Friday, November 11, 2011

అన్నదాతా సుఖీభవ

         వున్న ఇల్లు ఇరుకైపోయి కొత్త ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఒక ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్ మె౦ట్ కాంప్లెక్స్ లో ఖాళీలున్నాయని తెలిసింది. ఆ యేరియా మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉంది కూడానూ. వెళ్లి ఇల్లు చూసి వద్దామనుకున్నాను.

“గుండూస్ శ్రావణి ఆంటి వాళ్ళింటికి వెళ్దామా?” పక్కింటి సాహిల్తో 'షూట్స్ అండ్ లాడర్స్' ఆడుతున్న మా అమ్మయిని అడిగాను.
“ఆఫ్టర్ దిస్ గేమ్” అంది లాడర్ ఎక్కబోతున్న మా అమ్మాయి.
గేమ్ అయిపోయాక బయలుదేరి వెళ్ళాం. ఇల్లు చూసేసరికి సాయంత్ర౦ కాస్తా రాత్రవబోతుంది.
“అమ్మలూ రామ్మా నాన్నను తీసుకుని రావాలి” అన్నా.
“ఐ విల్ స్టే హియర్ యు గొ గెట్ డాడీ” అంది.
“తెలుగు” అన్నా.
“నేను ఇక్కడ ఉంటా డాడీని తీసుకుని రా” అంది. 
ఏదో సర్ది చెప్పబోయేంతలో మా ఫ్రెండ్ కూడా “ఇక్కడే ఉండనీండి ఆడుకు౦టుంది. ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకుని వెళుదురుగాని” అన్నారు. 

             పాపని అక్కడే ఉంచి మా వారిని తీసుకుని రావడానికి వాళ్ళ ఆఫీసుకి బయలుదేరాను. గోధూళి వేళ గోవులు లేవుకాని రోడ్డు మీద ఆవులమందలా కార్లు. ఇరవై నిముషాల ప్రయాణం గంట పట్టింది.  మళ్ళీ తిరగిరావడానికి మరో గంట, వెరసి రెండు గంటల ప్రయాణం. ఎప్పుడో మధ్యాన్నం తిన్న భోజనం...ఆకలి మొదలయ్యింది, తోడుగా తలనొప్పి.

       పాపను తీసుకుని రావడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫ్రెండ్ అంటే మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు ఆ ఏడాదే వాళ్ళతో పరిచయం. ఇంటికి వెళ్ళాక ఆవిడ  “వంట చేసారా చెయ్యాలా” అని అడిగారు. “చెయ్యలేదు వెళ్ళగానే చేస్తాను, ఎంత సేపు” అన్నాను. ఆవిడ హడావిడిగా పచ్చడి, కూర, పప్పు అన్నీ సర్దడం మొదలెట్టారు. నాకు బోలెడు మొహమాటంగా ఉంది, వద్ద౦టే వినలేదు. ఒక డబ్బాలో అన్న౦ కూడా పెడుతున్నారు. అన్నం నేను పెట్టుకు౦టానంటే, “పాప కోసం లెండి మీరు వండేసరికి ఆకలికి ఉండలేదని” పెట్టేసారు. ఆవిడకు థాంక్స్ చెప్పి వచ్చి కారులో కూర్చున్నాము.  నాకు తలనొప్పి ఎక్కువై, పొట్టలో తిప్పడం మొదలైంది. 

          ఇంటికి వెళ్ళీ వెళ్ళడంతో ఆ అన్నం కూరలు తి౦టే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు నాకు మూడో నెల. ఇంటి దగ్గర వాళ్ళంతా గుర్తొచ్చే రోజులు. ఆ ఆకలంతా వేవిళ్ళ మహిమ, అది తెలిసే ఆవిడ అన్న౦తో సహా ఇచ్చారని అర్ధం అయింది. అమెరికాలో వున్న అమ్మాయిల కష్టాలు ఇలా ఉంటాయి. ‘ఏ మెక్ డోనాల్డ్స్ కో వెడితే సరిపోయేదిగా’ అని మీకనుమానం రావచ్చు. అవన్నీ తినాలనిపించదు, పైగా మన మీద ప్రేమ చూపించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బహుశా హార్మోన్స్ కావచ్చేమో. 

       అమెరికాలో అందరికీ దూరంగా వుంటూ మిస్ అయ్యే వాటిలో ఇదొకటి.  ప్రగ్నెన్సీ మొత్తం రోజులు వీలయితే వండుకుని తినాలి లేకపోతే ఏదో కాలం గడిపేయడమే. తెలుగు వారు ఎవరూ దగ్గరలేని వారి పరిస్థితి మరీ దారుణం. మా బంధువులమ్మాయి కొత్తగా పెళ్ళై వచ్చింది ఆ ఊరిలో ఎవరూ తెలిసిన వారు లేరట. రావడమే వేవిళ్ళు పైగా వింటర్. రెండు నెలల వరకూ మంచం దిగలేక పోయింది. 

       ఎంత చనువున్నా నాకిది తినాలని ఉంది  అని చెప్పలేని కనిపించని గోడలేవో  అడ్డం ఉంటాయి. అలాంటి కష్టం తెలిసిన నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు అన్నపూర్ణలు మాకు. 

12 comments:

 1. చదివిన తర్వాత ఏం చెప్పాలో తెలియడం లేదండి..ఎక్కడో దూరాన, వాళ్ళకేం సంతోషంగా ఉంటారు, అన్నీ ఉంటాయ్,బాగా ఎంజాయ్ చేస్తారు అనుకునే వాళ్ళకి అక్కడి చెప్పుకోలేని సంగతులు ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. అలా మనసు తెలుసుకుని సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండీ.ఏమైనా ఆ సమయంలో మీరు అదృష్టవంతులే.ఎప్పుడైనా అన్నదాతలు అన్నపూర్ణలే అండీ

  ReplyDelete
 2. చెప్పలేని భావం మదిని తాకినప్పుడు మాటలు మూగపోయాయి. ఒంట్లో కొంచెం నలతగా అనిపిస్తే వెంటనే అమ్మ ఒడి గుర్తుకొస్తుంది ఎందుకో??? ఆ ప్రేమగా నిమిరే చేయి కోసమేమో!

  ReplyDelete
 3. @జ్యోతిర్మయి
  ఇది సత్యము అన్నము పెట్టినదేవరైనా వారు దైవ సమానులు. కాని అర్థం చేసుకొని సమయానికి , తగినవారికి చేస్తే మరింత పుణ్యము. మీరు చెప్పిన ఆవిడెవరో మాకు తెలియక పోయిన అ తల్లికి మా తరపు ధన్యవాదాలు. అలాగే ఆ అన్నదాత గురించి మాతో పంచుకునందుకు మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. అమెరికాలో తెలుగువాళ్ళు పడుతున్న బాధలు 'మీ జ్ఞాపకాల' ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీ అమ్మాయి "ఐ విల్ స్టే హియర్ యు గో గెట్ డాడి" అన్నప్పుడు మీరు 'తెలుగు' అనడం చూస్తుంటే, అమెరికాలో ఉంటున్నా తెలుగు భాష పైన మీకున్న ప్రేమ
  ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంగ్లీష్ మోజులోపడి తెలుగు భాషను చిన్నచూపు చూసే వాళ్ళు సిగ్గుతో తలదించుకొనేలా ఉంది.

  ReplyDelete
 5. కొంచెం శ్రమ, మరి కొంత అర్ధం చేసుకునే తత్వం ... కలసి అన్నపూర్ణ లైన తల్లులందరికి వందనములు చెప్పుతూ.. అన్నదాతా..సుఖీ భవ!!

  ReplyDelete
 6. చదువుంటేనే బాధగా వుంది.

  ReplyDelete
 7. @ ఆ సమయంలో అలంటి వారు పక్కనుండడం నా అదృష్టమే శుభా..తర్వాత చాలా విషయాల్లో ఆవిడ మాకు పెద్దరికంగా నిలిచారు. ధన్యవాదాలు.

  @ అమ్మ ఒడి అందరికీ దొరకదుగా రసజ్ఞా..నీ స్పందనకు ధన్యవాదాలు.

  @ కళ్యాణ్ గారూ ఆవిడ అన్నపూర్ణే కాదు, ఒక మార్గదర్శకం కూడా. ఇప్పటికీ ఏదైనా కష్టం వస్తే నా ఆలోచన ఆ వైపే వెళ్తుంది. ధన్యవాదములు.

  ReplyDelete
 8. @ నాగేంద్ర గారూ..పిల్లలకు అలా గుర్తుచేస్తూ ఉండక పోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారండీ. మాతృభాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీనీ. మీ స్పందనకు ధన్యవాదములు.

  @ అలాంటి వారు మార్గదర్శకులు వనజగారూ..ధన్యవాదములు

  @ మానవత్వం గురించి కొంచెం పంచుకోవలనిపించిది. మీ స్పందనకు ధన్యవాదములు శర్మగారూ.

  ReplyDelete
 9. @ మౌళి గారూ ధన్యవాదములు.

  ReplyDelete
 10. నిజంగా చాలా బాగా వివరించారు....
  నేనూ, నా స్నేహితురాలు కలిసి మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఇంకో స్నేహితురాలికి ఈ మధ్య ఇలాగే వండి ఇచ్చాము వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు....తనకి బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్......... మాకు కొంచెం సాన్నిహిత్యం ఎక్కువే అందుకని ఒక్కొసారి వళ్ళింటికే సాయంత్రం తొందరగా వెళ్ళి ఫ్రిజ్ ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయో చూసి కూరలు, పప్పు చేసి వచ్చేవారము....

  ఇప్పుడు వారికి పాప పుట్టింది..... అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు... అంతా హ్యప్పీస్...

  ReplyDelete
 11. మాధవి గారూ మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పటికీ మరచి పోరు. బాగ్ చదివి వ్యాఖ్యలు పెడుతున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.