Thursday, March 25, 2021

స్వప్నలోకం

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలు అంటూ ఐదు రోజుల నుండీ కబుర్లు  చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.
                                   
సినిమాల్లో చూస్తుంటాం. విశాలమైన లోగిలి అందులో ఓ పెద్ద కుటుంబం, అందరూ ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండడం. రియాలిటీకి దూరం అని తెలిసినా జీవితంలో కొన్ని రోజులయినా అలా ఉండాలనే ఫాంటసీ ఒకటుండేది. ఆ ఫాంటసీ ఈ సందర్భంగా రియాలిటీలోకి వచ్చింది. ఉదయం పూర్తిగా తెల్లవారకుండానే స్టవ్ మీద మరుగుతున్న ఫిల్టర్ కాఫీ వాసన, ఆ కాఫీతో పాటు కబుర్లు మొదలైపోయేవి. మా పెళ్ళయిన ఇన్నాళ్ళలో మేము, తమ్ముడు వాళ్ళు, మరిది వాళ్ళు అందరం కలసి ఒక దగ్గర ఉండడం ఇదే మొదటిసారి. అక్కా, బావా, వదినా, అత్తా, పిన్నీ, పెద్దమ్మా, పెదనాన్నా, బాబాయ్ పిలుపులతో ఇంటికి కొత్త కళ వచ్చింది.

ఇలాంటి సందడి మా చిన్నప్పుడు చూసాను. వేసవిలోనూ, పండుగలప్పుడూ అందరం ఒక్క ఇంట్లోనే ఉండడం. ఇంట్లో ఏ శుభకార్యమైనా బంధువులందరూ వారం ముందే రావడం. మళ్ళీ ఇన్నేళ్ళకు ఆ సందడి చూస్తున్నాను. పిల్లలందరికీ కూడా ఇంతమంది ఇన్ని రోజులు ఒక్క ఇంట్లో ఉండడం అనేది కొత్త విశేషం.  
మా మరిది వాళ్ళు వస్తామన్నప్పుడు ముందు కంగారుపడ్డాము. ఇంత రిస్క్ ఉన్న రోజుల్లో ఇంటెర్నేషనల్ ట్రావెల్ చేయడం ఎంత వరకు సేఫ్ అని. మా మరిది ఒక్కటే చెప్పాడు “వదినా రిస్క్ రివార్డ్ రెండూ ఉంటాయి, మనం రిస్క్ తీసుకుందాం” అని. మా తోడికోడలు మరిది ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోక పోయి ఉంటే ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యేవాళ్ళం. పైగా పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ అవడంతో మూడు వారాలు ఇలా రాగలిగారు.

సంగీత్ కోసం డాన్స్ ప్రాక్టీస్ లు, సినిమాలు చూడడం, బ్రౌనీస్ చేసుకోవడం, ఫైర్ పిట్ లో మార్ష్ మల్లోస్ రోస్ట్ చేసి స్మోర్స్ కత్తి యుద్దాలు, పిల్లో ఫైట్స్ ఒకటేమిటి వాళ్ళ అల్లరి నవ్వులతో రోజులు చలాకీగా గడిచాయి. ఇండియా పిల్లలు రాత్రిపూట, అమెరికా పిల్లలు పగటిపూట క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు. 

రాత్రంతా కనీసం రెండు గదులలోనైనా లైట్లు వెలుగుతూ, మాటలు వినపడుతూనే ఉండేవి. ఏ దొంగా మన ఇంటికి రారని ఒకరంటే ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు వచ్చినా ఇంతకు ముందే మరో దొంగల ముఠా వచ్చి వెళ్ళిందని వచ్చిన దారినే వెళ్లిపోతారని మరొకరు అనడం. ఇంట్లో అంత మంది ఉండడం పైగా అందరం పెళ్ళి పనుల్లో బిజీగా ఉండడంతో పడుకునే ముందు ఇల్లంతా సర్దినా, తెల్లవారి పది గంటలకల్లా మరేవో వస్తువులు నట్టి౦ట చేరేవి. ఇంట్లో ఇంతమందిమి ఉన్నాం సుమా అని అందరి ఉనికిని తెలుపుతూ ఆ చిందరవందర వస్తువులను చూడడం కూడా అదొక తృప్తిగా ఉండేది.

రోజుకో సందడి. ఒకరోజు పెళ్ళి కూతురి డ్రస్ రిహార్సల్స్. పెళ్ళి కూతురు ఒక్కో చీర కట్టుకుని చూపించడం, దానికి పిన్నో, అత్తో వాళ్ళ నెక్లెసో, బుట్టలో మాచ్ అవుతాయని ఇవ్వడం. ఇంకో రోజు లడ్డు చేయడం, మరో రోజు డెకరేషన్స్. ఒకరోజు అందరం పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఒకరోజు పెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సరదా.


ఇది కాక చెప్పుకోవలసింది మగపెళ్ళి వారి గురించి. పెళ్ళికొడుకు వాళ్ళ అన్నా వదినలు కూడా ఇదే ఊర్లో ఉండడంతో మా సరదా రెట్టింపు అయ్యింది. అన్నా వదినా అంటే ఏ నలభై ఏళ్ళ వాళ్ళో కాదు, వాళ్ళూ మా పిల్లలంత వాళ్ళే. పెళ్ళి అనుకున్న రోజునే చెప్పేసారు. మీరు మేము వేరు వేరు కాదు అంతా ఒకే కుటుంబం అని. వాళ్ళు చెప్పినట్టుగానే ఇది మేనమామ కూతురి పెళ్ళి అనే అనుకున్నారు వేరే భావనే రానివ్వలేదు ఏ సందర్భంలో కూడా. హాల్ సెలెక్షన్, డెకరేషన్స్, షాపింగ్, ఫోటో గ్రాఫర్ తో మాట్లాడం, డ్రెస్ సెలెక్షన్ ఇలా అన్నీ కలిసే చేసుకున్నాం. 

మా వియ్యంకురాలైతే పెళ్ళికి కావలసినవన్నీ లిస్ట్ ఇవ్వండి మేము ఇండియా నుండి వచ్చేటప్పుడు తీసుకుని వస్తాం అని ఒకటికి పదిసార్లు అడిగారు. తాను కొన్నవన్నీ వాట్స్ అప్ లో పిక్స్ పెట్టేవారు మాకు కూడా అలాంటివి కావాలేమో కనుక్కోవడానికి.
                                       
కరోనా వలన ఒంటరిగా ఉండాల్సిన రోజులలో మేము దానికి భిన్నంగా కుటుంబంతో గడపడం మా అదృష్టం. ఒక్కటే లోటేమిటంటే మా నాన్న కూడా ఉండి ఉంటే చాలా బావుండేది. ఈ కరోనా వలన ఆయన వయస్సు దృష్ట్యా ధైర్యం చేయలేక పోయారు.

సరుకులూ, సంరంజామా అంతా సిద్దం చేసికున్నాం, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తరవాత భాగం  నిశ్చయ తాంబూలాలు ఇక్కడ చదవొచ్చు.