Monday, April 12, 2021

పారిజాత పరిమళాలు

 “పెళ్ళిసందడి అంతా సరదాగా వ్రాసారు, లోపల జరిగే చికాకులు ఎవరైనా చెప్పుకుంటారా ఏమిటి?” అనుకుంటున్నారు కదూ! 

ఒక్క చిన్న మాట, అసంతృప్తి లేకుండా పెళ్ళి అక్షరాలా సరదాగానే జరిగింది. ఈ క్రెడిట్ అంతా కొత్తగా మా కుటుంబసభ్యులైన అన్నయ్య వదినలకే ఇస్తాను. ఎందుకంటే పెళ్ళి అనుకున్న రోజునే మమ్మల్ని వారు వారి కుటుంబంలో భాగస్వాములను చేసుకున్నారు. “ఇది మన ఇంట్లో పెళ్ళి మనం చేసుకుంటున్నాము” అన్నారు. అదే మాట ఈ నాటికీనూ. మీకు కుదిరినట్లు మీరు చేయండి, మాకు తోచింది మేము చేస్తాం అన్న పరిణితి వాళ్ళది, అదే సంస్కారం వారి పిల్లలిద్దరిదీనూ. తల్లి సంస్కారమే కదా పిల్లలకు వస్తుంది. ఈ విషయంలో పెద్దపీట నేను మా వదినమ్మకే వేస్తాను. ఎప్పుడైనా మాటల్లో నేను, మీ చిన్న కోడలు అంటే వెంటనే సవరించే వారు మా చిన్నమ్మాయి అని. పెద్ద కోడలితో వారిద్దరూ అమ్మా నాన్నలనే పిలిపించుకుంటారు.

మా అమ్మాయికి పెళ్ళి చేస్తే మాకు ఎలాంటి అల్లుడు వస్తాడా అని కంగారు పడ్డాం కానీ మా ఇంటికి పెద్ద కొడుకు వచ్చాడు. పెళ్ళికొడుకు, తన అన్నా, వదిన వీళ్ళు ముగ్గురూ కూడా అరేంజ్ మెంట్స్, డెకరేషన్స్, పెళ్ళి బట్టలు ఆర్డర్ ఇవ్వడం ఇలా అన్నింటిలో ఎంతో సహాయం  చెసారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన వాళ్ళు పక్కనే ఉన్నారు అనే ధైర్యం కలిగించారు. పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య వయస్సులో చిన్నవాడయినా ఈ పెళ్ళి బాధ్యత అంతా భుజాన వేసుకుని చక్కగా నిర్వర్తించాడు. నవంబర్ వరకూ మాకు ఆరుగురు పిల్లలు ఇప్పుడు తొమ్మిదిమంది.


మా అదృష్టం ఏమిటంటే ఇటు అమెరికాలో ఉన్న మా తమ్ముడు వాళ్ళు, ఇండియాలో ఉన్న మా మరిది వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవడం. మా మరిది వాళ్ళు మేము ఇక్కడి నుండి వెళ్ళనవసరం లేకుండా పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ ఇండియా నుండి తీసుకుని వచ్చారు. ఈ కరోనా టైమ్ లో కూడా సకుటుంబ సమేతంగా వచ్చారు. అసలు వాళ్ళంతా రాకపోతే ఇంత సందడే ఉండకపోను. ఇక్కడ మేము చేస్తున్న పనులేవీ వాళ్ళకు అలవాటు లేకపోయినా నలుగురూ ప్రతి పనిలో సాయం చేసారు. పెద్దావిడ మా అత్తయ్య కూడా మనవరాలి పెళ్ళి చూడడానికి ఇండియా నుండి ఇంత దూరం వచ్చారు.

మా తమ్ముడు వాళ్ళు పెళ్ళి కుదిరిన రోజు నుండీ మా పక్కనున్నట్లే. ప్రతిరోజూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ ఉంటూనే ఉండేవి. ఒక్క ఊరిలో లేమన్న మాటే కానీ ప్రతి నిర్ణయమూ కలసే తీసుకున్నాము. మా మరదలితో నేను మనసులో ఏ మాట చెప్పడానికి ఫిల్టర్ పెట్టనవసరం లేదు. మా కళ్ళ ముందే పుట్టి పెరిగిన మా మేనకోడలు ఇంట్లో జరుగుతున్న ప్రతి పనిని, సరదా సన్నివేశాలను  ఫోటోలు వీడియోలు తీసి పెళ్ళి తరువాత ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో పంపించింది. ఇన్ని రోజుల సంతోషానికి తీపి గుర్తు అది. ఏడుగంటలు ప్రయాణం చేసి మా మరిది వాళ్ళను వాషింగ్టన్ డి సి నుండి తీసుకొచ్చి మళ్ళీ అక్కడకు వెళ్ళి ఎక్కించే బాధ్యతను మా తమ్ముడు మరో కజిన్ తీసుకున్నారు.

వీళ్ళే కాక బెంగుళూరులో వున్న కజిన్ చేసిన సహాయం అక్షరాలకు అందనిది. నేను చెప్పినవే కాక పెళ్ళికి ఇంకేం కావాలో కూడా చెప్పి అన్నీ తీసుకుని పంపించింది. తన సహాయం లేకపోతే డెకరేషన్ కానీ, పెళ్ళికి కానీ కావలసిన వస్తువులను సేకరించడంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కూతురు పెళ్ళి జరిగి మూడు రోజులవ్వలేదు “పెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయని” పలకరించి అతి పెద్ద బాధ్యత భుజాన వేసుకుని కావసిన నగల ఎంపికకు సహాయం చేసారు నంద్యాలలో ఉన్న మరో ఫ్రెండ్. అన్నీ కొనడం అయిందా ఇంకేమైనా కావాలా అంటూ పలకరించి నెల్లూరు లో ఉన్న ఓ ఫ్రెండ్ మిగిలిన షాపింగ్ అంతా పూర్తి చేసారు.

మా పాప క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్ళికి ఐదురోజుల ముందే వచ్చి, పెళ్ళి కూతురికి కావలసివాటి దగ్గర నుండీ ప్రతి ఈవెంట్ కి ముందుగానే కావలసిన బట్టలు నగలు తీసి పెట్టడం వరకూ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇవే కాక ఇంట్లో అన్ని పనులూ అందుకున్నారు. ఈ పిల్లలిద్దరూ వచ్చాక నేను పెళ్ళి కూతురి గురించి ఆలోచించ కుండా పెళ్ళి పనులు చూసుకునే వీలు చిక్కింది. వీళ్ళలో ఒకరికి ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ అమ్మాయి వాళ్ళాయన కలసి వచ్చారు. పెళ్ళి కూతురికి పూల పందిరి పట్టుకోవడానికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నాలుగో వాళ్ళు ఎవరూ అని వెతుక్కుంటుంటే “నేను పట్టుకుంటాను ఆంటీ, తన ఫ్రెండ్ అంటే నా చెల్లి” అంటూ ఆ అబ్బాయి చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను.

“పెళ్ళికి పిలవక్కర్లేదు కానీ పనులు మాత్రం చెప్పండి” అంటూ మొత్తం అన్ని రోజులూ మా పక్కనే ఉండి సహాయం చేసిన వారొకరు, “ఏమన్నా హెల్ప్ కావాలా?” అని వాట్సాప్ లో నాలుగు రోజులకు ఒకసారి మెసేజ్ పెట్టి మరీ సహాయం చేసిన వారొకరు. కొబ్బరి బోండాం ను అందంగా అలంకరించిన వారొకరు, దాదాపుగా ప్రతి రోజూ మేము ఏం చేస్తున్నామో కనుక్కుని ఏమన్నా సహాయం కావాలా అంటూ వెన్నంటే ఉన్నవారొకరు. 

పెళ్ళి, హంగామా అంటేనే ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకోవాలి? ఎంత ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఏ సమయంలో ఫోన్ చేసినా ఓపిగ్గా విని తగిన సలహాలు ఇచ్చిన వారొకరు. జ్యూయలరీ కొనడం దగ్గర నుండీ కావలసిన సమాచారం అందిస్తూ దాదాపుగా రెండు నెలలు పక్కనే ఉండి సహాయం చేయడమే కాక, పెళ్ళికూతురి చీరలన్నీ పొందికగా కుచ్చిళ్ళు పెట్టి చక్కని మడతలు వేసిచ్చిన వారొకరూ. నలుగు పెట్టడానికి వచ్చి వంటగది మొత్తం హాండ్ ఓవర్ చేసుకున్న వారొకరు. కావలసిన వస్తువులన్నీ పంతులు గారికి అందిస్తూ పెళ్ళిపెద్ద బాధ్యత వహించిన వారొకరు. మండపానికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకున్నవారు కొందరు. పూల కార్లను ముస్తాబు చేసిన వారు మరికొందరు.

ఇందరి అభిమానం మా మనసులలో పారిజాతాలై కురిసింది. మా హృదయాలలో ఆ పారిజాత పరిమళాలు ఎప్పటికీ వెదజల్లుతూనే ఉంటాయి.
ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి కూడా సందేహించే ఈ రోజుల్లో పెళ్ళికి రావడం సాహసమనే చెప్పాలి. ఎంతో అభిమానంతో పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన బంధువులకు, మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

ఈ పెళ్ళి కబుర్లు రాయాలని పట్టుబట్టి నాచేత రాయించి, మొదటి ప్రతి చదివి అద్బుతంగా ఉంది బ్లాగ్ లో పోస్ట్ చేయాల్సిందే అన్నారు ఓ ఆత్మ బంధువు. రాసుకున్నాం సరే పబ్లిక్ పోస్ట్ అవసరం లేదు కాదా అంటే "కరోనా కాలంలో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో భవిష్యత్తులో ఒక రికార్డ్ ఉంటుంది తప్పకుండా బ్లాగ్ లోనే పోస్ట్ చెయ్యాలి" అంటూ ప్రోత్సహించిన తనకు ప్రత్యేక ధన్యవాదాలు. తన ప్రోత్సాహమే లేకపోతే ఈ పోస్ట్ ఇలా పబ్లిక్ లోకి వచ్చేదే కాదు.

"ఏమిటండీ ఇంకా పెళ్ళి కబుర్లు రాయలేదు, మేమంతా ఎదురుచూస్తున్నాం" అంటూ ఫోన్స్ చేసి నాకు రాయాలనే ఆలోచన కలిగించిన వాళ్ళకు, ప్రతి పోస్ట్ చదివిన వెంటనే తనకు నచ్చిన ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం నాతో పంచుకున్న వారికి, కామెంట్ లతో, లైక్స్ తో నన్ను ఉత్సాహ పరిచిన మీకందరకూ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మిత్రులు ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మనకేం కావాలో తెలిస్తే కదా వారు ఏమైనా చేయగలిగేది. లేకపోతే అంతా గందరగోళమే. ఇద్దరికీ అంతా కొత్త, అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ గమ్యం చేరాం. అన్నింటికీ మించి పెళ్ళి కుదిరిన రోజునే ఈయన “అమ్మడూ, పెద్ద బాధ్యత నెరవేర్చబోతున్నాం. పెళ్ళి పెద్దలం గృహస్థుల౦ రెండూ మనమే. ఈ పెళ్ళి జీవితాంతం మనకొక తీపి జ్ఞాపకంగా ఉండాలంటే మనిద్దరం ఎటువంటి పరిస్థితిలో కూడా సహనం కోల్పోకూడదు.” అని చెప్పారు. అదే మాట మీద ఉన్నాం ఇద్దరమూనూ. మేము చేసిన మా అమ్మాయి పెళ్ళి మా పెళ్ళికంటే తియ్యని జ్ఞాపకం.

*********************

రెండు కుటుంబాల కలయిక ఇంత ఆహ్లాదంగా జరిగింది కాబట్టే నిస్సంకోచంగా నాకనిపించివి అన్నీ ఇలా రాయగలిగాను. ఇంత సరదాగా జరుగవలసిన వేడుకలు మగ పెళ్ళి వారు, మర్యాదలూ, కట్నాలూ, కానుకలూ అంటూ ఎందుకంత క్లిష్టతరం చేసుకుంటున్నామో ఆడపెళ్ళివాళ్ళం కాస్త తగ్గి ఉండాలంటూ అమ్మాయిలను ఎందుకు చిన్న బుచ్చుతున్నామో మనందరం మరొక్కసారి ఆలోచిస్తే బావుంటుందేమో! పెళ్ళితో దగ్గరవ వలసిన రెండు కుటుంబాలు సాంప్రదాయాలు, పెట్టుపోతల పేరుతో పెళ్ళి పందిట్లోనే మనస్పర్ధలు పెంచుకోవడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. దానికి ముఖ్య కారణం మీరూ మేమూ అనే తేడా చూపడం, ఏవేవో ఆశించడం అవి జరగనప్పుడు కోపాలు, అసహనాలు. అప్పుడు మొదలైన విభేదాలు కుటుంబాల మధ్యే కాదు కొత్త దంపతుల మధ్య కూడా అడ్డుగోడలు ఏర్పడడానికి అవకాశం ఇస్తాయి.  

ఇక్కడ మా వదిన అన్న మాటను మరోసారి గుర్తుచేస్తాను. “మేము ఎప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా కోడలు అత్తయ్యా, మామయ్యా వచ్చారా అని సంబరంగా ఎదురు వచ్చేలా మేమే చేసుకుంటాం. మా ప్రవర్తన బట్టే కదా వదినా మా కోడలు మెలిగేది” అని. ఎంత గొప్ప ఆలోచన ఇది.

మనకు కాళ్ళు చేతులే కాదు రెక్కలు కూడా ఉంటాయి. ఆ రెక్కలకేగా మనం ఊహలు తగిలించి, కలలు, కోరికలు కలగలిపి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మమ్మల్నిద్దర్నీ ఎక్కడా తల వంచనీయని ఈ పెళ్ళి మా రెక్కలు మరింత విశాలమై మరిన్ని దూరాలు ఎగరడానికి దోహదం చేసింది.  

ఎంత జాగ్రత్తగా ఉన్నా రకరకాల ప్రాంతాల వాళ్ళం ఒకదగ్గర కలిసాము అని భయపడుతూనే ఉన్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళకు కానీ పెళ్ళి కొచ్చిన వాళ్ళకు కానీ ఎవ్వరికీ కోవిద్ రాలేదు. అందరం క్షేమంగా ఉన్నాం.

పెళ్ళి కబుర్లన్నీ ఓపిగ్గా చదివి మా సంతోషంలో పాలుపంచుకుని వధూవరులకు ఆశీస్సులు అందజేసిన పెద్దలకూ మిత్రులకూ అందరికీ ధన్యవాదాలు. 🙏

*********************