Monday, November 3, 2025

యూటా(Utah) - 2025

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

మా ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని అనుకున్న నేషనల్ పార్క్స్ అన్నింటికీ వెళ్ళాము. ఆఖరి రోజు మాంట్ రోజ్ నుండి మధ్యాహ్నం పదకొండున్నరకు డ్యురాంగోకు బయలుదేరాం. ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు ఫ్లైట్.

బయలుదేరిన ముప్పావు గంటకు యురే(Ouray) అనే ఊరు వచ్చింది. కొలరాడోలోని అందమైన ఆ చిన్న ఊరి నుండి మిలియన్ డాలర్ హైవె మొదలౌతుంది. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో సరిగ్గా తెలియదు కానీ ఒక కారణం ఆ హైవె కట్టడానికి మైలుకు మిలియన్ డాలర్స్ చొప్పున ఖర్చు అవడం వల్ల అట. అంతా ఘాట్ రోడ్ మీద ప్రయాణం, ఆ రోడ్ మీద వాహనాలు వెళ్ళడానికి రెండు లైన్స్ తప్ప పక్కన నాలుగడుగుల స్థలం లేదు.
దారి పొడవునా ఆ పర్వతాల మీద పసుపు చల్లినట్లు ఆస్పెన్(Aspen), కాటన్ ఉడ్(Cottonwood) చెట్లు ఎంత అందంగా ఉన్నాయంటే మేము ఘాట్ రోడ్ మీద ప్రయాణిస్తున్నామనీ, జాగ్రత్తగా లేకపోతే కార్ లోయలో పడే ప్రమాదం ఉందని కానీ కూడా అనిపించలేదు.
మా ప్రయాణం ఒక వర్ణ చిత్రం అనుకుంటే మొదటి నాలుగు రోజులు వేసిన స్కెచ్ కి ఐదవ రోజు రంగులు వేసినట్లుగా ఉంది ఆ ఘాట్ రోడ్ మీద ప్రయాణం. ఆ ఊరు, ఆ దారి అంత బావుంటాయని తెలుసుంటే మాంట్ రోజ్ నుండి ఉదయాన్నే బయలుదేరే వాళ్ళం.

అలా అనుకోకుండా నాలుగు రోజులలో ట్రిప్ ప్లాన్ చేసి, యూటా నేషనల్ పార్క్స్, కొలరాడో మిలియన్ డాలర్ హైవె, నవాహో నేషన్ కు వెళ్ళి వచ్చాం. మొత్తం మీద ఏది నచ్చిందీ అంటే చెప్పడం కష్టమే.

ఒక పార్క్ నుండి మరో పార్క్ కు వెళ్ళడానికి తీసుకున్న సీనిక్ రౌట్స్ నచ్చేశాయి. దారి పక్కన షాప్స్, సైన్ బోర్డ్స్, మొక్కలు, చెట్లు, ఎలక్ట్రిక్ స్థంభాలు ఏవీ లేక విశాలంగా కనిపించే మైదానం, అక్కడక్కడా రకరకాల ఆకారాలలో ఉన్న రాళ్ళు, కొండలు నచ్చేశాయి. హోటల్స్ కు వెళ్తే తప్ప మరెక్కడా సిగ్నల్ లేదు, దాంతో ఫోన్ కాల్స్, గూగుల్ సర్చ్ ఏవీ లేవు. డిజిటల్ డిస్ట్రబెన్స్ లేని ఆ ప్రశాంతత నచ్చింది.

మాన్యూమెంట్ వ్యాలీహార్స్ షూ బెండ్ దగ్గర ఎర్రని కొండలు నచ్చాయి. జ్సయాన్ నేషనల్ పార్క్ లో వెన్నెల్లో చేసిన ప్రయాణం బావుంది. బ్రైస్ కెన్యన్ నేషనల్లో పార్క్ లోని హుడూస్ అందాలు చెప్పనే అక్కర్లేదు. క్యాపిటల్ రీఫ్ నేషనల్లో పార్క్ లో మోర్మన్స్ జీవనోపాధిగా చేసుకున్న ఫ్రూటా ఆదర్శవంతంగా ఉంది. కెన్యన్ లాండ్ నేషనల్లో పార్క్ లో కొండ చెరియ మీద నడక, ఆర్చెస్ నేషనల్ పార్క్ లో సూర్యోదయం మరచిపోలేనివి. బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్ లో జీవన పోరాటం చేస్తున్న చెట్లు నచ్చేశాయి. ఈ ప్రయాణంలో వెళ్ళిన మెలికల దారులు నచ్చేశాయి, దారి పక్కన ఏ సైన్ బోర్డ్స్, రెస్టరెంట్స్ లాంటివేమీ లేక విశాలంగా కనిపిస్తున్న ఆ ప్రాంతం అంతా ఎంతో బావుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిశ్శబ్ద సంగీతం వినిపించింది. అలా ఆ వారం అంతా ఏదో కల లాగా గడిచిపోయింది, జీవితాంతం గుర్తుండి పోయే తీయని కల.

బ్లాక్ కెన్యన్ ఆఫ్ గనిసన్ నేషనల్ పార్క్ (Black Canyon of Gunnison National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

మొఆబ్(Moab) నుండి బ్లాక్ కెన్యన్ ఆఫ్ గనిసన్ నేషనల్ పార్క్(Black Canyon of Gunnison National Park) కు శాన్ వాన్ పర్వతాల (San Juan Mountains) మీదుగా వెళ్ళాము.

బయలుదేరిన కొంతదూరం వరకూ కొండలను చుడుతూ ఘాట్ రోడ్ మీద ప్రయాణం. కనిపించినంత దూరం ఎత్తైన కొండలు వాటి మీద చిన్న చిన్న చెట్లు. మరికొంత దూరం వెళ్ళేసరికి కొండలన్నీ ఎటు వెళ్ళాయో పొడవైన రోడ్ మీద మా కార్ తప్ప మరో వాహనం లేదు. 

ఆ తరువాత అంటే దాదాపుగా మేము బయలుదేరిన రెండు గంటల తరువాత శాన్ మొగిల్ నది(San Miguel River) పక్కనే ప్రయాణం. నది అంటే పెద్ద నదేమీ కాదు చిన్న కాలువలా ప్రవహిస్తూ ఉంది. ఆ కాసిన నీళ్ళకే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా చెట్లు. ఫాల్ వచ్చిందనడానికి గుర్తుగా పచ్చని ఆకులు పసుపు రంగులోకి మరిపోయాయి. ఎత్తైన కొండల మధ్య రాళ్ళను చూస్తూ మొదలైన మా ప్రయాణంలో హఠాత్తుగా అలా రంగులు కనిపించడం గమ్మత్తుగా అనిపించింది. 


సాన్ వాన్ మౌంటెన్ సీనిక్ వ్యూ(San Juan Mountain Scenic view) దగ్గర ఆగాము. కొండమీద అంతా రకరకాల రంగుల్లో మొక్కలు, దూరంగా ఉన్న పర్వతం మీద అప్పుడే మంచు కురవడం మొదలైనట్లుంది అక్కడక్కడా పొడి చల్లినట్లు తెల్లగా కనిపిస్తుoది. ఆ కొండలను, చెట్లను ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు.


మేము బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్ కు వెళ్ళేసరికి సాయంత్రం ఐదు గంటలు అవుతోంది. జులైలో ఆ పార్క్ లోని సౌత్ రిమ్ లో మొదలైన ఫైర్ కారణంగా అటువైపు చాలా భాగం కలిపోయి ఉంది. మేము పార్క్ లోకి వెళ్ళగానే మొదటగా ఆ కాలిపోయిన ప్రాంతమే కనిపించింది. ఫారెస్ట్ ఫైర్ గురించి టీవి లో చూడడమే కానీ ఎదురుగా చూడడం అదే మొదటిసారి. 


గవర్నెమెంట్ షట్ డౌన్ కారణంగా యూటా పార్క్స్ నిర్వహణ చేపట్టింది కానీ కొలరాడో కాదు. ఆ పార్క్ లోని విజిటర్ సెంటర్ మూసివేసి ఉంది. రెస్ట్ రూమ్స్ లేవు, గార్బేజ్ కాన్స్ కూడా తాళలేసి ఉన్నాయి. పార్క్ లోనికి వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ, ఎమర్జన్సీ అండ్ రెస్క్యూ సర్వీసెస్ పూర్తిగా పనిచేయడం లేదు. అందువలన మేము పార్కింగ్ నుండి ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేని వ్యూ పాయింట్స్ కు మాత్రమే వెళ్ళాము.
   

ఎత్తైన రెండు పెద్ద కొండల మధ్య ఎక్కడో లోతులో ప్రవహిస్తోంది గనిసన్ నది(Gunnison). కొండలు రెండూ దగ్గరగా ఉండడంతో రోజు మొత్తంలో ఏ అరగంటో ఆ కెన్యన్ లో ఎండ పడుతుంది. మిగలిన సమయం అంతా ఆ లోయలో చీకటిగా ఉండి, కిందకు చూస్తుంటే కొంచెం భయంగా కూడా ఉంది. బ్లాక్ కెన్యన్ కు అందుకనే ఆ పేరు వచ్చింది. 

వ్యూ పాయింట్స్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కాలిపోయిన చెట్ల మధ్యగా వెళ్ళవలసి వచ్చింది. ఆ చెట్ల మొదళ్ళ నుండి మళ్ళీ చివుర్లు రావడం చూస్తే సంతోషంగా అనిపించింది. కొన్ని దగ్గర రిస్టోరేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. 

కార్ పార్క్ చేసి చాసమ్ వ్యూ పాయింట్(Chasm Viewpoint) కు వెళ్ళబోతుంటే అక్కడ అడవి గొర్రెలు కనిపించాయి. మొదట చూసినప్పుడు అవి విగ్రహాల్లా నిలబడి కదలక మెదలక ఉంటే వాటిని జీవమున్న జంతువలనే అనుకోలేదు. హఠాత్తుగా అవి తల తిప్పడంతో జంతువులని అర్థమైంది.

చాసమ్ వ్యూ పాయింట్ కు వెళ్ళే ప్రయత్నం మానుకుని పెయింటెడ్ వాల్ వ్యూ పాయింట్(Painted Wall Viewpoint) దగ్గరకు వెళ్ళాము. ఒక కొండమీద అంతా చీరల మీద క్రాస్ అడ్డగీతలున్నాయి.

ఆ పార్క్ నుండి బయలుదేరిసరికి సూర్యాస్తమయం అవుతూ ఉంది. వరుసగా అది నాలుగవ రోజు కొండలలో సూర్యాస్తమయం చూడడం.



మేము ఆ రోజు రాత్రి మాంట్ రోజ్ (Montrose) అనే ఊరిలో ఉండబోతున్నాము. ఆ ఊరిలో మేము తీసుకున్న హోటల్ “ది రాత్ బోన్ పార్లర్ అండ్ బార్” (The Rathbone Parlor and Bar). అది హిస్టారిక్ బిల్డింగ్, రాత్ బోన్ (Rathbone) అనే అతను నైట్స్ ఆఫ్ పైథియాస్ (Knights of Pythias) అనే ఫ్రాటర్నల్ ఆర్గనైజేషన్(Fraternal Organization)ను స్థాపించాడు. ఆ ఆర్గనైజేషన్ కోసం కట్టిన బిల్డింగే తరువాత రోజుల్లో హోటల్ అయింది.    

ఆ ఆర్గనైజేషన్ కు నైట్స్ ఆఫ్ పైథియాస్ అని పేరు పెట్టడానికి కారణం గ్రీక్ కథ డామన్ అండ్ పైథియాస్ (Damon and Pythias). పైథియాస్ అనే అతనిని రాజద్రోహం కారణంగా బంధించి ఉరి శిక్ష వేస్తారు. అప్పుడు అతను ఆవు, సింహం కథలోలాగా నాకు ఇంటి దగ్గర కొన్ని పనులున్నాయి అవి పూర్తి చేసుకుని మా వాళ్ళకు వీడ్కోలు చెప్పి వస్తాను అంటాడు. "అలా ఎలా కుదురుతుంది ఒప్పుకోము" అంటే దానికి డామన్ "పైథియాస్ బదులు నేను కారాగారంలో ఉంటాను. అతను చెప్పిన సమయానికి రాకపోతే నన్ను ఉరితీయండి" అంటాడు. 

పైథియాస్ వెళ్తాడు, చెప్పిన సమయం దగ్గర పడుతూ ఉంటుంది, అతని సమాచారం తెలియదు. పైథియాస్ మోసం చేశాడు ఇక తిరిగి రాడని అంతా  అనుకుంటూ ఉంటారు. అతని స్నేహితుడు డామన్ ను ఉరితీయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పైథియాస్ ఆఖరి నిముషంలో వచ్చి తాను రావడానికి దారిలో ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్తాడు. ఆ రాజు ఆ స్నేతులిద్దరినీ విడుదల చేస్తాడు. ఆ కథను స్ఫూర్తిగా తీసుకుని స్నేహమంటే అలా ఉండాలనే ఉద్దేశ్యంలో 'రాత్ బోన్ తను మొదలుపెట్టిన ఆర్గనైజేషన్ కు  నైట్స్ ఆఫ్ పైథియాస్ అని పేరు పెట్టాడు.

A historic brick building on a street corner with surrounding trees, parked cars, and a neon sign storefront in the evening.

పిక్చర్ కార్టెసి: Boutique Stay in Historic Montrose | The Rathbone Hotel

తరువాత రోజు 'ఫ్రాన్సిస్ గ్జేవియర్ కాబ్రిని డే' (Frances Xavier Cabrini Day). మరియా ఫ్రాన్సెస్కా కాబ్రిని (Maria Francesca Cabrini) అనే నన్ పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాకు వలస వచ్చిన ఇటాలియన్ బాలల కోసం ఎంతో సేవ చేశారట. ఆవిడ సేవాభావానికి గుర్తుగా ఆవిడ పుట్టిన రోజున కొలరాడో గవర్నమెంట్ సెలవు ప్రకటించింది.
  

ఆ రోజు ఇక చూసేవేమీ లేకపోవడంతో తీరిగ్గా లేచి ఆ డౌన్ టౌన్ కు దగ్గరలోనే ఉన్న హిస్టారిక్ హౌసెస్ చూస్తూ బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చే ఒక ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకున్నాము. తరువాత బాక్ స్ట్రీట్ బేగల్ కంపనీ(Backstreet Bagel Company) కి వెళ్ళాము. ఆ షాప్ లో ఒక గోడ మీద మొత్తం లోకల్స్ చేసిన క్విల్ట్స్, పెయింటింగ్స్ ఉన్నాయి. నచ్చినవి కొనుక్కోవచ్చు.  

ఆ తరువాత విజిటర్ సెంటర్ కు వెళ్ళాము. స్టే హియర్ ప్లే ఎవ్రి వేర్ (stay here play everywhere) అన్న వాళ్ళ స్లోగన్ బావుంది. అంటే ఆ ఊరిలో ఉండి ఆ చుట్టుపక్కల అడ్వెంచర్స్ చేయమని అర్థం. 

ఆ వేళతో మా వెకేషన్ పూర్తి అయింది అనుకుంటూ డ్యురాంగో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాము కానీ దారిలో మాకొక అనుకోని అతిథి ఎదురౌతుందని అప్పుడు తెలియదు.

ఈ ప్రయాణం లోని తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

ఆర్చెస్ నేషనల్ పార్క్ (Arches National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్ (Mighty Five National Parks)లో ఆర్చెస్ నేషనల్ పార్క్ (Arches National Park) అన్నింటికన్నా చిన్నదీ, ఎక్కువగా విజిట్ చేసేదీ కూడా. ఆ పార్క్ లో సూర్యోదయం చూడాలని ఉదయం ఆరున్నరకే హోటల్ నుండి బయలుదేరాము. మేము నార్త్ విండో ఆర్చ్(North Window Arch) వెళ్ళేసరికి, సూర్యోదయం అవబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.   


తొలికిరణాలను ఆర్చ్ నుండి కాకుండా తొలివేలుగులో ఆర్చ్ ని చూడాలని మా బుజ్జి పండు పెద్ద కొండ ఎక్కుతుంటే, వెనుకే నేను కూడా ఎక్కడం మొదలెట్టాను. ఒక పెద్ద రాయి అంచున నిలుచుని సూర్యోదయం కోసం చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. కాలు జారితే లోయలో పడిపోతామని ఒక్క క్షణం భయం వేసింది కానీ, ఆ భయంతో అంతటి అపురూపమైన అనుభవాన్ని కోల్పోకూడదని ఆ ఆలోచనను పక్కకు నెట్టేసాను. సూరీడు పైకి వచ్చిందీ రాందీ మేము నిలుచున్న దగ్గరనుండి కనిపించదు. మా ఎదురుగా ఆర్చ్ దగ్గర ఉన్న వాళ్ళను గమనిస్తూ ఉన్నాము.

దాదాపుగా ఇరవై నిముషాల తరువాత ఒక్కసారిగా అందరూ ఫోన్ లు, కెమెరాలు బయటకు తీయగానే మేము కూడా మా కెమేరా తీసి సింధూరంలా మెరిసిపోతున్న ఆర్చ్ ను ఫోటో తీసాము. ఆ రోజు పండుతో అలా సూర్యదయం చూడడం ఒక గొప్ప అనుభూతి. 
ఆ పార్క్ లోని ఆర్చ్ లను చూడడానికి కొన్నింటి కోసం కొంత నడవాల్సి వచ్చింది, కొన్నింటి కోసం కొండలు ఎక్కాము, కొన్ని రోడ్ పక్కనే ఉన్నాయి. ఆ ఆర్చ్ ల పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి.  
ల్యాండ్ స్కేప్ ఆర్చ్(Landscape Arch)

టనెల్ ఆర్చ్(Tunnel Arch) 
పైన్ ట్రీ ఆర్చ్(Pine Tree Arch)

బాలన్స్డ్ రాక్(Balanced Rock)
త్రీ గాసిప్స్ (Three Gossips)
ఇంకా చూస్తే చాలా ఉన్నాయి కానీ అప్పటికే మధ్యాహ్నం అవుతుండడంతో తిరిగి మోఆబ్ కు వెళ్ళిపోయాము. అక్కడ కాక్టస్ జాక్స్(Cactus Jacks) రెస్టరెంట్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఉన్న సూవనీర్ షాప్స్ కు వెళ్ళి సూవనీర్ స్పూన్ కొన్నాము. విజిటింగ్ సెంటర్ లో సీత కుగిఫ్ట్, పబ్లుకు హాట్ తీసుకున్నాం.

అక్కడితో మా యూటా నేషనల్ పార్క్స్(Utah National Parks) చూడడం అయిపోయింది. అక్కడ నుండి మా ప్రయాణం కొలరాడో(Colorado) కు. 

ఈ ప్రయాణంలో తరువాత భాగం చదవాలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి. 

కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ (Canyonlands National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks)లో కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ (Canyonlands National Park) కూడా ఒకటి. కెన్యన్ లాండ్స్ పార్క్ రెండు భాగాలుగా ఉంటుంది, ఐలెండ్ ఇన్ ది స్కై(Island in the sky), ది నీడిల్స్(The Needles).

మేము క్యాపిటల్ రీఫ్ నుండి ఐలెండ్ ఇన్ ది స్కై దగ్గరకు వెళ్ళేసరికి నాలుగవుతోంది. ఆ పార్క్ లో చూడవలసిన వాటిలో మేసా ఆర్చ్(Mesa Arch) ఒకటి. పార్కింగ్ నుండి ఆర్చ్ కు వెళ్ళే దారికో కొంత దూరం అంతా నున్నని రాళ్ళున్నాయి. ఆ రాళ్ళు మీద ఎక్కుతూ దిగుతూ వెళ్ళడం సరదాగా అనిపించింది.

  

అప్పటికి వరకు మేము చూసిన అన్ని నేషనల్ పార్క్స్ లో కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ చాలా పెద్దది. అక్కడ గ్రాండ్ వ్యూ పాయింట్(Grand Viewpoint)దగ్గరకు వెళ్ళడానికి కొండ చెరియ అంచునే దారి. ఎండ వేడి తగ్గి ఆహ్లాదంగా ఉన్న ఆ సాయంత్రం కొండ చెరియ అంచునే నడుస్తూ ఉంటే ఆ పార్క్ మొత్తం కనిపిస్తోంది. గ్రాండ్ వ్యూ పాయింట్ పాయింట్ వెళ్ళేసరికి వేరే గ్రహానికి వెళ్ళినట్లు అనిపించింది, ఎందుకంటే అక్కడ మేము తప్ప మరో ప్రాణి లేదు, కనిపించినంతదూరం కొండలు, లోయలు. 

సాయంత్రం ఏడవుతుండగా అక్కడ నుండి మోఆబ్(Moab) అనే ఊరికి బయలుదేరాము. షార్లెట్ నుండి బయలుదేరాక వెళ్ళిన మొట్ట మొదటి పెద్ద ఊరు అది. ఆ దారిలో సూర్యాస్తమయం, చంద్రోదయం రెండూ చూసాము. 

 
మోఆబ్ లో థాయ్ రెస్టరెంట్ బెల్లా మోఆబ్ (Thai Bella Moab) కు వెళ్ళాము. రెస్టరెంట్ సీటింగ్ అంతా ఆరుబయట టేబుల్స్ మధ్య చిన్నచిన్న మొక్కలు, అక్కడక్కడా చెట్లకు వేలాడదీసిన లైట్స్ తో చాలా అందంగా ఉంది. అక్కడ ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చినా ఫుడ్ కూడా బావుండడంతో తృప్తిగా భోజనం చేసి హోటల్ కు వెళ్ళాము.
ఈ ప్రయాణంలో తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

Sunday, November 2, 2025

క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ (Capitol Reef National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks)లో క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ (Capitol Reef National Park) కూడా ఒకటి.

బ్రైస్ కెన్యన్ నుండి క్యాపిటల్ రీఫ్ కు వెళ్ళడానికి సీనిక్ రౌట్ తీసుకున్నాము. బయలుదేరిన కాసేపటికే చీకటి పడింది కానీ పౌర్ణమి ముందు రోజులవడంతో మసక వెన్నెల్లో కొండల మధ్య ప్రయాణం అద్బుతంగా ఉంది. 

క్యాపిటల్ రీఫ్ కు వెళ్ళేసరికి బాగా రాత్రయింది. అక్కడ సబ్ వేలో శాండ్ విచ్ తీసుకుని నేరుగా క్యాపిటల్ రీఫ్ రిసార్ట్(Capitol Reef Resort) కు వెళ్ళాము. రిసార్ట్ ఫాన్సీ గా లేదు గానీ పయనీర్ డెకరేషన్ తో అదొక అందంగా ఉంది.  

ఉదయాన్నే కర్టెన్ తెరిచి చూస్తే తొలివెలుగులో మెరిసి పోతున్న ఎఱ్ఱని కొండలు, విశాలమైన ఆకాశంతో ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. చిరు చలిగా ఉన్నా రిసార్ట్ అందాలు చూడాలని జాకెట్స్ వేసుకుని ఉత్సాహంగా బయటకు వెళ్ళాము. రిసార్ట్ లో రూమ్స్ తో  పాటు టీపీ, వేగన్ లలో ఉండే సౌకర్యం కూడా ఉంది. చుట్టు పక్కల ఏవో కొన్ని హోటల్స్, రెస్టరెంట్స్ ఉన్నాయి తప్ప అక్కడ ఊరేమీ లేదు. 

 

ఆ రిసార్ట్ లోని రెస్టరెంట్ ‘ది పయోనీర్ కిచెన్’ (The Pioneer Kitchen) లో బ్రేక్ ఫస్ట్ చేసి అక్కడకు దగ్గరలోనే ఉన్న “పానొరమ పాయింట్ (Panorama Point)”, గూస్ నెక్ ఓవర్ వ్యూ పాయింట్స్ (Gooseneck Over viewpoint) దగ్గరకు వెళ్ళాము. పానొరమ పాయింట్ దగ్గర నుండి చూస్తే కనిపించినంత మేరా కొండలు, విశాలంగా ఆకాశమూ తప్ప మరేమీ లేక ప్రపంచం మరింత అందంగా కనిపించింది.  

గూస్ నెక్ ఓవర్ వ్యూ పాయింట్ దగ్గర ఎన్నో అడుగుల కింద సల్ఫర్ క్రీక్(Sulfur Creek) కొండ చుట్టూ తిరుగుతూ గూస్ నెక్ ఆకారంలో ప్రవహిస్తూ ఉంది. ఆ క్రీక్ లో నీళ్ళు సల్ఫర్ వాసనలు వస్తాయట అందువలనే దానికి ఆ పేరు పెట్టారు. 

ఆ రెండు వ్యూ పాయింట్స్ చూసిన తరువాత అక్కడ నుండి పెట్రోగ్లిఫ్స్ (petroglyphs) దగ్గరకు వెళ్ళాము. వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఆ ప్రాంతంలో ఫ్రీమాంట్ ఆది వాసులు ఉన్నట్లు గుర్తుగా అక్కడ రాళ్ళ మీద చెక్కిన బొమ్మలు ఉన్నాయి. రాళ్ళ మీద కొంత భాగం ఊడి పోయి ఉంది. వాటి మీద ఏం చెక్కారో, వాటి ద్వారా ఏమి చెప్పాలనుకున్నారో.   

 

అక్కడి నుండి ‘హిక్మన్ బ్రిడ్జ్(Hickman bridge)’ చూడడానికి బయలుదేరాం. అంతా కొండ దారి కొంచెం పైకి వెళ్ళాక కిందకు చూస్తే పచ్చని చెట్లు, మధ్యలో పారుతున్న ఫ్రీమాంట్ నది, చుట్టూ ఎరుపు, తెలుపు రంగులలో ఎత్తైన కొండలు మిగిలిన పార్క్స్ కంటే భిన్నంగా ఉంది క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్. ఆ ఉదయం మబ్బేసి వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో అక్కడ కొండలు ఎక్కడానికి ఎక్కువ ఇబ్బంది పడలేదు.
    

పంతొమ్మిదవ శతాబ్దంలో మోర్మన్స్(Mormons) పది కుటుంబాలు కాపిటల్ రీఫ్ కు వలస వచ్చి, ఆ ఏడారిని సాగు చేసుకుని సారవంతమైన భూమిగా మార్చి జీవనాధారం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఫ్రూటా(Fruita) అంటారు. ప్రస్తుతం ఫ్రూటా లో రెండు వేల కు పైగా పండ్ల చెట్లున్నాయి. గ్రిఫర్డ్ హౌస్ లో ఆ పండ్లతో చేసిన ఆపిల్, పీచ్ పైలను (pie) అమ్ముతారు. సీజన్ లో వెళితే ఆ పండ్లను రుచి చూడచ్చు కూడా. అప్పట్లో కట్టిన గ్రిఫర్డ్ (Gifford Homestead), బెహునిన్ (Behunin) ఇళ్ళు, ఫామ్, వాళ్ళ చిన్న స్కూల్ అక్కడ ఇంకా ఉన్నాయి. వారి గురించి తెలుసుకున్నప్పుడు లారా ఇంగిల్స్ వైల్డర్(Laura Ingalls Wilder) రాసిన లిటిల్ హౌస్ ఆన్ ది ప్రెయిరీ(Little House on the Prairie) గుర్తొచ్చింది.

అక్కడ నుండి కాపిటల్ రీఫ్ లోనే ఉన్న గ్రాండ్ వాష్(Grand Wash) అనే స్లాట్ కెన్యన్ కు వెళ్ళాము. అక్కడ హైక్ చేస్తే బావుంటుంది కానీ అప్పటికే మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో కొంత దూరం వెళ్ళి తిరిగి వెనక్కు వచ్చేశాము.

అప్పటి వరకు చూసిన నాలుగు పార్క్ లు దేనికదే బిన్నంగా ఉన్నాయి. క్యాపిటల్ రీఫ్ లో ఎన్నో కష్టాల కోర్చి జీవనం సాగించిన మోర్మన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం క్యాపిటల్ రీఫ్ మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది.

ఈ ప్రయాణం లోని తరువాత భాగం చదవలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి.