Friday, July 24, 2015

రంగుల కల

       అందమైన కల ఇచ్చే అనుభూతే వేరు, అది నిద్రలో కాని, మెలుకువలో కాని. నాకు బాగా గుర్తున్న కల.. బుజ్జిపండు ఇక రెండు నెలల్లో పుడతాడనగా వచ్చిన పసుపు పచ్చని పులిహోర కల. నవ్వకండి! నిజంగానే. తెల్లవారి లేచి మామూలు కన్నా కొంచెం ఎక్కువ పసుపుతో పులిహోర కలిపి తినేశాను. ప్రస్తుతం నా కలల్లో రంగులు కనిపించడం లేదు. పోనీ కలలకే రంగులు వేస్తే! ఏమిటీ..  వేయలేం కదూ! అందుకే చుట్టూ ఉన్న పరిసరాలకు అంటే ఇంటి గోడలకు రంగులు వేయాలనిపించింది. ఆ కథా కమామీషంతా ఓ సహస్రం నడిచింది. టూకీగా విశేషాలు చెప్తాను.

             *            *            *            *            *            *    

"ఇవాళ రంగులు చూసి వద్దామా?" తో ఓ రోజు మొదలైంది. ఆ వసంతమాసపు ఉదయం ఉత్సాహంగా 'షెర్విన్ విలియమ్స్' లోకి అడుగు పెట్టాం. కావలసిన రంగులేలో కార్ట్ లో  పెట్టుకుని తెచ్చేద్దాం అనుకుంటూ.
"కెన్ ఐ హెల్ప్ యూ?" సేల్స్ గర్ల్ వచ్చింది.
"మేము ఇంటికి రంగులు వేయాలనుకుంటున్నాం."
"మరి రంగులు ఎంచుకున్నారా?" అని అడిగింది. "ఇంకా లేద"నగానే రంగుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏ రంగులైతే ఒకదానిపక్కన ఒకటి సఖ్యంగా ఉంటాయో, సాధారణంగా ఏఏ గదులకు ఏఏ రంగులు వాడతారో ... అన్నీ చెప్పడం మొదలెట్టింది. పూర్తయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ పూటకు రంగుల వేట చాలించి  ఆ మర్నాడు కొత్తగా రంగులు వేసిన మా స్నేహుతుల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటాయన వాళ్ళ గదులన్నీ ఉత్సాహంగా చూపించి అన్ని గదులకు కలిపి మొత్తం పదహారు రంగులు వాడినట్లుగా చెప్పాడు. మరో ఇంటికి వెళ్ళాం, వాళ్ళూ అంతే. అంటే ఈ రంగుల ఎంపిక అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదని అర్ధం అయింది. "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది" అన్నట్లుగా మేమొకటి అనుకుంటే మా పిల్లల అభీష్టం మరొకటని అర్ధం అయింది. ఎలాగంటారా...  

"నీ రూమ్ కే రంగు వేద్దాం అమ్మలూ",
"పింక్ అండ్ పర్పుల్"
"ప్రెట్టీ కలర్స్, చ్యూజ్ వన్"
"ఐ వాంట్ బోత్"
"బుల్లి రూమ్ కి రెండు రంగులు ఏం బావుంటాయిరా?"
"బావుంటాయమ్మా" అమ్మని ఒప్పించాలంటే ఏ భాషలో మాట్లాడాలో అమ్మాయికి బాగా తెలుసు. 
సరే అందులో షేడ్స్ చూడు. 
"లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్..  ఐ మీన్ ఫషియా"
"ఫషియా .... ఫషియా అంటే దగ్గర దగ్గరగా నేరేడుపండు రంగు... ఇంకో సారి ఆలోచించరా"
"బాత్ రూమ్ కి లావెండర్ కలర్."
వెంటనే ఓకె  చెప్పేశాను. ఆలస్యం చేస్తే కిటికీ అంచులకీ, డోర్ నాబ్ కి కూడా వేరే రంగులు చెప్పెయ్యగలదు. 
"నీకు పండూ"
"ఐ వాంట్ ఓన్లీ వన్ కలర్. బ్లూ"
"ఓకే. గుడ్"
"డా...ర్క్ బ్లూ".
"రూమంతా అదేనా?" నడి సముద్రంలో మునిగిపోతున్న ఫీలింగ్ తో అడిగారు నాన్న.  
"ఆక్చ్యువల్లీ . ఐ వాంట్  హైపర్ బ్లూ".
"ఒద్దురా బాబూ. ఆ రంగువేస్తే  రూమంతా చీకటై పోతుంది." 
"నాకదే కావాలి. బాత్ రూమ్ అండ్ కోజెట్స్ బ్రైట్ ఆరంజ్"
"నో వే" రామ్ గోపాల్ వర్మ సినిమా చూడకుండానే ముచ్చెమటలు పోశాయి.
"ఎస్."
"ఆ..సరే కానియ్."
ఆ 'నో వె' కి... 'సరే కానియ్' కి మధ్య చాలా అంతరాలు దాటాల్సి వచ్చింది.

మిగిలిన గదులన్నింటికీ ఏ రంగులు వేయాలా? అని ఇంటర్ నెట్  అంతా వెతుకుతూ ఓ రోజు బయటకు చూసేసరికి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో చెట్లు హోలీ ఆడినట్లు రంగులే రంగులు. ఫాల్ కలర్స్ తో ఆకులు రంగులు మార్చుకున్నాయి కాని మా గోడలకు ఆ భాగ్యం కలగలా. . ఇక లాభం లేదని పెయింటర్ ని ఇంటికి పిలిచి సలహా అడిగాం. ఏ రంగు బావుంటుందో చూడాలంటే ముందు సాంపిల్స్ తెచ్చి వేసి చూడమన్నాడు. వేశాం. ఏ గోడమీద చూసినా ఎక్సర్ సైజ్ చేస్తున్న ఇంద్రధనస్సులే.

మళ్ళీ వసంతం వచ్చిన కొన్ని రోజులకు గోడలకున్న పటాలన్నీ కిందకు దిగాయి. సోఫాలు, మంచాలన్నీ ముందుకు జరిగాయి. ఏ గదిలోకి వెళ్ళినా గోడమీద నృత్యం చేస్తున్న రంగులు పులుముకున్న కుంచెలు...అర్ధం కాని భాషలో ఆ కుంచెలు పట్టుకున్న వారి కబుర్లు. ఒక్కో గోడకు రంగు వేస్తుంటే అది ఎలా మారుతుందో ఆశ్చర్యంగా చూడడం. నచ్చకపోతే షెర్విన్ విలియమ్స్ కి పరిగెత్తి కొత్త రంగు తెచ్చుకోవడం. ఇలా ఓ వారం గడిచాక...

    మంచి గంధానికి రెండు చుక్కలు లవంగనూనె కలిపినట్లు మధ్య గది, తొలకరి జల్లులో మెరిసే మైదానంలా వంటగది, కుంకుమ పువ్వు పులుముకుని ముందుగది, నడివేసపు చల్లని సాయంత్రంలో మెరిసేటి నీలి సంద్రంలా మరో గది.... ఇలా గది గదిలో ప్రకృతికాంత విన్యాసాలతో నా రంగులకల పూర్తయ్యింది.

నేర్చుకున్న పాఠాలు:

  • ఎవరి ఇంట్లోనైనా అందంగా అనిపించిన రంగు మన ఇంటికి సరిపోకపోవచ్చు. వెలుతురును బట్టి రంగు అందం మారుతూ ఉంటుంది. 
  • ఇంటికి రంగులు వేసిన తరువాత సామాన్లు కొనడం ఉత్తమం.
  • పెయింట్ గోడ మీద చూడాలనుకుంటే పోస్టర్ బోర్డ్ మీద వేసి గోడకు అంటించాలి. అంతే కాని నచ్చిన దగ్గర పులిమేయకూడదు.   
  • చీకటిగా ఉన్నాయి కదా అని క్లోజెట్స్  కి లేత రంగులు వేయక్కర్లేదు. ముదురు రంగులు కూడా బావుంటాయి. లైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది. 
  • గోడలమీద వున్న నొక్కులు, చొట్టలు సరిచేసిన తరువాత  రంగు వేస్తే మంచిది. ఈ విషయం మీ పైంటర్ మీకు చెప్పకపోవచ్చు.
  • ముదురు రంగులు వేయడం చూస్తూ ఉన్నప్పుడు గది చీకటై పోతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. మరేం ఫరవాలేదు. తెల్లని గోడపక్కన అలా అనిపిస్తుంది కాని గది మొత్తం వేసినప్పుడు అసలు రంగు తెలుస్తుంది.  
  • లేత రంగు ఎంచుకునేప్పుడు ఆ షీట్స్ తెలుపు రంగు కాగితం మీద పెట్టి చూస్తే రంగు ఎలాంటిదో సరిగ్గా అర్ధం అవుతుంది.

Tuesday, July 7, 2015

ఏమండోయ్...

"మిమ్మల్నే.... పిలుస్తుంటే పలకరేం?"
"పిలిచావా? ఏమని?"
"ఏమని పిలుస్తానో తెలీదా?"
"ఎందుకు తెలీదు. బాగా తెలుసు. అలా దారిని పొయ్యేవారిని పిలిచినట్లు 'ఏవండోయ్' ఏవిటి? చక్కగా పేరు పెట్టి పిలవొచ్చుగా?"
"అలవాటు లేని పని కొత్తగా ఎందుకని?"
"అలవాటుదేముంది చేసుకుంటే అదే వస్తుంది."
"మిమ్మల్ని చేసుకున్నాను చాలదూ!"
"అదంతా ఏం కుదరదు. ఇవాళ నన్ను పేరు పెట్టి పిలవాల్సిందే"
"పేరా... ఏం పేరూ?"
"మా అమ్మా నాన్న పెట్టిన లక్షణమైన పేరు."
"మిమ్మల్ని నాకిచ్చేశారుగా. కనీసం ఆ పేరన్నా వాళ్ళకి వదిలేద్దామని."
"అబ్బో గొప్ప ఆలోచనే!"
"కదా!"
"కదా లేదు ఏం లేదు. పిలవాల్సిందే"
"కుదరదు."
"ఏం.. ఎందుకని"
"ఏవిటో సిగ్గనిపిస్తోంది"
"కొత్త పెళ్ళికూతురా రారా! నీ కుడికాలు ముందుమోపిరారా!...."
"చాల్లే. అయినా నేను సిగ్గుపడితే అందంగా ఉంటానని నిన్నేగా అన్నారు. ఇప్పుడేమో ఎగతాళి చేస్తున్నారు"
"అది రాత్రి మాట కదా!"
"పగలో మాట రాత్రో మాట. మాట మార్చడం మీ వంశంలోనే లేదని మొన్న మీ మామయ్యతో అన్నారు..."
"ఏదో కోపంలో మాటా మాటా అనుకున్నాం. అయినా బోడి గుండుకూ మోకాలికీ ముడి పెడతావే."
"ఎంత కోపం వస్తే మాత్రం పెద్దవాళ్ళతో అందులోనూ మేనమామతో అలాగేనా మాట్లాడేది?
"మరి ఆయనన్న మాటలు యెట్లా ఉన్నాయ్?" 
"యెట్లా ఉన్నాయేమిటి?"
"ఆయన తాతగారిని, అమ్మావాళ్ళను అలా అనడం తప్పుకాదూ"
"తప్పే."
"ఆ విషయం ఆయనకు మాత్రం తెలియదూ?"
"తెలుసు. చివరి రోజుల్లో మీ అత్తయ్య తాతగారిని చూడక పోవడం. ఆస్తంతా ఆయన అత్తయ్యగారి పేరున వ్రాయడం ఈ గొడవలన్నింటికీ కారణం. మీ అత్తయ్య ఆయనని చూడకపోవడంలో మీ మామయ్య తప్పేం ఉంది? పైగా ఆయనకు తండ్రి కోసం ఏమీ చెయ్యలేక పోయాననే గిల్టీ కాన్షస్. దాంతో ఏదో అన్నారు. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఊరుకుంటే పోయేదిగా"

"మరి నాకు మాత్రం కోపం రాదేమిటి?"
"వస్తుంది. ఆ కోపంలో చిన్నప్పట్నుండీ ఆయన మిమ్మల్ని ఎంత గారాబం చేసేవారో, మీ అత్తయ్యకు మీరంటే ఎంత ఇష్టమో మర్చిపోయారా? వాళ్ళతో గడిపిన సమయం అంతా ఇప్పుడు తలచుకుంటే ఎలా ఉంది? అన్నీ పాడుచేసుకుంటారా?"

"నిజమే. బాధగానే ఉంది. కాని ఆయన అలా చేయడం తప్పుకదూ! పైగా అప్పుడు అత్తయ్యకు సర్ది చెప్పుకోలేక ఇప్పుడిలా మాట్లాడడం!"
"మీ తాతగారికి ఆడవాళ్లంటే ఉన్న చులకన మీకు తెలుసుగా! స్వతహాగా మీ అత్తయ్య చాలా మంచివారు. ఆవిడ మనసెంత కష్టపడితే అలా బిహేవ్ చేసి ఉంటారో మీరూహించగలరా?"

"అయితే మాత్రం?"
"అయితే గియితే ఏమీ లేదు. ఆవిడ చెప్పుల్లో కాళ్ళు పెట్టి గతాన్నీ భవిష్యత్తునూ మనం చూడలేం. అయినా అలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే చివరకు మనకూ ఎవరూ మిగలరు."

"అవుననుకో అన్ని మాటలనుకున్నాక అంతకు ముందులా ఎలా ఉండగలం?"
"చక్కగా ఉండొచ్చు. బూరెలు చేశాను. మీ మామయ్యకు ఇష్టంగా! తీసుకుని సాయంత్రం వాళ్ళింటికి వెళ్దాం. మీ అత్తయ్య మీ కిష్టమైన మామిడికాయ పులిహోర చెయ్యకపోతే నన్నడగండి"
"అంతేనంటావా?"
"అంతే కాదు. ఇప్పుడంటే కోపంలో ఉన్నారుగాని, మీరెవ్వరూ మీ మామయ్యతో మాటాడక పోవడం, రెండు కుంటుంబాల మధ్య కలతలు రావడం అత్తయ్యగారికి ఎలా ఉంటుందో ఆలోచించండి."
"....."
"అయిన వారి మధ్య కలతలు ఎన్ని మానసిక సమస్యలకు దారి తీస్తాయో మీకు తెలియదు. అహానికి పెద్ద పీట వేస్తే సౌఖ్యానికి తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి చేయి దాటనివ్వకండి."
"......"
"ఎమాలోచిస్తున్నారు?"
"నువ్వు గొప్ప మాయల మరాఠివి"   
"అందరం బావుండాలని తోచిన సలహా చెప్పాను. గొప్ప బిరుదే ఇచ్చారు. ఇష్టం లేకపోతే మానెయ్యండి"
"ఆహ అది కాదు" 
"ఏది కాదు సందర్భం వచ్చింది కదా అని చెప్పాను. కోపంలోనో, ఆవేశంలోనో ఒకరు తడబడినప్పుడు రెండో వారు దిద్దుకుంటేనే కదా జీవనం సవ్యంగా సాగేది. నాకెన్నిసార్లు మీరిలాంటివి చెప్పలేదు."

"సర్లేవోయ్. అసలు విషయానికి వద్దాం" 
"ఏ విషయం....ఓ అదా!"
"అదా అని అంత తేలిగ్గా అనేస్తే ఎలా..."
"బరువుగా అనడం రాదు మరి. నేనసలే ఏడు మల్లెలెత్తు. మిమ్మల్ని కలిసిన మొదటి సారి మా బాబాయి చెప్పలేదూ"
"అప్పుడు ఏడు మల్లెలే. ఇప్పుడే ఏడువేల మల్లెలయ్యాలి."
"ఎన్నయినా మల్లెలు మల్లెలే."
"మల్లెలు మల్లెలే జాజులు జాజులే"
"ఇప్పుడా మల్లెలు జాజుల కథలెందుకులెండి!"
"ఔనంటే కాదనిలే... కాదంటే ఔననిలే... ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే....ఇప్పుడు ఎందుకన్నావంటే మరి కావాలన్నమాటేగా!"
"ఆడవాళ్ళందర్నీ కాచి వడపోసి గొప్ప మాటే చెప్పారు కవిగారు"
"కవిగారి సంగతి మనకెందుకు కాని 'బాహుబలి' ఎల్లుండి రిలీజ్ అవుతోందిట. వెళ్దామా?"
"వెళ్దాం. టికెట్స్ దొరుకుతాయా?
"నీకెందుకు నేను తీసుకొస్తాగా. అయితే ఒక షరతు" 
"ఏమిటో..." 
"ఏముంది పేరు పెట్టి పిలవడం."
"మీరింకా మర్చిపోలేదా?"
"లేదు" 
"ఓ విషయం చెప్పనా?"
"చెప్పొద్దు."  
"ఇప్పుడూ..." 
"ఇప్పుడూ లేదు అప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే పేరు పెట్టి పిలవాల్సిందే"
"అబ్బ నన్ను కొంచెం చెప్పనిస్తారా?"
"నివ్వను."  
"అది కాదండీ."
"ఏది కాదండీ." 

"పేరుతో పిలవడానికేం అభ్యంతరం లేదు. కాకపోతే...ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పేరు....అదీ నాలుగక్షరాల కలయిక మాత్రమే. ఆ పేరు పలకడానికి ఏదో సిగ్గు, బిడియం. తెలియని భావాలేవో ఎదలో మెదులుతుంటే తొలిసారి మిమ్మల్ని యేమని పిలిచానో జీవితాంతం అలానే పిలవాలనిపిస్తుంది. ఆ రోజు మన మధ్య మొదలైన స్నేహానికి గుర్తుగా అనుక్షణం హృదయ సీమలో విహరించే అక్షరాలను పెదవి దాటనీయక పదిలంగా దాచుకోవాలనీ, ఆ అనుభూతిని అలాగే నిలుపుకోవలనీ అనిపిస్తుంది. లేదూ కాదూ పేరుతోనే పిలవాలంటే మీ ఇష్టం"

*                       *                       *                        *          

ఏమండోయ్ మిమ్మల్నే. ఐదున్నరౌతోంది ఇక బయలుదేరదామా?
ఇదుగో వచ్చేస్తున్నా. కారు తాళాలు తీసుకో!


Monday, April 13, 2015

పాఠశాల ఆరవ వార్షికోత్సవం

         పాఠశాల ఆరవ వార్షికోత్సవం శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు కమ్యూనిటీ హౌస్ మిడిల్ స్కూల్లో జరిగింది. పోయినేడాది కూడా ఇక్కడే జరిగింది కాని, అప్పుడు పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్ధులు, పదకొండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నూటనాలుగు మంది విద్యార్ధులు, పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు. అంటే సగటున ప్రతి ఐదుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులున్నారన్నమాట. ఇది పాఠశాల విద్యార్ధులు చేసుకున్న అదృష్టం. 
ఉపాధ్యాయులు 
వేలూరి రాధ, సూరే మంజుల, వాడకట్టు శైలజ, కింతలి అనురాధ ఉపాధ్యాయులుగానే కాక పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 


        పడాల ఉష, మారోజు కవిత, సుంకే జ్యోతి, చెట్టా రమేష్, భైరి ఈశ్వరి, మేడికయాల లక్ష్మి, సూర్యదేవర హరిత, 
గుమ్మడి సుధ, మల్లాది శశికాంత్, బులుసు పద్మ, కాకాని లక్ష్మి, పాండవ రోహిణి, రామడుగు మాధురి, గండ్లూరి భాను ప్రకాష్ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు.  ఏ పని చేయడానికి వాలంటీర్లు ఎవరూ ముందుకు రావడంలేదని వింటుంటాం. 


వచ్చినా వారు నిబద్దతతో పనిచెయ్యరని అపోహ. అలాంటిది ఏడాది పొడవునా ప్రతివారం ఓ సమయానికి కట్టుబడి పాఠాలు చెప్తున్న  ఈ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. 


వీరు పాఠాలు చెప్పడమే కాదండి, పాఠశాల తరగతులను తమ ఇంట్లోనే  నిర్వహించడానికి సహృదయంతో ముందుకు వచ్చారు. ఒంట్లో బాగాలేని రోజులుంటాయి, ఆఫీసులో ఒత్తిడి, పిల్లలకు బాగా లేకపోవడం, చుట్టాలతో బిజీగా ఉన్న సందర్భాలు... ఇలా ఎన్నో ఉంటాయి.
సంవత్సరం మొదట్లో రూపొందించిన కాలెండర్ ప్రకారం ప్రతి వారం తరగతి నడిపే ఉపాధ్యాయులకు ఏమిచ్చినా ఋణం తీరదు. పైగా విద్యార్ధులు హోం వర్క్ చేయకపోయినా, ఎవరైనా కొంచెం వెనకబడుతూ ఉన్నా “ఆ పిల్లాడు చాలా బాగా చేస్తాడండి. ఇంట్లో వాణ్ని కూర్చోబెట్టి వాడేం చేస్తున్నాడో కొంచెం చూసేవాళ్ళుంటే బావుణ్ణు” అంటూ విద్యార్ధుల గురించి వీళ్ళు బాధపడి పోతారు. 

       ఇందులో ఆరుగురు టీచర్ల పిల్లలు పాఠశాల విద్యార్ధులు కారు.

అయినప్పటికీ వారు మాతృభాష మీద అభిమానంతో పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. కొంత పని చేసి ఎంతో ప్రతిఫలం ఆశించే ఈ రోజుల్లో నిస్వార్ధంగా ఇంత సహాయం చేస్తున్న ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక్క రోజు భోజనం పెట్టి తమ సంతోషం మేరకు వాళ్ళను సత్కరించాలనే తల్లిదండ్రుల ఆలోచనతో ఈ వార్షికోత్సవం. 

మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్ధులను ఆశీర్వదించడానికి డొక్కా ఫణి కుమార్ గారు రావడం ఓ విశేషం.
       ఈ ఏడాది మరో విశేషం పాఠశాల కొలంబియా, సౌత్ కేరోలినాలో మొదలవడం. ప్రముఖ కవి విన్నకోట రవిశంకర్ గారు, విద్యాసాగర్ గారు ఉపాధ్యాయులు. వారికి తమ ప్రోత్సాహం అందిస్తున్న వారు కొలంబియా తెలుగు అసోసియేషన్ అద్యక్షులు కడాలి సత్య గారు. 
కొలంబియా పాఠశాల బృందం 

ఎంతో మంది, ఎన్నో రోజుల కృషి ఫలితం ఈ వార్షికోత్సవం. తెర వెనుక
వుండి అహర్నిశలూ కష్టపడిన వారిని ఇప్పుడు పరిచయం చేస్తాను. 



వార్షికోత్సవ బాధ్యతలు భుజాన వేసికొని ఈ కార్యక్రమాన్ని నడిపించిన సమన్వయకర్త డోకి శ్రీనివాస్ గారు. ప్రణాళికా బద్దంగా ప్రతిపనికి 
ఓ సమయాన్ని కేటాయించి, వారానికో సమావేశం ఏర్పాటుచేసి, ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా పరిశీలిస్తూ సమర్ధవంతంగా నిర్వహించారు.

       

విద్యార్ధుల కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వారి సాధక బాధకాలను పరిశీలిస్తూ, అవసరం మేరకు సలహాలు సూచినలు ఇచ్చి వేలూరి రాధ గారు కష్టతరమైన కార్యాన్ని ఎంతో ఇష్టంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడం దగ్గర నుండి ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తున్నవారు సూరె మంజుల గారు. ఈ కార్యక్రమానికి నిర్వాహక బాధ్యత తీసుకుని కూడా కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వెనుకనే ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

ఒక కార్యక్రమం నిర్వహించాలంటే స్పీకర్లు, మైకులు, పాలు,
నీళ్ళు లెక్కలు, అప్పులు, వసూళ్ళు, వగైరా, వగైరా, వగైరా. ఈ హరైనా అంతా పడుతూ డాలర్ అడిగితే “క్వార్టర్ తో సర్దుకుందురూ” అంటూ కోత వేసి చాలా పొదుపుగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రకారం నడిపిన వారు దేవినేని నీలిమ గారు. ఈవిడ ఫుడ్ కమిటీ లో కూడా ఉన్నారు. అక్కడ మాత్రం ఈవిడ అన్నపూర్ణే. నాలుగు ట్రేలు సరిపోతాయంటే “లేదండీ... ఆరైతే బెటర్” అంటూ వంటలన్నీ ఘనంగా వండించారు. 


       పాఠశాల తరగతుల నిర్వహణ కోసం తమ ఇంటిని వాడుకోమని
సహృదయంతో ముందుకొచ్చి సహాయం చేసిన వారు ముందుకు వచ్చినవారు మొగిలి షర్మిల గారు. అంతేకాదండి ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా ఆ తరగతిని నడపడానికి సహాయం చేశారు. తమ పిల్లలు పాఠశాల విద్యార్ధులు కానప్పటికీ మీకెప్పుడు అవసరమైనా నేనున్నానంటూ ఉపాధ్యాయులకు సహాయపడినవారు గుడితి వేణి గారు.                                                                                                            
తెలుగులో ప్రశంసా పత్రాలు తాయారు చేయడమే కాక, జ్ఞాపికల మీద కూడా తెలుగులోనే పేర్లు వ్రాయించి తెప్పించిన వారు వర్ధినేని వెంకట్ గారు. 

ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు వేదిక సమకూర్చిన వారు గొట్టిపర్తి వెంకట్ గారు. కేవలం ఒక్క గంటలో వేదిక అలంకరణ పూర్తి చేసి కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి మొదలయ్యేలా సహకరించిన వారు వాడకట్టు శైలజ గారు, వాడకట్టు సునీల్ గారు, పడాల సూర్య గారు, వేమూరి సత్య గారు, పుల్లేటి కల్యాణి గారు. 
ఎప్పుడు కొన్నారో ఎలా జాగ్రత్త చేసారో కానీ మనకు తాజా రోజాలను అందించిన వారు. అంబటి సరిత గారు, కింతలి అనురాధ.


వచ్చవాయ్ రామ్ కుమార్ ఈ కార్యక్రమానికి వీడియోలు తీయడమే వెంటనే యూ ట్యూబ్ లో పెట్టేశారు కూడా. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు. 

కార్యక్రమం మొదటినుండి ఓపిగ్గా ఫోటోలు తీస్తున్నారు ఫణి కుమార్ గారు, మల్లాది శశికాంత్ గారు. ఫణి కుమార్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ, శశికాంత్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. 

శశికాంత్ ఉపాధ్యాయులు కూడా. ఫణి కుమార్ గారి శ్రీమతి ఈశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు. వీరు కూడా అవసరమైనప్పుడు తరగతి నిర్వహణలో సహాయం చేస్తుంటారు. 


కార్యక్రమమైన విజయవంతం అవడానికి అతిముఖ్యమైనవి. స్పీకర్లు, మైకులు. వాటిని తీసుకొచ్చి అమర్చి వాటి బాగోగులు చూస్తున్న వారు సుంకర శశికాంత్ గారు. 


తమ సరదా సంభాషణలతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాఖ్యాత పారుపూడి ఉష గారు.


కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారో చూసి అందరికీ సరిపడా భోజనం

తరయ్యేలా చూడడం శ్రమ కంటే వత్తిడితో కూడకున్న పని. వంటలు, వడ్డనల ఏర్పాట్లు చూస్తున్న వారు పుల్లేటి కళ్యాణి, పండ లక్షి, కుంట రంజని, దేవినేని నీలిమ. 

చదవలవాడ రాజా గారు, వేమూరి సత్య గారు అవసరమైన ప్రతి దగ్గర మేమున్నామంటూ ముందుకు వచ్చి అన్ని పనులూ సవ్యంగా జరిగేలా చూశారు.

ఈ వార్షికోత్సవంలో తమ ప్రజ్ఞా పాటవాలతో మనల్ని అలరించిన విద్యార్ధులకు అభినందనలు. వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ధన్యవాదాలు.


అచ్చతెలుగుపేర్లతో తయారయిన జ్ఞాపికలు 



ఒకటవ తరగతి 



ఒకటవ తరగతి 


ఒకటవ తరగతి 

ఒకటవ తరగతి 
ఒకటవ తరగతి 



మూడవ తరగతి విద్యార్ధులు 



పూర్వ విద్యార్ధులు 


రామ లక్ష్మణులు 


ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందుకుంటున్న రెండవ తరగతి విద్యార్ధులు 



రామ రావణ యుద్ధం 


సింహము, కుందేలు కథ చెప్తున్న విద్యార్ధులు 


శ్రీ రామ విజయం నాటిక వేసిన నాలుగవ తరగతి విద్యార్ధులు 


సోది 

బుఱ్ఱ కథ 

ఉగాది పచ్చడి 


తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో తయారుచేసిన విందు భోజనం 
తాంబూలాలు  


పాఠశాల వైభవాన్ని తమ దర్పణంలో ప్రతిబింబించిన ఐడియల్ బ్రెయిన్ , ఆంద్ర ప్రభ, అంతర్జాతీయ తెలుగు వార్తా వేదిక, తెలుగు కమ్యూనిటీ న్యూస్, తెలుగు టైమ్స్ పత్రికలన్నింటికీ ధన్యవాదాలు.

ఒక సంస్థ అభివుద్ది వైపు అడుగులు వేయాలంటే ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ కావాలన్న నిజాన్ని గ్రహించి నడుం కట్టి ముందుకొచ్చి వార్షికోత్సవాన్ని విజయపంథాలో నడిపించిన కార్యనిర్వాహకులందరికీ అభినందనలు.





Monday, March 16, 2015

సందడే సందడి

“ఏమిటంత అలసటగా వున్నావ్?” వాడిపోయిన తంతి మొహం చూస్తూ అడిగింది విద్య. నాకూ విద్యాలయానికీ రోజుకోసారైనా కలసి కబుర్లు చెప్పుకోకపోతే తోచదు. ఈ వేళ పాఠశాల 'మెయిల్' కూడా మాతో కలసింది.

“ఏం చెప్పమంటావ్ శర్కరీ, ఆ టీచర్లేవో "ఈ వారం ఈ పాఠం చెప్పాం, ఇదిగో ఈ కొత్త పద్యం నేర్పించాం." అంటూ అడపాదడపా ఓ కబురు పంపిస్తుండేవాళ్ళు. తీరగ్గా హాయిగా ఉండేది. ఇదిగో ఇప్పుడీ వార్షికోత్సవం వస్తోందిగా, పగలూ రాత్రీ తీరక లేదంటే నమ్ము” మొరపెట్టుకుంది తంతి. 

“అవున్లే, మరి వార్షికోత్సవం అంటే బోలెడు పనులుంటాయిగా!” సానుభూతి చూపించింది విద్య.

“అయితే నీకేమిటి? నువ్వేమన్నా దానికోసం ఊరూ, వాడా తిరిగి పన్లు చేస్తున్నావా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నీకేం తెలీదు శర్కరీ. వార్షికోత్సవానికి బోలెడుమంది కార్యకర్తలు కమీటీలుగా ఏర్పడి పని చేస్తారు. భోజనం ఏర్పాట్లకో కమిటీ, జ్ఞాపికల తయారీకో కమిటీ, అలంకరణకొకటి, ఆహ్వానాలకొకటి, ఫోటోలకొకటి, వీడియోలకొకటి, ఇలా చాలా చాలా ఉంటాయి” వివరించింది విద్య.

“అయితే?”

“అయితే ఏమిటీ వాళ్ళందరూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరో ఒకరు అది కావాలనో ఇది కావాలనో ఓ కబురు పంపడం, దానికి మరొకరు వెంటనే సమాధానం చెప్పడం.”

“అవన్నీ నీక్కూడా చెప్తారా?” సందేహంగా అడిగాను.

“ఆవన్నీ నా ద్వారానేగా మరీ. ఫుడ్ కమిటీ గురించి చెప్తా విను. "ఇదిగోనండి వార్షికోత్సవానికి నాలుగొందల మంది వస్తున్నారు, మనం వంటలవీ ఇంట్లోనే చేద్దాం, ఇవి ఇవి చేస్తే బావుంటుంది. ఇందులో మీరేం చేస్తారు? అని అడిగారు." దానికి పులిహోర చేస్తామని కొందరు, దద్దోజనమని కొందరు, గొంగోర పచ్చడిని, బంగాళ దుంప కుర్మా అని ఇలా ఒకటేమిటి బోలెడు మంది అవీ ఇవీ చేస్తామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు”

“అబ్బో భలేగా ఉందే! ఈ జ్యోతసలే నాకేమీ చేసి పెట్టదు. అప్పుడెప్పుడో ఓ మూడేళ్ళ క్రితం చెక్కలు, ఆ తరువాతేదో గులాబ్ జామున్ తప్ప మరేమీ రుచి చూసి ఎరగను. నువ్వా పేర్లు చెప్తుంటేనే నూరూరిపోతోంది.”

"అవునూ...వార్షికోవత్సవానికి ఈ వంటలవీ ఎందుకు?" సందేహం వ్యక్తపరిచాను.

ఎందుకంటే మధ్యాహ్నం రెండుగంటలకల్లా ఆడిటోరియం దగ్గరకు వస్తారందరూ, నాలుగు గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం ఏడు గంటలకు అందరూ అక్కడే భోజనాలు చేస్తారు.  

"ఓ భలే ఉందే. ఇంకా" చెప్పమన్నట్లుగా చూసింది విద్య.

"పాఠశాల విద్యార్ధులను అభినందిస్తూ వారికి ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందజేసే ఉత్సవాన్ని మీరెల్లరూ కనులారా తిలకించి చందన తాంబూలాలు స్వీకరించ ప్రార్ధన." అంటూ తల్లిదండ్రులనూ పెద్దలనూ ఆహ్వానించారు.

“ఇంకా ఏమేం కార్యక్రమాలున్నాయో అవీ చెప్పు” ఉత్సాహంగా అడిగింది విద్య.

"పాటలు, పద్యాలు, నాటికలూ, బుఱ్ఱ కథ, సోది .."

"ఏమిటేమిటీ బుఱ్ఱ కథ సోదీనా" సంబర పడింది విద్య.

"బుఱ్ఱ కథ స్క్రిప్ట్ ఎంత బావుందనుకున్నావు?" మరింత ఊరించింది తంతి.

"మరివన్నీ తెలుగురాని ఆ పిల్లలతో చేయించాలంటే బోలెడు శ్రమ కదూ!" అడిగాను.

"చిన్నగా అంటున్నారా? ఆ టీచర్లు మీ పిల్లలకీ డైలాగులు నేర్పించండి, ఈ పాటలు ఈ ట్యూన్ లో పాడించండి, మీరు ఇంటి దగ్గర చెప్పిస్తే స్పష్టంగా చెప్పగాలగుతారు. అని తల్లిదండ్రులతో ఎంతో ఇదిగా చెప్తున్నారు."

"నిజమేలే పాపం టీచర్లకా మాత్రం తాపత్రయం ఉంటుందిగా. అవన్నీ చక్కగా చేస్తే వాళ్ళ విద్యార్ధులను బోలెడు మంది మెచ్చుకుంటారని, ఆ ఉత్సాహంతో ఆ పిల్లలు ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకుంటారనీ వీళ్ళా శ్రమ తీసుకోవడం". వివరించింది విద్య. 

"మరో విషయం చెప్తా వినూ! పిల్లలు చెప్పిన పద్యాలు, పాటలు, తెలుగులో సరదాగా మాట్లాడిన వీడియో పంపమని అడుగుతున్నారు.  

"ఎందుకవన్నీ?" ఆశ్చర్యంగా అడిగాను.

"వాటితో సరదాగా వీడియో చేసి అందరికీ చూపిస్తారట" ఎంతో ఇష్టంగా చెప్పిందా మాట.

“వీటన్నింటిలో పాలుపంచుకోవడానికి అదృష్టం ఉండాలి” మనస్ఫూర్తిగా అన్నానా మాట. ఏ కార్యక్రమమైన జరిగేది ఓ రెండు గంటలు లేదా ఒక పూట మాత్రమే. అదీ బోలెడు హడావిడిగా జరిగిపోతుంది. ముందుగా నలుగురు కలసి సంతోషంగా చేసుకునే ఏర్పాట్లలోనే ఉంటుంది సరదా అంతానూ. అప్పటికి తంతి మూడ్ మారినట్లుంది. ఇక ఇక్కడి నుండి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టింది.
“ఇంకా వినూ. జ్ఞాపికలేవో అచ్చేయిస్తారట. వాటికి అచ్చ తెలుగులో పేర్లు వ్రాసి పంపించాలట" అంటూ పకాపకా నవ్వింది.

"అందులో అంత నవ్వాల్సిందేముంది?" అడిగింది విద్య.

“మా క్లాసులో కొన్ని ఇంటి పేర్లు తప్పుగా పడ్డాయి, బరాటం కి బారతం, తేళ్ళ బదులు తెల్ల, వడమాలకు బదులు వాదముల అని పడింది. అని ఓ టీచర్ చెప్పారు." వస్తున్న నవ్వు ఆపుకుని చెప్పింది.

“ఇంకా?” నాకా కబుర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.

“మాకు తోకలు కావాలని ఓ టీచర్..." అంటూ ఫక్కున నవ్వింది తంతి.

"ఎందుకట?" తనూ నవ్వింది విద్య.

"వాళ్ళ తరగతి విద్యార్ధులు అడవి జంతువుల వేషాలు వేస్తున్నారట”

"ఉపాధ్యాయుల సంగతి సరే మరి కార్యకర్తలు ఏం చేస్తున్నారు?" గతస్మృతులేవో గుర్తొచ్చినట్లున్నాయి విద్యకి.

“వారానికో మీటింగ్ పెట్టి "ఎవరే పని చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?" అంటూ ఒకటే ప్రశ్నలు. దానికేదో సమాధానమొస్తుంది. వెంటనే "మీకేమన్నా సహాయం కావాలంటే మేం చేస్తామంటూ" మరొకరు చటుక్కున ముందుకొస్తారు”

"కొంతమంది కార్యకర్తలయితే రెండు మూడు కమిటీలలో కూడా పనిచేస్తున్నారు"

"అవునా?"
"అప్పుడెప్పుడో శ్రీరామ నవమికి పందిళ్ళు వేసి వూరు ఊరంతా సందడి చేసేవారు చూడండి. అలా వీరు ఈ ఉగాదికి అంతా ఒక కుటుంబంలా కలసిపోయి ఏర్పాట్లు చేసుకుంటున్నారు."
"వాళ్ళ పేర్లూ అవీ చెప్పకూడదా?" ఆసక్తిగా అడిగాను.

"వార్షికోత్సవమయ్యాక ఆ విశేషాలన్నీ నాకు తెలుస్తాయి. అప్పుడు నీకూ చెప్తాలే" అంటూ వెళ్ళడానికి తయారయింది విద్య.

"అక్కడ నాకోసం ఏమేమి కబుర్లు ఎదురుచూస్తున్నాయో! నేనూ వస్తాను" అంటూ లేచింది తంతి.

"అవునా ఆ ఫోటోలు, వీడియోలవీ తీసుకుని త్వరలో మీరిటు రావాలి మరి" అంటూ వీడ్కోలు పలికాను.

Sunday, March 15, 2015

పా

        పెళ్ళి కాకుండానే తల్లిని కాబోతున్నానని దానికి తనను ప్రేమించిన వాడు ఒప్పుకోవడం లేదని ఓ కూతురు తల్లితో చెప్పడం... దానికి ఆవిడ సమాజం, తల ఎత్తుకోవడాలు, భవిష్యత్తు, వగైరా, వగైరాలతో తను బెంబేలుపడి తను కూతుర్ని కంగారు పెట్టి గందరగోళం చెయ్యకుండా ఓ దర్శకుడు ఆ కుటుంబాన్ని, ప్రేక్షకులని కాపాడిన అపురూప చిత్రం పా. దర్శకుడు ఆర్. బాలక్రిష్ణన్.

      ఈ జంజాటం అంతా వద్దు అబార్షన్ చేయించుకోమన్న కారణంగా తన ప్రియుడు అమోల్(అభిషేక్ బచ్చన్)కు దూరంగా వచ్చేసి బిడ్డను కంటుంది విద్య(విద్యా బాలన్). కాని ఎలాంటి బిడ్డ పుట్టాడు? ఆరేళ్ళ పిల్లలు అరవై ఏళ్ళ వృద్ధులుగా కనిపించే అరుదైన వ్యాధి ప్రొజేరియాతో. జన్యు కారణమైన లోపం వలన వచ్చే ఈ వ్యాధి బారిన పడిన వారు పదహారేళ్ళకు మించి బ్రతకరు. ఏ పరిస్థితులలో కూడా విద్య అమోల్ సహాయం తీసుకోవాలనుకోక పోవడం ఆ పాత్ర ఆత్మగౌరవానికి నిదర్శనం. ఈ రోజుల్లో హీరోయిన్ పాత్రకు ఇంతటి ఆత్మగౌరవం ఉండడం అరుదైన, అపురూపమైన విషయం కదూ! విద్యా బాలన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు.

      సన్నగా, పీల గొంతుతో ఉండే ఆరో పాత్రలో అంత పొడుగు అమితాబ్ ఎలా సరిపోయారన్నది ఊహకందని విషయం. పైగా డబ్బింగ్ కూడా లేదుట. ఈ సినిమాలో అమితాబ్ తన నటనా కోశల్యం
చూపించారు. ఓ విధివంచితుడైన పిల్లాడి చుట్టూ అల్లిన సినిమాలో హృదయాన్ని పిండేసే సన్నివేశాలు ఏవీ కనిపించక పోవడం ఈ దర్శకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాలో మరో ప్రత్యేకత కథలో ఇమిడిపోయిన హాస్యం. 

      అమ్మమ్మ(అరుంధతీ నాగ్)ను అల్లరి పెడుతూ, సరదాగా సంతోషంగా ఉండే ఆరోకు అసాధారాణమైన తెలివి తేటలు ఉన్నాయి. 'నీ', 'నా' లేకుండా 'మన' అనే భావన ఉండాలని ఓ తెల్లని గ్లోబ్ ను తాయారు చేస్తాడు ఆరో.  ఈ దిశలో ఎవరూ అలోచించి ఉండరు కదూ!


      ఈ సినిమాలో తోటి పిల్లలు ఆరోతో ప్రవర్తించిన తీరు ఎంతో ముచ్చటేస్తుంది. ఆరో తనకు తెలియకుండానే తండ్రికి దగ్గరౌతాడు. వారిద్దరి ప్రయాణం, అమోల్ మీడియా మీద సంధించిన బాణాలు, అమ్మమ్మతో మనవడి అల్లరి ....ఇవన్నీ చూడవలసిన ఘట్టాలు. ఈ సినిమాలో మనం ప్రధానంగా చెప్పుకోవలసింది క్రిస్టీన్ టిన్స్లే , డామినీ టిల్ మేకప్ గురించి.  ఇళయ రాజా సంగీతం సమకూర్చిన శ్రావ్యమైన పాటలను ఇక్కడ వినొచ్చు.



Wednesday, March 4, 2015

పెళయ కావేరి కతలు

        ఆ పొద్దు నిదర లేసే యాళకి సందమామ పరంటికి వాలతా వుండాడు. పిలకాయలు, ఇంటాయినా గుర్రుపెడతా పొణుకోనుండారు. అట్టిట్ట తిరిగి యేదన్నా సదూదామని 'కినిగె' తట్టు యెతుకులాడితే 'ప్రళయ కావేరి కథలు' పొస్తకం ఔపడింది. ఇదేందో కవేరమ్మకు వొరదొచ్చిన కతలాగుండాదే అనుకుంటా పేజీలు దిప్పినాను. మద్దినేళదాకా వొకదానమ్మట వొకటి కతలు సదూతానే వుండిపోయినా. అయ్యేం కతలు... అదేం కతా... సల్ది పొద్దేళదాకా వాకిట్లో ముక్కర్ర గీలా, సుట్టింట్లో సట్టి పొయ్యి మిందకెక్కీలా.

      అసలీ కతలేందీ? ఎవురు రాసినారు? అనుకుంటా వుణ్ణ్యారా. 

"అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మ బాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడా" అన్యాడంట ఓ తాత. ఆ మాటను గుండెల్లో యెట్టుకుని ఆయన మనవడు స. వెం. రమేశ్ పది కాలాల పాటు పెళయ కావేరి మన గాపకల్లో నిలిసిపోయేలా ఈ కతలు రాసినాడు. ఈయన్నీ రాగన్న పట్టెడ, జల్లల దొరువు, కాళాస్తిరి, గొల్లపాళెం, శిరసనంబేడ, ఓటుకుప్పం, నిమ్మాడి తిప్ప, నిడిగుర్తి, నలగామూల, ఓడ పాళెం ఇంకా శానా శానా వూర్లున్యాయి. ఆ వూర్లల్లోని కతలే. 

          ముంతమావిడాకుల యిస్తట్లో ఇంత  వణ్ణం బెట్టుకుని  బెండలం గెడ్డల పులుసు, వంకాయ బజ్జి యేసుకుని కడుపునిండా తిని ఈ వూర్లన్నీ ఓ సుట్టు సుట్టి వచ్చినా.  

     'ఉత్తర పొద్దు' కత చదవతా "ఈ పొద్దు యీడ్నేవుండి రేపు బయదేలిపోండి నయినా. ఉత్తర పొద్దు పెయానం మంచిది కాదు"  అన్నా యినకుండా ఆ ముకుపచ్చలారని పిలకాయలు పెయానం పెట్టుకుంటిరే...పళయ కవేరమ్మ సూరీడుతో కలసే మందల యెరగరే..నీళ్ళలో యెట్ట  యీదులాడతారా... యెట్ట 'జల్లల దొరువు' జేరతారా అని వొకటే యోచన జేస్తిని.

    "ఇంట్లో మొగోడు లేనపుడొచ్చి ఆడకూతుర్ని ఎత్తుకోని పోతావంట్రా ముండమోపి నాయాలా, అడిగే వోళ్ళు లేరనా నీ కంత పోత్రం? నీ యిష్టమొచ్చినట్లు చేస్తే చూస్తా వుండే దానికి మేము పరంటోళ్ళం కాదు, ఈ దామరాయ కాశెమ్మ గొంతులో వూపిరుండగా సీతమ్మ మింద చెయ్యెయ్యి, ఆనేక తెలస్తాది మందల" అని 'కాశెవ్వ బోగాతం' యింటా పకపకా నవ్వినా. యీ నవ్వులినబడితే సెకలు బడతన్నానని కాశెవ్వ నన్ను కూడా తాటి బరకతో వొక్క పెరుకు పీకుతాదేమో!

     నిండెన్నల రెయ్యిలో 'ఎచ్చలకారి సుబ్బతాత' చెప్పే కతలు ఇంటా బక్కోడితో బాటే నేనుగూడా మచ్చు కత్తి పొట్టుకొని గెనాల మింద నడిసినాను.

      అటిక మామిడాకులో పెసల పొప్పేసి యెణిపిన కూరతో అవ్వ ముద్దలు గలిపి పెడతావుంటే ఒకో ముద్దా నోటిలో యేసుకుంటా..."అయ్య మీరెవరయ్యా యింత ఆగడములా కోస్తిరీ, యెవరూ లేని వేళా మీరిపుడు యేకాంతములా కొస్తిరీ" అని అల్లెవ్వ ఊరిందేవి నిద్దర పాట యిణ్యాను.

     యెన్నిట గుడ్లాట ఆడతా బొయ్యి శంకరవ్వోళ్ళ సందులో వుండే "మామిడి చెట్టు కింద కొరివి దెయ్యం" జూసి బెదురు జెరం దెచ్చుకున్న బక్కోడికి, లోలాకులోడికి తిప్పతీగ కషాయం కాసిచ్చినాను.

     "ఆడపిలకాయలు కూడా మగరాయుళ్ళ మాదిర ఆడేదానికి  బయల్దేర్నారు" అని చెంగత్త మూత్తిప్పడం జూసి ఈ మాటగాని ఫెమినిస్టు లెవురన్నా ఇన్యారేమో! ఇపుడేం జగడమౌతదో అని జడుసుకున్నా. అంతట్లోకే "మేం మటుకు ఆడుకోబళ్యా" అని గుండు పద్న అనేసింది. "ఎందిమే ఆడేది, ఇట్నేనా? ఆడపిలకయులు ఆడుకోవాలంటే వామనగుంటలు, అచ్చంగాయలు, గెసికపుల్లలు, గుడుగుడు గొంజెం చికుచికు పుల్ల, బుజ్జిల కూడు, బుడిగీలాట ఇట్టాంటి ఆడుకోవాలగానీ మగపిలకాయిల యెనకాల బొయ్యి బావుల్లో దూకి ఈత కొట్టేదేంది ఆగిత్తం కాకపోతే "అనేసింది చెంగత్త.  దానికి అవ్వ "మేయ్ చెంగమ్మా, వోళ్ళని బోనీ. ఆడేవొయిసులో ఆడాల పాడే వొయిసులో  పాడాల"  అన్యాక చెంగత్త ఊరుకునింది.  
  
       ఆ గాణమ్మ అట్టొచ్చిందో లేదో 'కత్తిరి గాలి' ని గూడా లెక్కజేయకుండా వొంటి చేత్తో సమస్తం సక్కబెట్టేసింది. ఆ యక్కకు ఫేస్ బుక్ అకౌంటోటి సేసి పెడితే నేనిద్జేసినానని ఆ యక్క గోడ మింద బెట్టనూ మనం లైకులు గొట్టనూ.... గోడ కొనాకి ఆ ముచ్చటే నిండి పోయ్యేట్ది.

       ఓ నాడు "అల్లి సుదుగులకని పొయ్యి ఆవు దూడను దెచ్చినారు యాడదిది?" అనిందవ్వ. "యెనకటికి నీ బోటోడొకడు  యెండి బంగారు పోగొట్టుకొని పిడకల కూచి కోసరం యేడిసినాడంట" అని అవ్వని యెగతాళి బట్నాడు తాత." కర్రి వన్నె, మొహం మింద నామం తీసినట్టు తెల్లటి మచ్చ, నడీపన, సట్టుమిందా పుల్ల సారలు, పొందికయిన కొమ్ముల్తో" అందంగా వున్న 'కొత్త సావాసగోడ్ని' జూసి మురుసుకుంటిని.

     'నల్లబావ తెంపు' కతలో "పులింజేది మాది డా, ఇరకం మాది దా. పళవేర్కాడే మాది దా" అని నొచ్చుకుప్పం పట్టపోళ్ళు మాట్లాడతా అమ్మిడికి రాంగానే, నల్ల బావ "ఏందాన్నో, మాటలు బద్దరంగా రానీ. మేము దురాయి కట్టల్నా? మేమేమ్మన్నా పట్టపోల్లమా? ఎల దాటి చేపల యాత కోచ్చినామా? దేనికి కట్టాల దురాయి? అని అరవంగనే బిత్తరతో గుండె దడదడ లాడతా వసంతక్కతో పాటు చెల్లాతమ్మకి మొక్కినా.

      "ఎప్పుడొచ్చినావు పండో" అని పిట్టకి పల్లాయిలు పాడతా ఓటుకుప్పానికి పోయి వొంటి కంబం మిద్దికి బోయినా. జల్లల దొరువుకు 'పద్దినాల సుట్టం'గా వొచ్చి, కడుపులో పెట్టుకొని సాకిన ఆవ్వకు ఊపిరినే బొదులిచ్చిన మిద్దోడు కోసరం కంట తడిపెట్టినాను.

     'తెప్పతిరనాళ'లో మందు కాలేతపుడు ఆకాశ సువ్వలు జనం మిందకి వచ్చేతలికి తోపుడు మొదలవ్వంగనే  ఆ జనంలో లోలాకు  యేడకు బొయ్యినాడో యేందో ఇపిటికీ అయిపులేడు.

     రామనాటకం చూసేదానికి పొద్దు పరంటకీ వొంగి, తూరుపు తట్టు నీడలు లేసె యాళకి మొత్తం తొమ్మిది మంది బయిలుదేలినారు. "ఇంతింతాకు తగును బాలింతకు తగును, మందలో మేకకు తగును, సందులో ఆకుకు తగును, కలుగులో ఎంట్రకాయికి తగును. ఎలుగులో కాకక్రకాయికి తగును, కర్రిపిల్ల మూతి కళింగు మనును" అని అల్లెవ్వ కత అల్లంగనే "రయిక ముడి బీమారం అమ్మగారు, రాకుంటే పీకులాడు అత్తగారు" అంటూ చెంగత్త పైకత అల్లేసింది. ఈ కతలినే 'పుబ్బ చినుకులు' వాళ్లెంట బడినట్టుండాయి.

      పిలకాయిలు కూట్నీల్లూ, పెద్దోళ్ళు కల్లునీళ్ళతో దాహం అణుసు కుంటుండిన వయ్యాశి ఎండల కాలంలోవసంతక్క చేసిన పనికి కళ్ళు తడిశాయి. 


       "అబయా లేసి సూడరా ఎంత బావుండాయో " అన్న అక్క మాటతో అక్క సూపించిన తలికి సూసినాను. "ఆకాశానుండే సుక్కలన్నీ అడివిలోకి వోచ్చేసుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకూ మినమిన మెరిసి పోతుండాది. అడివిమ్మ వొళ్ళంతా తళుకులు అంటుకొని తళతళ వుండాయి. మింట యెగరతా కొమ్మకొమ్మకీ రెమ్మరమ్మకీ యాలాడతా, గుంపులు గుంపులుగా లెక్కలేనన్ని మిణకర బూసులు."  కొంచెపటికి  బావ ఈత కొట్టేది సాలిచ్చి "వసంతా చెవుల పిల్లులు యెట్ట బోయినాయి మే" అని అరస్తా అడిగినాడు. "ఎరగం, సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, చూసేసోస్తాము అంటే కట్టు ముళ్ళు యిప్పినాము. అమాసకాలం గదా, సందమామని యెతకతా యెట్నో పోయినట్టు వుండాయి" అక్కతో పాటు ముసిముసిగా నవ్వేసినాను.

     ఓ నాడు "రాత్రి ఒక పోద్దుకాడ నెప్పులు మొదలయినాయి నా. కుమ్మరోళ్ళ యాగాతక్క కి  పురుడు పోసే దానికి పిలుసుకో నొచ్చినాము ఆయమ్మ యింతసేపూ పోరకాడింది. యిందాకనే బిడ్డ అడ్డం తిరిగింది నా వల్లగాదు పేటకు తోడ్కొని పొండి అనేసింది. బిన్నా బండి కట్టునా" అంటానే కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుబ్బవ్వ"సినమ్మికి తోడుగా దాపటెద్దుని పంపించిందిరా మన పెళయకావేరమ్మ" తాత మాటతో గుండె బరువెక్కిపోయ్యింది. 

       "అత్త పిండిని వుంటచేసి, తట్టి నూన్లో యేసికాల్చి, యెత్తి నిప్పట్ల పీటమింద యేస్తా వుంటే, మామ నిప్పట్లలో నూని కారిపోయ్యేటట్టు వొత్తి ఇంకొక తట్టలో యేస్తా ఉండేది." ఆ నిప్పట్లను పరంటింట్లో పరిసిపెట్టిన యెండు కసువుమింద వరసగా పరిసినాను.

      అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి... ఆ నలుగురు ఆడపొడుసులు వదినని చూసేదానికి ఉరుకులు పరుగులతో వచ్చినారు. కొత్త చేటలో పసుపు, కుంకం, గాజులూ, పూలూ, రైక గుడ్డలూ పెట్టుకొని పెళయకావేరమ్మ ఆడపొడుసులకు సాంగెం పెట్టిచ్చినాను. 
  
     "తాతా ఎన్నాళ్ళిట్ట చేతులు కాల్చుకుంటావు. కంటి సూపు గూడా సదరంగా లేదంటివి. నా మాటిని పేటకు పోదాం రా తాతా. ఎవురికీ లేని పాశం నీకు మటుకు దేనికి తాతా?" అని అడిగినాను. "ఇది అమ్మపాశం. నేను పుట్టిన మూడోనాడే మాయమ్మ జన్నెక్కి సచ్చి పోయిందంట అపిట్నించీ ఈ ప్రళయకావేరమ్మ వొళ్ళోనే నేను పెరిగింది. ఆట ఆడేది, పాట పాడేది, మడక కట్టేది, మాను కొట్టేది, సేద్దం చేసేది, మద్దిస్తం చూసేది అన్నీ ఈయమ్మ వొళ్ళోనే నేర్సుకునింది. అట్టాంటి మాయమ్మని నేనెట్ట మర్సిపోతాను చెప్పు" బొదులిచ్చినాడు తాత. 

 "అబయా, మీ తాత  యెట్ట బోయినాడు రా ?" అని నల్లబావ అనడిగే తలికి ఉలిక్కిపడి లేచినాను. "ఇల్లూ, వాకిలీ, కొట్టామూ, కసువామీ చూసి, బోడోడి  దిబ్బ,పీతిరి దొరువు, ఆరేటమ్మ కయ్యిలు, బాడవ చేను యెతికేటపితికి ఎలుగు పడింది. మీ తాత ప్రళయకావెట్లో పడుండాడు" అని గసబోసుకుంటా చెప్పిన కుమ్మరోళ్ళ రవణన్న మాటతో ఆత్రంగా పరిగెత్తినాను. తాత వోళ్ళమ్మ వొళ్ళో పొణుకోని వొళ్ళెరగని నిదర పోయేది చూసి కళ్ళొత్తుకుంటా యెనిక్కి దిరిగినాను.

    ఆ పంటరంగస్వామి రమేసన్నను సల్లంగా జూడాలి. ఆయన్న యిట్టాంటి కతలెన్నో మనకినిపియ్యాల.

         *           *          *            *      

       స. వెం. రమేశ్ గారు తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివుద్ది కోసం నిరంతర కృషి చేస్తూ, తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్రేతర ప్రాంతాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన తమిళనాడులో తెలుగు భాషా పరిశోధన బోధనా ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగు వాణి' ట్రస్టు సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నారు.