ఆ మూడంతస్తుల భవనంలో మొత్తం తొమ్మిది వాటాలు. మూడొవ
అంతస్తులో ముచ్చటగా ఓ చిన్ని కుటుంబం, ఓ అమ్మ, నాన్న, పాప. అప్పుడు సమయం ఉదయం పది గంటలు. గదిలో చిట్టితల్లి లియో టాయ్స్
ముందేసుకుని ఆడుకుంటోంది. అమ్మ వంటింట్లో బెండకాయలు తరుగుతూంది. కాసేపటికి పాప
కనిపించలేదు.
“చిట్టితల్లీ
ఎక్కడున్నావ్?”
“ఇక్కలున్నా..”
“అక్కడేం
చేస్తున్నావ్?”
“మత్తి
తింతున్నా..”
అమ్మ పరుగెత్తుకెళ్ళి
గోడమూలలో చీమలు పెట్టిన మట్టి దగ్గరున్న పాపను తీసుకుని కుళాయి దగ్గరకెళ్ళి నోరు
కడుగుతూ “మట్టి యాక్కీ, తినకూడదు నాన్నా”
“యక్కీ”
“అవును
మట్టి తింటే పొట్టలో పాములు వస్తాయి. ఇంకెప్పుడూ తినకు.” పాప పెద్దపెద్ద కళ్ళతో అనుమానంగా చూసింది. అమ్మ చెప్పిన విషయం ఏ మాత్రం
నమ్మినట్టులేదు.
మరోరోజు, ఇంకోరోజు
పాప మట్టి తింటూ కనిపించడంతో అమ్మ మట్టి కనిపించిన దగ్గరల్లా కొంచెం కారం
కలిపేసింది. ఇంకేముంది పాప కొంచెం నోట్లో పెట్టుకోగానే కారం. అంతటితో ఊరుకుందా
మట్టి దొరికే అన్ని ప్రదేశాలకి వెళ్లి రుచి చూసింది. అమ్మ వారం పాటు రోజూ
మరచిపోకుండా కారం చల్లింది.
ఇంతలో సంక్రాంతి పండుగొచ్చింది. పాప, అమ్మ,
అమ్మమ్మ గారింటికి వెళ్లేట్టు నాన్న తరువాతొచ్చేట్లు నిర్ణయమైంది. రిక్షా దిగగానే చిట్టితల్లి మొహం సంతోషంతో పుచ్చపువ్వులా విరిసింది. ఎందుకో తెలుసా
హైదరాబాదులోలా మట్టి కోసం మూల మూలలా వెతుక్కోనఖ్ఖర్లా ఇక్కడ ఎక్కడ చూసినా మట్టే. అమ్మ చిట్టితల్లి ఆంతర్యం గ్రహించేసి 'మట్టి' ప్రహసనం గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పేసింది. వాళ్ళు పక్కనున్న ఇంకో
అమ్మమ్మకు, ఆవిడ వీధిలో వాళ్ళకు ఇలా అందరికీ చెప్పేశారు. దాంతో చిట్టితల్లి 'మట్టి తినడం' గురించి
ఊరు వాడా తెలిసిపోయాయి. ఇక కట్టుదిట్టాలు మహా బందోబస్తుగా జరిగిపోయాయి.
ఒక రోజు ఉదయం తాతయ్య వరండాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నాడు. పాప గేటు పట్టుకుని ఆడుతూ ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఎదురుగా ఊరిస్తూ వాకిట్లో బోలెడంత మట్టి.
"తాతయ్యా,
ఆపీచుకి వెల్లవా?"
"వెళతానమ్మా" పేపర్ పక్కకు తీసి పాపను చూస్తూ.
"తొందరగా
వెల్లూ, లేతుగా వెల్తే మీ మాత్తాలు కొలతాలు."
పెద్దగా నవ్వేసి
"నేను వెళితే మట్టి తి౦దామనా" అన్నాడు తాతయ్య.
పాప సిగ్గుగా నవ్వేసింది. ఈ పెద్దవాళ్లకి అన్నీ ఎలా తెలిసిపోతాయో అని ఆశ్చర్యపోతూ...
అక్కడున్నంత కాలం పాప మట్టి
తినకుండా.....పిన్నులో, మామయ్యలో,
తాతయ్యలో ఎవరో ఒకరు ఆ చిన్ని ప్రాణానికి. ఆ విధంగా ఊరిలో కూడా మట్టి
తినడం కుదరలేదు. పాపా వాళ్ళు పండుగవగానే తిరిగి హైదరాబాదు వచ్చేశారు.
* * *
పాపావాళ్ళ బిల్డింగ్లో వున్న తొమ్మిది పోర్షన్లలో బోలెడంతమంది పిల్లలు. దాదాపుగా అందరూ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళే. అందులో మన చిట్టితల్లే చిన్నది. అందువల్ల
పిల్లలూ, పెద్దలూ అందరూ చిట్టితల్లిని
చాలా ముద్దు చేసేవారు. రోజూ సాయంత్రాలు పిల్లలు స్కూల్ నుండొచ్చాక అ౦దరూ టెర్రస్ మీదకెళుతూ చిట్టితల్లిని కూడా తీసుకెళ్ళేవారు. అమ్మ వాళ్లకు "పాప మట్టితినకుండా చూడమని" బోలెడు జాగ్రత్తలు చెప్పేది. అప్పుడప్పుడూ పైకెళ్ళి తణిఖీలు కూడా చేసేది....పాప చిన్నగా గోడ మూలల్లోని
మట్టి తినడం మానేసింది.
మట్టి తినడమైతే మానేసింది కాని మన గడుగ్గాయి కొత్త మార్గం
కనిపెట్టింది. అదేంటంటే గోడకున్న సున్నం నాకడం. అమ్మకు రోజంతా పాపను కాపలా కాయడమే
పని. రోజూ లాగే ఆ రోజు కూడా
పిల్లలు పాపను మేడపైకి తీసుకెళ్ళారు. అమ్మ రోజూలాగే జాగ్రత్తలు చెప్పింది కూడా..
ఓ అరగంట గడిచాక, చిట్టితల్లి
ఏం చేస్తుందో చూద్దామని అమ్మ పైకి వెళ్ళింది. పైకెళ్ళిన అమ్మ ఆశ్చర్యంగా
నిలబడిపోయింది. ఇంతకూ అమ్మకు ఏం కనిపించిందంటారా?
గోడ పొడవునా రెండేళ్ళ
చిట్టితల్లికి తోడు పదిమంది పిల్లలు గోడ నాకుతున్న దృశ్యం.