Showing posts with label పర్యటన. Show all posts
Showing posts with label పర్యటన. Show all posts

Thursday, March 26, 2020

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 2

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1 

మా ప్రయాణం విషయం ఉదయాన్నే మా నాన్నకు, అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను. ఓ గంటలో మా తోడికోడలు ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నెల్లూరు వస్తామనీ, మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాక వెనక్కు వెళ్తామని చెప్పింది. చెప్పినట్లుగానే తను అత్తయ్యను, పిల్లలను తీసుకుని మధ్యాహ్నం వచ్చింది. అప్పటికే సర్దడం మొదలు పెట్టేసాను. ఇల్లంతా చిందర వందరగా పెట్టెలు వస్తువులు. కాసేపు అవీ ఇవీ సర్దాక "అక్కా, నువ్వు కావలసినవి తీసుకుని వెళ్ళిపో, నేను మరో వారం తరువాత వచ్చి ఇల్లు ఖాళీ చేస్తాను. ఎవరికైనా ఇవ్వవలసినవి ఉంటే చెప్పు అవన్నీ వాళ్ళకు పంపించేస్తాను" అని చెప్పింది. గొప్ప సహాయం కదూ! ఎలా పడితే అలా వదిలేసిన ఇంటిని ఖాళీ చెయ్యడమంటే మాటలా, ఎంతమంది చేయగలరలా? ఆ రోజంతా సర్దిన వాళ్ళం సర్దినట్లే ఉన్నాం. కావలసిన వాళ్ళను కలవడం,  ఫోన్లు చేయడంతో ఆ రోజంతా హడావిడిగా గడిచింది. 

శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా పిల్లలు "పెద్దమ్మా తమిళ నాడు బార్డర్ క్లోజ్ చేశారట. ఇప్పుడెలా?" అంటూ హడావిడి పడుతూ పేపర్ చూపించారు. నాకేమీ అర్థం కాలేదు. బార్డర్ క్లోజ్ చెయ్యడం ఏమిటి? వెళ్ళనీకుండా పెద్ద కంచె కానీ కట్టేస్తారా? ఎప్పుడూ ఇలాంటిది వినలేదే. "నిత్యావసర వస్తువుల వాహనాలనీ, ప్రభుత్వ వాహనాలను, శవ శకటాలను మాత్రమే బార్డర్ దాటనిస్తారట" అంటూ పేపర్ లో వ్రాసిన వార్తను పైకి చదివారు. ఇప్పటికప్పుడు బార్డర్ దాటలంటే ఓ శవాన్ని కానీ తీసుకుని వెళ్ళాలా అని జోకులు వేస్తున్నారు పిల్లలు. మేము అమెరికన్ సిటిజన్స్ మి అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాము కాబట్టి, బార్డర్ దగ్గర మమ్మల్ని ఆపకూడదు. అలా కాకుండా బార్డర్ దాటనీయలేదనుకోండి  ఏమిటి పరిస్థితి?

అలా తర్జని బర్జన పడుతూ సరే మన ప్రయత్నాలు మనం చేద్దాం అనుకున్నాం.  గత పద్నాలుగు రోజులుగా ఎటువంటి అనారోగ్యమూ లేదని మెడికల్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాం. అంతలో ఒక ఆలోచన వచ్చింది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ తో వెళితే బార్డర్ దగ్గర ఆపరు కదా అని. చెన్నై లో ఉన్న ఒక ఫ్రెండ్ ను సహయం అడిగాం. తను పాపం వెంటనే మమ్మల్ని బార్డర్ దాటించడానికి ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం ఏ మూడు గంటలకో చెన్నై బయలుదేరినా ఆరుగంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాం. కానీ ఆ రోజు ఒంటిగంటకే నెల్లూరి నుండి బయలుదేరాం. అదే సమయానికి మా ఫ్రెండ్  చెన్నై నుండి బయలుదేరారు. మధ్యలో సూళ్ళూరు పేట దగ్గర తన కారులో ఎక్కించుకుని బార్డర్ దాటించి ఎయిర్ పోర్ట్ లో దింపాలని ఆలోచన. కొంత దూరం పొయ్యాక తన నుండి ఫోన్ వచ్చింది. బార్డర్ దగ్గర ఇబ్బంది పెట్టారనీ, ఇప్పుడు కనుక బార్డర్ దాటి  ఏపి లోకి అడుగు పెడితే తిరిగి తమిళనాడు లోనికి రానీయ మన్నారట. అయినా రిస్క్ తీసుకుని వచ్చారు. సూళ్ళూరుపేట దగ్గర డ్రైవరలిద్దరూ మా సూట్ కేస్ లను తన కారులోకి మార్చారు. ఏదో స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలా అనిపించింది. మేము బార్డర్ దాటే దాకా మా డ్రైవర్ ను అక్కడే ఉండమని డ్రైవర్ కి చెప్పాం. మేము ఎయిర్ పోర్ట్ కు వెళ్ళగలమనే నమ్మకం పోయింది. 

తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కార్ ఆపారు. ఒక పోలీస్ విండో దించమని సైగ చేసి,  "బార్డర్ క్లోజ్ చేశాం ముందుకు వెళ్ళకూడదు" అన్నారు. ఆ రాత్రికే అమెరికా వెళ్తున్నామని మాకు అమెరికన్ పాస్ పోర్ట్ ఉందని చెప్పాము. పాస్ పోర్ట్ చూపించమన్నారు. పాస్పోర్ట్ లో మా ఫోటోలు మామొహాలు మార్చి మార్చి చూసి కారు రిజిస్ట్రేషన్ చూపించమన్నారు. అన్నీ చూసాక,  ఫ్లైట్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసారు. ఎయిర్ ఇండియా కాన్సిల్ అయింది ఎమిరేట్స్ కాదు అని మా ఫ్రెండ్ చెప్పారు. ఈ సంభాషణంతా తమిళంలోనే జరుగుతోంది. ఐటనరీ చూపించాము. కాసేపు అవీ ఇవీ చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని సరే వెళ్ళమన్నారు.

మళ్ళీ కొంతదూరంలో మరో చెక్ పోస్ట్, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కారు ఆగగానే ముందు కారు మొత్తం స్ప్రే చేసి, కారులో నుండి దిగమన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో బెంచి ఎక్కమని మాష్టారు చెప్తారే అలాగ. మాకందరికీ థర్మల్ చెక్ చేశారు. పొరపాటున కాస్త జ్వరం ఉంటే ఇంక బార్డర్ దాటనిచ్చేవాళ్ళు కాదేమో! మెడికల్ సర్టిఫికేట్ చూపించాము. ఇండియా ఎప్పుడు వచ్చామో, ఎందుకు వచ్చామో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో, మా అమ్మాయి ఎక్కడ చదువుతుందో అన్నీ అడిగి, మెడికల్ సర్టిఫికేట్ చూసి వెళ్ళమని చెప్పారు. అయితే ఎక్కడా ఆగకుండా ఎయిర్ పోర్ట్ కే వెళ్ళమని కండిషన్ పెట్టారు. డెస్టినేషన్ చేరాక సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని సలహా ఇచ్చి పంపించారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ ఎంప్లాయిస్ కాకుండా ఓ పది మంది పాసింజర్స్ ఉండి ఉంటారేమో! మేము టికెట్ తీసుకున్నప్పుడు ఫ్లయిట్ అంతా  ఖాళీగా ఉంది. అది కానీ కాన్సిల్ అవదు కదా అని కంగారూ పడ్డాము. ఒకవేళ కాన్సిల్ అయితే అప్పుడు తమిళనాడు దాటి ఆంధ్రలోకి కూడా వెళ్ళలేము. ఆరున్నరకు కౌంటర్ ఓపెన్ చేశారు. అంతవరకూ ఖాళీగా ఉన్న ఆ కౌంటర్ దగ్గరకు ఎక్కడ నుండి వచ్చారో బోలెడు మంది వచ్చేసారు.  ఫ్లయిట్ లోపలకు వెళితే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఇండియా నుండి బయలుదేరిన ఆఖరి ఫ్లైట్ అది. 

ఫ్లయిట్ లో అంతా మామూలుగానే ఉంది, ఒక్కటే తేడా ఏమిటంటే ఎవరైనా రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ లు లోపలకు వెళ్ళి సానిటైజ్ చేస్తున్నారు. దుబాయ్ చేరాం. అటూ ఇటూ తిరిగే ప్రయాణీకులతో, షాపింగ్ చేసే కస్టమర్స్, రెస్టారెంట్స్ తో  ఎయిర్ పోర్ట్స్ సాధారణంగా సందడిగా ఉంటాయి. అప్పుడు మాత్రం ఎవ్వరిలోనూ సరదా సంతోషాలు కనిపించక పోగా అక్కడ ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది. అందరూ మాస్క్ లు పెట్టుకుని ఉన్నారు, కొంత మందైతే పూర్తిగా పాలిథీన్ తొడుగులు వేసుకుని ఉన్నారు.

బోర్డింగ్ దగ్గర అందరికీ థర్మల్ చెక్ చేస్తున్నారు. అప్పుడు కూడా టెంపరేచర్ ఉంటే దుబాయ్ నుండి వెళ్ళనివ్వరట. నెల్లూరు కాదు, చెన్నై కాదు ఇప్పుడు దుబాయ్ లో ఉండి పోవల్సి వస్తుందా అని చాలా కంగారూ పడ్డాము. కానీ మేము భయపడ్డట్లు కాక ఇద్దరికీ టెంపరేచర్ నార్మల్ చూపించింది. అమ్మయ్య, ఇక యుస్ వరకూ ఇబ్బంది లేకుండా వెళ్తాం అనుకున్నాం. అక్కడ మాత్రం ఇంటికి వెంటనే వెళ్ళాక తప్పక క్వారంటైన్  చేయాల్సి వస్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయి ఓ ఆరుజాతల బట్టలు హ్యాండ్ లాగేజ్ లో పెట్టుకుని రెడీగా ఉన్నాం కూడా.  

వాషింగ్టన్ డీసీలో లాండ్ అయ్యాం. ఇమిగ్రేషన చెక్ లో ఇండియా కరెన్సీ, బంగారం, పచ్చళ్ళు లాంటివి ఏమైనా తెచ్చారా అని అడిగారు. అటువంటివేమీ లేవన్నాం. అయితే మీరిక వెళ్ళొచ్చు అన్నారు. ఆశ్చర్యం వేసింది, మేం అనుకున్నట్లు క్వారంటైన్ చేయమనలేదు సరికదా కనీసం థర్మల్ చెక్ కూడా చెయ్య లేదు. బహుశ మాకు తెలియని టెక్నాలజీ వాడి ఉంటారా? లేదూ అమెరికాలో అప్పటికే వ్యాపించి ఉండడంతో పరీక్షించనక్కరలేదు అనుకున్నారా? ఇండియాలో అలా కాదే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ని వెంటనే చెక్ చేస్తున్నారని విన్నాము. సరే వెళ్ళామన్నారు కదా అనుకుంటూ లాగేజ్ తీసుకుని బయటకు వచ్చాం. 

మాకు డిసి వరకే ఫ్లయిట్ దొరికింది. అక్కడి నుండి షార్లెట్ కు కారులో ఏడు గంటలు ప్రయాణం.
మా తమ్ముడు వాళ్ళు మేరీలాండ్ లో ఉంటారు. అక్కడి నుండి డిసి ఎయిర్ పోర్ట్ దగ్గర. మమ్మల్ని మా తమ్ముడు పికప్ చేసుకుని సగం దూరం తీసుకుని వెళ్తే షార్లెట్ నుండి బయలుదేరిన మా వారు, పండు మమ్మల్ని అక్కడి నుండి  పికప్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట. మాకు కనుక వైరస్ అటాక్ అయిఉంటే వీళ్ళందరికీ  సోకే ప్రమాదం ఉంది. మా అమ్మాయి, నేను ఫ్లయిట్ దిగాక కూడా మస్క్ లు తీయలేదు. 

దాదాపుగా మూడు గంటల డ్రైవ్ తరువాత వచ్చిన రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. అప్పటికే మా వారు, పండు అక్కడికి వచ్చారు. మా మరదలు  పులిహోర, దద్దోజనం, పూరీలు, ఊర్లగడ్డ కూర, ఉప్పు మిరపకాయలు, అన్నీ రెండు పూటలకూ సరిపడా పంపించింది. మా తమ్ముడి కూతురు బ్రౌనీలు చేసి పంపింది. రెస్ట్ ఏరియా దగ్గర ఆగి అందరం భోజనాలు చేసి కారు మారాం. మేము షార్లెట్ చేరేసరికి సాయంత్రం ఐదయింది. అంటే బయలుదేరిన ముప్పైఏడు గంటల తరువాత నాలుగు కార్లు, రెండు ఫ్లైట్స్ మారి ఇల్లు చేరాం. అప్పటినుండి ఒక వారం పాటు నేనూ మా అమ్మాయి చెరో గదిలో స్వయం నిర్భంధంలో ఉన్నాం.

మేము ఇల్లు చేరడానికి సహాయం చేసిన మా తోడికోడలికి, చెన్నైలోని మా ఫ్రెండ్ కు,  మా తమ్ముడికీ, మమ్మల్ని పికప్ చేసుకున్న వారికి కూడా  వైరస్ సోకే ప్రమాదం ఉన్నా మనస్పూర్తిగా మా తమ్ముడ్ని పంపిన మా మరదలికీ, ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈ ఐదు నెలలు మా వారిని, పండును తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్న అమెరికా స్నేహితులకూ ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అనుకున్నదానికంటే ఎంతో ముందు ఖాళీ చేస్తున్నా, ఖాళీ చేసే నెల వరకే  అద్దె ఇవ్వమన్నారు నెల్లూరులోని మా ఇంటి ఓనర్. అలా కాదని చెప్పినా వినక మీరు క్షేమంగా వెళ్ళడం ముఖ్యం ఇవన్నీ తరువాత అన్న మా ఇంటి ఓనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం అంతా డబ్బు మయం అని అంటుంటారు కాదా! అలా కాదని నిరూపించారు ఆవిడ. వైరస్ భయంతో ఎవ్వరూ ఇల్లు కదలని సమయంలో కూడా ఫ్లైట్ అటెండెంట్స్, కెప్టన్స్, ఇంకా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అంతా వారి కుటుంబాలను వదిలి ప్రమాదం ఉండవచ్చని తెలిసినా పనిచేస్తున్నారు. వారందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఎవరండీ రోజులు మారిపోయాయి, అప్పటి రోజులు, అప్పటి అనుబంధాలు ఇప్పుడేవీ అనే పెద్ద మనుషులు? ఇవన్నీ అనుబంధాలు కావూ! చూసే దృష్టే ఉండాలి కానీ, రోజులన్నీ ఒక్కటే. మేము నెల్లూరి నుండీ బయలు దేరిన దగ్గరనుండి ఎన్నో వాట్స్ ఆప్ మెసేజస్, ఫోన్ కాల్స్. ఎలా ఉన్నారు? గమ్యం చేరారా? అంటూ యోగక్షేమాలు అడిగిన అందరికీ వందనాలు.

ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే మీరు ఈ సమయంలో ఇండియా నుండి అమెరికాకు ఎలా వచ్చారు? ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయని, చాలా దేశాలు బార్డర్స్ క్లోజ్ చేశారని  విన్నామే, ఏ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి? ప్రయాణంలో ఏమీ ఇబ్బంది ఎదురవలేదా?  ఇలా గత ఐదు రోజులుగా వాట్స్ అప్ లోనూ ఫోన్ కాల్స్ లోనూ కుశలం అడిగిన మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ఈ టపా. 

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1

ఏ దేశమైన చూడాలి, అక్కడి జీవనసరళి తెలుసుకోవాలంటే కనీసం ఓ రెండు నెలలైనా ఆ దేశంలో ఉండాలని నా అభిప్రాయం. ఆ కోరిక నాకు ఇండియాలో తీరింది. అదేమిటి నువ్వు ఇండియన్ వేగా వేరుగా దేశం చూడడమేమిటి అనుకోకండి. నేను ఇండియన్ ని అయినా అమెరికాకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది. ప్రతి రెండేళ్ళకూ, లేదా ఇంకా తక్కువ వ్యవధిలోనో ఇండియా వెళ్తూ ఉన్నా నేను అక్కడ అతిథినే. చుట్టాలనూ, స్నేహితులనూ కలవడం అన్నీ అమర్చిపెడుతుంటే ఖుషీగా తిరుగుతూ అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని రావడం ఇలా అన్నమాట. అది ఇండియాలో ఉండడం ఎలా అవుతుంది?

ఈసారి ఆ కోరిక తీర్చుకోవడానికీ, మెడిసిన్ పూర్తి చేయబోతున్న మా అమ్మాయి దగ్గర ఉండడానికి రెండువేల పంతొమ్మిది అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. ఆరునెలలు అక్కడే ఉండి ఏప్రిల్ పదహారున తిరిగి అమెరికా వచ్చేట్లుగా అనుకున్నాము. నెల్లూరులో ఇల్లు  అద్దెకు తీసుకుని పాలు, నీళ్ళు, పేపర్ అన్నీ సమకూర్చుకుని, అక్కడి వాతావరణానికి, జీవనానికి అలవాటు పడుతూ, ఆస్వాదిస్తూ వున్నాను. ఫిబ్రవరి చివరి వరకూ అలాగే గడిచింది.  

అప్పటికే కరోనా గురించి అక్కడెక్కడో చైనాలో అలా ఉందీ, ఇటలీలో ఇలా ఉందీ అని వార్తలు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఒకరోజు హైదరాబాద్ లో కరోనా అని పేపర్లో చదివి "మన దేశానికి  కూడా వచ్చిందీ ఇది" అనుకున్నాను. ఆ వైరస్ సోకినతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందనీ, వాళ్ళందరినీ క్వారంటైన్ లో ఉంచారనీ తెలిశాక కొద్దిగా కంగారు మొదలైంది. 

టికెట్ ప్రీ పోన్ చేసికుని మార్చ్ నెలాఖరకే అమెరికాకు వచ్చేస్తే మంచిదేమో అన్నాను శ్రీవారితో. దానికి మా అమ్మాయి ప్రమాదమేమీ లేదంటూ ఆ వైరస్ గురించి వివరించింది. చైనాలో  మొదలైనప్పుడు అప్పటికి ఆ వైరస్ గురించి తెలియక అది  ఎక్కువగా వ్యాపించిందనీ, అందువలన వైరస్ లోడ్ ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించిందనీ చెప్పింది. మరే ఇతర దేశాలలో అంత ప్రమాదమేమి లేదని, పైగా అది మామూలు ఫ్లూ లాంటిదే ఆరోగ్యవంతులకు ప్రాణభయమేమి లేదని చెప్పింది. వైరస్ లోడ్ అంటే ఏమిటని అడిగాను. "వైరస్ లోడ్ అంటే మన అపార్ట్ మెంటే తీసుకో దాదాపుగా వందమంది ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నలుగురికి వస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అదే ఎనభై మందికి వచ్చిందనుకో వైరస్ అన్నిచోట్లా వ్యాపించి అది శరీరంలోకి ఎక్కువ కణాలుగా ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి సరిపోక అనారోగ్యం ఎక్కువవుతుంది. అప్పుడు వయసు, ఆరోగ్యస్థితితో సంబంధం లేకుండా ప్రాణహాని ఉంటుంది. దానికి పరిష్కారం జాగ్రత్తలు పాటించడమే. ప్రతి గంటకూ, బయటకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి" అని వివరించింది. 

మా సంభాషణ జరిగిన వారానికి అంటే మార్చ్ పదకొండున ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేస్ రిజిస్టర్ అయింది, అదీ నెల్లూరులోనే. ఆ వ్యక్తి ఇటలీ నుండి వచ్చి ఓ వారం చిన్న బజారులోనే ఉన్నాడని  తెలిశాక మొదలైంది అసలు కంగారు. నాకే కాదు నెల్లూరు వాసులందరికీనూ. ఎందుకంటే చిన్న బజార్ నెల్లూరులోని ప్రధాన వ్యాపార కేంద్రం. అక్కడ చిన్న, పెద్ద దుకాణాలు, ఇళ్ళు అన్నీ కిక్కిరిసి ఉంటాయి. అయితే అతని కుటుంబసభ్యులు ఎవరికీ ఈ వైరస్ వ్యాపించలేదనే సరికి కొద్దిగా కంగారూ తగ్గింది. 

అప్పటికే అమెరికాలో స్కూళ్ళు, యూనివర్సిటీలకు ఏప్రిల్ లో ఇవ్వవలసిన  స్ప్రింగ్ బ్రేక్ ముందుగా ఇచ్చేశారు. మేము నడుపుతున్న పాఠశాలకు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసికుని తరగతులను రద్దు చేసి తల్లిదండ్రులే పిల్లలకు పాఠాలు చెప్పేట్లుగానూ, ఈ ఏడాది వార్షికోత్సవం రద్దు చేసేట్లుగానూ నిర్ణయం తీసుకున్నాం. మరో వారం గడిచాక అమెరికన్ గవర్నమెంట్, విద్యార్ధులు ఎవరూ స్కూళ్ళ కు, యూనివర్సిటీలకూ రానక్కర్లేదనీ ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్పారు. యూనివర్సిటీ నుండి స్ప్రింగ్ బ్రేక్ కి ఇంటికి వచ్చిన బుజ్జి పండు మరి తిరిగి వెళ్ళలేదు.  

మార్చ్ రెండవ వారానికి వచ్చేసరికి నెల్లూరులో మరో కేసు రిజిస్టర్ అయింది. ఈసారి కూడా ఇటలీ నుండి వచ్చిన వారికే వచ్చింది.  ఇండియా నుండి ఇటలీ వెళ్ళిన విద్యార్థులు అందరూ తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజలకు ఈ వైరస్ పట్ల స్పృహ కలిగించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ లో ఖళ్ ఖళ్ మని దగ్గు, ఆ తరువాత ఓ అరనిముషం పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తున్నారు. టీవీలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. 

ప్రజలకు దీని సీరియస్ నెస్ బాగానే అర్ధం అయింది. రోడ్డు మీద వెళ్ళేవారు, కూరలమ్మే వాళ్ళూ, ఆటో వాళ్ళూ మాస్కులు వేసికుని జాగ్రత్తలు చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో అందరికీ  గొప్ప అవేర్ నెస్ వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా వెంటనే మెడికల్ ఆఫీసర్లకూ, హాస్పిటల్ కూ ఫోన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం, పైగా ప్రాణ భయం ఏమీ లేదన్న ధీమా ఉండేది. అప్పటికి బయట దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది. భారత దేశంలో పెద్దగా ఈ వ్యాధి వ్యాపించలేదు. బహుశ అక్కడి వేడి వాతావరణం కారణం కావచ్చు. లేదా ప్రజల ఇమ్యూనిటీ కావచ్చు. ఒకవేళ ఎక్కువమంది పేషంట్స్ వచ్చినా వైద్య సదుపాయం అందించడానికి వీలుగా గవర్నెమెంట్ మరియు ప్రయివేట్ హాస్పిటల్స్ అదనపు వార్డులు ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలిసింది. 

మార్చ్ పదిహేడువ తేదీ నుండి షిర్డీలోనూ, ఇరవైయ్యొవ తేదీ నుండి తిరుపతిలోనూ దర్శనాలు ఆపేశారు. మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇండియా నుండి ఇతరదేశాలకు విమానప్రయాణాల రాకపోకలు రద్దు అనే వార్త భారతదేశం ప్రకటించింది. ఆ వార్తలు విన్నాక  నాకు మళ్ళీ కలవరం మొదలయ్యింది. ఒకవేళ ఏప్రిల్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగా అని. అప్పటికే అమెరికాలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ పండు, వాళ్ళ నాన్న ఇద్దరే ఉన్నారు. మామూలుగా అయితే ఫ్రెండ్స్ రావడం, పోవడం ఏమి అవసరమైనా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉండేది. రాకపోకలు నిలిచిపోవడంతో వాళ్ళ గురించి నాకు కంగారుగా ఉండేది. 

అప్పుడు మా అమ్మాయి, "అమ్మా, నాన్న గురించి నువ్వు టెన్షన్ పడుతూ ఇక్కడ ఉండడం కంటే నువ్వెళ్ళు నేను తరువాత వస్తాను" అన్నది. దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నువ్వొక్క దానివే ఎలా ఉంటావు? ఇప్పటికిప్పుడు బయలుదేరవలసిన అవసరం లేదు నేనూ పండూ జాగ్రత్తగానే ఉన్నాం. ఒకటి రెండు వారాలు ఇలాగే ఉంటుంది తరువాత అంతా సర్దుకుంటుంది. ఏప్రిల్ పదహారు నాటికి అంతా మామూలయిపోతుంది. మీ ప్రయాణానికేమీ  ఇబ్బంది ఉండదు, అప్పుడు ఇద్దరూ కలిసే రండి అన్నారు. ఈ చర్చలన్నీ మార్చ్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగాయి.  

అదే రోజు రాత్రి రెండు గంటలకు శ్రీవారి నుండి ఫోన్, ఒక లింక్ పంపించాను చదువు అంటూ. లింక్  ఓపెన్ చేస్తే, అమెరికా ట్రావల్ 4 అడ్వైజరీ అంటూ ఓ వార్త  కనిపించింది. దాని సారాంశం ఏమిటంటే అమెరికా పౌరులు ఏ దేశాలలో ఉన్నా తిరిగి అమెరికా రావలసిందనిన్నూ రాని పక్షంలో ఆయా దేశాలల్లో అనిర్నీత కాలం ఉండేట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసింది అనిన్నూ. ఆ వార్త పూర్తిగా చదివే లోపలే "టికెట్ దొరికింది రేపు రాత్రికే మీ ప్రయాణం, ఐటనరీ ఇప్పుడే మెయిల్ పంపించాను" అన్నారు. మరీ మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అన్నాను. "లేదు, ఇప్పటికే అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయి. మన అదృష్టం కొద్దీ ఎమిరేట్స్ ఒక్కటే ఉంది. ట్రావెల్ ఫోర్ అడ్వైజ్ ఇచ్చారంటే అమెరికా కూడా త్వరలో లాక్ డౌన్ ప్రకటిస్తుంది. అప్పుడిక అమెరికా నుండి ఇతర దేశాలకు  రాకపోకలు నిలిచిపోవచ్చు. ఏప్రిల్ కి కూడా ఈ పరిస్థితిలో మార్పు లేకపోవచ్చు. నీవు ఊహించినదే నిజమయ్యేలా ఉంది" అన్నారు. 

శుక్రవారం వేకువ ఝామున టికెట్ బుక్ చేశారు, ఫ్లయిట్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిముషాలకు. అంటే మాకు మానసికంగా సంసిద్దమవడానికి, కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే వ్యవధి ఉంది. పాపకు హౌసీ పూర్తవడానికి ఇంకా వారం ఉంది. పైగా డిసెంబర్ లో తనకు డెంగ్యూ రావడంతో మరో వారం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా అత్యవరసరమైన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ ఇప్పుడు కనుక ఇండియాలోనే ఉండిపోతే మళ్ళీ ఆమెరికాకు ఎప్పటికి వెళ్ళగలమో తెలియని పరిస్థితి. టైలర్ల దగ్గర, లాండ్రీలో బట్టలు ఉన్నాయి. పాల వాళ్ళకు, పని మనిషికి, పేపర్ అతనికీ చెప్పాలి. ఇంటి ఓనర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్లకు ఈ విషయం చెప్పి వీడ్కోలు తీసుకోవాలి.  తెల్లవారేదాకా నిద్రలేకుండా ఇలా రకరకాల ఆలోచనలు.

మిగిలిన వివరాలు ఇక్కడ ...


Sunday, March 31, 2019

జమేకా - అనుభవాలు - ఆలోచనలు

      కొన్నిసార్లు ఏవి ఎందుకు జరుగుతాయో అస్సలు ఊహించలేం. అలాంటిదే బ్లూమౌంటైన్ సైకిల్ ప్రహసనం. ఉపోద్ఘాతం ఇలా మొదలెట్టానని ఆ పెద్ద పర్వాతం మీద నుండి కిందకు పడిపోయాననో, ఏ కాలో చెయ్యో విరిగిందో లాంటి వయొలెంట్ ఆలోచనల జోలికి పోకండి. అంతా సవ్యంగానే జరిగింది. సరే విషయానికి వద్దాం.

      సైకిల్ తొక్కాలని బ్లూ మౌంటెన్ మీదకు వెళ్ళి "బాబోయ్ ఈ బైక్ రైడ్ నా వల్ల కాదు నన్ను వాన్ లోనే వెనక్కి తీసుకుపొండి" అనగానే కాలిన్ "డోంట్ వర్రీ మామ్ ఐ విల్ టేక్ యు డౌన్ దేర్" అంటూ టాండన్ బైక్ తీసుకుని వచ్చాడు. "ఆర్ యు షూర్?"అడిగాను. "ఎస్ ఐ యాం. ఆల్ యు హావ్ టు డూ ఈజ్ పుట్ యువర్ ఫీట్ ఆన్ పెడలల్స్". అన్నాడు. అలా మొదలైంది ప్రయాణం అయితే విశేషం ఏమిటంటే కాలిన్ టూర్ గైడ్. పై నుండి కిందకు రావాడానికి సుమారుగా రెండు గంటలు పట్టింది. అంత సేపూ జమేకా విశేషాలు, జీవన విధానం, చెట్లు, వ్యవసాయం... ఇలా ఎన్నో కబుర్లు చెపుతూ వచ్చాడు. నా సైకిల్ నేను తొక్కుతూ వస్తే ఇంత గొప్ప అవకాశం జారిపోయి ఉండేది కదా! అదన్నమాట సంగతి. అతని ద్వారా ఏం తెలుసుకున్నానో తరువాత చెప్తాను.

         ఇలాంటి మరో వ్యక్తిని కలవడం కూడా గమ్మత్తుగా జరిగింది. వారం రోజులు గిర్రున తిరిగి ఊరికి ప్రయాణమయ్యే వచ్చే రోజొచ్చింది. ఉదయం ఐదు గంటలకే రిసార్ట్ నుండి బయలుదేరాలి. నిద్ర కళ్ళతో అబ్బా అనుకుంటూ వేన్ ఎక్కాం. ఎక్కగానే కబుర్లు మొదలుపెట్టాడు శర్మ. అదేనండి వేన్ డ్రైవర్. అక్కడి జీవన విధానం, తన జీవితం గురించి దారంతా చెప్తూనే ఉన్నాడు.

         ఇక షార్టీ, ఆవిడ అసలు పేరేమిటో గానీ తన పేరు షార్టీ అనే చెప్తారు. అంత చలాకీ మనిషిని ఇంతవరకూ చూడలేదు. ఆవిడ ఉన్నదంటే ఆ చుట్టూ ఉత్సాహం ధూపం వేసినట్లు ఆవరించేస్తుంది. మరో వ్యక్తి చార్లీ ది గ్రేట్, కొనుకో ఫాల్స్ గైడ్. అతని పేరు అలాగే గుర్తు పెట్టుకోమన్నాడు. నాలుగేళ్ళప్పుడు మా పండును పెద్దయ్యాక ఏమౌతావు అంటే బర్డ్ అవుతా, అక్కవుతా, టీచర్ అవుతా అంటూ చెప్పేవాడు. నాకు మాత్రం టూర్ కి వెళ్ళొచ్చిన ప్రతిసారి టూర్ గైడ్ అయిపోదామనిపిస్తుంది.

        ఇదంతా సరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నదేంటనే గా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా, ఏవి ఎవరు చెప్పారో అడక్కండి. అవి వాళ్ళ సొంత విషయాలు. అందరు చెప్పినవీ కలిపి మీతో చెప్తున్నా. Yeah mon. జమైకాలో దిగిన దగ్గరనుండి ఇదే వింటారు :).

భాష: జమేకా వాసులు మాటలతో కాలయాపన చేసే మనషులు కాదు. నిజమండీ వాళ్ళ భాష గురించి తెలుసుకుంటే నా మాటలో నిజం ఎంతో తెలుస్తుంది. పదాలు సాగదీసి వాక్యాలు పొడవుగా మాట్లాడారట. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

వెయాసె(Weh yuh ah seh) what are you saying
మిసుకం(Mi Soon Come ) I Will Be Right Back
సెలెఫ్(Sell off) Excellent
వెయసే (Whe yu a seh?) What’s up?
లిక్లిమొ (Likkle more) See you later
ఒవడ(Ova deh) Over there

నేను చెప్పింది నిజమే కదూ! వాళ్ళు మాట్లాడే భాష పాట్వా, స్కాటిష్, ఐరిష్, స్పానిష్, ఇంగ్లీష్, ఆఫ్రికన్ భాషలు కలిపేసి వాళ్ళ సొంత భాష తయారుచేసుకున్నారట. పట్వా భాషకు లిపి కూడా ఉందట. కానీ స్కూల్లో పాఠాలు మాత్రం ఇంగ్లీషులోనే ఉంటాయట. గైడ్స్ అందరూ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రెగే మ్యూజిక్ ఇక్కడే పుట్టింది.

ఆహార్యవ్యవహారాలు: జమేకా పండు అకీ. దీనిని పండుగానే తినాలి. కాయ తింటే మనం హాస్పిటల్ కు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మాత్రమె తయారుచేసే అకీ అండ్ సాల్ట్ ఫిష్, జర్క్ చికెన్ దాదాపుగా రోజూ రిసార్ట్ లో పెడుతూనే ఉన్నారు. అలాగే రాస్తా పాస్తా కూడా. పెన్నే పాస్తా, స్పైరల్ పస్తా ఇవన్నీ విన్నాం కానీ ఈ రాస్తా పాస్తా ఇక్కడే వినండి. ఇది తెలియాలంటే రాస్తాఫారియా మూమెంట్ గురించి తెలుసుకోవాలి. రెగే మ్యూజిక్, రాస్తాఫారియాకు గొప్ప సంబంధం ఉంది. అది మరోసారి చెప్పుకుందాం.

పనస, సపోటా, జామ, మామిడి, కొబ్బరి, అనాస, సీతాఫలం, సారసోపియా, సారపిల్లా ఇలాంటి పండ్లు, కాకర, గోంగూర, గుమ్మడి లాంటి కూరలు దొరుకుతాయి. కాకరకాయ తిని డ్రగ్ టెస్ట్ కి వెళితే మేర్వానా శాతం తెలియదట. రక్తాన్ని అంతగా సుద్ది చేస్తుందట. సోరసోపియా వేర్లను మరగించి కొన్ని నెలల పాటు తీసుకుంటే కాన్సర్ కూడా తగ్గుతుంది.

బంధుత్వాలు: వాళ్ళ మాటలలో బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అర్ధమైంది. మొత్తం రాయలేను కాని ఒకటి, రెండు ఉదాహరణలు చెప్తాను. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు... చివరకు అమ్మా నాన్నలు కూడా విదేశాలకు వెళ్ళిపోయినా వాళ్ళు ఏడాదికి ఒక్కసారైనా ఈ దేశానికి తిరిగి రావాలంటే ఇక్కడ ఇల్లొకటి ఉండాలని ఇంకా ఆ ఇంటినే అంటి పెట్టుకుని ఉన్న అన్నని ఏమందాం. "నాకొచ్చేది నాకు, నా భార్యకు, ఇద్దరు పిల్లలకు సరిపోతుంది. కొద్దో గొప్పో వ్యవసాయం కూడా చేసుకుంటున్నాను. పిల్లలు కాస్త పెద్దైతే నా భార్య కూడా పనో/ఉద్యోగమో వెతుక్కుంటుంది. ఇంతకుమించి మాకేం కావాలి. ఐ యాం ఎ కంటెంటెడ్ మాన్ అని చెప్పిన వాళ్ళు మనకు జీవితాంతం గుర్తుండి పోరూ?

చెల్లెలు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఏడు నెలలు ఇక్కడే ఉంటే ఆమె కొడుకును తన ఇంట్లోనే ఉంచుకుని చూసుకుంటున్న అన్నను చూసి ముచ్చటేసింది. అంతకు ముందే ఆవిడ డైవర్స్ తీసుకున్నారని మాటల్లో తెలిసింది. పైగా అమెరికాలో చదువుతున్న తన కూతురి మంచి చెడ్డలు మా చెల్లెలే చూస్తుందని మాటల్లో భరోసా కూడా నచ్చేసింది. అట్లాగే అక్కయ్య బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నా రెండు కుంటుంబాల ఆదాయంలో చాలా తేడా అది వారు కలసిమెలసి ఉండడంలో మరుగున పడిపోయింది. మాటల్లో గొప్ప నిశ్చింత కనిపించింది.

నివాసం: ఇక్కడ ఇల్లు ఏర్పచుకోవడం అంటే వారికి చాలా కష్టమైన పనే అట. ముందు ఒకటో రెండో గదులున్న చిన్న ఇల్లు కట్టుకుని సంపాదన పెరిగే కొద్దీ పెంచుకుంటూ పోతారట. దానికోసం వారు చాలా కష్టపడతారని తెలిసింది. అంతేకాని అక్కడ ఇంటిని ఎవరూ అమ్మరట. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అస్సలు సరిపోదట అందువల్ల వారు రిటైర్ అయ్యేనాటికి ఓ నాలుగు గదులు కట్టుకుని ఆ అద్దె డబ్బులతో కాలక్షేపం చేస్తారట. ఇంటి పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారట.

సామాజిక పరిస్థితులు: జాత్యాహకారం మచ్చుకైనా ఉండవట. ఆశ్చర్యంగా ఉంది కదూ! అందుకు కారణం వివిధ దేశాల వారిని అక్కడకు బలవంతంగా తీసుకురాబడడంతో అందరి బాధ ఒక్కటే బానిసత్వం. దాంతో వారందరూ కలసిపోయి అనుబంధాలు పెంచుకుని పెళ్ళి చేసుకోవడం కారణం కావచ్చు. వారికి దేశం, మతం అడ్డురాలేదు. ఒకే ఇంట్లో చైనా దేశపు అమ్మమ్మ ఆఫ్రికా దేశపు బాబాయి కెనడా దేశపు అత్తమ్మ ఉంటే ఎవరిని చిన్నచూపు చూస్తారు? ఈ విధంగా ఆ దేశంలో ఆ సమస్యే లేదు. ఆలోచించాల్సిన విషయమే కదూ!

వివాహ వ్యవస్థ: అక్కడ మనలాగా ఇదిగో "అబ్బాయ్ నీకు పెళ్ళీడొచ్చింది, ఫలానా వాళ్ళమ్మాయిని చేసుకో" అనరట. ఎవరి భాగస్వామిని వాళ్ళు వెతుక్కోవలసినదే. చదువో, సంపాదనో, చతుర్యమో, మరోటో మరోటో సంపాదించుకుని మనసును దోచుకోవలసిందే. వారికి పెళ్ళిళ్ళు కూడా ముఖ్యం కావట. కలిసి ఉండడమే ప్రధానం. వారికి పిల్లలు కూడా ఉంటారు. ఏ కారణం చాతైనా విడిపోతే పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చు తండ్రే భరించాలని అక్కడి న్యాయవ్యవస్థ చెబుతోంది. పెళ్ళితో దానికి సంబంధం లేదు.

పిల్లల పెంపకం: ఎంత కష్టమైనా పడి పిల్లలకు మంచి విద్య అందించాలని చూస్తారని తెలిసింది. మాతో మాట్లాడిన గైడ్ పిల్లలు ఉన్నత విద్యలో ఉన్నారు. ఒక వయసు వచ్చాక పిల్లలు వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోవసినదే. అనుకోని పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కుంటారే తాప్ప ఎవరు సహాయ పడతారా అని చూడరట. దాంతో అక్కడ ఒకరిపై ఆధారపడడం ఆశించటం లేదని అర్ధమైంది. అక్కడ పెద్దవాళ్ళకులకు ఆస్థి పాస్తులు సంపాదించి పిల్లలకు ఇవ్వవలసిన అవసరం అగత్యం లేదు. బ్లూ మౌంటెన్ నుండి కింగ్స్టన్ మీదుగా వస్తూ ఉంటే ఆ సాయంత్రం యూనిఫాం వేసుకుని ముచ్చటగా పిల్లలు రావడం చాలా దగ్గర్ల కనిపించింది. మెల్ ఇగో గురించి అడిడితే గైడ్ ఒక్క నవ్వు నవ్వి జమైకన్ లేడీస్ చాలా స్ట్రాంగ్ అన్నాడు. వాళ్ళు మమ్మల్ని తన్నక పోతే చాలు అని ఆ నవ్వుకు అర్ధం. తన కూతురికి తనే ఫైట్ చెయ్యడం నేర్పించాడట. మనం వార్తలలో చూస్తె అక్కడి పరిస్థితి భిన్నంగా కనిపింస్తుంది. బహుశా ప్రాంతాన్ని బట్టి అయిఉండవచ్చు.

అసలు ప్రశ్న కొంచెం సందేహిస్తూనే అడిగాను. ఒకప్పుడు ఈ స్పెయిన, ఇంగ్లండ్ వారి కారణంగా దారుణమైన కష్టాలు పడ్డారు కదా మరి ఆ దేశాల నుండి టూరిస్ట్ లు వచ్చినప్ప్పుడు మీకేమనిపిస్తుంది?అని. అప్పటి వారు వేరు, వీళ్ళు వేరు అలాగే మేము కూడా. అప్పుడు వారేదో చేశారని వీరి మీద మాకు కోపం ఎందుకుంటుంది? పైగా వాళ్ళు కూడా ఎంతో కొంత దేశాభివృద్ది చేశారు కదూ అని చెప్పాడు. బానిసత్వపు శృంఖలాలు తెంచుకోవాలని ప్రేరేపించిన నేతలు ఏం చెప్పి మానసిక సంకెళ్ళు కూడా విడగొట్టగలిగారు. ఏ మతం వారికీ క్షమా గుణాన్ని నేర్పి ఉంటుంది?

విందు - వినోదం: అక్కడ వారెవరెవ్వరూ శుక్రవారం సాయంత్రం ఇంట్లో భోజనాలవీ చేయారట. అన్నీ బయటే. వారాంతం బీచ్ కి వెళ్ళడం రమ్ తాగడం వారికి పెద్ద వినోదం. జర్క్ చికెన్ లేదా అప్పుడే పట్టుకున్న చేపలు, ఎక్కువగా మేక మాంసం కూడా తింటారట. పైగా చెప్తున్నారు. మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోకపోతే పిల్లల్నేం చూసుకుంటాం. త్యాగాలకీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి ఆస్కారం లేకుండా ఈ పద్దతేదో బావున్నట్లుంది కదూ!

పాలనా వ్యవస్థ: రాజకీయ నాయకుల గురించి అడిగితే కిసుక్కున నవ్వారు. దానర్ధం నేను చెప్పక్కర్లేదనుకుంటాను. ఇక అమెరికాలో లాగే అక్కడ కూడా రోడ్డు మీద స్పీడ్ గా వెళితే టికెట్ ఇస్తారట. అయితే పోలిస్ పట్టుకున్న వెంటనే "లెఫ్ట్ ఆర్ రైట్" అని అడుగుతారట. అంటే ఏమిటని అడిగిన దానికి అతని సమాధానం విని ఇద్దరం పక్కుమని నవ్వాం. అది నేను ఇక్కడ చెప్పడం లేదు. కావాలంటే మీరే జమైకాలో తెలిసినవాళ్ళుంటే అడిగి తెలుసుకోవలసిందే.

జమేకా నుండి విదేశాలకు వెళ్ళిన వాళ్ళలో 98 శాతం మంది రిటైర్డ్ లైఫ్ కోసం తిరిగి జమేకాకే వస్తారట. మా దేశం గొప్పది అని వారు చెప్తారో లేదో కాని ఒక దేశం గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే ఇంతకు మించిన ఉదాహరణ అఖ్ఖర్లేదు కదూ!

ఇక మనం వింటున్న విషయాలకు ఇక్కడ రాసిన విషయాలకు మీకు భేదం కనిపించి ఉండొచ్చు. అక్కడ భద్రత విషయంలో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అక్కడ మనం వింటున్న నేరాలు ఎక్కువ శాతం గాంగ్ ల మధ్య డ్రగ్స్ గురించి జరిగే యుద్ధాలు. మీకో విషయం తెలుసా జమేకాకు గంజాయిని తీసుకువెళ్ళింది భారత దేశీయులేనట. మనం వీధులలో వెళ్తున్నప్పుడు గాజులో, రిబ్బన్లో కొనమని చిన్నప్పుడు వెంటపడేవారు కదూ అలా గంజాయి కొనమని రహస్యంగా వెంట పడుతూ ఉంటారు. టూరిస్ట్ ల జోలికి ఎవరూ వెళ్ళరట. ఎందువలనంటే ఆ దేశానికి ఆదాయం ప్రధానంగా టూరిజం వలన వస్తుంది కాబట్టి.

భద్రత గురించి తెలుసుకోవాలంటే ఈ కింద లింక్ లో కామెంట్ లు చదవండి. వార్తలకు, నిజాలకు తేడా తెలుస్తుంది.

https://www.worldnomads.com/travel-safety/caribbean/jamaica/crime-in-jamaica-what-to-watch-for








Thursday, March 28, 2019

Jamaica - Attractions

కాన్ కూన్ మొన్న మొన్న వెళ్ళినట్లుగా ఉంది అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ పిల్లలిద్దరితో బయటకు వెళ్ళే అవకాశం ఇప్పుడొచ్చింది.
"శనివారం ఉదయం బయలుదేరితే మళ్ళీ వచ్చే శనివారం సాయంత్రానికల్లా ఇంటి కొచ్చెయ్యొచ్చు. ఏమంటావ్?" అంటూ అడిగారు.
"బానే ఉంటుంది. ఓ వారం పిల్లలిద్దరితో సరదాగా గడపొచ్చు." చెప్పాను.
"సరే అయితే జమైకా వెళ్దాం. ఆ మూన్ పాలస్ వాళ్ళు నెలకోసారి ఫోన్ చేసి ఎంతో ఇదిగా
వాళ్ళ  రిసార్ట్ కే రావాలని అడుగుతున్నారు. పాపం వాళ్ళను డిజప్పాయింట్ చేయడం ఎందుకు
అక్కడే ఉందాం." అంటూ ప్రయాణానికి ఏర్పాట్లు మొదలెట్టారు. సరే ఓ వారం ఉంటున్నాం కదా అక్కడ చూడాల్సినవి, చేయాల్సినవి ఏమున్నాయో ననుకుంటూ Things to do in Jamica అని గూగుల్ చెయ్యగానే ఓ చిన్న సైజ్ లిస్ట్ వచ్చింది. Dunn falls, Rose Hall Great House, Dolphin cove, Bob Marley Meusium ... ఇలాక్కాదులే రిసార్ట్ కి వెళ్తే వాళ్ళే చెప్తారు అనుకుంటూ శనివారం తెల్లవారు ఝామున రాలీలో ఫ్లైట్ ఎక్కాం. రెండున్నర గంటల
ప్రయాణం. ఫ్లైట్ దిగి రిసార్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాన్ లో ఓ గంటన్నర ప్రయాణం తరువాత నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాం. ఎదురొచ్చి పువ్విచ్చి నవ్వు మొహంతో పలకరించి "రండి రండి ముందు భోజనం అదీ చెయ్యండి మిగతా విషయాలు తరువాత మాట్లాడుకోవచ్చు" అంటూ మర్యాద చేశారు.  భోజనం అదీ పూర్తి చేసి ఆ పూట రిసార్ట్ అంతా తిరిగి చూశాం. ఈ రిసార్ట్ కాన్ కూన్ లో ఉన్నంత పెద్దది కాదు కాని బావుంది.

మరుసటి రోజు అక్కడ చూడవలసినవి ఏమిటా అని వాకబు చేస్తే Blue Mountains, Dunn Falls, Konoko Falls బావుంటాయని తెలిసింది. పిల్లలు horse riding, snorkeling చేద్దామని సరదా పడ్డారు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రణాళిక వేసుకుని ఎక్స్కర్షన్ ప్లానర్స్ దగ్గరకు వెళ్ళాం.  టూర్స్ మీరు కోరుకున్నట్లువే బుక్ చేశాం. మీరు మాత్రం ఉదయాన్నే ఆమ్లెట్ అదీ వేయించుకుని, జ్యూస్ గట్రా తాగేసి ఖచ్చితంగా ఎనిమిది గంటలకల్లా  వచ్చేయాలి లేకపోతే బస్ వెళ్ళిపోతుంది అంటూ బెదిరించారు. అలా చెప్పకపోతే పిల్లలు సమయానికి రారని వాళ్ళకు ఎట్లా తెలిసిందో మరి.

శానాదివారాలు విశ్రాంతిగా గడిపేశాక సోమవారం
బ్లూ మౌంటైన్స్ కి వెళ్ళాం. అన్నట్లు చెప్పనే లేదు కదూ బ్లూ మౌంటైన్స్ రిసార్ట్ నుండి ఓ రెండు గంటల ప్రయాణం. వెళ్ళగానే బ్లూ మౌంటైన్ కాఫీ ఇచ్చారు. వాన్ లో పైకి తీసుకువెళ్ళి కిందకు దిగడానికి సైకిిళ్ళిచ్చారు. సైకిల్ తొక్కుతూ సగం దూరం దిగాక భోజనం పెట్టారు. జర్క్ చికెన్, స్పానిష్ రైస్, స్తీమ్డ్ వెజిటబుల్స్. ఓపదేళ్ళ క్రితం వెళ్ళినా ఈ భోజనమే పెట్టుండేవాళ్ళు. జమైకా వాళ్ళకు మరేం వంటలు రావనుకునేరు. జర్క్ చికెన్ జమైకాలో ప్రత్యేకమైన వంటకం. అతిధులు వచ్చినప్పుడు అదే పెడతారు మరి.

మంగళ వారం డన్ ఫాల్స్ కి వెళ్ళాం. మంగళ వారమే ఎందుకు వెళ్ళామంటే ముహూర్తం బావుందని కాదు. ఆ రోజైతే క్రూజ్ షిప్స్ రావట. అందువల్ల కొంచెం రష్ తక్కువగా ఉంటుందట.
https://en.wikipedia.org/wiki/Dunn%27s_River_Falls

ఏ కొండమీద నుండో చెంగుచెంగున కిందకు దూకే జలపాతాన్ని చూస్తూ ఉంటే ఉత్సాహం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది కదూ! ఉదృతంగా హోరున శబ్దం చేస్తూ అంత ఎత్తునుండి పడుతున్న నీళ్ళ కింద నిలబడి  తడిచి పోయే అనుభవం మహా గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి జలపాతాన్ని కిందనుండి పైకి ఎక్కాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకైతే ఊహకూడా రాలేదు. ఈ డన్ ఫాల్స్ ప్రత్యేకత అదే. వడివడిగా పడుతున్న నీళ్ళలో తడిచిపోతూ పైకి ఎక్కడం వింతైన అనుభవం. వడిగా పడుతున్న నీళ్ళ తాకిడి పడిపోకుండా ముందున్న వాళ్ళ చేయి పట్టుకుని  వెనకనున్న వాళ్ళు వస్తున్నారో లేదో చూసుకుంటూ వెళ్ళాం. ఎత్తైన చెట్ల నీడ ఉండడంతో అక్కడంతా చల్లగా ఉంది. టూర్ గైడ్స్ ఎక్కడ గుంటలున్నాయో ఎక్కడ అడుగు వెయ్యాలో చెప్తూ ఉంటారు. లేకపోయినా ఫరవాలేదు ఎక్కెయ్యగలం. వాటార్ షూస్ తప్పకుండా వేసుకోవాలి. మరీ ఖరీదయినవి అఖ్ఖర్లేదు వాల్మార్ట్ లో దొరికేవయినా సరిపోతాయి.

డన్ ఫాల్స్ చరిత్ర: Battle of Las Chorreras ఈ డన్ ఫాల్స్ దగ్గరే జరిగిందట. ఆ యుద్దంలో బ్రిటిష్ వాళ్ళు స్పెయిన్ ని ఓడించి జమైకాను సొంతం చేసుకున్నారట. ఈ యుద్దాన్ని Battle of Ocho Rios అని కూడా అంటారు. Ocho Rivers అంటే స్పానిష్ లో ఎనిమిది నదులు (eight rivers) అని అర్ధం.

డన్ ఫాల్స్ రిసార్ట్ కు చాలా దగ్గరలోనే ఉంది. పదిన్నరకు రిసార్ట్ నుండి బయలుదేరితే రెండు గంటలకల్లా తిరిగి వచ్చేశాం. ఒక్కటే అనిపించింది ఏమిటంటే టూర్ బుక్ చేసుకోవడం వలన అక్కడ ఎక్కువ సమయం గడపలేక పోయాం. అదే విడిగా టాక్సీ మాట్లాడుకుని వుంటే కాస్త స్తిమితంగా గడపగలిగే వాళ్ళం. ఖర్చు కూడా తక్కువ అయివుండేది.
Image result for snorkeling
https://anthonyskey.com/snorkeling/
బుధవారం స్నార్క్లింగ్. స్విమ్మింగ్ డ్రెస్సెస్, టవల్స్, సన్ టాన్ లోషన్స్, హాట్స్, వాటర్ షూస్ అన్నీ సర్దుకుని అట్టహాసంగా బయలుదేరాం. తీరా వెళ్ళి చూస్తే అది ఎక్కడో కాదు రిసార్ట్ కి ఓ చివరన ఉంది.  ఒక చిన్న పడవ ఎక్కించుకుని సముద్రంమధ్యలోకి  తీసుకువెళ్ళి అక్కడ దూకేయ్యమన్నారు. "బాబోయ్ ఈత రాదంటే మరేం ఫరవాలేదు ఇదుగో ఈ ట్యూబ్ పట్టుకుంటే చాలు మేం తీసుకెళ్ళి పోతాం" అంటూ ధైర్యం చెప్పారు. సముద్రం లోపల బుల్లి బుల్లి చాపలు, సీవీడ్, తోక పొడవుగా ఉండే stingray చాపలు కనిపించాయి. పిల్లలకు పాము కూడా కనిపించిందట. ముట్టుకుంటే ముడుచుకుపోయే సి అనిమోన్స్ కూడా చూశాం.

మాంచి ఎండలో తిరిగి వచ్చాం ఇక బార్ దగ్గర కూర్చుని బ్లడీ మారీ, స్ట్రా బెర్రీ డెకరే, మార్గరీటా,
పినా కోలాడా అలా రకరకాల డ్రింక్స్ తీసుకున్నాం. అన్నీ వర్జిన్ డ్రింక్స్ :). ఏ డ్రింక్స్ నచ్చుతాయో చూడాలంటే రిసార్ట్ మంచి ప్లేస్. ఒక విశేషం చెప్పనా. రిసార్ట్ లో ఇరవై నాలుగు గంటలూ ఆల్కహాల్ సర్వ్ చేస్తూనే ఉంటారు. డ్రింక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఒక్కరు కూడా తూలడం కానీ, అతిగా వ్యవహరించడం కానీ చూడం. అదేం విచిత్రమో మరి. అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు అందరూ బికినీల్లో తిరుగుతున్నా అక్కడున్న పురుషపుంగవులు ఒక్కళ్ళు కూడా వెధవ్వేషాలు వెయ్యరు. అప్పుడనిపిస్తుంది. అసభ్యత బట్టల్లో కాదు చూసే చూపుల్లో ఉంటుందని.

గురువారం ఉదయం గుర్రపు స్వారీకీ వెళ్ళాం. ఇక్కడ విశేషం ఏమిటంటే గుర్రాలు నీళ్ళలోకి కూడా తీసుకువెళతాయి. అవి అలా అలా చలాగ్గా నడుచుకుంటూ వెెళ్ళాయి. అలాకాక ఒక్కసారి పరుగందుకుంటేనా అని లోపల్లోపల కొంచం భయంగానే ఉండింది. వాటర్ షూస్ కావాలన్నారు కానీ. నీళ్ళ లోకి వెళ్ళేప్పుడు చెప్పులు తీసేసి వెళితే బావుంది. సముద్రం మధ్యలో ఉన్నాం. నీళ్ళు కాళ్ళని వెనక్కి తోసేస్తున్నాయి, ఈత రాదు. పోనీ చేతిలో ఉన్నా కళ్ళెమన్నా గట్టిగా పట్టుకుందామన్నా కుదరదు. అలా పట్టుకుంటే గుర్రం పరిగెడుతుందట. కాసేపలా అనిపించింది కానీ భయం పోయాక చాలా ఎంజాయ్ చేశాను. రిసార్ట్ కి ఓ అరగంట దూరంలోనే ఉంది ఫాం. టూర్ బుక్ చేసుకోకుండా టాక్సీ తీసుకుంటే బావుండేదనిపించింది. లేదా లోకల్ టూర్ గైడ్ కానీ.

మధ్యాహ్నం కొనొకో ఫాల్స్ కి వెళ్ళాం. ఇది కూడా రిసార్ట్ దగ్గరే ఉంది. ఎత్తైన కొండ మీద పెద్ద పార్క్, రకరకాల పక్షులతో చిన్న జూ, మరీ పెద్దది కాని జలపాతం, చిన్న మ్యూజియం. ఇవి అక్కడ ప్రత్యేకతలు. గైడ్ అక్కడ మొక్కల విశిష్టత చాలా చక్కగా వివరించాడు. ఇక్కడ నుండి చూస్తె ఓచో రియోస్ మొత్తం కనిపిస్తుంది.









జమైకాలో ఓచో రియోస్, మంటేగో బే, కింగ్స్టన్ ప్రాంతాలలో చూడవలసినవి ఉన్నాయి. ఎక్కువ శాతం ఓచో రియోస్ లోనే ఉన్నాయి. కింగ్స్టన్, మంటేగో బే రెండు దగ్గర్లా అంతర్జాతీయ విమానాశ్రాయలు ఉన్నాయి.

ఇలా మరో మరపురాని అనుభవాన్ని సొంతం చేసుకుని శనివారం తిరిగి గూటికి చేరాం.
ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవలసిన వ్యక్తులు, ఆశ్చర్య పరిచిన వివరాలు, అక్కడి వారి ఆచార వ్యవహారాల గురించి మరోసారి చెప్పుకుందాం.

Sunday, March 24, 2019

Jamaica - Blue Mountains

జమైకా చరిత్ర తెలుసుకున్నాం. మరి అక్కడ చూడవలసిన ప్రదేశాలు, వింతలు, విశేషాలు చెప్పుకోవద్దూ! 
ముందుగా బ్లూ మౌంటైన్స్ కు వెళదాం. జమైకాలోని పొడవైన, మరియు ఎత్తైన పర్వతశ్రేణులు ఇవి. మెరూన్స్ గురించి చెప్పుకున్నామే వాళ్ళు తప్పించుకుని నివాసం ఏర్పరచుకున్నది ఈ పర్వతశ్రేణులలోనేనట.  అంత ఎత్తుమీద ఎలాంటి వాహనాలు లేని ఆ కాలంలో ఎలా ఇళ్ళు కట్టుకోలిగారో ఊహకు కూడా అందదు. కొండల్లో చాలా ప్రశాంతంగా ఉంది, సరదాగా అక్కడో  ఇల్లు కొనుక్కోవాలనుకునేరు, అక్కడ ఎవరూ ఇల్లు అమ్మరట. కేవలం వారి వారసులకే ఇస్తారట. వంశపారంపర్యంగా ఆ తోటలను సాగు చేసుకుంటూ వారికి కావలసిన కూరగాయలు, పండ్లు అక్కడే పండించుకుంటారట. ఆ కాలంలో వారు 100 సంవత్సరాలకు పైగా బ్రతికేవారట. అక్కడ దొరికే మూలికలు, ఆకుపసరులతో వైద్యం చేసుకునే వారట.

ఇంతకూ ఇక్కడ కాఫీ ప్రపంచ ప్రసిద్ది గాంచిందని అతి ఖరీదైనదని మీకు చెప్పనే లేదు కదూ! చల్లని వాతావరణం, సంవత్సరం పొడవునా పడే వర్షాలు, కొండ వాలు ఇవన్నీ కాఫీ తోటలకు అనువైన అంశాలు. ఇక గింజలు సేకరించడం, ఒలవడం, ఎండపెట్టడం ఇవన్నీ ఏ యంత్రాల సాయం లేకుండా స్వయంగా చేస్తారట.







 ఎత్తైన పర్వతాల శిఖరాలను చుట్టేస్తూ మేఘాలు, చెంగున దూకుతున్న జలపాతాలు, మొక్కల చాటునుండి హఠాత్తుగా ప్రత్యక్షమే అంతలోనే మాయమైపోయే జంతువులు... వీటన్నింటినీ పలకరిస్తూ పర్వతం అంచుల వెంబడే సైకిల్ తొక్కుతూ కిందకు రావడం గొప్ప అనుభూతి. మధ్యలో కాఫీ తోటలు చూస్తూ, అక్కడి చెట్లు, మొక్కల విశేషాలను తెలుసుకుంటూ రావడం మరీ బావుంది.





 





Sunday, March 17, 2019

జమైకా చరిత్ర

       మార్చిలో ఎక్కడికైనా వెళ్ళాలంటే చలి. లేదూ కాదూ అంటే పక్కనే కరేబియన్ ఐలాండ్స్. ఆ విధంగా ఈసారి జమైకా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళే ముందు జమైకా, బహామాస్ లో ఒక ద్వీపమనే తెలుసు. కాని అక్కడకు వెళ్ళి స్థానికులతో మాట్లాడి, వారి జీవన విధానం తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

      విశేషాలలోకి వెళ్ళేముందు అక్కడి చరిత్ర తెలుసుకుందాం. అప్పుడు అక్కడి ప్రాంతాలతో పరిచయం ఏర్పడుతుంది. సుమారుగా క్రీశ 600 కాలంలో జమైకా తీరప్రాంతాలలో ప్రజలు నివసించిన ఆనవాళ్ళు ఉన్నాయట. ఆ తరువాత సౌత్ అమెరికా నుండి టహానాస్(Taíno) జాతి ప్రజలు వలస వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది.

     క్రీశ 1200 నాటికి వారు ఇల్లూ, వాకిలీ, ఊరు, వాడా ఏర్పరుచున్నారు. కుర్చీలు, మంచాలు లాంటి సామానులు వెండి, బంగారాలు సమకూర్చుకున్నారు. ఆటా పాటా కూడా ఉండేవట. గ్రామాలు నిర్మించుకుని, గ్రామ పెద్దల పాలనలో సుఖంగా కలసి మెలిసి జీవించేవారట.
www.jamaicaglobalonline.com
 అలా ఎప్పటివరకూ అంటే కొలంబస్ కి అక్కడో ద్వీపముందని తెలిసే వరకూ. అంటే క్రీశ 1450కు. ఆ తరువాత మొదలైయ్యాయి వారి కష్టాలు. స్పానిష్ వారు రావడం ద్వీపాన్ని ఆక్రమించుకోవడం, ఆ తరువాత స్థానికులు పేరు తెలియని రోగాలతోనూ, బానిసత్వం భరించలేకనూ చనిపోవడం, కొందరు పర్వతాల మీదున్న అడవులలోకి పారిపోవడం జరిగాయట. అలా పారిపోయిన వారిని  మెరూన్స్ (Maroons) అంటారు.

       ద్వీపంలో గొప్ప బంగారం నిధులేమీ లేవని స్పానిష్ వారికి తెలిసిపోయింది. ఆ ద్వీపాన్ని ఆహారం, తోలు పంపిణీ చేసే కేంద్రంగా వాడుకున్నారు. మరి ఈ పనులన్నీ చెయ్యడానికి మనుషులు కావలిగా. అందుకోసం ఆఫ్రికా నుండి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చారు.
sites.google.com/site/thejamaicanmaroons
క్రీశ 1509–1655 వరకూ స్పానిష్ వాళ్ళు జమైకా లో స్థావరాలు ఏర్పరచుకున్నారు. అక్కడ బంగారం కూడా లేదు ఇక పోయేదేం ఉందిలే అని వాళ్ళు ద్వీపాన్ని పెద్దగా కట్టుదిట్టం చెయ్యలా. అప్పుడు జరిగిందట మరో పెద్ద ఘోరం. ఇంగ్లాండ్ వాళ్ళు ద్వీపానికి వచ్చి ఇక మీరు పొండని స్పానిష్ వారిని తరిమేశారు. వీరు క్రీశ 1655–1962 వరకూ ఆ ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు.

        బ్రిటిష్ వారు అక్కడ చక్కెర ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. చక్కెర అంటే మరి మాటలు కాదు బోలెడంత మంది పని వాళ్ళు కావాలి. ఆఫ్రికా నుండే కాక ఆసియా ఖండం నుండి ముఖ్యంగా చైనా, ఇండియా నుండి పనివాళ్ళను తీసుకుని వచ్చారు. అలా వెళ్ళిన మన వాళ్ళను జమైకాలో కూలీ అని పిలిచేవారట. చైనా వారికి ఎక్కడైనా సులువుగా కలిసిపోయే తత్వం ఉంది. కాబట్టి వారు అక్కడివారితే తేలికగా కలిసిపోయారు. ఇక మిగిలింది మనం. భారతీయులను మిగిలిన వారందరూ చాలా చిన్న చూపు చూసేవారట. జీతం కూడా మిగిలిన వారికంటే తక్కువ ఉండేదట. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఇండియన్స్ అని చెప్పాలంటే కూలీ అనే అంటారు.

http://toronto.mediacoop.ca/
          ఇక చక్కర ఉత్పత్తి పెంచడం అధిక సంఖ్యలో బానిసలను తీసుకురావడం ఇలా జమైకాలో ఆంగ్లేయుల కంటే ఆఫ్రికన్ల సంఖ్య బాగా పెరిగి పోయింది. ఈ అడవులలోకి వెళ్ళి ఎవరి ఆధిపత్యానికి లొంగక స్వతంత్రంగా జీవిస్తున్న మెరూన్స్ తరువాత వచ్చిన ఆఫ్రికన్స్ తో కలసి చేసిన యుద్దాల ఫలితంగా 1962 ఆగస్ట్ 6 వ తేదీన జమైకాకు స్వాతంత్య్రం వచ్చింది. అదీ క్లుప్తంగా కథ. వివరించాలంటే భాషకందని దారుణాలు, శతాబ్దాల తరబడి బానిసత్వం. అణచివేత, మెరూన్స్ వీరోచిత పోరాటాలు... చెప్పుకోవాలంటే చాలా ఉంది.

టహానా(Taíno) అని వీరికి పేరెలా వచ్చిందంటే, కొలంబస్ మొదటిసారి వీరిని కలసినప్పుడు వాళ్ళు "టహానా టహానా" అన్నారట. అంటే దానర్ధం మేము మంచి వారిమి అనట. కొలంబస్ కు వారి అరవకన్ భాష రాదుగా వాళ్ళు టహానా తెగ అనేసుకుని ఆ పేరు స్థిరం చేసేశారు. ఈ ద్వీపాన్ని స్థానికులు గ్జెమైకా అనేవారట అంటే కొయ్య, నీటి ప్రాంతం అని అర్ధం. అది క్రమేనా జమైకాగా మారింది. మనం వాడే హామక్, కనో, బార్బిక్యూ, టుబాకో, హరికేన్ ఈ పదాలన్నీ ఆ భాషనుండి వచ్చినవే.
        
మెరూన్స్ చేసిన యుద్దాల గురించి చెప్పుకోవాలంటే నేనీ(Nanny) "క్వీన్ అఫ్ మెరూన్స్"  గురించి చెప్పుకోవాలి. నేనీ తన సోదరులతో కలసి 
http://funtimesmagazine.com
బానిస్వత్వపు  కోరల నుండి తప్పించుకుని పర్వతాలలో నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ననుసరించి ఎంతో మంది అలా అడవులలోకి వెళ్ళిపోయారట. వీరంతా కలసి నేనీ అధ్వర్యంలో యూరోపిన్ల మీద దాడి చేసి దాదాపుగా వెయ్యిమందిని బానిసత్వం నుండి విముక్తి కలిగించారు. 

మెరూన్స్, నేనీ వారి వీరోచిత పోరాటాలు గురించి ఈ క్రింది లింక్స్ లో తెలుసుకోవచ్చు. ఇంత హింసకు, పీడనకు గురై ఎన్నో విధాల బాధలు అనుభవించిన ఆ ద్వీప ప్రజలు ఎలా ఆలోచిస్తారు? డబ్బు, నాగరికతలలో అన్ని విధాల ముందున్నాయని చెప్పబడుతున్న దేశ ప్రజలు జమైకాను సందర్శించినపుడు అక్కడి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? స్వాతంత్య్రం తరువాత అక్కడి స్థితి గతులలో వచ్చిన మార్పులు ఏమిటి? వారి ఆర్ధిక పరిస్థతి ఎలా ఉంటుంది? అక్కడి ఆచార వ్యవహారాలు, చూడవలసిన ప్రదేశాలు వీటన్నిటి గురించి తరువాత చెప్పుకుందాం. 

https://www.youtube.com/watch?v=-US3_OxhEsk
https://www.youtube.com/watch?v=3cm-WFvOpLI
https://en.m.wikipedia.org/wiki/Nanny_of_the_Maroons

Sunday, February 4, 2018

Grand Turk



దేశం చుట్టూరా ఝామ్మని తిరిగి రావాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకనిపిస్తూ ఉంటుంది. ఇండియా చుట్టూనో, అమరికా చుట్టూనో తిరిగి రావడం కుదరని పని కాని అదిగో అక్కడ కనిపిస్తోందే, గ్రాండ్ టర్క్, అదో ద్వీపము. ఆ ద్వీపాన్ని కాలినడకన చుట్టేసి రావచ్చు. ఏడు ౘదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఈ చిన్న ద్వీపం, టర్క్స్ అండ్ కైకోస్ ద్వీప సమూహానికి రాజధాని. ఈ చిన్న ద్వీపంలో బాంక్, ఆసుపత్రి, జైలు, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హైస్కూల్ వరకూ ఉచిత విద్యా సదుపాయాలు ఉన్నాయి. సున్నపు రాయి ఇక్కడ  ప్రధాన వ్యాపారము. వీరికి విమానమార్గం ప్రధాన ప్రయాణ సౌకర్యము. ద్వీపం అనగానే పెద్ద పెద్ద చెట్లు కొండలు, గుట్టలు  ఉంటాయనుకుంటాం కదూ! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటింటే ఎక్కడా పెద్ద చెట్టన్నది  కనిపించలేదు. ఈ ద్వీపంలో పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. ఈ మధ్య వచ్చిన మరియా తుఫాను వలన ఈ ద్వీపానికి చాలా నష్టం కలిగిందట. ఇక్కడ వారికి  రెండువేల పంతొమ్మిది వరకు కూడా టివి సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదట.

లేతాకుపచ్చ రంగుకు పిసరంత నీలం రంగు కలిపేసి సముద్రంలో గుమ్మరించినట్లు గమ్మత్తైన రంగులో మెరిసిపోతున్న ఈ  సముద్రంలోకి ఎంత లోపలకు వెళ్ళినా స్వచ్ఛంగా అడుగు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా మురికి అన్నది కనిపించక పోవటానికి ఇసుకలో సున్నపురాయి కలసి ఉండడమే కారణమట.
పంతొమ్మిది వందల అరవై కాలం నాటికి రెండవ ప్రపంచయుద్ధం ముగిసిపోయినా, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం
 కొనసాగుతూనే ఉండేది. అప్పటికే రష్యన్ వ్యోమగాములు భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసేశారు. అమెరికా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. ఆ సమయంలో జాన్ గ్లెన్, అనే వ్యోమగామి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయినప్పటికీ,  భూమండలం చుట్టూ విజయవంతంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేశాడు. అతను ప్రయాణం చేసిన రోదసీ నౌక  గ్రాండ్ టర్క్ దగ్గర నీటిలోకి దిగింది. దానికి గుర్తుగా రోదసీ నౌక నకలును గ్రాండ్ టర్క్ దగ్గర ప్రదర్శనకు పెట్టారు.

పద్దెనిమిది వందల శతాబ్దంలో కరేబియన్ ద్వీపాలలో నౌకా వ్యాపారం మెండుగా ఉండేది. అసలే జిపియస్ లేని కాలం, పైగా ద్వీపానికి దగ్గరలో తీరంలోపల కొండలు, గుట్టలు. అటు వైపుగా ప్రయాణించే ఓడలు రాత్రిపూట అటూ ఇటూ ఊగడం, మునిగిపోవడంతో విపరీతమైన ధన, వస్తు, ప్రాణనష్టం వాటిల్లేదట. ఈ కారణంగా అక్కడ పద్దెనిమిది వందల యాభై  రెండవ సంవత్సరంలో లైట్ హౌస్ కట్టడం జరిగింది. అరవై అడుగుల ఎత్తు, గట్టి ఇనుముతో కట్టిన ఈ లైట్ హౌస్ లో మొదట ఆర్గాండ్ ఆయిల్ దీపాలు రిఫ్లెక్టర్ల సాయంతో కొంతకాలం ఏదో మిణుకు మిణుకు మంటూ వెలిగినా ఆ వెలుగు సరిపోలేదట. ఆ తరువాత కిరసనాయిల్ దీపాలు ఫ్రెస్నెల్ లెన్స్ లతో పరిస్తితి చక్కబడిందట. పంతొమ్మిది వందల డెబ్భై రెండొవ సంవత్సరంలో పూర్తిగా విద్యుతీకరణ చేశారు. చాలా విశేషాలు  తెలుసుకున్నాం. కాసేపలా ఊరు చూసొద్దాం రండి.





మన దేశంలో ఓ మారుమూలనున్న చిన్న పట్టణాన్ని చూస్తున్నట్లు ఉంది కదూ! అదిగో కనిపిస్తోందే అదే పెద్ద బజారు.

                                                                                                 










       ఓ గమ్మత్తైన విషయం చెప్పనా, ఇక్కడ ఎటువంటి డ్రైవింగ్ నియమాలు లేవుట. మద్యం తాగి కూడా డ్రైవింగ్ చెయ్యొచ్చట. అన్నట్లు ఇక్కడ జలుబు, జ్వరాలకు మందులు వేసుకోరట. వేపాకులు నీళ్ళలో మరిగించి తాగేస్తే తగ్గిపోతుందని చెప్తున్నారు. వేపాకులా, ఇక్కడా? అని నేను కూడా మీలానే ఆశ్చర్యపోయాను. ఎప్పుడో ఇండియా నుండి వేపమొక్క పట్టుకెళ్ళి  అక్కడ నాటారట. జైలొకటి ఉందని చెప్పాను గుర్తుందా? ఇక్కడ చిన్న చిన్న దోపిడీలు తప్ప మర్డర్లు, మానభంగాలు లాంటి పాశవిక ఘోరలేమీ ఇప్పటి వరకూ జరగలేదట. "ఏమోయ్, బొమ్మిడాయల పులుసు పెట్టెయ్. రాత్రికి వచ్చేస్తాను" అని ఖైదీలు రాత్రుళ్ళు బయటకు వెళ్ళి రావడం ఇక్కడ మామూలేనట.

     భారీ చదువులు, ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువులు సరే, కనీసం అద్దం కూడా కొననక్కర్లేని సాదాసీదా జీవితాలు! ఏమిటీ, అక్కడ వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? వెళ్ళేమాటయితే మీ అడ్రస్ ఏదో ఈ కింద కామెంట్ లో పోస్ట్ చెయ్యండి. ఈసారి గ్రాండ్ టర్క్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాం.
 
https://en.wikipedia.org/wiki/Grand_Turk_Island
https://www.grandturkcc.com/island-information/fact-sheet.aspx