Thursday, January 16, 2014

చీమా చీమా ఎందుక్కుట్టావే అంటే...

"నా పనే అది, వేరే పని ఎలా చేస్తానూ..." అంటూ దీర్ఘం తీసింది.  

"ఏం తల్లీ రాయడానికేం దొరకలేదా ఏం? ఇలా చీమలూ, దోమల వెంట పడ్డావ్?" ఇదే కదా మీ సందేహం. ఆగండాగండి... అసలేం జరిగిందో చెప్తాను. 

మొన్నా మధ్య మా సుధను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. ఆయన పరీక్షలన్నీ చేసి, "ఈ అమ్మాయికి జబ్బేమీ లేదు. చీమలు కుట్టాయంతే" అని తేల్చేశారు. "కుడితే గిడితే కనీసం తేలన్నా కుట్టాలి గాని, మరీ చీప్ గా చీమా కుట్టేది?" అన్న మా మామయ్యను ఓదార్చి, "ఏమిటి చీమలు కుడితే మనుషులు ఇలా మాటా మంతీ లేకుండా అవుతారా?" అని ఆశ్చర్యపోయాం.

"ఇప్పుడేం చెయ్యాలి డాక్టర్"  
"తగ్గడానికి మందులు రాశాను, వేళ తప్పక వేసుకోవాలి" అని ఓ చీటీ మా చేతిలో పెట్టాడు. 
"ఇవి వాడితే తగ్గుతుందా?" కాస్త అపనమ్మకంగా ఆ కాగితం వైపు చూస్తూ అడిగాను. 
"ఆ తగ్గుతుంది. కాని మళ్ళీ చీమలు కుట్టకుండా చూసుకోవాలి మరి" 
"అంటే ఇంటి చుట్టూ గమాక్సిన్ చల్లి, లక్ష్మణ రేఖ గీస్తే సరిపోతుందా౦డి"
"సరిపోదమ్మా. ముందుగా ఈ అమ్మాయిని ఏ రకమైన చీమలు కుడుతున్నాయో గమనించాలి"
"చీమల్లో రకాలా?"  కాస్త అయోమయంగా అడిగాను.
"ఆ చీమల్లోనే...తొమ్మిది రకాలున్నాయి. అవి దేనికవే గొప్ప చరిత్ర కలిగినవి"
చీమలూ, వాటి చరిత్ర.... డాక్టర్ మతిస్థిమితం మీద కొద్దిగా అనుమానం వచ్చింది. ఆయన మాత్రం అదే౦ పట్టించుకోకు౦డా చెప్పుకుపోయారు. 

మొదటి చీమ కుట్టగానే, అప్పటిదాకా సవ్యంగా ఉన్నవాళ్ళు కాస్తా, "ఆ...నువ్వెప్పుడూ ఇంతేలే", "నా మోహన ఇంతే రాసిపెట్టుంది", "ఇలాంటి కష్టం నాకు తప్ప ఎవ్వరికీ రాదు"" ఇలా అంటారు. . 

రెండో చీమ కుడితే, ప్రతి దాంట్లోనూ చెడు మాత్రమే కనిపిస్తుంది. కాగడా పెట్టి వెతికినా వారికి ఒక్క మంచి విషయ౦ కూడా కనిపించదు.

మూడో చీమ...ఇది కుట్టనక్కర్లేదు, దగ్గరకొస్తేనే భవిష్యత్త౦తా ముందే తెలిసిపోతుంది. అయితే ఆ తెలిసిన దానిలో వారికి ఒక్క మంచి విషయ౦ కూడా ఉండదు. 

నాలుగో చీమతో కుట్టించుకున్న వాళ్ళు అవతలి వాళ్ళ మనసును చకచకా చదివేస్తుంటారు. "ఎలా అంటారా?... నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయింది. నా మీద ఏదో పెట్టేసుకుంది, లేకపోతే ఎందుకలా వెళ్ళిపోతుంది? ఎందుకో నన్ను కావాలని అవాయిడ్ చేస్తోంది." ఇలా 

ఐదో చీమ...అదెప్పుడూ భావనా ప్రపంచంలో ఊరేగుతూ దానితో కుట్టించుకున్న వాళ్ళని  ఎప్పుడో జరిగిన వాటితో ముడిపెట్టేస్తుంది, "అప్పుడలా చేశాడు, ఇప్పుడు మాత్రం చేయడని నమ్మకమేమిటి? అప్పుడు ఇచ్చిందా ఇప్పుడు ఇవ్వడానికి"  ఇలా అన్నీ ఊహించేసుకుంటూ ఉంటారు.

ఆరో చీమ కుట్టీ కుట్టడం తోటే ఆరు మైళ్ళ వెనక్కు తీసుకువెళుతుంది. "నేను అప్పుడలా చేసు౦డాల్సింది", "వాళ్ళనలా కోప్పడి ఉండకూడదు." "పోయినేడాదే వెళ్ళుండాల్సింది" ఇలా ఉపయోగం లేని వాటి చుట్టూ గానుగ ఆడించేస్తుంది. 

ఇక ఏడో చీమ కనిపించిన వాళ్ళందరికీ ఏదో ఒకటి అంటగట్టేస్తుంది. "వాడొట్టి మూర్ఖుడు, ఆమె పొగరుబోతు, ఈమెతో అసలు పడలేం". అది కుట్టిన అమాయకులు ఆ మాయలో పడిపోతారు. అంతటితో ఊరుకుంటుందా! ఆ ఫలానా మనిషి ఎదురవగానే రాసిన చిట్టా వీళ్ళ  చేతిలో పెట్టేస్తుంది. అది చదివాక అవతల వాళ్ళు చెప్పేది వీళ్ళ తలకేం ఎక్కుతుంది?

ఎనిమిదో చీమ "అదిగో ఆ అమ్మాయిని చూశావా? నిన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతోంది", "అతను వాళ్ళింటికొచ్చి కూడా రాలేదంటే ఏమిటర్ధం" అంటూ కుట్టి కుట్టగానే లేనిపోని అనుమాలను బుర్రలోకి ఎక్కి౦చేస్తుంది.

ఆఖరిది తొమ్మిదో చీమ. దీనికి ఒళ్ళంతా విషమే. తప్పులన్నీ ఎదుటి వాళ్ళ తలమీద రుద్దమని అదేపనిగా పోరుతుంది. తమ దగ్గర తప్పయితే దిద్దుకోగలరు కాని, ఎదుటి మనిషిదే తప్పని నమ్మేస్తారుగా. ఇక అవతలి వాళ్ళని తిట్టడానికే వీళ్ళ జీవితం మొత్తం ఖర్చయిపోతుంది.   

"అమ్మో! ఇవి చాలా ప్రమాదమైనవిలా ఉన్నాయి. మరి వీటిని వదిలించుకోవడం ఎలా డాక్టర్ గారు?" 
"ఏముంది సింపుల్. జాగ్రత్తగా ఉండడమే. దగ్గరకు రానిచ్చామో, మిగిలేది రసం తీసిన చెరుకు గడే"  

ఇంతకు ఈ చీమలు కుట్టింది సుధను ఒక్కదాన్నేనా?





 http://ahha.org/ సౌజన్యంతో...

18 comments:

  1. పదో చీమ కూడా ఉందండి. అది కుట్టితే, చదివి కామెంటు కూడా పెట్టకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్లాగుల్లో చాలా మందిని కుట్టిందిట. (నన్ను కూడా నండోయ్)......దహా.

    ReplyDelete
    Replies
    1. పదో చీమ... :). థాంక్స్ సుబ్రమణ్యం గారు.

      Delete
  2. ha ha ha..Simple yet superb post Jyothi gaaru.. Super like.:-)

    ReplyDelete
  3. ఇంతకీ 9 రకాలే ఉన్నాయంటారా? జాగ్రత్తగా ఉండటం వరకు బాగుంది. దగ్గరకు రానీయకఫోవడమే కష్టమైన విషయం.వచ్చినా మనని కుట్టకుండా చూసుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. ఇంకా ఉండే ఉంటాయండి. ఈ తొమ్మిదీ కుట్టకుండా చూసుకుంటే, మిగిలిన వాటి బారిన పడకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడం తేలికే.

      Delete
  4. ఈ ఎనిమిది చీమలేవో అరిషడ్వర్గాల కులానికి చెందినట్టున్నాయ్...
    ఆ తొమ్మిదో చీమ మాత్రం బ్రహ్మరాక్షసి తెగకు చెందినదానిలా ఉంది :-)

    ReplyDelete
  5. ఇన్ని రకాలా చీమలు ?
    అన్నీ ఆడవి గనుకన అంతగ కుట్టెన్ ?
    కొన్నైన మగవి లేవా ?
    ' ఫన్నీ కథ ' జ్యోతి గారు! బాగుందండీ !

    ReplyDelete
    Replies
    1. ఉన్నాయండి. చీమ కనుక కుట్టాడు అనలేదు అంతే.
      థాంక్యు రాజారావు గారు.

      Delete
  6. ఇక అవతలి వాళ్ళని తిట్టడానికే వీళ్ళ జీవితం మొత్తం ఖర్చయిపోతుంది. good

    ReplyDelete
    Replies
    1. థాంక్యు సుబ్రహ్మణ్యం గారు.

      Delete
  7. Nice akka, how funny, In my opinion almost everyone will get these ant bites. But the one who realizes that and modify them self will be great.

    ReplyDelete
  8. చీమల కథ పేరుతో మనుషుల మనస్తత్వాన్ని చాలా బాగా వ్రాసారు. మంచి విశ్లేషణ.

    ReplyDelete
    Replies
    1. ఇది నేను చెప్పిందేమీ కాదండి.
      ANTS అంటే Automatic Negative Thoughts అట.
      ఆసక్తిగా అనిపించి నా పదాలలో మార్చి వ్రాశాను.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.