Wednesday, November 30, 2011

కౌముదిలో నా కవిత 'నిర్వేదం'

చెట్టు మీద పిట్ట ఒకటి జాలిగా చూసింది
ఒంటరి నక్షత్రం బాధగా నిట్టూర్చింది!

ఆనవాలు లేని అలజడేదో...
తొంగి తొంగి చూస్తోంది!

ముక్కలైన రోజులన్నీ...
చీకటి మాటున మెసలుతున్నై!

నిన్న మానిన గాయం
కొత్త మందును కోరుతోంది!

మరచిపోయిన సంగతేదో...
దిగులుకు తోడై వచ్చింది!

అంతులేని విషాదానికి
పాత చిరునామా దొరికింది !

నిలకడలేని ఆలోచన
అంధకారాన్ని ఆశ్రయమడిగింది!

రాలిపోయే ఉల్కను చూసి
ఎగిసే అల విరిగి౦ది!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'డిసెంబర్ 'సంచికలో ప్రచురితమైంది. నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Monday, November 28, 2011

ప్రియమైన అమ్మకు,

              చాలా ఏళ్ళయి౦ది కదూ నీకు ఉత్తరం రాసి. అప్పుడెప్పుడో...  “ఫోన్ లో మాట్లాడితే నాకు గుర్తు చేసికోవడానికేం ఉండదు, నువ్వు రాసిన ఉత్తరం అయితే  నేను చాలసార్లు చదువుకుంటాను.అన్నావు కదా, అది గుర్తొచ్చి ఈ ఉత్తరం వ్రాస్తున్నా.

        ఇక్కడ అందరం బావున్నాం. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఇవేకాక ఇంకా ఆటలు, పాటలు, స్నేహితులుఇప్పటి పిల్లలకు అస్సలు తీరికే వుండదు, వారి ప్రపంచంలో వారుంటారు. చిన్నప్పుడు నువ్వు వంట చేస్తుంటే నేను బియ్యంలో రాళ్ళేరుతూనో, చిక్కుళ్ళు తు౦చుతూనో పక్కనే ఉండేదానిని. నేను చదువుతున్నప్పుడు నువ్వు కూడా పేపర్లు దిద్దుతూనో, పాఠం చెప్పడానికి పుస్తకం చదువుతూనో ఆ పక్కనే కూర్చునేదానివి. 

       నువ్వూ, నాన్నా ఏ 'మిస్సమ్మ' గురించో, 'గుండమ్మ కథ' గురించో మాట్లాడుతుంటే తెలియకుండానే మాక్కూడా వాటి మీద ఇష్టం కలిగింది. ఇప్పటికీ ఆ సినిమాలు చాలా నచ్చుతాయి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీ మాటలు కూడా గుర్తొస్తుంటాయి. ఈ పిల్లల్ని పదేళ్ళ క్రితం సినిమా చూడమన్నా ఓల్డ్ మూవీఅనేస్తున్నారు. జీవితంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి, అందుకోవడానికి పరుగులు పెట్టాల్సివస్తుంది.

        ఇంటి ముందున్న తోటలోని గులాబీలు ఈ వేసవిలో చాలా బాగా పూశాయి. గులాబీరంగు పువ్వులయితే ఎంతందంగా ఉన్నాయో! వర్షం పడుతున్నప్పుడు ఫోటో తీశాను, చాలా బాగా వచ్చింది. ఈ సారి దారి  పక్కనంతా బంతి మొక్కలు నాటాం. మొన్నటి వరకు పూజకు అవే పెట్టాను. చలికాలం వచ్చిందిగా కరివేప, మల్లెమొక్కల్ని ఇంట్లో పెట్టాము. 


       పిల్లల బట్టల కోసం మొన్న షాపింగ్ కి వెళ్ళాము. స్కూల్ తెరిచే ముందు వేసవిలో మనం అలానే వెళ్ళేవాళ్ళం కదూ! ఎక్కువ బట్టలు అప్పుడే కొనేవాళ్ళం, ప్రతి పండక్కీ దాచుకుని వేసుకునేదానిని. పండగంటే గుర్తొచ్చిందీ, సంక్రాంతికి నువ్వు ముగ్గులు వేస్తుంటే నేను రంగులు వేసేదాన్ని కదూ! ఇప్పుడా ముగ్గులూ, ర౦గులూ రెండూ లేవు. 

         మొన్నోరోజు నువ్వు చేసినట్లే మైసూర్ పాక్చేద్దామని మొదలెట్టాను. నీ అంత బాగా రాలేదు గానీ... పిల్లలకు నచ్చింది. పాపకు ఆల్జీబ్రాచెప్తుంటే 'యు అర్ సో స్మార్ట్అని సర్టిఫికేట్ ఇచ్చింది. అమ్మమ్మ అయితే ఇంకా బాగా చెప్పేదని చెప్పాను. అప్పుడు నువ్వు నేర్పిందే... నాకిప్పటికీ గుర్తుంది, ఒక్కొక్క చాప్టర్ ఎన్నిసార్లు చేసేవాళ్ళమో! చాలా సరదాగా ఉండేది. 

          నేనీ మధ్య కొన్ని నాటికలు రాశాను. పిల్లలతో వేయిస్తుంటే సరదాగా అనిపించింది. నువ్వు దగ్గరుండి చూస్తే నాకు తృప్తిగా ఉండేది. నేను కొత్త అడుగు వేసినప్పుడల్లా ఆలోచన నీవైపే సాగుతుంది. ఈ మధ్యే  బ్లాగ్ మొదలు పెట్టాను. కొంచెం రాయడం అలవాటయింది. నువ్వు నెట్  చూడవుగా, అన్నీ నీకు చూపించాలనిపిస్తుంది. బ్లాగ్ లో విజిటర్స్ ని చూసినప్పుడల్లా ఇంటికి చుట్టాలొచ్చినట్లు ఎంత సంబరంగా ఉంటుందో! కొన్ని కొన్ని కామెంట్లు ఎంత సరదాగా ఉంటాయనుకున్నావు... మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. 

            చాలా సంవత్సరాలయ్యింది, ఇలా నీతో కబుర్లు చెప్పి. ఎన్నో చెప్పాలి నీకు. నా కవితలూ, నాటికలు అన్నీ చూపించాలి. అవునూ, ఇవాళ నీ పుట్టినరోజు కదూ! శుభాకాంక్షలు చెప్దామంటే చిరునామా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఈ కబుర్లన్నీ నిన్ను చేరేదెలా...


ప్రేమతో 
నీ 
జ్యోతి       


Saturday, November 26, 2011

చుక్కల కింద చక్కని రోజులు..తరువాయి భాగం

      తరువాత రోజు నిద్రలేచి టెంట్ బయటకు రాగానే అత్భుతమైన దృశ్యం, తెలిమంచు తెరల్లో ప్రకృతి. చెట్ల మధ్యలో దోబూచులాడుతూ రవి కిరణాలు ఎంత  అందంగా వున్నాయో! కాళ్ళ కింద మెత్తగా తగులుతున్న మట్టినేల, స్వాగతమంటున్న చల్లగాలి, చూపులు సాగినంత మేరా నిర్మలమైన ఆకాశం. రాత్రి చీకట్లో కనిపించలేదు కానీ, మధ్యలో స్థలం వదిలి, చుట్టూ టెంట్లు వేసికున్నాం, ఒక పక్కగా కారు దగ్గరకు వెళ్ళడానికి దారి, మరో పక్క పిక్నిక్ టేబెల్,  బార్బిక్యూ గ్రిల్, కొంచెం దూరంగా షెల్టర్, 

             మాలాగే కా౦పింగ్ కి వచ్చిన వాళ్ళ టెంట్స్ దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఓ ఇరవయ్ అడుగుల దూరంలో రెస్ట్ రూమ్స్, ఓ ఫర్లాంగ్ దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. సైట్ మొదట్లో ఓ చిన్న స్టోర్, అందులో ఫైర్ వుడ్, సాల్ట్, వాటర్, మెడిసిన్స్, స్నాక్ పాకెట్స్ లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అన్నీ అధిక ధరల్లోనే ఉన్నాయనుకోండి. అన్ని సైట్లకూ మధ్యగా వాలీబాల్ కోర్ట్. చెట్ల మధ్యగా వాకింగ్ ట్రైల్స్ కనిపిస్తున్నాయి. 

        ఇవన్నీ చుట్టేసి వచ్చి ఇక పనిలో పడ్డాం. ఒకళ్ళు సిలిండర్ బిగిస్తే, ఇంకొకరు దోశపిండిని ఐస్ బాక్స్ లోంచి తీశారు, మరొకరు టేబుల్స్ సర్దారు ఇలా తలా ఒక పని ఆడుతూ పాడుతూ చేశాసామన్నమాట. ముందుగా దోశెల కార్యక్రమం మొదలు పెట్టాం. చిరుచలిలో వేడివేడి కారం దోసలు, ఆమ్లెట్ దోసెలు, ఉల్లిదోసెలు ఇలా రకరకాల దోసెలు. మాలో 
బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళు కొందరు. వాళ్ళు అవి కూడా వేయడం మొదలు పెట్టారు. ఇలా టిఫిన్ సెక్షన్ ఎంజాయ్ చేశాం. తరువాత హికింగ్ పేరుతో చెట్టూ, పుట్టా తిరిగేసి పిట్టల్ని పలకరించి వచ్చి, కే౦పింగ్ చైర్స్ లో సెటిల్ అయ్యాం. ఉత్సాహం కాస్త ఎక్కువ పాళ్ళలో వున్నవాళ్ళు బైక్ రైడింగ్ కెళ్ళారు.  


        ఆ తర్వాతేముందీ, ఓపెన్ ఎయిర్ లో కడిగిపారేసి, తాట తీయడాలు,  తొక్కు వలవడాలు చేస్తుంటే భలే వుందిలే! "వారెవ్వా.. ఎవరినీ?” అంటారా, కూరగాయలనండీ. కళ్ళు మూసి తెరిచేంతలో టొమాటో పప్పు, దొండకాయ వేపుడు, పచ్చడితో వేడి వేడి భోజనం రెడీ(ఎంత సేపు కళ్ళు మూశామో మీరడగకూడదూ మేం చెప్పకూడదూ). అందరం భోజనాలు కానిచ్చి, ఆ వెచ్చటి మధ్యాహ్నపువేళ, చల్లగా చెట్ల కింద కూర్చుని చిన్నప్పటి కబుర్ల చెప్పేసుకుని, ఎప్పుడో మరచిపోయిన మధురఫలాలు తేగలు, రేగుపండ్లు, ఈతకాయలు, నేరేడుపళ్ళూ లాంటి వాటిని గుర్తుచేసికుని, అలా బాల్యంలోకి విహారానికి వెళ్ళాం. ఇక జూనియర్స్, వాళ్ళిష్టం వచ్చినట్లు చెట్లూ పుట్టలూ ఎక్కేసి దూకేసి, పరిగెత్తి ఆకలేసినప్పుడు దొరికినవేవో తినేసి అసలు సిసలు పిల్లలైపోయారు.. కేంప్ సైట్ లో వారు ఎక్కడికైనా తప్పిపోతారన్న కంగారు వుండదు.

          మధ్యాహ్నం దేశవాళీ వంటలు తిన్నాంగా, సాయంత్రం బార్బిక్యూ గ్రిల్ మీద ముష్రూమ్స్, కాప్సికమ్స్, ఆనియన్స్, కార్న్, యాం లాంటి వాటిని గ్రిల్ చేశాం. పాటీస్ గ్రిల్ మీద పెట్టి లెటస్, టొమాటోస్, మేయొనైజ్ లతో బర్గర్ ఫిక్స్ చేసి డిన్నర్ కానిచ్చాం. అన్నీ సర్దేసరికి సందెపొద్దు నల్లనై౦ది. ఆ చీకట్లో అంత్యాక్షరి  పేరుతో ఇష్టమైన పాటలన్నీ పాడుకున్నా౦. ఘంటసాల గారు ముఖ్య అతిధి.

       ఆరుబయట పండువెన్నెల.....వెలుగులు చి౦దుతూ అందాల చందమామ...చుక్కలచీర కట్టిన నల్లని ఆకాశం... చిత్తరువులై నిలిచిన పొడవాటి చెట్లు...చుట్టూ నిశ్శబ్దం... మంచుకురుస్తూ చిరుచలి....ఆ వెన్నెలరాత్రి ఎంత బావుందో! అమెరికా సిటీస్ లో ఆకాశం, అర్ధరాత్రికూడా నీలంగానే ఉంటుంది నియాన్ లైట్ల మహిమేమో. ఇలా అందమైన నక్షత్రాల్ని చూడడానికైనా సంవత్సరానికోసారి క్యాంపింగ్ కి వెళ్ళాలనుకున్నాం. 


మరిచేపోయాను క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నామండోయ్. ఆ ఫైర్ లొ పిల్లలు 'మాష్మల్లోస్' వేడిచేసి 'గ్రాండ్ క్రేకర్స్', 'చాకొలేట్'తో స్నాక్ కూడా చేసుకున్నారు. అక్కడ సర్దడానికి, పెట్టడానికి ఏం వుండవుకదా కారులో కొన్ని, టెంట్ లో కొన్ని, ఐస్ బాక్స్ లో కొన్ని, వస్తువులు పెడతాం. దీనితో పది నిముషాల్లో చేసే పనులన్నీ ఓ గంటపట్టి ఈ ఫాస్ట్ లైఫ్ ని కొంచెం స్లో డౌన్ చేస్తాయి. ఆ రోజు బ్రేక్ ఫాస్ట్ పూరీ కూరా, సీరియల్, పీనట్ బటర్ సాండ్ విచ్.  

         బ్రేక్ ఫాస్ట్ తరువాత ఔత్సాహికులందరూ వాలీబాల్ ఆడి, బాల్ భరతం పట్టారు. కొందరేమో పిల్లల్తో  కలసిపోయి గుజ్జనగూళ్ళూ, కోతికొమ్మచ్చి ఆడారు. ఆ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ కుర్మాతో భోజనం. భుక్తాయాసం తీరగానే అందరం సరదాసరదాగా 'డంషార్ ఆర్ట్స్' ఆడాం, ‘జూ లకటక’ సినిమా ఆ రోజు హైలైట్. ఇక రాత్రికి పావుభాజీ పలహారం. ఆ విధంగా కాలం వైపన్నా చూడక ఆ రోజు కూడా గడిపేశాం. 
  
       ఇక ఆదివారం, మెల్లగా కదిలింది కాలం. వస్తువులన్నీ సర్ది తిరగి కార్లెక్కించేసరికి  మధ్యాహ్నం అయ్యింది. ఆ ప్రదేశాన్ని వదలడం కార్లక్కూడా ఇష్ట౦లేనట్లు భారంగా కదిలాయి. తిరిగి వచ్చేదారిలో ఒక అత్భుతాన్ని చూశాం.  అదే 'షా౦డ్లియర్ ట్రీ', సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న చెట్టు. పంతొమ్మిది వందల ముప్ఫైలో ఆ చెట్టుబెరడుని తొలిచారట. అందులోనుండి కార్లు కూడా వెళ్ళొచ్చు. అంత పెద్దపెద్ద చెట్లున్న ఆ పార్క్ చాలా నచ్చింది.

          అందరం ఇలా కలసి మెలసి మూడు రోజులు ఒక కుటు౦బంలా మెలగడం ఎక్కువ ఎంజాయ్ చేసామో..కేంపింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసామో చెప్పడం కష్టం. పిల్లలకు అమ్మ నాన్నలు కాకుండా మిగిలిన వారితో అనుబంధం ఏర్పడడానికి నాంది ఇలాంటి విహారాలనే చెప్పొచ్చేమో! అలా మా తొలి కేంపింగ్ అనుభవాల్ని పదిలంగా మూట కట్టుకుని ఇంటికి చేరాం. తరువాత ప్రతి సంవత్సరం కేంపింగ్ కి వెళ్తున్నాం కాని, ఈ కేంపింగ్ మాత్రం చాల ప్రత్యేకంగా మా మనుసుల్లో నిలిచిపోయింది.