Friday, April 2, 2021

పెళ్ళికూతురు

 

ముందు రోజు సంగీత్ నుండి ఆలస్యంగా వచ్చామా అయినా త్వరగా లేచేసాం. మరి పెళ్ళికూతురికి తొమ్మిదన్నర లోపు నలుగు పెట్టాలిట. నిద్ర లేచిన వాళ్ళం లేచినట్లు త్వరత్వరగా తయారవుతున్నాం. మా మరదలు, తొడికోడలు పెళ్ళి కూతురిని, పిల్లలను రెడీ చేసే హడావిడిలో ఉన్నారు.  

ఇక్కడ ఏ రెస్టారెంట్ లో కూడా వారాంతంలో తప్ప వారం మధ్యలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇవ్వరు. ఇంటి దగ్గర చేసే వాళ్ళకు ముందుగా చెప్పాను కానీ వాళ్ళకేదో ఇబ్బంది వచ్చిందిట. చేయలేకపోయారు. ఇక త్వరగా అయిపోయేది ఉప్మాయేగా అందుకని ఆ రోజు ఉప్మా చేసాను. అదే చేత్తో సాంబార్ కూడా చేయడం మొదలు పెట్టాను. మిగిలినవన్నీ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చేసాము. ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా ఫ్రెండ్స్ ఐదుగురు వచ్చారు. రావడం రావడం నా చేతిలో గరిటె తీసుకుని ఒక్క కిచెనే కాదు పనులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇన్ని రోజులు మేము మిస్ అయింది ఇదే. అమెరికాలో ఎవరి ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్నా మొదటి నుండి ఈవెంట్ పూర్తి అయి అన్నీ సర్దుకునే వరకు ఓ నలుగురం నిలబడి పోతాం.

మా తోడికోడలు, మరదలు పాపం పెద్ద వాళ్ళు ఎవరూ లేక బాధ్యత భుజాన వేసుకోవాలసి వచ్చింది కానీ వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళే. మా ఫ్రెండ్స్ వచ్చారుగా మమ్మల్ని ఈవెంట్స్ ఎంజాయ్ చేయమంటూ ఆ రోజంతా గంధం, అక్షింతలు కలిపినా, టిఫిన్స్ ప్లేట్స్ లో సర్దినా, టీలు, కాఫీలు పెట్టినా అన్నీ వాళ్ళే చూసుకున్నారు. 
 
సంగీత్ కు వెళ్ళేముందే బ్యాక్ డ్రాప్ పెట్టేసామని చెప్పాను కదా! దాని ముందు ముగ్గు వేసి మూడు పీటలు వాల్చి వాటి మీద అంచున్న తెల్లని కొత్త పంచె పరిచాము. ఒక పళ్ళెంలో నెయ్యి, సున్నిపిండి, గంధము, కుంకుమ, అక్షింతలు పెట్టి, మరో పళ్ళెంలో తమలపాకులు, వక్కలు అరటిపళ్ళతో తాంబూలాలు సిధ్ధం చేసాము.

న్యూజెర్సీ నుండి వచ్చిన కజిన్స్ కు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఆ బుజ్జి పిల్లలే తోడుపెళ్ళికూతుర్లు. తొమ్మిది గంటలకు పెళ్ళికూతురిని, తోడు పెళ్ళికూతుర్లను పీటలమీద కూర్చోబెట్టాము.

ముగ్గురికీ ముందు నెయ్యి, సున్నిపిండి రాసి ఆ  తరువాత గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసాము. పిల్లలిద్దరూ కూడా బుద్దిగా కూర్చుని అన్నీ చేయించుకున్నారు.





మెడలో స్టెత్ వేసుకుని కాలేజ్ కి పరిగెత్తే వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపించింది.
నలుగు పెట్టిన వారందరికీ పెళ్ళికూతురు, తోడు పెళ్ళికూతుర్లు ఇద్దరూ తాంబూలాలు ఇచ్చారు. 

పెళ్ళికూతురు సిగ్గు పడలేదు కాని ఆ బుజ్జి పాప సిగ్గుపడి పోయి వంచిన తల ఎత్తలేదు.

అత్తలందరూ పెళ్ళికూతురికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసారు. 

ఆ కార్యక్రమం పూర్తయ్యాక స్నానం చేసి ఈ రోజు కోసమని వాళ్ళ పిన్ని ముచ్చటపడి కంచి నుండి తెచ్చిన గులాబీ రంగు పట్టు చీర కట్టుకుని వచ్చింది పెళ్ళికూతురు. కళ్యాణం బొట్టు, బుక్కన చుక్క పెట్టడంతో పెళ్ళికళ వచ్చేసింది.

అత్త మామ, పిన్ని బాబాయి, నాన్నమ్మ పెళ్ళికూతురిని ఆశీర్వదించి వాళ్ళు ఇవ్వాలనుకున్న కానుకలు ఆ వేళే ఇచ్చారు. మాకైతే వాళ్ళు  అందరూ ఇంత దూరం రావడమే అతి పెద్ద కానుక అనిపించింది, ఇలాంటి రోజుల్లో. పెళ్ళికి వచ్చిన బంధువులు, నలుగు పెట్టడానికి వచ్చిన ఫ్రెండ్స్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

బుజ్జి పండు ఈ వేడుక నంతా పెళ్ళికి రాలేని మా నాన్నకు ఇంకా దగ్గరి బంధువులకు జూమ్ లో చూపించాడు. 

పెళ్ళి కుదిరే వరకూ త్వరగా కుదిరితే బావుండని అనుకున్నాను. ఇప్పటి వరకూ పెళ్ళి హడావిడిలో పెద్దగా అనిపించలేదు కానీ ఇవాళ మాత్రం కొంచెం బాధ సంతోషం కలగలిసిన భావన. చిట్టితల్లికి ఇక నుండీ తన ఇల్లు, తన సంసారం, తన లోకం తనది కాబోలు. హఠాత్తుగా మనస్సు ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళింది. పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పటి నుండీ అప్పుడప్పుడూ తొంగిచూస్తున్న జ్ఞాపకాలు ఇవాళ మూకుమ్మడిగా చుట్టుముట్టాయి.

మా అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉంటుంది కదూ! ఇవాళ మా ఇంట్లో జరుగుతున్న ఇలాంటి హడావిడి మా పెళ్ళి వీడియోలో ఎన్నో సార్లు చూసాను. అమ్మ, పిన్నీ వాళ్ళు, అత్తా వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరి మొహాల్లో సంబరం. మా పెళ్ళి తరువాత అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటుంది? తాను ఉండి ఉంటే ఆ కబుర్లన్నీ చెప్పుకునేవాళ్ళం. ఈ వేడుకలేవీ చూడకుండానే, అసలే వేడుకలూ చూడకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. తాను ఊహించినట్లుగా నా జీవితం మలుపు తిరిగే నాటికి తానే తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయింది. ఆపుకోలేని దుఃఖం ఆ క్షణాన నన్ను కమ్మేసింది. అమ్మ పెళ్ళిలో నాకిచ్చిన కానుకలు రూపం మార్చి అమ్మమ్మ జ్ఞాపకంగా చిట్టితల్లికి ఇచ్చాను.

****  

ఒకరోజు ఏదో పెళ్ళి వీడియో చూస్తూ మనం కూడా ఇలా పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుక్కీ  మంగళ స్నానాలు కలిపి చేయిస్తే బావుంటుంది అనుకున్నాం. అనుకున్నదే తడవుగా పెళ్ళికొడుకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని పెరట్లో పందిరి వేసి కావల్సిన కర్టెన్స్ ఇండియా నుండి తెప్పించి చలిలో నాలుగు గంటల పాటు ఆ పందిరిని ముస్తాబు చేసారు. ఏర్పాట్లయితే చేసాము కానీ అమెరికాలో డిసెంబర్ నెలలో ఆరుబయట మంగళ స్నానాలు కుదిరేపని కాదనే నిర్ణయానికి వచ్చాం. ఆశ్చర్యంగా ఆ రోజు వాతావరణం చాలా బావుంది.

మగపెళ్ళివాళ్ళు కూడా ఆ రోజు ఉదయమే వాళ్ళింట్లో పెళ్ళికొడుకుని చేసుకుని మధ్యాహ్నం ఇక్కడకు వచ్చారు.  ఇంట్లో అందరం పసుపు బట్టల్లోనూ, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మాత్రం అరేంజ్ కలర్ బట్టల్లోనూ ముస్తాబయ్యారు. పెళ్ళికూతురు పువ్వులతో చేసిన అభరణాలు పెట్టుకుని గమ్మత్తుగా తయారయ్యింది.


లోవ్స్ నుండి పెద్ద పెద్ద పాట్స్ తెచ్చాము కానీ, వాటిలో నీళ్ళు పోయగానే కింద ఉన్న రంధ్రం నుండి అన్నీ కారిపోయాయి. ఇలా కాదని ఇంట్లో వున్న చిన్న చిన్న బకెట్లు, చెంబులతో వేడినీళ్ళు పట్టి జల్లెడ మీదుగా పోసి మంగళ స్నానాలు చేయించాం. ఈ పువ్వులు కట్టడం పువ్వులు కలపడం అన్నీ అప్పటికప్పుడు చేసుకున్నాం. 


మంగళ స్నానాల అర్థం ఏమిటంటే సిరిసంపదలతో సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ వధూవరుల మంగళం కోరుకుంటూ చేయిస్తారట.

నీళ్ళు చూసేసరికి పిల్లలంతా చాలా సరదా పడ్డారు. 
  


స్నానాలవగానే  మగపెళ్ళివాళ్ళంతా టీ లవీ తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పెళ్ళికూతురు ప్రదానానికి తయారయ్యేలోగా నేనూ, మా తొడికోడలు, మా మరదలు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా అందరమూ కూర్చుని తలంబ్రాల బియ్యం కలిపా౦. ఈ బియ్యం కలపడానికి ఓ లెక్క ఉంటుందట. దాని ప్రకారమే కలిపాము. అప్పుడే వడికట్టు బియ్యం కూడా కలిపి ఒక టవల్ లో మూట కట్టాము.  


మగపెళ్ళి వాళ్ళు ఆ సాయంత్రం ప్రదానం తీసుకుని వచ్చారు. 


అందులో ఆకులు, వక్కలూ, బెల్లమూ, కొబ్బరి చిప్పలూ, మంగళ సూత్రం, పండ్లు, పువ్వులూ, చీరలూ, నగలూ, మేకప్ ఐటమ్స్ తెచ్చారు. మిగిలనవన్నీ తీసి ఆకులు వక్కలూ కొబ్బరి చిప్పలూ మాత్రం ట్రేలో ఉంచాము. పెళ్ళికూతురు మూడు దోసిళ్ళతో తీసి ఒళ్ళో వేసుకుని అందులోంచి మూడు పిడికిళ్ళు తీసి మళ్ళీ ట్రే లో వేయాలట. అది ఎందుకో ఏమిటో నాకు తెలియదు.




మామూలుగా అయితే అత్తవారు పెట్టిన చీర కట్టుకుని ఈ ఆకు వక్క తీసుకోవడం చేయాలిట. చెప్పాగా మా కంతా కొత్త పైగా పెళ్ళికొడుకు వాళ్ళకు ఇలా ప్రదానం తీసుకువచ్చే ఆచారం లేదట. వాళ్ళ వైపు ఎవరితోనైనా పంపిస్తారట. పెళ్ళికూతురు ఆ కొత్త చీర కట్టుకుని అందరికీ తాంబూలం ఇచ్చింది. 


పెళ్ళికొడుకు వాళ్ళే ఇంట్లో అందరికీ రామ్ రాజ్ పంచలు, సిల్క్ చొక్కాలు తీసుకుని వచ్చారు. ఆ బ్యాక్ డ్రాప్ వెనుక కత్తులు, కొడవళ్ళు లాంటివేమీ లేవు. పామిస్ :). 

వాళ్ళ డ్రస్సింగ్ ఆ సాయంత్రానికి కొత్త అందం తెచ్చింది. 


ఆ రోజు రాత్రి పులిబంగరాలు(పునుగులు), మునక్కాయ టమోటో కూర, బెండకాయ వేపుడు, బీరకాయ పచ్చడి, పులిహోర, సాంబారు, అరిసెలు, మైసూర్ పాక్ లతో భోజనం చేసాము.

ఆ రోజు ఉదయం వచ్చిన ఫ్రెండ్స్ మంగళస్నానాలు అయ్యాక వెళ్తామన్న వాళ్ళు కాస్తా సాయంత్రం ప్రదానం పంచుకునే వరకు అలాగే ఉండి పోయారు. ఒకదాని తరువాత ఒకటి ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి మరి. మమ్మల్ని ఆ హడావిడిలో వదిలి వెళ్ళడానికి వాళ్ళకు కష్టంగా అనిపించిందిట. 

పెళ్ళికి వచ్చిన వాళ్ళలో ఒక్కరో ఇద్దరో తప్ప అందరూ డ్రైవ్ లోనే వచ్చారు. ఫ్లైట్ లో వచ్చిన ఆ ఒకరిద్దరూ కూడా కోవిద్ టెస్ట్ చేయించుకుని వచ్చారు. ఎప్పటినుండో మా అమ్మాయి పెళ్ళికి రావాలని ఎదురుచూస్తున్న దగ్గర బంధువులు స్నేహితులు కూడా ఫ్లై చేయడం రిస్క్ అని రాలేకపోయారు. వాళ్ళు కూడా ఉంటే బావుండేదని చాలా సార్లు అనుకున్నాము.

ఇప్పటివరకూ అన్నీ అనుకొన్నవి అనుకున్నట్లుగానే జరిగాయి. పైకి అనుకోలేదు కానీ మనసులో మాత్రం భయంగానే ఉంది. ఇంకొక్క రోజు సరిగ్గా గడిస్తే అన్నీ నిర్విఘ్నoగా జరిగినట్లే. 

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలుపెళ్ళికి కావలసినవిఅలంకరణఅరిసెలూ అవాంతరాలుస్వప్నలోకంనిశ్చయ తాంబూలాలుమెహెందీ , సంగీత్ అంటూ తొమ్మిది రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.