Sunday, March 16, 2014

మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ

"నమస్తే డాక్టర్ గారు."
"రామ్మా రా. ఓ పిల్లల్ని కూడా తీసుకొచ్చావా?"
"అవునండి. ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదుగాని, పిల్లల్ని మీరోసారి పరీక్ష చేస్తే మంచిదని తీసుకొచ్చాను. ముందు మా చిన్నబాబును చూడండి.”
“ఏమైందమ్మా బాబుకు?”
“వీడు ఎవరి దగ్గరికీ పోడండి. ఇరవై నాలుగ్గంటలూ నన్నంటిపెట్టుకునే ఉంటాడు."
"బాబుకిప్పుడు నాలుగేళ్ళు కదూ! సాధారణంగా పిల్లలకు మూడేళ్ళ వయసొచ్చేప్పటికే ఆ భయం పోతుంది. కాని..... “
“చెప్పండి డాక్టర్, సందేహించకండి.”
“మీ బాబుకు మాత్రం పోదమ్మా"
"ఎందుకని డాక్టర్?"
"అది తనకు వంశపారంపర్యంగా సంక్రమించింది."

"మా వాళ్ళెవరూ అస్సలు ఇంట్లో ఉండరుకదండీ. ఉదయం నిద్ర లేస్తే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూనే ఉంటారు. ఆఖరికి మా అత్తగారు కూడా ఇరవై నాలుగు గంటలూ అరుగుమీద కూర్చుని ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ రాజకీయాలు మాట్లాడుతుంటారు."
"మరి అంతా తెలిసిన వాళ్ళు, ముందు వెనుకలు ఆలోచించకుండా పరిచయస్థులకో, బంధువులకో మాత్రమే ఎందుకు మద్దతిస్తారో తెలుసా? అలాంటి నిర్ణయాల వలన జరిగే అనర్ధాలు కూడా ఊహించగలరు. కాని పాపం మీ వాళ్ళకు కొత్త వాళ్ళంటే భయం. దీన్నే 'స్ట్రేంజర్ యాంగ్జైటీ' అంటారు.

"ఓ...మా మామగారి పెద్ద అమ్మమ్మ గారి చిన్న మనవడు లేడూ, అదేనండీ అందరూ చంటి అంటారే! అతను చదువు చట్టుబండలూ లేక రాజకీయాల్లో తిరుగుతుంటాడు. అతనేం మాట్లాడతాడో అతనికే తెలియదు. మా చేత అతనికి ఓట్లేయించినప్పుడు ఎందుకా అనుకున్నాను. ఇదన్నమాట సంగతి."
"...."

"సర్లెండి. మా పెద్ద బాబునోసారి చూడండి డాక్టర్. దూరానున్నవి సరిగ్గా కనిపించట్లేదటండీ. పాపం టీచర్ బోర్డు మీద ఏం రాస్తున్నారో తెలియట్లేదట."
"దాందేముంది. పరీక్ష చేసి మంచి అద్దాలిద్దాంలేమ్మా."
"అప్పుడు సరిగ్గా చూడగలడా డాక్టర్?"
"ముందున్నదేదో చూడగలడు. కానీ ముందుచూపు మాత్రం తనకు ఎప్పటికీ లేకపోవచ్చు. అదీ వంశపారంపర్యమే"

"అయ్యో అలాగా! అవునులెండి. ఆ ముందుచూపే ఉంటే ఎమ్ ఎల్ ఏ చనిపోతే కనీసం సంతకం పెట్టటం కూడారాని వాళ్ళావిడకు మా వాళ్ళు పట్టుబట్టి మరీ పదవెందుకు ఇప్పిస్తారు? ఆ కుటుంబం మీద సానుభూతి ఉంటే బ్రతుకు తెరువు చూపించాలి కాని, అర్హతలేని ఆవిడకు అధికారం అప్పచెప్పడం..."
"...."
"మా పాపనోసారి చూడండి డాక్టర్ గారు. తనకు సరిగ్గా వినిపించడం లేదండీ. ఏ విషయమైనా గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది."
"పాపా, ఇటు రామ్మా. ఇలా కూర్చో"
.

.

"చెముడేమన్నా ఉందా డాక్టర్?"
"పాపకు బాగానే వినిపిస్తుందమ్మా. తనే వినిపించుకోవడం లేదు"
"ఇది కూడా....."
"అవునమ్మా... నీ అనుమానం నిజమే. మీ మామగారి దగ్గరనుండి అందర్నీ పరీక్ష చేస్తున్నాను. మీ వాళ్ళందరకూ ఉన్నదే ఇది కూడానూ"
“నిజమేలెండి. వినిపించుకుంటే మా వాళ్ళకు మంచీ చెడ్డా తెలిసి ఊరుకి మంచి చేసేవాళ్ళనే ఎన్నుకునేవాళ్ళుగా! అలా వినిపించుకోక పోబట్టి కదూ కనీసం ఊర్లో మంచి నీళ్ళు కూడా లేకుండా నానా ఇబ్బందులూ పడుతున్నాం, ఆడవాళ్ళం పట్టపగలు నడిరోడ్లో ఒంటరిగా నడవడానికి భయపడి చస్తున్నాం.”
“......”

“డాక్టర్ గారూ, మరి మా బావగారు, వదిన గారు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా తెలివికల వాళ్ళని మాష్టారు గారు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు కూడాను. వాళ్ళకిలాంటివేమీ లేవు కదండీ.”
“ఎందుకు లేవమ్మా మొహమాటం అనే అతి ప్రమాదకరమైన జబ్బుంది. మీ ఇంట్లో తీగ మీద ఆరేసిన పట్టుచీరను ఏ దొంగైనా పట్టుకుపోవడం చూస్తున్నా నోరు తెరిచి ఒక్కమాటా మాట్లాడరు. ఆ దొంగేమైనా అనుకుంటాడనీ, దారిని పోయేవాళ్ళకు వినిపిస్తుందనీనూ."
"అయ్యో....అయితే ఇక ఈ పిల్లలు ఇంతేనా డాక్టర్ గారు. ఇవన్నీ పోవడానికి మందేమైనా ఇవ్వండి."

"మందంటే....ఆ, రోజుకో పది నిముషాలు ఆలోచించడం నేర్పమ్మా"
"మా ఇంటా వంటా లేని పనని మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ..."



Wednesday, February 19, 2014

ఇంకేమంటాం?

      సమీరలాంటి వారిని ఏమనాలో కూడా అర్ధం కాదు. ఆడవాళ్ళంటే కాస్త సుకుమారంగా, కొంచెం బేలగా, అంతో ఇంతో మొహమాటపడుతూ ఉంటే కదా అందం. అలాంటిదేవీ లేకపోగా అమెరికా వచ్చిన ఏడాదిలోనే ఏవో కోర్సులవీ చేసి ఐటిలో ఉద్యోగం సంపాదించింది. ఇండియాలో ఏదో పెద్ద చదువు చదివిందనుకుంటున్నారేమో! అదేం కాదు బికాం డిగ్రీ చేతబట్టుకుని వచ్చింది. ఉద్యోగం కూడా ఏ ఇంటిపక్కనో చూసుకోకుండా ఊరికిరవై మైళ్ళ దూరంలో వున్న ఆఫీసుకు అప్లయ్ చేసింది. డ్రైవింగ్ అన్నా వచ్చా అంటే అదీ అంతంత మాత్రమే. "పాపం ఆడపిల్ల హైవే లవీ ఎక్కి అంత దూరం ఎలా వెళ్తుంది? కొన్ని రోజులన్నా ఆఫీస్ దగ్గర దింపుదా౦" అని లేకుండా వాళ్ళాయన "నువ్వెళ్ళిపో" అని పెళ్ళాం కట్టిచ్చిన కారేజ్ తీసుకుని చక్కా పోయాడు. ఆ ఫ్రీవే మీద మరొకరైతే ఏం చేసేవారో కాని సమీర కదా ఎంచక్కా ఆఫీస్ కెళ్ళిపోయింది. "ఎలా వెళ్ళావ"ని అడిగితే "వేరే దారిలేదుగా" అని నవ్వుతూ సమాధానం.

       మేమందరం స్టీరింగ్ పట్టుకోవడానికి భయపడి మగమహారాజులు డ్రైవ్ చేస్తుంటే నిశ్చింతగా పక్కన కూర్చుని ఊరు వాడా తిరిగేస్తున్న సమయంలోనే, ఈవిడ డ్రైవ్ చెయ్యడం ఆయన సుఖంగా ముందు సీట్లో కాళ్ళు డాష్ బోర్డ్ మీద పెట్టుక్కూర్చోవడమూను...అంతలోనే అయిపోతే కథేముంది? వినండి.

       ఓ రెండేళ్ళు తిరిగేసరిగి సమీర తల్లి కాబోతుందని తెలిసింది. అంతా మామూలుగా ఉంటే మన౦ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటాం? నిండు చూలాలు, రేపో మాపో ప్రసవం అయ్యే భార్యను పరాయి దేశంలో ఒంటరిగా వదిలి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందని సమీర భర్త ఇండియా వెళ్ళాడు. అసలు తప్పంతా సమీరదే, అతనెంత తండ్రి మీద ప్రేమతో వెళ్ళాలనుకున్నా తొలి కాన్పు తనను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని చెప్పక్కర్లా. అబ్బే అదే౦ లేదు, పైగా బట్టలన్నీ శుభ్రంగా మడతలు పెట్టి సూట్ కేస్ లో సర్ది పెడుతుందా? తీరా పురిటి సమయానికి స్నేహితులెవరో సంతకం చేస్తే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. వాళ్ళాయన ఊరినుండి వచ్చేసరికి మగబిడ్డను ప్రసవి౦చిదనుకో౦డి. పరిస్థితి తారుమారుయ్యుంటే ఎవరు దిక్కు? ఏమైనా చెప్పామనుకోండి. "అతనికి వెళ్ళాలని వుంది నేను ఆగమని చెప్తే ఆగుతారా" అని నవ్వేస్తుంది. ఎక్కడా కోపం, దిగులు మచ్చుకైనా కనబడవంటే నమ్ముతారా?

     మరో రెండేళ్ళకు ఇంకో చంటిది. సరే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు...ఇద్దరు పిల్లలు... ఇహనంతా మామూలుగా ఉందిలే అనుకున్నాం. ఈలోగా ఏమైందో ఏమో వున్న ఉద్యోగం మానేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ అంటూ ఇల్లు కట్టించడం మొదలు పెట్టింది. "ఇదేం పని, ఇదేమైనా మన దేశమా? లేక మనకేమైనా మిలియన్స్ ఉన్నాయా? ఇలాంటి పని చేశారు. ఈ ఇల్లు కట్టించడం మనవల్ల అయ్యే పనేనా?" అని ఎన్నో విధాల చెప్పి చూశాం. ఇద్దరిదీ చిరునవ్వే సమాధానం. ఇంటి పనికి సమయం సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగం మానేసింది. "ఇప్పుడెలా డబ్బులూ అవీ చాలా కావాలేమో కదా" అంటే "అవే వస్తాయని" ఆయన సమాధానం. ఆ ఇల్లు కాస్తా పూర్తయ్యింది. ఏమాటకామాటే ఇల్లు ఇంద్ర భవనంలా ఉందనుకోండి. ఇక అమ్మేద్దాం అనుకునే సమయానికి అమెరికాలో ఆర్ధిక కాటకం అదేనండీ రెసిషన్. చేసేదేం లేక ఆ ఇంట్లోనే కాపురం పెట్టారు. అప్పుడన్నా మోహంలో ఎక్కడైనా దిగులు విచారం కనిపిస్తాయేమో అని చూశాం. అబ్బే అదే చిరునవ్వు.


     "ఇప్పుడేంటి సమీరా, మళ్ళీ ఉద్యోగంలో చేరుతావా?" అని అడిగితే "ఇద్దరం బిజీగా వుంటే పిల్లలకు కష్టమౌతుంది. మెడికల్ బిల్లింగ్ చేద్దామనుకుంటున్నాను" అని చెప్పింది. ఏ డాక్టర్ ఆఫీస్ లోనే పని చేస్తుంది కాబోలుననుకున్నాం. ఆ కోర్స్ ఏదో చేసి పదివేల డాలర్లు పెట్టి కావాల్సిన సరంజామా తయారు చేసుకుని సొంతంగా ఆఫీస్ మొదలు పెట్టింది. రెండేళ్ళ వరకూ డాక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగింది తిరిగినట్లే ఉందనుకోండి ఒక్క డాక్టరూ కరుణించలా. ఆ దారిలో వెళ్దామనుకున్నకొందరు స్నేహితులు చేతులెత్తేశారు. కాని తను మాత్రం అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఇండియాలో కూడా దానికనుబంధంగా మరో ఆఫీస్ తెరిచి౦దిట. "అబ్బా నువ్వు చాలా గోప్పదానివి సుమా " అంటే కనీసం దానికైనా ఒప్పుకోవచ్చుగా "నేనే చెయ్యగలిగానంటే ఎవ్వరైనా చెయ్యగలరని" మనల్నే మునగ చెట్టు ఎక్కించేస్తుంది. ఇలాంటి వారిని ఏమనాల౦టారూ?



Tuesday, February 4, 2014

మానేస్తాన౦తే...ఆ

"ఎంత చేస్తే మాత్రమేం, పట్టించుకునేదెవర్లే....."
"ఎందుకలా అనుకుంటావ్....అన్నీ నీ కోస౦ కాదుటే?"
"భలే చెప్పేవు లేవమ్మా... ఇవన్నీ కావాలని నేనడిగానా? అదుగో టింగు రంగా మంటున్నాయే వాటికోసం ఇవన్నీ. ప్రేమంతా వాటిపైనే. నాకు మిగిలేది మాత్రం కేవలం పనే, ఓపిక ఎక్కడనుండి తెచ్చుకోమంటావ్?"
"అదేంటి! రోజుకో ఆరుగంటల పని చేస్తావేమో! దానికే ఓ...ఇదై పోతున్నావే. ఆ పని కాస్తా అవ్వగానే అంతా విశ్రాంతేగా!"
"ఎవరమ్మా చెప్పింది. ఉదయానుదయాన్నే నా మోహన ఇంత కాఫీ పోస్తారు. అదెంత చేదుగా ఉంటుందో తెలుసా! కషాయం నయం. ఇక అక్కడ్నుండి మొదలు. "ఇచ్చిన పనేదో కానిచ్చి కాసేపలా కునుకు తీద్దాం" అనుకుంటుండగానే, పని మీద పని పురమాయిస్తారు. వాన కానీ, వరదే రానీ బండెడు చాకిరీ తప్పదు. చిన్న సాయ౦ కూడా ఉండదనుకో. ఇక సాయంత్రాలు, రాత్రిళ్ళూ చెప్పనే అక్కర్లేదు."
"పోనీలేవే రోజులన్నీ ఒక్కలాగే ఉంటాయా!"
"ఒక్కలాగా ఎలా ఉంటాయి? ఇంటికి చుట్టాలో, బంధువులో వస్తూనే ఉంటారుగా! అప్పుడైతే ఇక చెప్పనే అక్కర్లేదు."
"బావుంది, మనుషులొచ్చినప్పుడు కూడా అలా అనుకుంటే ఎలా? బయటకు వెళ్ళినప్పుడ౦తా విశ్రాంతేగా!"
"ఎక్కడికీ వెళ్ళేది....పెళ్ళీ, పెరంట౦ ఇవేగా...కాకపోతే ఏ ఊరు చూడ్డానికో..... రోజూ చేసే పనికంటే రెట్టింపు పని. అక్కడికొచ్చే నాలాంటి వాళ్ళంతా ఇదే అనుకుంటారు. మా కష్టాలు కష్టాలు కావనుకో. వెనకటికెప్పుడో ఈ పెళ్ళిళ్ళ కోసం సరదాగా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడదంతా ఏం లా."
"అవునా, అక్కడన్నీ మీ కోసమే చేస్తున్నామని చెప్తారే".
"అంతా ఒట్టిది. వాళ్ళ గొప్పలు చూపించుకోడానిగ్గాని, మా గురించి వాళ్ళకేం పట్టింది?"  
".........."
"కనీసం పడుకోబోయే ముందన్నా కనికరిస్తారా! అబ్బే...అంతో ఇంతో పని అప్పజెప్పి గాని పడుకోరు. దాంతో రాత్రంతా నిద్రే ఉండదు."
"అయ్యో అలాగా!"
"ఇదేమైనా ఒకనాటిదా రోజూ ఇలాగే పనిచేయాలంటే ఎట్టాగమ్మా?"
"పోనీ చెయ్యనని చెప్పు"
"అదీ అయ్యింది, నేరుగా చెప్పలేక విషయం అర్ధం అయ్యేలా చేశాను. నన్నే నానా మాటలూ అన్నారు. ఏ పనీ సరిగ్గా చెయ్యలేనని అడ్డమైనా గడ్డీ పెట్టి మందులూ, మాకులూ ఇచ్చారు.".
"అయితే ఇప్పుడేమంటావ్?"
"కళ్ళు, నోరూ కావాలని అడిగిన  పిజ్జాలు, పనీర్లు, పఫ్ లు, కోడి పలావులు, కాలా జామూన్ లు, పాలకోవాలు ఇంకా పేరు తెలియని అడ్డమైన వంటకాలు తింటూ ఇరవై నాలుగు గంటలూ విశ్రాంతి లేకుండా చేస్తే ఏదో నాడు పని మానేస్తాను. అప్పుడు ఏమనుకునీ ఉపయోగం ఉండదు ఏమనుకుంటున్నారో...ఆ"

Wednesday, January 29, 2014

అదన్నమాట సంగతి!

"నా అక్కకు రెండు కిడ్లు"
"మాకు ఇద్దరు కల్లున్నారు"


"రామ రామ! సంగతేమిటో చూద్దామని వస్తే, ఏమిటీ భాష?" అనుకుంటున్నారా... 
ఆ సంగతేమిటో నేను చెప్పడం ఎందుకు? స్వయంగా మీరే చూడండి. 




Sunday, January 26, 2014

"ఊ..." అంటే వస్తుందా?

"అనగనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకరోజు బావి గట్టుమీద కూర్చుని బట్టలు కుడుతోంది." ఓ రోజు రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరికీ కథ చెప్తోంది అమ్మ. 

"అప్పుడు సూది జారి బావిలో పడిపోయింది. ఆ సూది ఎలా బయటకు వస్తుంది?" పిల్లల వైపు చూస్తూ ఆడిగింది.
"పెద్ద మాగ్నెట్ కి తాడు కట్టి బావిలో వేస్తే వస్తుంది." చిట్టితల్లి సమాధానం. 
"బావి అడుగునంతా బురద, ఇసుక, ఇనుప ముక్కలు,  చిన్నచిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి కదా! దొరకడం చాలా కష్టం"
"బావిలోకి జంప్ చేసి వెతికితే దొరుకుతుంది" గర్వంగా అక్క వైపు చూశాడు పండు.
"చిన్న సూది కార్పెట్ మీద పడితేనే కనిపించదు ఇక బావిలో ఎలా దొరుకుతుంది పండూ?"
"బావిలో నీళ్ళన్నీ బయటకు పంప్ చేస్తే కనిపిస్తుంది" చెప్పి౦ది చిట్టితల్లి 
"నీళ్ళన్నీ పంప్ చేసినా కింద బురదలో కూరుకుని ఉంటుంది కాని కనిపించదు." 
"దెన్ హౌ?" ఆలోచనలో పడ్డాడు పండు. 

నాన్న ఈ కథనంతా ఆసక్తిగా వింటున్నాడు. చిన్నప్పుడు చాలా సార్లే విన్నాడీ కథ, కాని "ఊ అంటే వస్తుందా? ఆ అంటే వస్తుందా" అ౦టూ పెద్ద వాళ్ళు ఆట పట్టించడమే అతనికి తెలుసు. నిజంగా బయటకు తీసే ఉపాయం చెప్తుందేమో అనుకుంటూ చేసే పని ఆపేసి మరీ వాళ్ళ సంభాషణ వింటున్నాడు. 

"సూదిని ఫైండ్ చేసే స్పెషల్ టూల్స్ ఏమైనా ఉన్నాయా?" అడిగింది చిట్టితల్లి.
"ప్చ్.." పెదవి విరిచింది అమ్మ. 
"ఐ నో" అరిచాడు పండు. 
"ఏమిటో చెప్పూ" అక్కకు కూడా త్వరగా తెలుసుకోవాలని కుతూహలం. 
"సూదికి దారం ఉందిగా అది ఫ్లోట్ అవుతుంది కదమ్మా" గారంగా అమ్మ ఒళ్ళో పడుకుని ఆమె గాజులతో ఆడుకుంటూ చెప్పాడు. 
"ఒట్టి దారమే అయితే ఫ్లోట్ అవుతుంది పండూ. కాని సూది బరువు కదా సూదితో పాటు దారం కూడా మునిగి పోయింది ." 
"బావి అడుగున ఫిల్టర్ ఉంటుందా పడినవన్నీ బయటకు తెచ్చుకోవడానికి" చిట్టితల్లి ప్రశ్న. 
"అలాంటివి ఏమీ ఉండవు"
"అయితే వాటర్ అంతా బయటకు పంప్ చేయడమే బెస్ట్ ఆప్షన్" ఓ నిర్ణయానికి వచ్చేసింది చిట్టితల్లి. 
"ఆ అవ్వకు నీళ్ళన్నీ బయటకు తోడే శక్తి లేదు. పైగా ఎంత తోడినా మళ్ళీ నీరు ఊరుతూనే ఉంటాయి"  తనకు తెలియకుండా నాన్న కూడా వాళ్ళ కథలోకి వచ్చేశాడు. 
"సం హౌ షి నీడ్స్ టు ఫైండ్ ఇట్, డాడ్" నాన్నను చూడగానే చిట్టితల్లి భాష మారింది. 
వాళ్ళ మాటలకు నవ్వింది అమ్మ. "ఏం చేసినా దొరకదు నాన్నా అది" 
"మరి?" పండు 
"కొన్ని థింగ్స్ అంతే. ఒకసారి జారిపోయాక మళ్ళీ దొరకవు"  
"బట్...బట్, అవ్వకి సూది కావాలి గామ్మా" పండుకు అమ్మ చెప్పిన ముగింపు నచ్చలేదు. 
"కావాలి. అవ్వ బావిలోకి ఒకసారి దీర్ఘంగా చూసి నిట్టూర్చి, మౌనంగా ఇంట్లోకి వెళ్ళి ఇంకో సూది తెచ్చుకుని మళ్ళీ కుట్టడం మొదలుపెట్టింది."
"ఆ" ఆశ్చర్య పోయాడు పండు.

"అయితే పాత సూది పోయినట్లేనా? అవ్వదానికోసం వెతకలేదా?" అడిగింది చిట్టితల్లి. ఆమెకు ఏ వస్తువు పారేయడం ఇష్టం ఉండదు. తన ప్రీస్కూల్ బొమ్మలు, విరిగి పోయినవి కూడా ఇంకా తనదగ్గర ఉన్నాయి. 
"పోగొట్టుకున్న సూదే కావాలని పట్టుబడితే. అది దొరకొచ్చేమో కాని దాన్ని వెతికే ప్రయత్నంలో చాలా నష్టపోవాల్సి వస్తుందని అవ్వకి బాగా తెలుసు" చెప్పింది అమ్మ. 
"కాని పాత సూదే బావుంటుంది కదా! ఐ కాంట్ ఫర్గెట్ ది ఓల్డ్ వన్స్" 
"మరచిపోవడం ఎందుకు? మంచి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటే సరి. అయితే దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పోయిన సూది తిరిగి రాదు, కుట్టడమూ పూర్తవదు" 
"సో వుయ్ నీడ్ టు లెట్ ఇట్ గో అఫ్ థింగ్స్" ఆలోచిస్తూ చెప్పింది చిట్టితల్లి. 
"ఎగ్జాట్లీ" చెప్పాడు నాన్న.   
"నాట్ ఓన్లీ థింగ్స్ బట్ పీపుల్ టూ" ముక్తాయించింది అమ్మ.


Thursday, January 16, 2014

చీమా చీమా ఎందుక్కుట్టావే అంటే...

"నా పనే అది, వేరే పని ఎలా చేస్తానూ..." అంటూ దీర్ఘం తీసింది.  

"ఏం తల్లీ రాయడానికేం దొరకలేదా ఏం? ఇలా చీమలూ, దోమల వెంట పడ్డావ్?" ఇదే కదా మీ సందేహం. ఆగండాగండి... అసలేం జరిగిందో చెప్తాను. 

మొన్నా మధ్య మా సుధను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. ఆయన పరీక్షలన్నీ చేసి, "ఈ అమ్మాయికి జబ్బేమీ లేదు. చీమలు కుట్టాయంతే" అని తేల్చేశారు. "కుడితే గిడితే కనీసం తేలన్నా కుట్టాలి గాని, మరీ చీప్ గా చీమా కుట్టేది?" అన్న మా మామయ్యను ఓదార్చి, "ఏమిటి చీమలు కుడితే మనుషులు ఇలా మాటా మంతీ లేకుండా అవుతారా?" అని ఆశ్చర్యపోయాం.

"ఇప్పుడేం చెయ్యాలి డాక్టర్"  
"తగ్గడానికి మందులు రాశాను, వేళ తప్పక వేసుకోవాలి" అని ఓ చీటీ మా చేతిలో పెట్టాడు. 
"ఇవి వాడితే తగ్గుతుందా?" కాస్త అపనమ్మకంగా ఆ కాగితం వైపు చూస్తూ అడిగాను. 
"ఆ తగ్గుతుంది. కాని మళ్ళీ చీమలు కుట్టకుండా చూసుకోవాలి మరి" 
"అంటే ఇంటి చుట్టూ గమాక్సిన్ చల్లి, లక్ష్మణ రేఖ గీస్తే సరిపోతుందా౦డి"
"సరిపోదమ్మా. ముందుగా ఈ అమ్మాయిని ఏ రకమైన చీమలు కుడుతున్నాయో గమనించాలి"
"చీమల్లో రకాలా?"  కాస్త అయోమయంగా అడిగాను.
"ఆ చీమల్లోనే...తొమ్మిది రకాలున్నాయి. అవి దేనికవే గొప్ప చరిత్ర కలిగినవి"
చీమలూ, వాటి చరిత్ర.... డాక్టర్ మతిస్థిమితం మీద కొద్దిగా అనుమానం వచ్చింది. ఆయన మాత్రం అదే౦ పట్టించుకోకు౦డా చెప్పుకుపోయారు. 

మొదటి చీమ కుట్టగానే, అప్పటిదాకా సవ్యంగా ఉన్నవాళ్ళు కాస్తా, "ఆ...నువ్వెప్పుడూ ఇంతేలే", "నా మోహన ఇంతే రాసిపెట్టుంది", "ఇలాంటి కష్టం నాకు తప్ప ఎవ్వరికీ రాదు"" ఇలా అంటారు. . 

రెండో చీమ కుడితే, ప్రతి దాంట్లోనూ చెడు మాత్రమే కనిపిస్తుంది. కాగడా పెట్టి వెతికినా వారికి ఒక్క మంచి విషయ౦ కూడా కనిపించదు.

మూడో చీమ...ఇది కుట్టనక్కర్లేదు, దగ్గరకొస్తేనే భవిష్యత్త౦తా ముందే తెలిసిపోతుంది. అయితే ఆ తెలిసిన దానిలో వారికి ఒక్క మంచి విషయ౦ కూడా ఉండదు. 

నాలుగో చీమతో కుట్టించుకున్న వాళ్ళు అవతలి వాళ్ళ మనసును చకచకా చదివేస్తుంటారు. "ఎలా అంటారా?... నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయింది. నా మీద ఏదో పెట్టేసుకుంది, లేకపోతే ఎందుకలా వెళ్ళిపోతుంది? ఎందుకో నన్ను కావాలని అవాయిడ్ చేస్తోంది." ఇలా 

ఐదో చీమ...అదెప్పుడూ భావనా ప్రపంచంలో ఊరేగుతూ దానితో కుట్టించుకున్న వాళ్ళని  ఎప్పుడో జరిగిన వాటితో ముడిపెట్టేస్తుంది, "అప్పుడలా చేశాడు, ఇప్పుడు మాత్రం చేయడని నమ్మకమేమిటి? అప్పుడు ఇచ్చిందా ఇప్పుడు ఇవ్వడానికి"  ఇలా అన్నీ ఊహించేసుకుంటూ ఉంటారు.

ఆరో చీమ కుట్టీ కుట్టడం తోటే ఆరు మైళ్ళ వెనక్కు తీసుకువెళుతుంది. "నేను అప్పుడలా చేసు౦డాల్సింది", "వాళ్ళనలా కోప్పడి ఉండకూడదు." "పోయినేడాదే వెళ్ళుండాల్సింది" ఇలా ఉపయోగం లేని వాటి చుట్టూ గానుగ ఆడించేస్తుంది. 

ఇక ఏడో చీమ కనిపించిన వాళ్ళందరికీ ఏదో ఒకటి అంటగట్టేస్తుంది. "వాడొట్టి మూర్ఖుడు, ఆమె పొగరుబోతు, ఈమెతో అసలు పడలేం". అది కుట్టిన అమాయకులు ఆ మాయలో పడిపోతారు. అంతటితో ఊరుకుంటుందా! ఆ ఫలానా మనిషి ఎదురవగానే రాసిన చిట్టా వీళ్ళ  చేతిలో పెట్టేస్తుంది. అది చదివాక అవతల వాళ్ళు చెప్పేది వీళ్ళ తలకేం ఎక్కుతుంది?

ఎనిమిదో చీమ "అదిగో ఆ అమ్మాయిని చూశావా? నిన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతోంది", "అతను వాళ్ళింటికొచ్చి కూడా రాలేదంటే ఏమిటర్ధం" అంటూ కుట్టి కుట్టగానే లేనిపోని అనుమాలను బుర్రలోకి ఎక్కి౦చేస్తుంది.

ఆఖరిది తొమ్మిదో చీమ. దీనికి ఒళ్ళంతా విషమే. తప్పులన్నీ ఎదుటి వాళ్ళ తలమీద రుద్దమని అదేపనిగా పోరుతుంది. తమ దగ్గర తప్పయితే దిద్దుకోగలరు కాని, ఎదుటి మనిషిదే తప్పని నమ్మేస్తారుగా. ఇక అవతలి వాళ్ళని తిట్టడానికే వీళ్ళ జీవితం మొత్తం ఖర్చయిపోతుంది.   

"అమ్మో! ఇవి చాలా ప్రమాదమైనవిలా ఉన్నాయి. మరి వీటిని వదిలించుకోవడం ఎలా డాక్టర్ గారు?" 
"ఏముంది సింపుల్. జాగ్రత్తగా ఉండడమే. దగ్గరకు రానిచ్చామో, మిగిలేది రసం తీసిన చెరుకు గడే"  

ఇంతకు ఈ చీమలు కుట్టింది సుధను ఒక్కదాన్నేనా?





 http://ahha.org/ సౌజన్యంతో...