వున్న ఇల్లు ఇరుకైపోయి కొత్త ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఒక ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్ మె౦ట్ కాంప్లెక్స్ లో ఖాళీలున్నాయని తెలిసింది. ఆ యేరియా మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉంది కూడానూ. వెళ్లి ఇల్లు చూసి వద్దామనుకున్నాను.
“గుండూస్ శ్రావణి ఆంటి వాళ్ళింటికి వెళ్దామా?” పక్కింటి సాహిల్తో 'షూట్స్ అండ్ లాడర్స్' ఆడుతున్న మా అమ్మయిని అడిగాను.
“ఆఫ్టర్ దిస్ గేమ్” అంది లాడర్ ఎక్కబోతున్న మా అమ్మాయి.
గేమ్ అయిపోయాక బయలుదేరి వెళ్ళాం. ఇల్లు చూసేసరికి సాయంత్ర౦ కాస్తా రాత్రవబోతుంది.
“అమ్మలూ రామ్మా నాన్నను తీసుకుని రావాలి” అన్నా.
“ఐ విల్ స్టే హియర్ యు గొ గెట్ డాడీ” అంది.
“తెలుగు” అన్నా.
“నేను ఇక్కడ ఉంటా డాడీని తీసుకుని రా” అంది.
ఏదో సర్ది చెప్పబోయేంతలో మా ఫ్రెండ్ కూడా “ఇక్కడే ఉండనీండి ఆడుకు౦టుంది. ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకుని వెళుదురుగాని” అన్నారు.
ఏదో సర్ది చెప్పబోయేంతలో మా ఫ్రెండ్ కూడా “ఇక్కడే ఉండనీండి ఆడుకు౦టుంది. ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకుని వెళుదురుగాని” అన్నారు.
పాపని అక్కడే ఉంచి మా వారిని తీసుకుని రావడానికి వాళ్ళ ఆఫీసుకి బయలుదేరాను. గోధూళి వేళ గోవులు లేవుకాని రోడ్డు మీద ఆవులమందలా కార్లు. ఇరవై నిముషాల ప్రయాణం గంట పట్టింది. మళ్ళీ తిరగిరావడానికి మరో గంట, వెరసి రెండు గంటల ప్రయాణం. ఎప్పుడో మధ్యాన్నం తిన్న భోజనం...ఆకలి మొదలయ్యింది, తోడుగా తలనొప్పి.
పాపను తీసుకుని రావడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫ్రెండ్ అంటే మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు ఆ ఏడాదే వాళ్ళతో పరిచయం. ఇంటికి వెళ్ళాక ఆవిడ “వంట చేసారా చెయ్యాలా” అని అడిగారు. “చెయ్యలేదు వెళ్ళగానే చేస్తాను, ఎంత సేపు” అన్నాను. ఆవిడ హడావిడిగా పచ్చడి, కూర, పప్పు అన్నీ సర్దడం మొదలెట్టారు. నాకు బోలెడు మొహమాటంగా ఉంది, వద్ద౦టే వినలేదు. ఒక డబ్బాలో అన్న౦ కూడా పెడుతున్నారు. అన్నం నేను పెట్టుకు౦టానంటే, “పాప కోసం లెండి మీరు వండేసరికి ఆకలికి ఉండలేదని” పెట్టేసారు. ఆవిడకు థాంక్స్ చెప్పి వచ్చి కారులో కూర్చున్నాము. నాకు తలనొప్పి ఎక్కువై, పొట్టలో తిప్పడం మొదలైంది.
ఇంటికి వెళ్ళీ వెళ్ళడంతో ఆ అన్నం కూరలు తి౦టే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు నాకు మూడో నెల. ఇంటి దగ్గర వాళ్ళంతా గుర్తొచ్చే రోజులు. ఆ ఆకలంతా వేవిళ్ళ మహిమ, అది తెలిసే ఆవిడ అన్న౦తో సహా ఇచ్చారని అర్ధం అయింది. అమెరికాలో వున్న అమ్మాయిల కష్టాలు ఇలా ఉంటాయి. ‘ఏ మెక్ డోనాల్డ్స్ కో వెడితే సరిపోయేదిగా’ అని మీకనుమానం రావచ్చు. అవన్నీ తినాలనిపించదు, పైగా మన మీద ప్రేమ చూపించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బహుశా హార్మోన్స్ కావచ్చేమో.
అమెరికాలో అందరికీ దూరంగా వుంటూ మిస్ అయ్యే వాటిలో ఇదొకటి. ప్రగ్నెన్సీ మొత్తం రోజులు వీలయితే వండుకుని తినాలి లేకపోతే ఏదో కాలం గడిపేయడమే. తెలుగు వారు ఎవరూ దగ్గరలేని వారి పరిస్థితి మరీ దారుణం. మా బంధువులమ్మాయి కొత్తగా పెళ్ళై వచ్చింది ఆ ఊరిలో ఎవరూ తెలిసిన వారు లేరట. రావడమే వేవిళ్ళు పైగా వింటర్. రెండు నెలల వరకూ మంచం దిగలేక పోయింది.
ఎంత చనువున్నా నాకిది తినాలని ఉంది అని చెప్పలేని కనిపించని గోడలేవో అడ్డం ఉంటాయి. అలాంటి కష్టం తెలిసిన నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు అన్నపూర్ణలు మాకు.