Wednesday, November 9, 2011

ఆ నలుగురూ

ఆ మధ్య ఒకసారి మా స్వరూప ఫోన్ చేసింది. ఆవిడ నిన్ను కలవాలన్నారు. ఈ పూట మధ్యాహ్నం వస్తార్టఅంది.
ఆవిడా, ఆవిడెవరు? ఎందుకొస్తున్నారు?” అడిగాను. 
వేరే కాల్ ఏదో వస్తుంది.  లైన్ లో ఉండుఅ౦ది.  ఓ ఐదు నిముషాలు లైన్లో ఉన్నా.
నాకు అర్జంట్ పని ఉంది సాయంత్రం మాట్లాడతాను. ఆవిడతో మాట్లాడుఅని ఫోన్ కట్ చేసింది. ఎప్పుడూ ఇంతే హడావిడి, పూర్తి వివరాలు చెప్పనే చెప్పదు.

మధ్యాహ్నం అయింది. ఆవిడ వచ్చారు.  కుశల ప్రశ్నలయ్యాక ఏం పని మీద వచ్చారు”  అని అడిగాను. ఏదో ఉద్యోగం ఉంది, ఫలానా దగ్గర చేస్తావా అని అడిగారు. ఇదేదో బానే వుందే ఇంటికి వచ్చి మరీ ఉద్యోగం ఇస్తామంటున్నారు, ఏమి నా భాగ్యం"అనుకున్నా.
ఇంతకీ నేను చేయవలసిన పనేమిటి?” అడిగాను.
వెళ్ళాక తెలుస్తుంది”.
వింతగా వుందే, ఎంత సమయం పని చెయ్యాల్సి ఉంటుంది?” అన్నా. 
మీరు చేయ్యగలిగిన౦త సేపు
జీతం యెంతో?
మీరు చేసే పనిని బట్టి ఉంటుంది.”  
ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా?”
మీరు ఊహించలేనన్నిఅన్నారు.
"నాకు పనే౦టో తెలియదు, ఎలా చెయ్యగలనో" బెరుకుగా అడిగాను.
"అప్పుడప్పుడు నా స్నేహితులు వచ్చి నిన్ను చూస్తూనే ఉంటారు." 

       ఏమీ అర్ధం కాలేదు. ఆవిడ కాసేపు ఉండి వెళ్లారు. ఆవిడ వెళ్ళాక చాలా సేపు ఆలోచించా. అసలు పనేంటో, ఎక్కువ సేపు చెయ్యాలేమో, జీతం కూడా సరిగా తెలియదు ఇలా సాగిపోయాయి. ఇప్పుడు హాయిగా ఉన్నాంగా ఎందుకీ బాధలుఅనిపించింది. ఆ సాయత్రం స్వరూప ఫోన్ చేసి ఏమై౦దని అడిగింది. జరిగిందంతా చెప్పి నా నిర్ణయం కూడా చెప్పాను. బాగా ఆలోచించావా?” అంది. ఆ అన్నీ ఆలోచించానుఅన్నా. సరే నీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది.

      "అనవసరంగా కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని వదలుకున్నానా"అని కాసేపు, "లేదులే మంచి పనే చేసా"నని" కాసపు అనిపించేది. వద్దనుకున్నాక ప్రశాంతంగా అనిపించింది. ఆవిడ మళ్ళా ఓ రెండు సార్లు వచ్చి తలుపుతట్టారు. కిటికీలోనుంచి చూసి తలుపు తీయడమే మానుకున్నా. కొద్ది రోజులు దాని గురించి ఆలోచనలు వచ్చాయి, కాని ఇప్పుడు హాయిగా సుఖంగా ఉన్నా౦గా ఈ త్యాగాలూ, అవీ అంటే కష్టం పైగా ఏం వస్తుందో, ఎంత వస్తుందో తెలియని భాగ్యానికి ఎందుకు లేని పోని కష్టాలు అని, ఆ విషయాన్ని పక్కకు నెట్టేశాను.

      ఆ తరువాత ఓ నాలుగు నెలల క్రితం అనుకుంటాను రోజులు మరీ రొటీన్గా అనిపించాయి. రోజూ ఒకటే పని. సడన్గా ఆవిడ గుర్తొచ్చారు. స్వరూపనడిగా ఆవిడెప్పుడూ ఒక దగ్గర వుండరని, వివరాలు సరిగ్గా తెలియవని, తన దగ్గర ఉన్నఅడ్రెస్ ఏదో ఇచ్చింది. వెతుక్కుంటూ వెళ్లాను. వెంటనే కాదుకాని మొత్తానికి ఆవిడని చూడగలిగాను. ఉద్యోగం గురించి మాట్లాడాను. "ఇప్పుడా ఉద్యోగం లేదుగా" అన్నారు. నిరుత్సాహంగా వెనక్కి తిరిగాను. "ఆగండాగండి, అదిలేదు కాని ఇంకోటి ఉంద"ని వివరాలు చెప్పారు.

           వెంటనే వెళ్లి చేరిపోయాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది. ఇంట్లో బయట పనులతో చాలా ఇబ్బంది అయింది. తరువాత మెల్లగా అన్నీ సర్దుకోవడం మొదలు పెట్టాయి. మధ్య మధ్యలో ఆవిడ స్నేహితులు వచ్చి కలుస్తూ ఉత్సాహపరుస్తూ ఉండేవారు. చాన్నాళ్ళు ఇలా జరిగాక ఈ మధ్యే ఆవిడ స్నేహితురాలు వచ్చి నన్ను ఆశ్చర్యానందాలలో ముంచివేశారు.

        “ఇంతకూ 'ఆ నలుగురూ' ఎవరని?” కదూ మీ ప్రశ్న. మొదటగా వచ్చి౦ది అవకాశంమధ్యలో పర్యవేక్షి౦చి౦ది తృప్తి’, 'అనుభవము' చివరగా వచ్చి౦ది అదృష్టం’.

        మనకు అవకాశం వచ్చినా అందుకోవడానికి బోలెడంత ఆలోచిస్తాం. ఒక్కోసారి అనవసర భయాలతో వదిలి వేస్తాం కూడా....కాని మనకు ఏం కావాలో తెలుసుకుని ప్రయత్నం చేస్తే మనకు ముందుగా ఎదురయ్యేది తృప్తి. తరువాత వచ్చేది అనుభవం. వాటన్నిటి చుట్టమే అదృష్టం. 


9 comments:

  1. ఆ నలుగురూ అని అంటుంటే సినిమా చెప్తున్నారేమో అనుకున్నా. వీళ్ళ నలుగురి గురించీ చెప్తున్నారా? భలే సస్పెన్స్ లో పెడతారండీ మీరు.ఇంతలా ఆలోచించం కానీ ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది.చాలా బాగా చెప్పారు. ఈ రోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను శ్రద్ధగా.ధన్యవాదాలు పంతులమ్మ గారూ.

    ReplyDelete
  2. మీ బ్లాగ్,కవితలు చాలా బావున్నాయి జ్యోతిర్మయి గారు
    శర్కరి పేరు కూడా చాలా బావుంది.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారండి. అవును, అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట.

    ReplyDelete
  4. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. థాంక్స్!

    ReplyDelete
  5. Success usually comes to people those who are too busy to look after it అంటారు! అదృష్టం ఒకసారే తలుపు తడుతుందిట కానీ దురదృష్టం తెరిచే దాక తలుపు తడుతూనే ఉంటుందిట! చాలా చక్కని విషయాలని మంచి కథలాగా బాగా చెప్పారు!

    ReplyDelete
  6. సుభా, లతా గారూ, జయ గారూ, కృష్ణప్రియ గారూ, రసజ్ఞా అందరికీ నా ధన్యవాదాలు.

    ReplyDelete
  7. చాలా బాగా చెప్పారు .

    ReplyDelete
  8. మౌళి గారూ, మాలా కుమార్ గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.