ఉపయోగ పడ్డాయి. అక్కడ ఉన్నన్ని రోజులూ పండ్లు, కొబ్బరి బోండాలే మా చిరుతిండి.

అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, నవలలు, జీవిత చరిత్రలు, పత్రికలు ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. అక్కడ విపుల, చతుర, ఆంధ్రభూమి, గోదావరి కథలు, పాలగుమ్మి పద్మరాజు రచనలు, విజయానికి ఐదు మెట్లు లాంటి తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. లైబ్రరీలో కూర్చుని చదువుకోవచ్చు లేదా పుస్తకాలు రూమ్ కి తెచ్చుకోవచ్చు.

అక్కడ లైబ్రేరియన్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు. అతను ఇరవై ఏళ్ళ నుండి అక్కడ పనిచేస్తున్నారట, ఆర్యవైద్యశాల గురించి చాలా వివరాలు చెప్పారు. వైద్యశాలలో రెండు వందల ముప్పై గదులు ఉన్నాయి, దాదాపుగా నాలుగు వందల మంది ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రూమ్ రెంట్ లో తేడా ఉన్నా ట్రీట్మెంట్ చార్జెస్ అందరికీ ఒకటే. అందరూ డాక్టర్స్ అన్ని వార్డ్స్ కు వెళతారు.  
కొట్టకల్ ఆర్యవైద్యశాలలు కొట్టకల్ లోనే కాక కొచ్చిలో రెండు, డిల్హీ లో ఒకటి ఉన్నాయి. ఇండియాలో మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో క్లినిక్స్ కూడా ఉన్నాయి. కొట్టకల్ లో వంద గదులున్న మరో బిల్డింగ్ మార్చి నుండి ప్రారంభం అవుతుంది.  
అక్కడ ఉద్యోగులకు రోజుకు నాలుగు రూపాయలకే భోజనం, టిఫిన్, టీ ఇస్తున్నారు. అక్కడ పనిచేసే వారి కుటుంబాలకు మెడికల్ ఖర్చులన్నీ ఉచితం. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే తప్ప అక్కడ పనిచేసే వారు ఎవ్వరూ ఉద్యోగం వదిలి వెళ్ళరు. మసాజ్ చేసే వాళ్ళకు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేషన్ పూర్తి చేసాక మిగిలిన బ్రాంచ్ లకు పంపిస్తున్నారు.

ఈ హాస్పిటల్ ను ప్రారంభించిన పి.యస్.వారియర్ గురించి చెప్పారు. ఆర్యవైద్యశాల ఒక హాస్పిటల్ మాత్రమే కాదు ఒక సంస్థ అనీ, ఆ సంస్థలో హాస్పిటల్స్, క్లినిక్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్, మ్యూజియమ్, హెర్బల్ గార్డెన్, ఫామ్స్, కాలేజ్, రీసెర్చ్ సెంటర్ కూడా ఉన్నాయని చెప్పారు. అంతే కాక ఒక చారిటబుల్ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు, అక్కడ ఆయుర్వేదం, అల్లోపతి డాక్టర్స్ కూడా ఉన్నారట. ఆ హాస్పిటల్ లో వైద్యం పూర్తిగా ఉచితం. చాలా ఆసక్తిగా అనిపించింది. 

పి.యస్.వారియర్ గరించి, ఆర్యవైద్యశాల గురించి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. రెండు పుస్తకాలు తీసి ఇచ్చారు.

Wednesday, January 11, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 2

కొట్టకల్ ఆర్యవైద్యశాల - 1 

మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కాంటీన్ కు వెళ్ళాము. నిన్న రాత్రి చీకట్లో తెలియలేదు కానీ ఆ డైనింగ్ హాల్ అద్దాల మేడలా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు, కొండలు, బిల్డింగ్స్ తో ఊరంతా అందంగా కనిపిస్తోంది. అప్పటికే అక్కడ ఒకరు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అతను జర్మనీ నుండి వచ్చారట, తనకు రిస్ట్ దగ్గర కట్టు కట్టి ఉంది. ఆ హాస్పిటల్ కు ఫారినర్స్ కూడా వస్తారని అర్థమైంది. 

ఒక టేబుల్ దగ్గర కూర్చోగానే మా దగ్గరకు ఈసారి ఓ పాతికేళ్ళ అబ్బాయి వచ్చి, మెనూ ఇచ్చాడు.  అతనూ నేపాలీనే, పేరు అజయ్. మెనూ లో ఇడ్లీ, దోశ, రాగి దోశ, రాగి పుట్టు, ఆపం, ఊతప్పం, టీ, కాఫీ ఉన్నాయి. దోశ, ఇడ్లీ, కాఫీ చెప్పాము. ఇంట్లో చేసుకునే లాంటి మెత్తని దోసెలు, కొబ్బరి పచ్చడి, తమిళనాడులో చేసే ఉప్పుడు బియ్యం ఇడ్లీ. అక్కడ ఫిల్టర్ కాఫీ దొరకదు, ఇన్స్టెoట్ కాఫీ మాత్రమే ఉంది. 
                                       


టిఫిన్ పూర్తి చేసి ఎనిమిది గంటల కల్లా రూమ్ కి వెళ్ళిపోయాం. ఎనిమిదిన్నరకు డాక్టర్ అనిత తన టీమ్ తో వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు ట్రీట్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ట్రీట్‌మెంట్ సమయంలో ఎటువంటి అసౌకర్యం ఉన్నా తనకు చెప్పడం మరచి పోవద్దని చెప్పారు. కాసేపటి తరువాత జూనియర్ డాక్టర్ వచ్చి పేషంట్ కు సంబంధించిన వివరాలు అన్నీ రాసుకున్నారు. ఒక నర్స్ వచ్చి మందులు ఇచ్చి ఏవి ఎప్పుడు వాడాలో చెప్పారు. ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నప్పుడు మామూలుగా వాడే అల్లోపతి మందులు ఏవీ ఆపక్కర్లేదని చెప్పడం రిలీఫ్ గా అనిపించింది. అక్కడ డాక్టర్స్ కు తప్ప ఎవరికీ సరిగ్గా ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ రాదు. అందరూ మళయాళం మాత్రమే మాట్లాడతారు.

ఆ రోజు నుండే తనకు ట్రీట్‌మెంట్ మొదలయ్యింది. తనను మసాజ్ రూమ్ కు తీసుకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళాను, అక్కడక్కడా బ్లూ డ్రెస్ వేసుకున్న హాస్పిటల్ స్టాఫ్ తప్ప వేరే ఎవ్వరూ కనిపించలేదు. కారిడార్ లో వెళుతుంటే మసాజ్ గదుల ముందు హెర్బల్స్ వాసన వస్తోంది. 

బాగా ఉక్కపోతగా  ఉంది. బహుశా చలి ప్రాంతం నుండి వచ్చిన నాకు ఇలా అనిపిస్తుందేమో, ఇండియాలో తీర ప్రాంతాలలో ఉండే వారికి ఈ వాతావరణం ఇంత అసౌకర్యంగా ఉండకపోవచ్చు. పావుగంటలో వెనక్కు వచ్చాను. బహదూర్ వచ్చాడు లంచ్ ఆర్డర్ చేస్తారా అని. లంచ్ కు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, పేషంట్ తాలి, చెపాతీ, కూరలు ఉంటాయట. ఒక సౌత్ ఇండియన్ తాలి, ఒక నార్త్ ఇండియన్ తాలి చెప్పాను.

ఒక గంటన్నర తరువాత తను ఒళ్ళంతా నూనె పట్టించుకుని వచ్చారు. తనను తీసుకుని వచ్చిన అతను బెడ్ మీద ప్లాస్టిక్ షీట్ పరిచి ఒక గంట పాటు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. స్నానం కూడా ఒక గంట, గంటన్నర ఆగి చేయమన్నారు. అలా అయితే ఆ నూనెలు శరీరానికి బాగా పడతాయట. ట్రీట్‌మెంట్ ఎలా ఉందని అడిగాను. ఆ రోజు ఇచ్చిన ట్రీట్మెంట్ పేరు ఫిజిచిల్(pizhichil) అని, ఒక లీటర్ రెండు వందల గ్రాముల వేడి నూనెతో నలుగురు మనుషులు గంటసేపు మర్దనా చేశారని చెప్పారు. తనకు పడుకోగానే బాగా నిద్ర పట్టేసింది. 

మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా రెండు పెద్ద కారేజ్ లతో భోజనం తెచ్చి పెట్టాడు బహదూర్. వాటి సైజ్ చూస్తే ఆ భోజనం మాకేనా లేక ఆ ఫ్లోర్ లో వాళ్ళందరికీ తెచ్చాడా అనిపించింది. కేరెజ్ తెరిస్తే సాంబారు, రసం, మట్ట రైస్, మూడు కూరలు ఉన్నాయి, అన్నీ సరిపడా ఉన్నాయి, ఏవీ ఎక్కువగా లేవు. విడిగా పెరుగు, పచ్చడి ఇచ్చారు. నార్త్ ఇండియన్ తాలి లో సాంబారుకు బదులు పలుచగా ఉన్న పప్పు, మజ్జిగ చారు, బాసుమతి బియ్యంతో అన్నం, రెండు చిన్న చపాతీలు, సలాడ్ ఉన్నాయి. అక్కడి పెరుగు తినలేనంత పుల్లగా ఉన్నది. ప్రతి కూరలోనూ కొబ్బరి తురుము వేసారు. సాంబారులో చక్రాల్లా తరిగిన తొక్కు తీయని అరటికాయ ముక్కలు కొత్తగా అనిపించాయి కానీ బాగానే ఉన్నాయి. మాకు కేరళ మట్ట రైస్ తినడం అలవాటే. అందువలన భోజనం బాగానే అనిపించింది. తెల్ల బియ్యం, ఉప్పు, కారాలు దండిగా వేసుకుని తినే అలవాటు ఉన్న వాళ్ళకు భోజనం నచ్చక పోవచ్చేమో.


మధ్యాహ్నం మూడు గంటలకు మరొక ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈసారి తలమీద బ్రిడ్జ్ లా కట్టి అందులో వెచ్చని నూనె పోసారట. నూనె వేడి తగ్గుతుంటే ఆ నూనె తీసి వెచ్చచేసి పోస్తూ ఉన్నారట. ఈ ట్రీట్‌మెంట్ పేరు శిరోవస్తి అనీ, వెన్నెముక గట్టిపడడానికి ఆ ట్రీట్‌మెంట్ ఇస్తారని చెప్పారు. ఒక వారం పాటు అదే ట్రీట్‌మెంట్ ఇస్తారట. ఈసారి కూడా ఒళ్ళంతా నూనె పట్టించి, ఒక గంట సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. 

ఆ సాయంత్రం కారిడార్ లో ఒక పెద్దావిడ కనిపించారు. ఆవిడ పది సంవత్సరాల క్రితం ట్రీట్‌మెంట్ కి వీల్ చెయిర్ వచ్చి, వెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. అప్పటి నుండి ఆవిడ ప్రతి సంవత్సరం రెండు వారాల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారట. ఆవిడ తనతో ఒక పాటు ఒక ముప్పై ఏళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చారు. ఆవిడకు వేళకు మందులు ఇవ్వడం, వంట చేయడం, ఆవిడ బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం లాంటివి అన్నీ చేస్తున్నాడు. ఈ హాస్పిటల్ లో పేషెంట్ తో పాటు అటెండెంట్ తప్పనిసరి.

Tuesday, January 10, 2023

కొట్టకల్ ఆర్యవైద్యశాల - 1

ఆయుర్వేద వైద్యశాలలు ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. కేరళలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడో కేరళలో ఉన్న వైద్యశాలకు వెళ్ళాలంటే సందేహిస్తాం. అక్కడ చికిత్స ఎలా జరుగుతుందో, వసతి సరిగ్గా ఉంటుందో లేదో, భోజన సదుపాయం ఎలానో, ఇలా అన్నీ సందేహాలే. ఈ మధ్యనే మేము కేరళలోని కొట్టకల్ ఆర్యవైద్యశాలకు వెళ్ళి వచ్చాము. మా అనుభవం మరికొంత మందికి ఉపయోగపడ వచ్చనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ రాస్తున్నాను.

నవంబర్ నెల మొదటి వారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొచ్చి విమానాశ్రయంలో దిగాం. కొట్టకల్ కు వెళ్ళడానికి కాలికట్ విమానాశ్రయం దగ్గర. మేము బెంగుళూరు నుండి బయల్దేరడంతో, అక్కడి నుండి కాలికట్ వెళ్ళే విమానాలు ఉదయం ఏడు లోపల లేదా సాయంత్రం ఏడు తరువాత మాత్రమే ఉన్నాయి. హాస్పిటల్ లో చేరాలి అంటే సాయంత్రం ఐదు లోపల అక్కడ ఉండాలి. అందుకే మధ్యాహ్నానికి కొచ్చికి వచ్చి అక్కడ నుండి టాక్సీ బుక్ చేసుకుని కొట్టకల్ కు బయలుదేరాం.
Image courtesy Google
Image courtesy Google
ప్రయాణం అంతా ఊర్ల మధ్యలోనే సాగింది. దారి పొడవునా షాపులు, ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పళ్ళ దుకాణాలు, కొబ్బరి బోండాలు, చెరకు రసం అమ్మే బండ్లు అయితే చెప్పనే అక్కర్లేదు. ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళే పది, పదిహేను నిముషాల వ్యవధిలో మాత్రమే పచ్చని పొలాలు, దూరంగా కొండలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, అక్కడక్కడా చిన్న కాలువలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కేరళ చాలా అందంగా ఉంది. సాయంత్రం నాలుగున్నరకు ఆర్యవైద్యశాలకు చేరుకున్నాం. ఆయుర్వేద వైద్యశాల అంటే పట్టణానికి దూరంగా పొలాల మధ్య ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా ఊరి మధ్యలో బిజీ రోడ్ పక్కనే ఉంటుందని అస్సలు ఊహించలేదు.


హాస్పిటల్ దగ్గర ఏమైనా దొరుకుతాయో లేదో తెలియదు. ట్రీట్‌మెంట్ లో భాగంగా రోజూ ఆయిల్ మసాజ్ ఉంటుందని విన్నాం. లాండ్రీ సర్వీస్ ఉందని చెప్పారు కానీ బట్టలు ఎక్కడ ఉతుకుతారో, ఉతకడానికి ఎటువంటి నీళ్ళు వాడతారో తెలియదు. ఎందుకైనా మంచిదంటూ అవీ ఇవీ సర్దుకునే సరికి రెండు పెద్ద సూట్ కేస్ లు నిండిపోయాయి. టాక్సీ డ్రైవర్ లగేజ్ దించి, తన కార్డ్ ఇచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి మళయాళం తప్ప మరో భాష రాదు. తిరిగి ఎయిర్‌పోర్ట్ కు వెళ్ళేటప్పుడు తననే పిలవమని కాబోలని అనుకున్నాము.

కొట్టకల్ కు వెళ్ళే ముందే అక్కడ డాక్టర్‌కు ఫోన్ చేసి మన సమస్యేమిటో చెప్పి, మెడికల్ రికార్డ్స్ మెయిల్ లో పంపిస్తే ఎన్ని వారాలు ట్రీట్‌మెంట్ అవసరమో చెప్తారు. ట్రీట్‌మెంట్ సాధారణంగా రెండు లేక మూడు వారాలు ఉంటుంది. అయితే అక్కడ రూమ్ దొరకడానికి మాత్రం దాదాపుగా నాలుగు నెలలు వెయిటింగ్ ఉంటుంది. ఆ హాస్పిటల్ లో ఏసీ, నాన్ ఏసీ, సింగల్, డబుల్ రూమ్స్, విల్లాస్ ఉన్నాయి. కొన్ని గదులలో వంటగది, మసాజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తే మాకు రెండు నెలల లోపే రూమ్ దొరికింది. రిసెప్షన్ కి వెళ్ళి అకౌంటెంట్ దగ్గర డిపాజిట్ కట్టి అడ్మిషన్ పూర్తి చేసుకున్నాం.

స్టాఫ్ మెంబర్ ఒకరు మాకు కేటాయించిన గదికి తీసుకుని వెళ్ళారు. అనెక్స్ బ్లాక్ లో ఐదవ అంతస్తులో ఉందా గది. ఒక చిన్న సోఫా సెట్, దాని ఎదురుగా గోడకు టీవీ, ఒక పక్కగా చిన్న డైనింగ్ టేబుల్, సోఫా వెనుక నున్న పార్టిషన్ పక్కన ట్విన్ సైజ్ మంచాలు రెండు, మంచాలకు ఎదురుగా స్టాండ్ మీద మరో టీవీ, గదికి చివర ఒక పెద్ద బీరువా దాని ఎదురుగా చిన్న డెస్క్ గోడకు ఒక అద్దం, బీరువా, అవీ గదిలో ఉన్న వస్తువులు. అటాచ్డ్ బాత్ రూమ్ ఉంది. గదికి ఒక వైపున గోడకు బదులుగా పెద్ద అద్దాలు ఉన్నాయి. అందులో నుండి ఒక వైపు పచ్చని చెట్లు వెనుకగా ఎత్తైన కొండలు మరో వైపు రోడ్డు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గదికి బాల్కనీ లే దు. గదిలో ఒక టవల్, సోపు, టిష్యూ పేపర్ బాక్స్, టాయిలెట్ పేపర్ ఉన్నాయి. 





    గదిలో సామాను సర్దుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఒక నేపాలీ అతను తన పేరు బహద్దూర్ అనీ తాను అక్కడ కాంటీన్ లో పని చేస్తున్నానని మాకు ఏమి కావాలన్నా తెచ్చి పెడతానని చెప్పాడు. సాయంత్రం కాబట్టి బజ్జీలు, పకోడీలు, కాఫీ ఉంటాయని అన్నాడు. ఆశ్చర్యం వేసింది, నేను విన్నదాని ప్రకారం అక్కడ ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు తప్ప ఇలా పకోడీలు, బజ్జీలు దొరుకుతాయని అనుకోలేదు. అరగంటలో ప్లాస్టిక్ ప్లేట్ లో వేడివేడి పకోడీలు, సాస్ పాకెట్స్, ఫ్లాస్క్ లో టీ తెచ్చాడు. పకోడీలు చాలా బాగున్నాయి. మాకు టీ పెద్దగా నచ్చలేదు. 

ఈలోగా హాస్పిటల్ అడ్మిషన్ డిపార్ట్‌మెంట్ నుండి రేఖ అట ఆవిడ వచ్చి మాకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయో లేదో కనుక్కుని, రేపటి నుండి ట్రీట్‌మెంట్ మొదలు పెడతారని, ఏమైనా అవసరమైతే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బుక్ లో ఉన్న సర్వీస్ నంబర్లకు ఫోన్ చేయమని చెప్పి వెళ్ళారు.
స్నాక్స్ తీసుకున్నాక హాస్పిటల్ చూడడానికి బయలుదేరాం. మొత్తం నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయి. ఆదిశంకర, సెంటినెల్, గోల్డెన్‌ జూబ్లీ, అనెక్స్ వాటి పేర్లు. హాస్పిటల్ లోనే ఒక స్టోర్ ఉంది మందులు, సబ్బులు, షాంపూ లాంటివి అక్కడ దొరుకుతాయి. లైబ్రరీ ఉంది కానీ సాయంత్రం ఐదు దాటడంతో అది మూసేసి ఉంది. సెంటెనల్ బిల్డింగ్ లో ఒక కాంటీన్, మేము ఉంటున్న అనెక్స్ బ్లాక్ ఏడవ అంతస్తులో మరో కాంటీన్ ఉన్నాయి.

హాస్పిటల్ వెనుక పార్క్ ఉంది. ఇటుకలు పరిచిన చక్కని దారి, ఎత్తైన కొబ్బరి చెట్లు, రకరకాల మొక్కలతో చాలా అందంగా ఉంది. దారి పక్కన, చెట్ల మొదట్లో మాత్రం పాచి కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఆసుపత్రి గోడల మీద బిల్డింగ్ పైన అంతా కూడా పాచి పట్టి ఉంది. అది శుభ్రం చేయడంలో లోపం కాదు, కేరళ లో ఎప్పుడూ కురిసే వర్షాలు వలన అని అర్థమైంది. సాయంత్రం ఆరవుతున్నా బాగా ఉక్కగా ఉన్నది, తిరిగి రూమ్ కి వచ్చేసాము. కేరళలో చాలా చల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ అక్కడ అలా లేదు.


                                       












ఏడు గంటలకు కాంటీన్ కు వెళ్ళాము. కాంటీన్ అనడం కన్నా పెద్ద డైనింగ్ హాల్ అనొచ్చేమో. ఎనిమిది టేబుల్స్, చుట్టూ చెక్కలతో గోడలు, వెలుతురు తక్కువగా ఉంది ఆ గదిలో. మేము కాక ఆ కాంటీన్ లో మరొకతను మాత్రమే ఉన్నాడు. మరీ త్వరగా వచ్చా మేమో ఎవరూ భోజనానికి వచ్చినట్లు లేరు. బహద్దూర్ నిండుగా నవ్వుతూ వచ్చి ఒక టేబుల్ చూపించాడు. కూర్చోగానే మెనూ ఇచ్చాడు. ఎక్కువగా చైనీస్, నార్త్ ఇండియన్ డిషెస్, మరో సారి ఆశ్చర్యపోయాము. ఆయుర్వేద హాస్పిటల్ భోజనంతో చక్కగా బరువు తగ్గాలని అనుకున్నాను, ఈ మెనూ చూస్తే బరువు పెరిగేలా ఉన్నానే అనిపించింది.

తరువాత భాగం ఇక్కడ