Tuesday, January 15, 2019

కనుమ

ముగ్గుడబ్బా, రంగుల డబ్బాలన్నీ తీసుకొచ్చి అరుగుమీద పెడుతున్నా. "పాపా, ఈ రోజు రంగులు బళ్ళా, లోపల బెట్టెయ్" చెప్పింది పిన్ని.
"ఎందుకు పిన్నీ"?
"ఈ రోజు కనప్పండగ్గదా రధం ముగ్గెయ్యాల. రంగులుబళ్ళా, సందులోకి బొయ్యా రొన్ని కారబ్బంతులు, చావంతులూ దీసకరా."
"రథం ముగ్గే ఎందుకెయ్యాలి పిన్నీ"
"దానికో కతుంది చెప్తానుండు.ఈ పండక్కి బల్చక్రవొర్తి పాతాళం నుండి బూలోకానికొస్తాడు."
"బల్చక్రవర్తంటే మూడు వరాలిచ్చాడు. ఆయనేనా?"
"ఆ ఆయనే, ఈ రోజు పండగైపోతళ్ళా మళ్ళాయన పాతాళానికి బొయ్యేదానికీ రధం" చెప్పింది.
"ఒకవేళ మనం రధం ముగ్గు వెయ్యకపోతే మనింట్లోనే ఉండిపోతాడా?"
", వుండి పొయ్యా మనింట్లో బిందెలూ, గంగాళాలు దానం జేసేస్తాడు."
"అమ్మో, అయితే మనం ఎప్పుడూ రథం ముగ్గే వేద్దాం కనుమ రోజు."
నేను పూలు తీసుకుని వచ్చేసరికి చకచకా చుక్కలు పెట్టేసింది పిన్ని. ముగ్గుతో చుక్కల చుట్టూ మెలికలు తిప్పి చివరగా రెండు చక్రాలు వేసి పసుపు కుంకుమలు పూలరెక్కలు చల్లగానే అచ్చంగా పూలరథమే మా వాకిట ముందర.

*                *             *                 *                *             *                 *           
వడ్లకొట్టు మీద కూర్చుని నేనూ తమ్ముడూ నిప్పట్లు తింటున్నాం. "జోతా, అమ్మమ్మ నడిగి పసూకుంకుం తీసకరా" పురమాయించాడు మామయ్య.
"ఎందుకు మావయ్యా?" అంటూ చెంగున కిందకు దూకాడు తమ్ముడు.
"ఇవాళ కనప్పండగ కదా పశూల్ని కడిగి పసుంకుంకాలు బెట్టాల"
"బర్రెలకా?" ఆశ్చర్యపోయాడు తమ్ముడు.
"ఆ బర్లెకీ, ఎద్దలగ్గూడా" అంటూ పశువుల కొట్టం వైపు వెళ్ళాడు. వెనకే తమ్ముడు.
నేనూ, పిన్ని కొట్టంలోకి వెళ్ళేసరికి మామయ్యలిద్దరూ గడ్డి చుట్ట తీసుకుని పశువులను శుభ్రంగా తోమి, చెంబుతో నీళ్ళు పోస్తున్నారు. ముత్తయ్య కొట్టంలో అప్పటికే గడ్డి గాదం లేకుండా శుభ్రంగా చిమ్మి నీళ్ళు జల్లాడు. పిన్ని ఒక పక్కగా ముగ్గేసి ముగ్గు ముందు ఇటుకరాళ్ళతో పొయ్యి చేసి అందులో ఎండుకట్టెలు పెట్టింది.
"ఎందుకు పిన్నీ ఇక్కడ పొయ్యి?"
"పొంగలి బెట్టి పశూలకు నైవేద్దం బెట్టేదానికి." చెప్పింది.
"ఇక్కడా.. కొట్టంలోనా?" ఆశ్చర్యపోయాను.
"ఆ ఇక్కడే."
మాటలల్లోనే అమ్మమ్మ వచ్చింది. పొయ్యి రాజేసి పసుపురాసి కుంకుమ బెట్టిన పొంగలి గిన్నె పొయ్యిమీద పెట్టింది. మామయ్య పశువులను కడగడం పూర్తిచేసి కొమ్ములకు పచ్చని పసుపు, ఎరుపు రంగులు వేసి ఆరాక కొమ్ముల చివరలో కుచ్చులు కట్టాడు.
"పాపా కుంకుం బెడ్డువురా" పిలిచాడు మామయ్య.
భయంగా చూశాను. అదసలే డిల్లీ బర్రె. "రా జోతా, యేం జైదులే నేనుళ్ళా" అంటూ దాని గంగడోలు నిమురుతూ పిలిచాడు. రెండు చెవుల మధ్యగా తలపైన పసుపురాసి కుంకమ పెట్టాను. ఈలోగా మిగిలిన బర్రెలకు, ఎద్దులకు పిన్ని పసుపురాసి బొట్లు పెట్టింది. ఎద్దుల మెడలో కొత్త పట్టెడలు వేసారు. అలికి ముగ్గులు పెట్టిన కొట్టం రంగుల కొమ్ములు, మువ్వల పట్టెడలు, పసుపు కుంకుమలతో పశువులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. పశువులకు నమస్కారం చేసుకుని పొంగలి నైవేద్యం పెట్టింది అమ్మమ్మ. అమ్మమ్మ చేసినట్టే నమస్కారం చేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి ఘుమఘుమలు.

పొయ్యి మీద మాంసం కూర ఉడుకుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద పెద్ద బాండలి పెట్టింది అమ్మ వడలు వెయ్యడానికి.
"నాకాకలేస్తంది అన్నం బెట్టుమా." అమ్మ పక్కన కూర్చుంటూ అడిగాడు తమ్ముడు.
"రొంత తాల్నాయినా అమ్మ వడలేస్తళ్ళా. అయిపోయినంక వడలు, అన్నం అన్నీ తిందువుగాని" చెప్పింది అమ్మ.
"నాకు వడలొద్దు. అన్నం బెట్టు."
"అట్టనగూడదు నాయినా. కనుమనాడు మినుము కొరకాల." చెప్పింది అమ్మమ్మ.
"వడలు గాల్నియ్ గానా మిగతా పిలకాయిల్ని గూడా బిలువ్. అట్నే బాయి కాడ కాళ్జేతులు కడుక్కుని రండి. అందరొక్కసారే తిందురు." పిలిచింది అమ్మ.
ఈ రోజుతో బడి సెలవలైపోయాయి. రేపే ఊరికి ప్రయాణం. 

*                *             *                 *                *             *                 *        

నాతో ప్రయాణం చేస్తూ పండగ సంబరాన్ని పంచుకున్న మిత్రులకు పెద్దలకు ధన్యవాదాలు. "అవీ ఇవీ రాయడం కాదు ఈసారి రాస్తే నెల్లూరి భాషలోనే రాయాలి" అని దబాయించి ప్రోత్సహించిన ప్రియనేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. 


Monday, January 14, 2019

సంక్రాంతి


       రోజుకన్నా ముందే తెల్లారినట్లుందివాళ. తీప్పొంగలి, కొత్తబట్టలు గుర్తురాగానే చెంగున మంచం దిగి గుమ్మాన్ని దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికే స్నానం చేసి పెద్ద పండక్కని కుట్టించుకున్న పావడా పైటా వేసుకుని తలకు పిడప చుట్టుకుని దేవుడింట్లోకి వెళ్తూవుంది పిన్ని. చేతిలో తామరాకులో చుట్టిన పూలు. "పిన్నీ పిన్నీ నేను పటాలకు పూలుబెడతా" అంటూ వెంట పడ్డాను. 

"అట్నేబెడుదువులేగానా, గంగాళంలో నీళ్ళు తోడుండాయి ముందు బొయ్యా నీళ్ళు బోసుకునిరా" చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి పిన్ని దేవుడి పటాలన్నీశుభ్రంగా కడిగి గంధం, పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది. ఆకు మధ్యలో పసుపుతో గౌరీ దేవిని కూడా చేసి పెట్టింది. "పాపా, తావరాకులో కదంబమాల తుంచి పెట్టుండాను, విడి పూలీడుండయ్ పటాలన్నింటికీ పెట్టు." అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పటాలకు పూలు పెట్టడం పూర్తవగానే బంతిపూలు, మామిడాాకులతో దండ గుచ్చి వీధి గుమ్మానికి కట్టడానికి బయటకు వచ్చాం.

ఇంతలో "డబుక్ డక్ డబుక్ డక్" అని ఢక్కీ మోగించుకుంటూ బుడబుక్కల అతను వచ్చాడు. "అంబ పలుకు జగదాంబ పలుకు కంచి లోనీ కామాక్షీ పలకు, మహా ప్రభువులకు జయం కలగాలి నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ ఇప్పిచ్చుసామీ" అంటూ ఆపకుండా ఢక్కీ మోగించడం మొదలుపెట్టాడు. అమ్మ చేటలో బియ్యంతో పాటు ఒక పాతచీర కూడా తెచ్చి అతని జోలెలో వేసింది. "అమ్మగారి కార్యం జయమౌతాది, అయ్యగారి కార్యం జయమౌతాది, ముత్యాల మూటలే మీ ఇంట మూల్గాలె, రతనాల రాసులే మీ చెంత జేరాలి సుభోజ్జయం సుభోజ్జయం" అని దీవిస్తూ డబుక్ డక్ డబుక్ డక్ అని ఢక్కీ మోగిస్తూ వెళ్ళిపోయాడు.


వెన్న కరుగుతున్న కమ్మని వాసన. ముక్కు ఎగబీలుస్తూ వంటింట్లోకి వెళ్ళాను. భగభగమని మండుతున్న పొయ్యి మీద పసుపురాసి కుంకుమ పెట్టిన ఇత్తడి గిన్నె. పక్కనే చిన్న పొయ్యి మీద నేతిలో జీడిపప్పు వేపుతూ ఉంది అమ్మమ్మ. కత్తిపీట ముందేసుకుని ఎరగడ్డలు కోస్తూ ఉంది చిన్నమ్మమ్మ. 

నన్ను చూడగానే "నాయనా, యాలక్కాయల రొన్ని మీ అమ్మకిచ్చా పొడిగొట్టమని జెప్పు." అంటూ ఏలకుల డబ్బా ఇచ్చింది.
"గబాగబా కానీకా ఈ పాటికి గంపలెత్తుకుని వస్తా వుంటారు." తొందర పెట్టింది చిన్నమ్మమ్మ.
"ఎవరొస్తారమ్మమ్మా" అడిగాను
"ఈ రోజు పండగ్గద్నాయనా చాకలోళ్ళు, మంగలోళ్ళు ఇంకా పొలం కాడ్నుండి సేద్దిగాళ్ళు అందరూ వస్తళ్ళా వాళ్ళకు నిప్పట్లు, మణుగుబూలతో పాటు అన్నం కూర్లు గూడా బెట్టాలి." చెప్పింది.
"ఎందుకమ్మమ్మా వాళ్ళు జేసుకోరా?" అడిగాను.
"పోద్దులొస్తం మన పన్లే జేస్తంటిరే నాయనా పండగ నాడైనా వాళ్ళకు మనం జేసుకున్నవి పెట్టబళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఇంతలో వీధిలో చిరుతలతో తాళం వేస్తున్న శబ్దం, లయగా గజ్జెల చప్పుడు వినిపించాయి. గుమ్మం పట్టుకుని వెనక్కి వంగి చూస్తే "హరిలో రంగ హరి" అని పాడుతూ హరిదాసు. బిక్ష్యం వెయ్యడానికి పెట్టిన చేటలో నుండి దోసిటి నిండుగా బియ్యం తీసుకుని వెళ్ళాను. హరిదాసు మోకాలి మీద కూర్చుని బియ్యం అక్షయ పాత్రలో వేయించుకుని "చిరంజీవ చిరంజీవ" అని దీవించి వెళ్ళిపోయాడు.

"పాపా, అరిటాకులు గోసుకు రమ్మని శేష్మామయ్యకి జెప్పి వొకాకిటు దీసకరా" చెప్పింది పిన్ని. ఆకు తీసుకుని వెళ్ళేసరికి దేముడికి ఎదురుగా ఒక పీట మీద పళ్ళెంలో టెంకాయ, కర్పూరం సాంబ్రాణి కడ్డీలు, ఇంకో పీట మీద కొత్త బట్టలు పెట్టున్నాయి. అమ్మ దీపం వెలిగిస్తూ ఉంది. "ఎందుకుమా ఇక్కడ బట్టలు పెట్టారు?" అడిగాను. పెద్ద పండగ్గద పాపా పెద్దలకి బెట్టాల" చెప్పింది. "ఓ ఇవి అమ్మమ్మకా" అడిగాను. "మీ అమ్మమ్మకి కాదు, మా అమ్మమ్మకీ, నాయనమ్మకీ ఇంకా పెద్దవాళ్ళకి" చెప్పింది అమ్మ. ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే వాళ్ళెవరినీ నేను ఎప్పుడూ చూడలేదు మరి. "దేవుడి కాడికి బోయినోళ్ళకి పాపా" నా ఆశ్చర్యం గమనించి చెప్పింది పిన్ని.

అమ్మమ్మ వచ్చి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట గణగణ మోగిస్తూ హారతిచ్చింది. అందరం దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకున్నాం. ఇంకో పీటమీద అరిటాకేసి తీప్పొంగలి, వడలు, పులుసన్నం, దోసకాయ పచ్చడి, ఉర్లగడ్డ తాళింపు, అన్నం, నెయ్యి, పప్పులుసు, పెరుగు వరుసగా వడ్డించారు అమ్మ, పిన్ని.

"ఏం జోతా యెట్టా వుంద మా ఊర్లో పండగ?" అందరం అన్నాలు తినేసి వరండాలో కూచోగానే అడిగింది చిన్నమ్మమ్మ.
"పండగింకా యేడయింది పిన్నమ్మా. కనప్పండగ్గూడా గానీ అప్పుడు చెప్పద్ది " చెప్పాడు మామయ్య.



Saturday, January 12, 2019

భోగి పండగ

“మోవ్ ఈసారి అక్కోళ్ళు, పిలకాయలందరూ పండక్కొస్తళ్ళా. పెద్ద భోగిమంటెయ్యాల" అన్నాడు మామయ్య అమ్మమ్మతో.
"అట్నేలేరా. గెనెం మీద తాటాకులు కొట్టకరారాదా." సలహా ఇచ్చింది అమ్మమ్మ.
మామ్మయ్య భోగికి పదిరోజుల ముందే బోల్డన్ని తాటాకులు తెచ్చి సందులో ఎండబెట్టాడు.
*             *             *             *         *          *       *
"మాయ్ కోడి కూసింది. భోగిమంటేస్కోబళ్ళా. ల్యాండి ల్యాండి." అన్న అమ్మమ్మ పిలుపుతో మెలుకువ వచ్చింది.
"అప్పుడేనా?" దుప్పటి మొహం మీదనుండి తియ్యకుండానే అడిగాను.
"ఆ మీ మావయ్య లేచా తాటాకులు లాక్కొచ్చి రోడ్డుమింద యాస్తా వున్యాడు." చెప్పింది అమ్మమ్మ.
"దిబ్బకాడ ముట్టిబోయిన చీపుర్లు, ఇరిగి పోయిన తలుపురెక్క బెట్నాం. అయ్యిగూడా రోడ్డుమింద యాస్తన్నాడా? అడిగింది పిన్ని.
"యేవోనమ్మా నే జూళ్ళేదా."చెప్పింది అమ్మమ్మ.
"నేంబొయ్యి చూసొస్తానుండు పిన్నీ" అంటూ లేచి దుప్పటి చుట్టూ చుట్టుకుని పరిగెత్తి వీధిలోకి వెళ్ళాను. అప్పటికే తాతయ్య దిబ్బపక్కనున్న విరిగిపోయిన సామాన్లని వీధి పక్కన పేరుస్తున్నాడు.
"ఏం జోతా లేచినావా? రా ఇటు గూచో యెచ్చంగుంటది." పోగేసిన తాటాకులకు నిప్పంటిస్తూ చెప్పాడు మామయ్య. దుప్పటి కింద పడకుండా జాగ్రత్తగా మడుచుకుంటూ కూర్చున్నాను. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. ఎర్రగా మొదలైన చిన్న మంట చూస్తుండగానే రాజుకుని నిప్పు రవ్వలు పైకి లేవడం మొదలుపెట్టాయి. మంటకు అరచేతులు అడ్డం పెట్టి వెచ్చగా చలి కాచుకుంటున్నాం. ప్రతి ఇంటి ముందు ఎర్రెర్రని మాటలు. ఇంటెల్లపాది మంట చుట్టూ చేరడంతో వీధి వీధంతా సందడిగా ఉంది.
"మాయ్ ఇంకా మంటకాడ్నించి లేచా తలకుబోసుకోండి. అట్నే పిలకాయలగ్గూడా తొందరగా తలకులు బొయ్యండి." చెప్పింది అమ్మమ్మ. ఎప్పుడు స్నానం చేసిందో గచ్చకాయ రంగు చీరకి మామిడి పిందెల అంచున్న పాటూరి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉప్పు మిరియాలు కలగలిసినట్లుండే బారెడు జుట్టుకి కాశీ టవల్ చుట్టుకొనుంది.  
"నీర్జా కాస్త కుంకుడ్రరసం దీసి అక్కకీ." అంటూ చిన్నపిన్నికి పురమాయించింది.
స్నానం చేసి వంటింట్లో కొచ్చేసరికి మసాలా ఉడుకుతున్న ఘుమఘుమలు, పెనం మీద నుండి సుయ్ మన్న శబ్దం వినిపిస్తోంది. సన్నికల్లు మీద వేరుశనక్కాయల పచ్చడి నూరుతోంది అక్క.
"అప్పుడే దోశలు పోస్తున్నావా?" అడిగాను అమ్మమ్మని.
"అప్పుడే యేవా ఏడవతళ్ళా. నీళ్ళు బోసుకున్నా, దేవుడికి దణ్ణం పెట్టుకురాపో" చెప్పింది అమ్మమ్మ.
"దండం పెట్టుకునే వచ్చా." సమాధానం చెప్పాను.
"అదిగో ఆ తలుపెనకాల పీటలుండాయ్. ఇటు వాల్చు నాయనా. అట్నే ఆ పళ్ళాలు ఇట్దీసకరా." అంది పెనానికి నూనె రాస్తూ. పొయ్యిలో కట్టెల మీద నిప్పులు కణకణ మండుతున్నాయ్. మంట పెనం కిందంతా పరుచుకుంటోంది.
అమ్మమ్మ చెప్పినట్లుగానే చేశాను. అక్క నూరడం పూర్తిచేసి గిన్నెలోకి పచ్చడి తీస్తోంది. స్నానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరే వంటింట్లోకి వస్తున్నారు. పళ్ళెంలో దోశ వేసి పక్కనే కోడి కూర కూడా వేసి నా ముందు పెట్టింది అమ్మమ్మ. ఇంతలో "వొరెవొరెవొరె అందరూ ఈడ్నే ఉండారే. ఎప్పుడొచ్చినారా? యేం ఆదిలచ్చమ్మా  దోశలు బోస్తండా?" అంటూ నేరుగా వంటింట్లోకి వచ్చాడు పక్కింట్లో ఉండే పెద్ద తాతయ్య.
"రామావా. పండగ్గదా, పిలకాయలంతా వొచ్చినారు." సమాధానం చెప్పింది అమ్మమ్మ.
"మేవొచ్చి నాల్రోజులవతా ఉంది పెదనాయినా, సూళ్ళూరుపేట బోయినావంట్నే, యెప్పుడొచ్చినావా?" అంటూ తాతయ్య కూర్చోడానికి పీట వాల్చింది అమ్మ.
"ఇప్పుడే యేడు గంటల బస్సుకొచ్చినా రాజమ్మా. రాంగానే విజ్యమ్మ జెప్పింది మీరంతా వచ్చుండారని, పలకరిచ్చి పోదావని వచ్చినా." పీట మీద కూర్చుంటూ చెప్పాడు తాతయ్య.
"మావకి రొంత కూరేసీ రాజమ్మా." అంటూ దోశలున్న పళ్ళెం అమ్మ చేతికిచ్చింది అమ్మమ్మ.
"నా కోడలు గూడా దోశలు బోస్తా వుండాది." మొహమాట పడ్డాడు తాతయ్య. పోస్తే పోసిందిలే మావా ఈడ గూడ దినొచ్చు. అయినా పిలకాయలంతా ఈడ్నే ఉంటే వాళ్ళు మాత్తరం ఎందుకాడ?"  అంది అమ్మమ్మ.
ఇంతలో "తాతయ్యా అమ్మా పిలస్తా వుంది." అంటూ తాతయ్య పెద్దమనవరాలు విజయొచ్చింది.
"యేమ్మే, మీ యమ్మగూడా దోశలు బోస్తా వుందా?" అడిగింది అమ్మమ్మ.
"ఇంకాలా నాయనమ్మా బుజ్జమ్మకు నీళ్ళు బోస్తా వుంది." చెప్పింది విజయ.
"మాయ్, ఇజ్యగ్గూడా పళ్ళెమీయండి. అని పిన్నితో చెప్పి, పాపా నువ్బొయ్యి అత్తని, మావని పిల్చకరా" పురమాయించింది అమ్మమ్మ.  
"యేంనా సూళ్ళూరుపేట యేం పని మీద బోయినావా?" అడిగాడు తాతయ్య.
"మన పెద యెంకట్రామిరెడ్డి లేడా గూడూర్లో, కూతురుకి సమ్బందాలు జూస్తా నన్నుగూడ పిల్చకపోయినాడు." చెప్పాడు పెద్ద తాతయ్య.
"సంబందం కుదిరినట్టేనా మావా?" అడిగింది అమ్మమ్మ.
"వాళ్ళు కట్నం లచ్చడుగుతుండారు. మన ఎంకట్రాముడు అంత ఇచ్చుకోలేడు."
"పిల్లోడు బాగుండాడా? ఆస్తేమాత్రం వుంటాదా?" అడిగాడు తాతయ్య.
"బాగుండేదేందిలేరా, మంచాస్తి. పదిహేనెకరాల మాగాణి ఏకచక్క. సమచ్చారానికి మూడు పంటలు పండే బూవి. మన నీర్జమ్మకు జూద్దామా?" అడిగాడు పెద్ద తాతయ్య.
"ఈ రోజుల్లో పంటలేంటికిలే మావా? మనం జాస్తళ్ళా యవసాయమా. వొక సంవచ్చరం వానలెక్కువ బడి పంట కుళ్ళిపోయ, ఇంకో సంవచ్చరం నీళ్ళే లేక కంకులెండిపోయ. పిలకాయలకెందుకులే ఆ బాదలు. ఆడపిలకాయలైనా సుబ్బరంగా చదూకుంటుంటిరే గవుర్నమెంటు ఉజ్జోగస్తునికిస్తే ఇద్దరూ ఉజ్జోగాలు జేసుకుంటా వాళ్ళ తంటాలేవో వాళ్ళు బడతారు." చెప్పింది అమ్మమ్మ.
"అదీ నిజమేలే." ఒప్పుకున్నాడు పెద్ద తాతయ్య.  
ఈలోగా పెద్ద తాతయ్య కోడలు పిండి గిన్నె ఎత్తుకుని వచ్చింది. అందరం ఆ పూట అక్కడే కడుపు నిండా దోశలు, కోడికూర దిన్నాం.

Thursday, January 10, 2019

నిప్పట్లు - మణుగుబూలు

అమ్మమ్మ వంటింటి పక్కనున్న వరండాలో కూర్చుని పెసలు విసురుతూ ఉంది. తిప్పడం ఆపినప్పుడల్లా గుప్పెడు గుప్పెడు పెసలు తీసుకుని జాగ్రత్తగా తిరగలి మధ్య గుంటలో పోస్తున్నాను. తాతయ్య గుమ్మం పక్కన కూర్చుని విస్తళ్ళు కుడుతున్నాడు. 

"ఎందుకు తాతయ్యా ఆ విస్తరాకులు?" అడిగాను.
"కుప్ప నూర్చేదానికి కూలోళ్ళు వస్తళ్ళా, వాళ్ళకు అన్నాలు బెట్టినప్పుడు కాబళ్ళా" చేస్తున్న పని ఆపకుండానే చెప్పాడు తాతయ్య.
"ఎంతమందొస్తారు తాతయ్యా?" అడిగాను.
"మీ మామయ్యా ముప్ఫైమందికి జెప్పొచ్చినాడు" అని నాతో చెప్పి. కోళ్ళెన్ని గావాల్న" అమ్మమ్మ నుద్దేశించి అడిగాడు.
"నాలుగన్నా గావద్దా? బదులిచ్చింది అమ్మమ్మ.  
"కోళ్ళెందుకు అమ్మమ్మా?"
"కుప్ప నూర్పిళ్ళప్పుడు కూలోళ్ళకు కోడి కూరొండి అన్నాలు బెట్టాల నాయనా." చెప్పింది అమ్మమ్మ.  

ఇంతలో గేటు దగ్గర చప్పుడయ్యింది. చూస్తే చిన్నమ్మమ్మ.
"ఏందికా రామ్మన్నావంట్నే?" ఎప్పుడొచ్చిందో గేటు దగ్గరే నిలబడి అడిగింది చిన్నమ్మమ్మ.
"గేటుకాడ్నించే అడగాల్నా. రామ్మే లోపలకా." పిలిచింది అమ్మమ్మ.
"మళ్ళొస్తాలేకా. బర్రెలొచ్చేయేళవతావుళ్ళా ఇంటికి బోవాల. మందలేందో కనుక్కుందావని వచ్చినా."
"నీడ ఇంకా యాప చెట్టుగాడిగ్గూడా పోలా, బర్రెలప్పుడే యాడొస్తాయా? మీ అక్కేందో రాస్యం జెప్పాలంట రామ్మే" పిలిచాడు తాతయ్య.
"నీక్దెలీని రాస్యాలు యాడుండాయి మావా మాకా" అంటూ నవ్వుతూ లోపలకి వచ్చి అమ్మమ్మ చేతిలోంచి తిరగలి పిడి తీసుకుని తిప్పడం మొదలు పెట్టింది.
"ఏంలేదు మే, పండగ దగ్గరకొస్తావుళ్ళా నిప్పట్లెప్పుడు జేద్దామా?" విసిరిన పెసర బద్దల్నిచాటలోకి ఎత్తుతూ అడిగింది అమ్మమ్మ.
"ఈ రోజు సోమ్వారం గదకా, బేస్తవారం జేద్దావా!"  
"అట్నేలే. అన్నట్టు నిప్పట్లీయేడు యెవురెవురికి పంపీయ్యాల?" అడిగింది అమ్మమ్మ.
"పిలకాయలకు పంపేదానికి తలో పాతిక. పండగరోజు కూలోళ్లు పదిమందన్నా రారా?"
"వస్తారు. ఇంకా కోటపాడుగ్గూడా పంపియ్యాల. పెదనాయన చనిపోయిళ్ళా, వాళ్ళీ యేడు పండగ జేసుకోరు." చెప్పింది అమ్మమ్మ.
"ఇంకా చాకలోళ్ళు, మంగలోళ్ళు, బుడబుక్కలోళ్ళు, జంగం దేవర...ఓ ఐదొందల్దాకా జెయ్యాల." లెక్క తేల్చింది చిన్నమమ్మ. 
"ఆ.. అట్నే" చెప్పింది అమ్మమ్మ. 

"మణుగుబూలగ్గూడా బియ్యం నానెయ్యి. బేస్తవారం పొద్దున్నే బియ్యం నానబెడ్తె మద్దినేళకి పిండి గొట్టుకోవచ్చు. పొద్దున్నే సందులో గాడిపొయ్యి తొవ్వీడం మర్చిపోబాక." అంది చిన్నమ్మమ్మ.   
"అట్నేలేమ్మే. మణుగుబూ గిద్దలు సుబరత్నమ్మ తీసుకుపోయ్యుండాది. అయ్యి కూడా తెప్పీయ్యాల." పెసలు పోసిన టిఫిన్ కేన్ మూతబెట్టింది అమ్మమ్మ.
"నిప్పట్లు ఒత్తేదానికి ముత్తయ్యను గూడ పిలిపిచ్చు."

"సరుకులెన్ని గావాల? బియ్యం నాల్గుమానికలు సరిపోతాయా?" అడిగింది అమ్మమ్మ.
"సాలకేం జేస్కోనుకా. బెల్లం తులం బడద్దేమో. ఏలక్కాయలు ఏబళం, నూనె నాలుగు శేర్లు" వరుసగా లెక్క చెప్పింది చిన్నమ్మమ్మ.  
"శెట్టి కొట్టుకాడ అన్నీ దెప్పిచ్చి పెడతా. బేస్తవారం కాస్త పెందలాడేరా."
"రవన్ని సజ్జ బూరెలు గూడ జేయ్ గూడదా" అడిగాడు తాతయ్య.
"ఏం మావా, సజ్జబూరెలు దినాలనుందా, అట్నేలే. సజ్జలు గూడ దెప్పిచ్చి పెట్టుకా. మూడవతా ఉంది ఇంక నేబోయోస్తా." అంటూ లేచి చీర కుచ్చిళ్ళు దులుపుకుని చక్కాబోయింది చిన్నమ్మమ్మ.  
తాతయ్య విస్తళ్ళు కుట్టడం పూర్తి చేసి ఆకుల మీద తిరగలి ఉంచాడు అణగడానికి.  

Wednesday, December 26, 2018

ముగ్గులు

ఎనిమిదిన్నర అవుతుండగా వీధిలో సందడి మొదలయ్యింది. ముగ్గు గిన్నె పట్టుకుని నేను అక్కా బయటకు వచ్చాం. అప్పటికే పక్కింటి చిట్టెక్క చుక్కలు పెడుతూ ఉంది.
"ఏం జోతా ముగ్గెయ్యడానికి వచ్చినారా?" అడిగింది పక్కింటి చిట్టెక్క.
"లేదుమే ముంజెల్దిండానికి వచ్చినాం, మొహం జూడు మోహమా. ఎన్మిదిగంట్లకు ఎందుకొస్తాంమే" పరాచికాలాడింది అక్క.
నవ్వేసింది చిట్టెక్క. "పెద్దత్తోళ్ళు గోడొచ్చినారా?"
"ఆ వచ్చుండారు." అని అక్క చెప్తుండగానే అమ్మ, పిన్ని బయటకు వచ్చారు. "కా చుక్కలు బెట్టవా? 25 చుక్కలు 5 వరసలు బేసిచుక్క 5 కి ఆపాల." అమ్మ చేతికి ముగ్గు గిన్నె ఇచ్చి చెప్పింది అక్క. అమ్మ చుక్కలు పెడితే సరిగ్గా గీత గీసినట్లు ఉంటుందని ఆ పని అమ్మకే అప్పగిస్తారు.

"ఏం, చిట్టెమ్మా బావుండాా? మీ అమ్మేదా?" అడిగింది అమ్మ.
"నాయనకన్నం పెడతా ఉందత్తా. అబ్బయ్య ఏడా? మావ గూడ వచ్చినాడా?"
"ఆ అందరం వచ్చినాం. అబ్బయ్య నిదరబోతా ఉండాడు. మీ మావ, చినమావ లీలామహల్ లో ఇంగ్లీషు సినిమాకు బొయినారు."
చిట్టెక్కతో మాట్లాడతూనే చకచకా చుక్కలు పెట్టేసింది అమ్మ. పిన్ని ముగ్గువెయ్యడం సగంలో ఉండగానే నేనూ, అక్కా ముగ్గులో రంగులు వెయ్యడం మొదలుపెట్టేశాం. చూస్తుండగానే చిలుకలు జాంపళ్ళతో సహా వాకిట్లో వాలిపోయాయి.

ముగ్గు చుట్టూదిరిగి ముచ్చటగా చూస్తున్న మాతో "మాయ్, తొమ్మిదింకాలౌతావుంది. రాండి లోపలకి." పిలిచింది అమ్మమ్మ.
"మీరు బోయి పొణుకోండిమా చుట్టుకర్ర గీసొస్తా౦." చెప్పింది పిన్ని.
"ముగ్గిన్నె అమ్మకీ నీర్జా తొందరగా గీస్తదా" అంది అమ్మ.
"చాన్నాళ్ళయిందే ముగ్గేశా" అంటూనే ఆ ముగ్గు గిన్నె తీసుకుని అమ్మమ్మ ఐదువేళ్ళు ఇలా కదిలించిందో లేదో వరుసగా నాలుగు గీతలు పడ్డాయి నేలమీద. ఐదే ఐదు నిముషాల్లో చుట్టూ దడిగట్టి ద్వారాలు పెట్టినట్టు చుట్టుకర్ర గీసేసింది.
"నీర్జా, ఆ వీధి మొగదాల ఇంట్లో సుబ్బమ్మత్త నడిగితే పశులకాడి పిల్లోడితో ఆవు పేడ పంపుండాది. రేపెకొంజావునే గొబ్బెమ్మలు జేసి, వాటిమింద మన సందులో గుమ్మడిపువ్వులు నాలుగు బెట్టండి." చెప్పింది అమ్మమ్మ.

"అట్నే మా. మీరు లోపలకు పాండి. ఐద్నిమిషాల్ అట్టా బోయి ముగ్గులు చూసోస్తాం. అంటూ భుజం చుట్టూ కొంగు కప్పుకుంది పిన్ని. ముగ్గేసేటప్పుడు తెలియలేదు కాని మంచు కురవడం మొదలై చలిగా ఉంది. ప్రతి ఇంటి ముందూ ఇద్దరూ ముగ్గురూ ఆడవాళ్ళు ముగ్గు వేస్తూనో, చూస్తూనే వీధంతా సందడిగా ఉంది. ముగ్గేసేవాళ్ళను పలకరిస్తూ వీధంతా చుట్టి వచ్చాం.

* * * * * * *

ఉదయాన్నే తమ్ముడు లేచి ముగ్గు చూస్తూ వాకిలి దగ్గర నిలబడ్డాడు.
"ఏం సుధాకరా, ముగ్గు బావుండాదా?" అడిగింది పిన్ని.
తల ఊపుతూ "ముగ్గు చుట్టూ ఎందుకు పిన్నీ గీతలు గియ్యడం" అడిగాడు తమ్ముడు.
"గీయకయకపోతే మీ చిలకలెగ్గిరి పోవా?"ఎప్పుడొచ్చిందో వెనకింటి గౌరమ్మత్త ముగ్గు వెనకాల నిలబడి నవ్వుతూ అంది.
"మరి మూడు పక్కలా ఆ దార్లేందుకు?" అడిగాను.
"ఈదిలో పిల్లి తిరగతా ఉండాదబయా. పిల్లొస్తే చిలకలు పారిపోయ్యేదానికి" చెప్పింది అత్త.


Saturday, December 22, 2018

పండగనెల

పండగనెల పెట్టి వారమౌతోంది. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. రంగుల ముగ్గులు, మెలికల ముగ్గులు, నెమళ్ళు, చిలకలు, తామరపూల ముగ్గులు.. ఒకటేమిటి ప్రకృతినంతా పటం గట్టి ముచ్చటగా ఇళ్ళ ముందు అలంకరించేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మతో సహా అందరిదీ అందె వేసిన చెయ్యే. అమ్మమ్మ వాళ్ళింట్లో వారిని పరిచయం చేసుకోవాలంటే ఇలా వెళ్ళండి. వాకిట్లో ముగ్గులు వంటింట్లో దోశలు 

*            *            *           *            *           *          *          *

ఉర్లగడ్డ తాళింపు, మునగాకు పెసర పప్పు కూర, వంకాయ పులుసుతో సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యగదిలోకి చేరాం నేనూ, పిన్ని, అక్క.

"ఏంకా ఈ రోజేం ముగ్గేద్దామా?" ముగ్గుల పుస్తకం పేజీలు  తిప్పుతూ అడిగింది అక్క.
"మొన్న ఆదివారం పేపర్లో వేసిళ్ళా...తామర పూల ముగ్గు. అదేద్దామా?" అడిగింది పిన్ని.
"వద్దులేకా. నాల్రోల నాడు సెట్టిగారి వందన అట్టాంటి ముగ్గే ఏసిళ్ళా" అక్క గుర్తుజేసింది.
"అవునుమే. అయితే బళ్ళేదులే. ఈ చిలకల ముగ్గు జూడా" ఓ పేజీ చూపించింది పిన్ని.
"బావుందికా. రంగులన్నీ ఉండాయా?చిలకపచ్చ, ఎరుపు రంగు ముక్కుకి, లేతాకుపచ్చ జామకాయలకు."
"పాపా ఆ కొట్టుగదిలో రంగుల డబ్బాల్లో ఈ రంగులుండాయేమో జూసిరా? చెప్పింది పిన్ని.
కొట్టుగదిలోకి వెళ్లాను. పాత ఇనప డబ్బాల్లో రంగులు పోసి ఉన్నాయి. ఎరుపు, బులుగు, ఆకుపచ్చ, చిలకపచ్చ, పసుపు ఇలా చాలా రంగులు ఉన్నాయి. అందులో అక్క చెప్పిన రంగుల డబ్బాలు తీసుకొచ్చాను.
"పిన్నీ సరిపోతాయా?"
"ఆ.. సరిపోతాయి. సాయంత్రమే కళ్ళాపి జల్లేసి రాత్రి అన్నాలు దిన్నాక ముగ్గు మొదలు బెడదాం." చెప్పింది.
ఏడవగానే అన్నం తినేసి ముగ్గు డబ్బా తీసుకొచ్చాను.
"కాసేపు తాలి ఏద్దుర్లే నాయినా. రోడ్డుమీద ఇంకా సైకిళ్ళు పోతా ఉళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఆ ముగ్గు డబ్బాలన్నీ వరండా చివరగా ఉన్న అరుగు మీదకు చేర్చాను. వరండాలో గోడ పక్కన తెల్ల పెయింట్ తో మెలికల ముగ్గు వేసివుంది. మధ్యలో మరో పెద్ద ముగ్గు. వరండా మెట్లు దిగి వీధి వైపునున్న ఇనుప గేటు దగ్గరకు వచ్చి చూశాను. అక్కడక్కడా వీధి దీపాల వెలుగుతో రోడ్డు మెరుస్తోంది. దూరంగా అక్కడో సైకిల్, ఇక్కడో రిక్షా కనిపిస్తూ ఉన్నాయి. వీ ధిలో ఇంకా ఎవరూ ముగ్గు వెయ్యడం మొదలు పెట్టలా. కాసేపట్లో ప్రతి ఇంటి బయట ముగ్గులు, రంగులతో హడావిడి మొదలవుతుంది.

Monday, April 16, 2018

వార్షికోత్సవం

        రంగులు మార్చుకున్న ఆకులు రాలి శీతాకాలం ప్రవేశించాక అంతటా నిశ్చలం. ఆకుల వియోగంతో మూగవోయిన కొమ్మలు... బూడిద రంగు ఆకాశంలో బద్దకంగా రెక్కలు విదుల్చుకుంటున్న పక్షులు. లోపల, బయటా అలుముకున్న స్తబ్ధత.

       చలి తాకిడికి కుంచించుకుపోయిన ఓ రోజుకి వార్షికోత్సవం పనులు మొదలెట్టలేదనే ఆలోచన తడుతుంది. పక్షి రెక్క విదిల్చి ముడుచుకున్నట్లు మెయిల్ ఒకటి వెళ్ళాక ఇక తప్పదన్నట్లు ఎవరో తంబూరా శ్రుతి చేస్తారు. కొత్త రాగాలు నేర్చుకుంటున్న వారు గొంతు విప్పే సమయానికి మేఘం చివరి నుండి చొచ్చుకుని వచ్చిన కిరణం భూమిని తాకుతుంది.

      విత్తనం నాటడం పూర్తయ్యాక వాలంటీర్ కోఆర్డినేటర్ అప్పుడప్పుడూ నీళ్ళు చిలకరిస్తూ ఉంటారు. నెల తిరిగేసరికి తెల్లని మంచుపైన వార్షికోత్సవం చివుర్లు తొడగడం కనిపిస్తుంది. ఈవెంట్ కోఆర్డినేటర్ కుంపట్లో మొక్కజొన్న కండెలు దోరగా కాలిస్తే, ట్రోఫీస్ కోఆర్డినేటర్ ఉప్పు, నిమ్మకాయ అద్దుతూ ఉంటారు. అందరూ కలసి చిరుచలిలో కబుర్లు చెప్పుకుంటూ ఒక్క గింజ కూడా మిగల్చకుండా మొత్తం వలిచేస్తారు. రాబోయే తీగలకు డెకరేషన్స్ టీం పందిరి సిద్దం చేస్తూ ఉంటారు.

     మూడు రాళ్ళు చేర్చి ఒక్క అగ్గిపుల్లతో నీళ్ళు వేడిచేయడం మొదలెడతారు ఫుడ్ టీం. టీ మరిగే సమయానికి చుట్టూ పళ్ళాలు, గిన్నెలు, బియ్యం, రైస్ కుక్కర్లూ అన్నీ ఎక్కడెక్కడి నుండో వచ్చి సర్దుకు కూర్చుంటాయి. బూడిద రంగు ఆకాశానికి సాయంత్రాలు జేగురు రంగు పులమడం మొదలౌతుంది. రాబోయే రంగులను అందంగా బంధించడానికి కెమెరాలకు కబుర్లు వెళతాయి.

       లోపలున్న వెచ్చదనం బయటకు పాకి కొమ్మలు పచ్చబారుతూ ఉంటాయి. చిలకలు అటూ ఇటూ ఎగురుతూ పలుకులు నేర్చుకుంటాయి. మంచు కరిగి మెల్లగా ప్రవాహం మొదలౌతుంది. నీళ్ళలో కొట్టుకొస్తున్న రంగు రాళ్ళనన్నింటినీ ఏరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓ పక్కగా పోగు పెడుతూ ఉంటారు. అక్కడెవరో రాళ్ళలో రాగాలు వింటూ పరవశించి పోతుంటారు.

          నలుగురు నడిచే బాటలో అటువైపుగా కూర్చున్న అతను కాగితమొకటి తీసుకుని దీక్షగా సున్నాలేని అంకెలు గీస్తుంటాడు.

         మధ్యాహ్నాలు నీలంగా మారే సమయానికి తీగలన్నీ పైకి పాకి పచ్చని పందిరి తయారవుతుంది. నీలం వంకాయలు, లేలేత చింతకాయలు నలుగురితో కూర్చుని నవ్వుకుంటూ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, కీర దోస నీళ్ళపైకి చేరి నిక్కినిక్కి చూస్తుంటాయి.

        పకోడీలు, టీలు ప్రయాణానికి సన్నాహాలు మొదలెడతాయి. అందరూ ఆడిటోరియం కు చేరుకుంటారు. నెగడు చుట్టూ ఆట మొదలౌతుంది. సాంబార్లు, దద్దోజనాలు బకెట్లలొ కూర్చుని వాడవాడలా షికార్లు చేస్తాయి.

         వార్షికోత్సవం పూలన్నీ పందిరి నిండా విరగబూస్తాయి. వసంతోత్సవం జరుపుకున్న చిన్న పెద్దా  గుండెనంతా వాసన నింపుకుని ఇంటి దారి పడతారు.



Sunday, February 4, 2018

Grand Turk



దేశం చుట్టూరా ఝామ్మని తిరిగి రావాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకనిపిస్తూ ఉంటుంది. ఇండియా చుట్టూనో, అమరికా చుట్టూనో తిరిగి రావడం కుదరని పని కాని అదిగో అక్కడ కనిపిస్తోందే, గ్రాండ్ టర్క్, అదో ద్వీపము. ఆ ద్వీపాన్ని కాలినడకన చుట్టేసి రావచ్చు. ఏడు ౘదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఈ చిన్న ద్వీపం, టర్క్స్ అండ్ కైకోస్ ద్వీప సమూహానికి రాజధాని. ఈ చిన్న ద్వీపంలో బాంక్, ఆసుపత్రి, జైలు, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హైస్కూల్ వరకూ ఉచిత విద్యా సదుపాయాలు ఉన్నాయి. సున్నపు రాయి ఇక్కడ  ప్రధాన వ్యాపారము. వీరికి విమానమార్గం ప్రధాన ప్రయాణ సౌకర్యము. ద్వీపం అనగానే పెద్ద పెద్ద చెట్లు కొండలు, గుట్టలు  ఉంటాయనుకుంటాం కదూ! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటింటే ఎక్కడా పెద్ద చెట్టన్నది  కనిపించలేదు. ఈ ద్వీపంలో పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. ఈ మధ్య వచ్చిన మరియా తుఫాను వలన ఈ ద్వీపానికి చాలా నష్టం కలిగిందట. ఇక్కడ వారికి  రెండువేల పంతొమ్మిది వరకు కూడా టివి సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదట.

లేతాకుపచ్చ రంగుకు పిసరంత నీలం రంగు కలిపేసి సముద్రంలో గుమ్మరించినట్లు గమ్మత్తైన రంగులో మెరిసిపోతున్న ఈ  సముద్రంలోకి ఎంత లోపలకు వెళ్ళినా స్వచ్ఛంగా అడుగు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా మురికి అన్నది కనిపించక పోవటానికి ఇసుకలో సున్నపురాయి కలసి ఉండడమే కారణమట.
పంతొమ్మిది వందల అరవై కాలం నాటికి రెండవ ప్రపంచయుద్ధం ముగిసిపోయినా, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం
 కొనసాగుతూనే ఉండేది. అప్పటికే రష్యన్ వ్యోమగాములు భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసేశారు. అమెరికా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. ఆ సమయంలో జాన్ గ్లెన్, అనే వ్యోమగామి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయినప్పటికీ,  భూమండలం చుట్టూ విజయవంతంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేశాడు. అతను ప్రయాణం చేసిన రోదసీ నౌక  గ్రాండ్ టర్క్ దగ్గర నీటిలోకి దిగింది. దానికి గుర్తుగా రోదసీ నౌక నకలును గ్రాండ్ టర్క్ దగ్గర ప్రదర్శనకు పెట్టారు.

పద్దెనిమిది వందల శతాబ్దంలో కరేబియన్ ద్వీపాలలో నౌకా వ్యాపారం మెండుగా ఉండేది. అసలే జిపియస్ లేని కాలం, పైగా ద్వీపానికి దగ్గరలో తీరంలోపల కొండలు, గుట్టలు. అటు వైపుగా ప్రయాణించే ఓడలు రాత్రిపూట అటూ ఇటూ ఊగడం, మునిగిపోవడంతో విపరీతమైన ధన, వస్తు, ప్రాణనష్టం వాటిల్లేదట. ఈ కారణంగా అక్కడ పద్దెనిమిది వందల యాభై  రెండవ సంవత్సరంలో లైట్ హౌస్ కట్టడం జరిగింది. అరవై అడుగుల ఎత్తు, గట్టి ఇనుముతో కట్టిన ఈ లైట్ హౌస్ లో మొదట ఆర్గాండ్ ఆయిల్ దీపాలు రిఫ్లెక్టర్ల సాయంతో కొంతకాలం ఏదో మిణుకు మిణుకు మంటూ వెలిగినా ఆ వెలుగు సరిపోలేదట. ఆ తరువాత కిరసనాయిల్ దీపాలు ఫ్రెస్నెల్ లెన్స్ లతో పరిస్తితి చక్కబడిందట. పంతొమ్మిది వందల డెబ్భై రెండొవ సంవత్సరంలో పూర్తిగా విద్యుతీకరణ చేశారు. చాలా విశేషాలు  తెలుసుకున్నాం. కాసేపలా ఊరు చూసొద్దాం రండి.





మన దేశంలో ఓ మారుమూలనున్న చిన్న పట్టణాన్ని చూస్తున్నట్లు ఉంది కదూ! అదిగో కనిపిస్తోందే అదే పెద్ద బజారు.

                                                                                                 










       ఓ గమ్మత్తైన విషయం చెప్పనా, ఇక్కడ ఎటువంటి డ్రైవింగ్ నియమాలు లేవుట. మద్యం తాగి కూడా డ్రైవింగ్ చెయ్యొచ్చట. అన్నట్లు ఇక్కడ జలుబు, జ్వరాలకు మందులు వేసుకోరట. వేపాకులు నీళ్ళలో మరిగించి తాగేస్తే తగ్గిపోతుందని చెప్తున్నారు. వేపాకులా, ఇక్కడా? అని నేను కూడా మీలానే ఆశ్చర్యపోయాను. ఎప్పుడో ఇండియా నుండి వేపమొక్క పట్టుకెళ్ళి  అక్కడ నాటారట. జైలొకటి ఉందని చెప్పాను గుర్తుందా? ఇక్కడ చిన్న చిన్న దోపిడీలు తప్ప మర్డర్లు, మానభంగాలు లాంటి పాశవిక ఘోరలేమీ ఇప్పటి వరకూ జరగలేదట. "ఏమోయ్, బొమ్మిడాయల పులుసు పెట్టెయ్. రాత్రికి వచ్చేస్తాను" అని ఖైదీలు రాత్రుళ్ళు బయటకు వెళ్ళి రావడం ఇక్కడ మామూలేనట.

     భారీ చదువులు, ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువులు సరే, కనీసం అద్దం కూడా కొననక్కర్లేని సాదాసీదా జీవితాలు! ఏమిటీ, అక్కడ వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? వెళ్ళేమాటయితే మీ అడ్రస్ ఏదో ఈ కింద కామెంట్ లో పోస్ట్ చెయ్యండి. ఈసారి గ్రాండ్ టర్క్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాం.
 
https://en.wikipedia.org/wiki/Grand_Turk_Island
https://www.grandturkcc.com/island-information/fact-sheet.aspx

Thursday, January 18, 2018

క్రూజ్ టు పోర్టోరికో

        కరేబియన్ ఐలెండ్స్ చూడాలంటె శీతాకాలం మంచి సమయం, పైగా ఈస్ట్ కోస్ట్ చలి నుంచి కొంతకాలం తప్పించుకోవచ్చు. నాలుగేళ్ళ క్రితం ఇదే సమయంలో బహమాస్ కు వెళ్ళాం.

ఈయేడాది కూడా అలాంటి ప్రయాణమే. డిసెంబర్ ఇరవైమూడవ తేదీ సాయంత్రం మయామీ నుండి ఓడలో బయలు దేరి, ఇరవైఐదున గ్రాండ్ టర్క్, ఇరవైఆరున డొమెనికన్ రిపబ్లిక్(యాంబర్ కోవ్), ఇరవైయేడున పోర్టోరికో చూసి ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటలకల్లా మయామీ చేరుకోవడం...ఇదీ కార్యక్రం.

Carnival Glory
ఈ  పదకొండు అంతస్తుల ఓడ వెనుక భాగంలో దొరికింది గది. అబ్బా వెనుక వైపునా అనుకున్నాం కాని ఊగిసలాడే ఓడలో వికారాలేవీ  కలిగకకుండా ఉండాలంటే అదే మంచిదట. మొదటి అంతస్తులో ఉన్నామేమో కిటికీలో నుండి చూస్తే చేతికి అందేదూరంలో సముద్రం. గదిలోనుండే సూర్యోదయాలు చూడొచ్చని సరదాపడ్డాం.. మేఘాలకి కూడాఅలాంటి సంబరమే. తెల్లవారేటప్పటికి మమ్మల్ని చూడడానికి తయారు. నడి సముద్రంలో వాటికి మాత్రం తోచుబాటు అయ్యేదెట్లా!

"భోజనానికి త్వరగా వస్తారా ఆలస్యంగా వస్తారా?" అని మర్యాదగా అడిగినప్పుడు ముందొస్తామని కదా చెప్పాలి. మరీ ముందొస్తామంటే ఏం బావుంటుందని కాస్త మొహమాటానికి పోయి ఆలస్యంగా వస్తామన్నాం, ఇక అంతే! ఎనిమిందింటికి మొదలైన వడ్డన పదింటికి కూడా పూర్తవదే. ఇక చాలు బాబోయ్ తినలేమంటున్నా"అబ్బే ఇది కొత్త వంటకం రుచి చూడండి అంటూ" మరోటి తెచ్చి పెట్టడం. మంచి పాటలతో, డాన్సులతో ఓడంతా హుషారుగా ఉన్న సమయంలో మేము ప్లేట్లు, ఫోర్క్ లతో కాలక్షేపం. 

సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఈ మధ్యకాలంలో ఓ నాలుగు గంటలు గడిపింది లేదు. అలంటిది ఏకంగా వారం రోజులు. ఎలా గడుస్తాయా అని గాభరాపడ్డాం కానీ...

సముద్రం మధ్యలో చుక్కల పరదా కింద, వెచ్చగా దుప్పటి కప్పుకుని సినిమా చూడడం...టీ టైంలోకేక్స్, శాండ్విచెస్ తో పాటు కొత్త పరిచయాలు...వారితో అమెరికా రాజకీయాల నుండి మొన్నటి మరియా, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్, యూనివర్సిటీ చదువులు ఇలా రకరకాల చర్చలు. పై అంతస్తులో మినీ గోల్ఫ్, ఆ పక్కనే వాలీ బాల్ కోర్ట్, తీరిగ్గా సముద్రం చూస్తూ డైనింగ్ హాల్ లో పెట్టిన కొత్త వంటకలేవో తెచ్చుకుని కబుర్లతో మధ్యాహ్నాలు, ఫోటోలు దిగుతూ సరదా సాయంత్రాలు... సమయమంతా ఇట్టే గడిచిపోయింది.   

"రండి రండి త్వరపడండి ఆలసించిన ఆశాభంగం మీరు వెళ్తున్న ప్రదేశాలు చూడడానికి ఓడలోనే టూర్ బుక్ చేసుకునే సదుపాయం" అని ఊదర బెట్టేస్తారు కాని అనుభవపూర్వకంగా తెలిసిందేమిటంటే అవి సాధారణంగా చాలా  ఎక్కువ ఖరీదు ఉంటాయి. పైగా వాటితో వచ్చిన ఇబ్బంది మనం ఒక టూర్ బుక్ చేసుకుంటే ఏదో ఒక వైపు చూడడానికి వీలవుతుంది. మిగిలిన భాగం చూసే అవకాశం ఉండదు. ఓడ నుండి ఇలా బయటకు వచ్చి ఓ నాలుగు ఫోటోలు తీసుకుని అలా చూడగానే టూర్ పేకేజస్ అంటూ చిన్నచిన్న బంకులు లాంటివి కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి విషయం కనుక్కుని అవసరం అనుకుంటే ఏమీ  మొహమాటపడకుండా బేరాలాడేయొచ్చు. అలా కుదరదనుకుంటే ఓ ప్రైవేట్ వెహికల్ గంటకు ఇంతని కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఆ ప్రదేశం మొత్తం చూపిస్తారు.

 Interesting foods
Toasted Avocado Poached eggs 

Buttered Popcorn Pot De creme


చూసిన ప్రదేశాల కబుర్లు త్వరలో

Sunday, June 18, 2017

నాన్నా,

       మనం ఉత్తరాలు రాసుకుని చాలా కాలం అయింది కదూ! నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కేవలం నన్ను పలకరించడం కోసమే రోజుకో ఉత్తరం రాసేవాడివి. అప్పట్లో ఫోన్ వాడకం ముఖ్యమైన విషయాలకే పరిమితమై ఉండేది.

       తమ పిల్లల జీవితం నందనవనంలా ఉండాలని ప్రతి తల్లీతండ్రీ కోరుకుంటారు. ఆ నందనవనానికి నాందీ వాక్యం గురించి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి.

      ఓ మబ్బు పట్టిన సాయంత్రం...ఊరికే... కేవలం ఊరికే, మనకు అప్పుడు టివియస్ ఉండేది. నువ్వూ, నేనూ, తమ్ముడూ జిటి రోడ్డు మీద ఓ రెండు కిలోమీటర్లు వెళ్ళి చిన్న బ్రిడ్జి  దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవడం గుర్తొచ్చింది. ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు కాని ఆ సాయంత్రం మాత్రం అలా ఓ చక్కటి జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలతో అలాంటి అందమైన సాయంత్రాలు ఎన్నో కేవలం ఊరికే... తీరిగ్గా కూర్చుని గడపగలిగే అదృష్టానికి ఆ సాయంత్రం బీజం వేసింది. 

       అప్పుడప్పుడూ మమ్మల్ని నీతో పాటు మీ ఆఫీస్ కు తీసుకువెళ్ళేవాడివి. కోర్టు ఆవరణలోకి వెళ్ళగానే దారి పక్కగా కనిపించే పెరివింకల్ పువ్వుల రంగు, అవి దాటి లోపలకు వెళ్ళగానే గదిలో వినిపించే టైప్ మిషన్ టకటక శబ్దం ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయ్. అప్పుడు అనుకోలేదు కాని తరువాత మా జీవితాలను పిల్లలకు పరిచయం చెయ్యాలనే ఆలోచనకు పునాది ఆ జ్ఞాపకం.

     ఏ పండగో వస్తే బడికి సెలవొస్తుందిగా, రెండు జతలు బట్టలు బాగ్ లో పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్ళిపోవడమే. ఒక్కోసారి ఈ ఊరా ఆ ఊరా అని కూడా అనుకునేవాళ్ళం కాదు. కావలో, ఉలవపాడో, గుడ్లూరో... ముందుగా ఏ బస్ వస్తే ఆ ఊరికి అటు అత్తా వాళ్ళింటికి కాని నాన్నమ్మ వాళ్ళింటికి కాని, పిన్ని వాళ్ళింటికి కాని. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళెవరికీ కూడా చెప్పాపెట్టకుండా చుట్టాలొచ్చారు, ఇప్పుడెట్లా అనే భావం ఉండేది కాదు. మొహమంతా వెలిగిపోతుండగా "రాండి...రాండి. సరైన టయానికి వచ్చారు. తోట కాడ్నించి మామిడి పళ్ళు దెచ్చినారు, దక్షిణపు గట్ల మీద తాటికాయలు ముదిరుండాయి, నిన్నే మచ్చల బర్రె ఈనింది. జున్నెట్లా పంపాలా అనుకుంటుండాం, " అంటూ లోపలకు తీసుకెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఇంటికి ఎవరైనా వస్తే అదే భావంతో వారిని ఆహ్వానించగలుగుతున్నామంటే ఆనాటి ఆనుభూతి పదిలంగా మనసులో నిలిచిపోవడమే కారణం. 

        ఓ పత్రికో పుస్తకమో చదువుతూ నచ్చిన వాక్యాలు పెద్దగా చదివి వినిపించడం నీకు అలవాటు. వింటూ బావున్నాయని అనుకున్నానే కాని అవి నాలో సాహిత్యాభిలాష పెంచే విత్తనాలని తరువాత కదా అర్థం అయ్యింది. చందమామ, బాలమిత్రలతో మొదలై చతుర, విపుల, ఆంధ్రభూమి ఆ తరువాత యద్దనపూడి, ఆరెకపూడి, పురాణం సీత, మాలతీ చెందూర్, చలం ఇలాంటి పరిచయాలతోనేగా జీవితానికో నిర్దుష్టమైన అభిప్రాయం ఏర్పరిచింది. 

        నీకు ఏవేవో ఆశయాలు అవీ ఉండేవి. లంచం తీసుకోవడం తప్పు, అలాగే అప్పు చేయడం ఇక మద్యపానం అంటే మహా నేరం. ఆ రోజుల్లో నీ ఒక్కడికే కాక జనాంతికంగా కూడా అవే అభిప్రాయాలు ఉండేవి. మారినకాలంతో పాటు ఎన్నో మార్పులు... లక్షీదేవి ఆదిపత్యంలోకి వచ్చాక, మంచి చెడు మధ్యనుండే అడ్డుగోడను లౌక్యం మేఘంలా కమ్మేసింది. భౌతికంగా సుఖమయ జీవినప్రమాణస్థాయి పెరిగినా మానసికంగా అల్లకల్లోలమవుతున్నవారే ఎక్కువ. ఈ మార్పులకు లోనవక నిటారుగా నిలబడగలిగామంటే ఆ నాడు మీరాచరించి చూపిన విచక్షణే కారణం. 

        నాకు సరిగ్గా గుర్తులేదు కాని బహుశా నేను ఇంటర్ లో చేరినప్పుడనుకుంటాను ఓ రోజు ముందుగదిలో మనందరం కూర్చుని ఉన్నప్పుడు అతిశయోక్తి కాని, అబద్డంకాని కాని జోడించకుండా మన ఆదాయం ఖర్చు లెక్కలన్నీ  వివరంగా చెప్పావు.  అందువల్లనే నువ్వు వంద రూపాయలు చేతికిచ్చినా తమ్ముడికి కాని నాకు కాని పదే ఖర్చు చెయ్యాలని చెప్పకుండానే అర్ధం అయింది. అందులో మేము సర్దుకుని బ్రతికిందీ లేదూ, అలా అని చాలకపోవడమూ లేదు. అంతా సహజంగానే. ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ రోజు పేదగా బ్రతకలేదు. ఆనాటి మీ ఆ జీవిన విధానమే మాకు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కునే ధైర్యం ఇచ్చింది. 

       అమ్మాయి మైనస్ అబ్బాయి ప్లస్ అనుకునే రోజుల్లో కదా పుట్టాను. అందులో అవి పిల్లలను డాక్టర్లనో, ఇంజనీర్లనో చెయ్యాలనుకునే రోజులు కూడానూ. మమ్మల్నిద్దర్నీ సమానంగా చూడడమే కాక మీ అభిప్రాయాలను మా మీద రుద్దకుండా మా భవిష్యత్తు పూర్తిగా మా చేతుల్లో వదిలి మా నిర్ణయమేదైనా ఆమోదించారు. ఆ ఆత్మవిస్వాసంతోనే జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. ఒకవేళ నాకు జీవితాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం వచ్చినా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకుంటాను. 

         నలభై, యాభై యేళ్ల క్రితం ఎవరైతే నీకు ముఖ్య స్నేహితులో ఇప్పటికీ మీ మధ్య అదే స్నేహం. వాళ్ళ పట్ల నీ అభిప్రాయం మారలేదు. అది ఆ స్నేహం గొప్పతనమని నీవన్నా అది నీ గొప్పతనమేమని నాకనిపిస్తుంది. మనింట్లో ఓ వ్యక్తి  గురించి గాని, ఓ సంఘటన గురించి గాని పదే పదే చెడ్డగా మాట్లాడే అలవాటులేదు. అది బహుశా నాన్నమ్మ వాళ్ళింటి నుంచి వచ్చిన అలవాటు కావచ్చు. తాతయ్య పోయి ముప్పై ఏళ్ళయినా ఈ నాటికీ  ఆయనను గుర్తు చేసుకోవడం కోసం ఎడాదికో రోజు మీరంతా  కలుస్తున్నారు. "మాకే కష్టమొచ్చినా మా అన్నకు చెప్పుకుంటామమ్మా ఆయనేగా మాకు పెద్ద" అని అరవై యేడేళ్ళ బాబాయి అన్నప్పుడు అబ్బురంగా అనిపించింది, గుండె తడి అర్ధం అయింది. ఆ అనుబంధాల తీవ్రత ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మౌనంగా భరించగలిగి, మరిచిపోగలిగిన పరిణితి ఇచ్చింది. జీవిత కాలపు స్నేహాలను నిలుపుకోగలిన అదృష్టాన్నిచ్చింది.

       నాన్నా ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో నువ్వు నమ్మిన సిద్ధాంతాలు తారుమారవడం, విలువలకు అర్థాలు మారడం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోగలను. నీ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. బాధపడడానికి , నీ బాధ వ్యక్తం చేయడానికి సహేతుకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. కాని విధికి తలవంచి జరిగిన వాటిని తలచుకుంటూ కోర్చోక పరిస్థితులను ఎదుర్కొని సంతోషంగా గడపగలుగుతున్న నీ జీవితం మాకే కాదు ఎందరికో ఆదర్శం.   

      ప్రస్తుతం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఏవేవో  అనిపిస్తూ ఉన్నాయి. వీధిలో చెత్త వేసినట్లు సోషల్ మీడియాల్లో విషం చిమ్మడం చూస్తుంటే బాధ వేస్తోంది. ప్రముఖులమని చెప్పుకుంటున్న వారు వేస్తున్న పిల్లిమొగ్గలను చూసి బాధతో కూడిన నవ్వు వస్తోంది. ముఖ్యంగా నలుగురిలో గుర్తింపు కోసం తమ కోరికలను పిల్లల మీద రుద్దడం చూసి బాధనిపిస్తోంది. తల్లిదండ్రుల ప్రోద్భలంతో సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకున్న వారు సంతోషంగా ఉండగలుగుతున్నారా? సంతృప్తితో జీవితాన్ని గడపగలుగుతున్నారా?   

      "నేనెలాంటి నిర్ణయం తీసుకున్నా మా నాన్న సమర్ధిస్తారు. నా అడుగులు తడబడినప్పుడు ఫరవాలేదులే అని భుజం తడతారు, నన్ను నన్నుగా మా నాన్న ఆమోదిస్తారు". ఇలాంటివి కదా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేది. అదిలేని వారు ఎంత గొప్ప పదవులలో ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నా అత్మన్యూనతతో బాధపడుతూ జీవితాన్ని కోల్పోతారని ఎంత మంది నాన్నలకు తెలుస్తుంది? 

     అక్షరాలు అందంగా రాయడం నేర్పింది అమ్మయితే ఆ అక్షరాలకు అర్ధం చెప్పింది నువ్వు. 

                                Happy Fathers Day Nanna.