Monday, November 3, 2025

యూటా(Utah) - 2025

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

మా ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని అనుకున్న నేషనల్ పార్క్స్ అన్నింటికీ వెళ్ళాము. ఆఖరి రోజు మాంట్ రోజ్ నుండి మధ్యాహ్నం పదకొండున్నరకు డ్యురాంగోకు బయలుదేరాం. ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు ఫ్లైట్.

బయలుదేరిన ముప్పావు గంటకు యురే(Ouray) అనే ఊరు వచ్చింది. కొలరాడోలోని అందమైన ఆ చిన్న ఊరి నుండి మిలియన్ డాలర్ హైవె మొదలౌతుంది. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో సరిగ్గా తెలియదు కానీ ఒక కారణం ఆ హైవె కట్టడానికి మైలుకు మిలియన్ డాలర్స్ చొప్పున ఖర్చు అవడం వల్ల అట. అంతా ఘాట్ రోడ్ మీద ప్రయాణం, ఆ రోడ్ మీద వాహనాలు వెళ్ళడానికి రెండు లైన్స్ తప్ప పక్కన నాలుగడుగుల స్థలం లేదు.
దారి పొడవునా ఆ పర్వతాల మీద పసుపు చల్లినట్లు ఆస్పెన్(Aspen), కాటన్ ఉడ్(Cottonwood) చెట్లు ఎంత అందంగా ఉన్నాయంటే మేము ఘాట్ రోడ్ మీద ప్రయాణిస్తున్నామనీ, జాగ్రత్తగా లేకపోతే కార్ లోయలో పడే ప్రమాదం ఉందని కానీ కూడా అనిపించలేదు.
మా ప్రయాణం ఒక వర్ణ చిత్రం అనుకుంటే మొదటి నాలుగు రోజులు వేసిన స్కెచ్ కి ఐదవ రోజు రంగులు వేసినట్లుగా ఉంది ఆ ఘాట్ రోడ్ మీద ప్రయాణం. ఆ ఊరు, ఆ దారి అంత బావుంటాయని తెలుసుంటే మాంట్ రోజ్ నుండి ఉదయాన్నే బయలుదేరే వాళ్ళం.

అలా అనుకోకుండా నాలుగు రోజులలో ట్రిప్ ప్లాన్ చేసి, యూటా నేషనల్ పార్క్స్, కొలరాడో మిలియన్ డాలర్ హైవె, నవాహో నేషన్ కు వెళ్ళి వచ్చాం. మొత్తం మీద ఏది నచ్చిందీ అంటే చెప్పడం కష్టమే.

ఒక పార్క్ నుండి మరో పార్క్ కు వెళ్ళడానికి తీసుకున్న సీనిక్ రౌట్స్ నచ్చేశాయి. దారి పక్కన షాప్స్, సైన్ బోర్డ్స్, మొక్కలు, చెట్లు, ఎలక్ట్రిక్ స్థంభాలు ఏవీ లేక విశాలంగా కనిపించే మైదానం, అక్కడక్కడా రకరకాల ఆకారాలలో ఉన్న రాళ్ళు, కొండలు నచ్చేశాయి. హోటల్స్ కు వెళ్తే తప్ప మరెక్కడా సిగ్నల్ లేదు, దాంతో ఫోన్ కాల్స్, గూగుల్ సర్చ్ ఏవీ లేవు. డిజిటల్ డిస్ట్రబెన్స్ లేని ఆ ప్రశాంతత నచ్చింది.

మాన్యూమెంట్ వ్యాలీహార్స్ షూ బెండ్ దగ్గర ఎర్రని కొండలు నచ్చాయి. జ్సయాన్ నేషనల్ పార్క్ లో వెన్నెల్లో చేసిన ప్రయాణం బావుంది. బ్రైస్ కెన్యన్ నేషనల్లో పార్క్ లోని హుడూస్ అందాలు చెప్పనే అక్కర్లేదు. క్యాపిటల్ రీఫ్ నేషనల్లో పార్క్ లో మోర్మన్స్ జీవనోపాధిగా చేసుకున్న ఫ్రూటా ఆదర్శవంతంగా ఉంది. కెన్యన్ లాండ్ నేషనల్లో పార్క్ లో కొండ చెరియ మీద నడక, ఆర్చెస్ నేషనల్ పార్క్ లో సూర్యోదయం మరచిపోలేనివి. బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్ లో జీవన పోరాటం చేస్తున్న చెట్లు నచ్చేశాయి. ఈ ప్రయాణంలో వెళ్ళిన మెలికల దారులు నచ్చేశాయి, దారి పక్కన ఏ సైన్ బోర్డ్స్, రెస్టరెంట్స్ లాంటివేమీ లేక విశాలంగా కనిపిస్తున్న ఆ ప్రాంతం అంతా ఎంతో బావుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిశ్శబ్ద సంగీతం వినిపించింది. అలా ఆ వారం అంతా ఏదో కల లాగా గడిచిపోయింది, జీవితాంతం గుర్తుండి పోయే తీయని కల.

1 comment:

  1. మీ నేషనల్ పార్కుల సందర్శనం మాతో పంచుకున్నందుకు .. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.