Thursday, November 17, 2011

బుజ్జిపండు.....ఓ కథ

“పండూ బెడ్ టైం అయింది పడుకుందాం రా నాన్నా”.
“అమ్మా స్టోరీ చెప్పవా?”
"కథా, ఏం కథ చెప్పనూ...ఆ....అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు". కథ చెప్పడం మొదలు పెట్టాను. 
"ఏడ౦టే?" అడిగాడు పండు. 
 “ఏడ౦టే సెవెన్. ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు."
"ఎస్టర్ డే వేట అంటే హ౦టింగ్ అని చెప్పావ్. వేటకెళ్ళి ఎవరైనా ఫిష్ లు తెస్తారా ఫిషింగ్ కెళ్ళి ఫిష్ లు తెస్తారు కానీ."పండు సందేహం. 
"యు ఆర్ రైట్ పండూ, ఫిషింగ్ కెళ్ళే ఫిష్ లు తెచ్చారు. తెచ్చి ఆ చేపల్ని ఎండబెట్టారు."
“ఎందుకు ఎండబెట్టారు? కుక్ చెయ్యరా?”
"అంటే అప్పటికే వేరే కూరేదో చేసేసారన్నమాట. అందుకని ఎండబెట్టారు నాన్నా."
“అయితో ఫ్రిజ్లో పెట్టొచ్చుగా” ఆలోచిస్తూ అన్నాడు పండు.
"వాళ్ళకు ఫ్రిజ్ లేదు. అందుకని ప్రిజర్వ్ చెయ్యడానికి ఎండబెట్టారన్నమాట." ఎదో అప్పటికి అలా సర్దేసాను. 
" ఓ వాళ్ళకు ఫ్రిడ్జ్ లేదా? సరే చెప్పు"
"అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా నువ్వు ఎందుకు ఎండలేదు?అంటే" చెప్పడం మొదలు పెట్టాను.
"ఈజ్ దట్ ఫిష్ అలైవ్ ఆర్ డెడ్?" అడిగాడు.
(అప్పుడా ఫిష్ అలైవో కాదో కాని ఇప్పుడు నేను డెడ్) "డెడ్డే." చెప్పాను.
"డెడ్ ఫిష్ ఎలా మాట్లాడిందీ?" గొప్ప సందేహం వచ్చింది పండుకు.
"కథ కదా, కధల్లో డెడ్ ఫిష్ లు మాట్లాడతాయన్న మాట. చేప ఏం చెప్పిందో తెలుసా?"
"ఏం చెప్పింది?"
"గడ్డిమోపు అడ్డమొచ్చింది". అన్నదట.
“గడ్డిమోపు అంటే?”
"గడ్డి మోపు అంటే హాలోవీన్ అప్పుడు, హే బండిల్స్ డెకరేషన్ కు పెడతారు కదా అలాంటిది ఇంకా పే...ద్దదన్నమాట".
"ఓ బిగ్ హే బండిల్. అది కార్టూన్ లో మాట్లాడినట్లు మాట్లాడుతుందా?
"(అమ్మయ్య థాంక్స్ టు వాల్ట్ డిస్నీ) ఆ అలాగే మాట్లాడుతుంది. “గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకడ్డమొచ్చావ్?” అంటే “ఆవు నన్ను మెయ్యలేదు” అన్నదట".
“మెయ్యలేదు అంటే?” మళ్ళీ సందేహం.
“తినలేదు అని” చెప్పాను.
అప్పుడు “ఆవు తినలేదు అనొచ్చుగా మెయ్యలేదు అని ఎందుకు చెప్పావ్?”
“ఆవులు మేస్తాయి మనం తినటాం” చెప్పాను.
“మనం ఎందుకు మెయ్యం?”
(బిడ్డల శిక్షణ రాసినందుకు చలాన్ని, చదివినందుకు నన్నూ తిట్టుకుని)....కొంచెం ఓపిక తెచ్చుకుని మెయ్యడం గురించి చెప్పాను.
“ఆవూ ఆవూ ఎందుకు మెయ్యలేదూ?” అంటే “నన్ను పశువులకాపరి అంటే షెపర్డ్, విప్పలేదు" అంది. (సో స్మార్ట్ ఒక క్వొశ్చన్ తప్పించుకున్నా). “ఎరా అబ్బాయ్ ఎందుకు విప్పలేదు అంటే” కథ కొనసాగించాను.
“బాయ్ అయితే స్కూల్ కి వెళ్ళాలి కదా! ఎనిమల్స్ దగ్గరకు ఎందుకు వెళ్ళాడు”
 (ఏదో అనుకుంటాం కానీ అంతా మన భ్రమ). “బాయ్ కాదు బిగ్ మానే.” సర్ది చెప్పాను.
“మరి బాయ్ అని ఎందుకన్నాడు” మళ్ళీ సందేహం.
ఊరికే అన్నాడు నువ్వు కథ విను ముందు. “నాకు అవ్వ బువ్వ పెట్టలేదు” అన్నాడట.
“అవ్వా అవ్వా బువ్వెందుకు పెట్టలేదు?” అంటే, “పాప ఏడ్చింది అన్నదట”. “పాపా పాపా, ఎందుకు ఎడ్చావ్?” అంటే చీమ కుట్టింది అన్నదట. “చీమా చీమా నువ్వెందుకు కుట్టావే?” అంటే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా!” అన్నదట.” (అమ్మయ్య కథ పూర్తి చేసేసాను)

అవునూ నాకో పెద్ద సందేహం వచ్చి౦దిప్పుడు. చిన్నప్పుడు ఈ కథ ఓ వంద సార్లు వినుంటాను. ఒక్కసారి కూడా నాకీ సందేహాలేవీ రాలేదు. ఎందుకనబ్బా?

26 comments:

  1. Really you feel the difficulty of telling a telugu story to your boy .

    ReplyDelete
  2. :) బాగుంది.

    ఏ జెనరేషన్ వారైనా, పిల్లలకి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి.. మీరు 'నోర్మూసుకుని విను' అననంత వరకూ అడుగుతూనే ఉంటారు :)

    మన చిన్నప్పుడు మరీ పెద్దవాళ్లు నోర్మూసుకొమ్మనక పోయినా, చాలా వరకూ పిల్లలు, వినేసి ఊరుకోవాలేమో అన్నట్టు ట్యూన్ అయ్యారు అనిపిస్తుంది నాకు.

    ReplyDelete
  3. శర్మ గారూ నా టపాలు చదువుతూ నాకు ప్రోత్సాహమిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. కథ చెప్పడంలో కష్టం కాదు ఇష్ట౦ వుందండీ..బాబు మీద తెలుగు మీద కూడా..పిల్లలకు మన భాష రావాలి మన భావం అర్ధం కావాలి. అందుకే ఇలా తెలుగులో కథలు కబుర్లూ చెప్తూ ఉంటాము.

    ReplyDelete
  4. హహ్హహ్హా..
    భలేగా ఉంది టపా. మీరు కథ చెబుతూ ఉండడం, మీ బాబు ప్రశ్నలడగడం అంతా కళ్లకు కట్టినట్లు ఉంది. మీ వ్యాఖ్య నాకు ఇంకా నచ్చింది:) నిజం, మన తరువాతి తరానికి కూడా మన భాష రావాలి భావం అర్థం కావాలి. అంతా ఆంగ్లమయం అయిపోయిన ఈరోజుల్లో, పాపం అంత కష్టపడుతూ కూడా ఇష్టంగా తెలుగు ముచ్చట్లు చెబుతున్నందుకు మిమ్మల్ని అభినందించాలి:)

    ReplyDelete
  5. మనం మన కాలం లో కథల్ని 'వినేవారం' మాత్రమె. మరి ఈ కాలం బడుద్దాయిలు 'watch' చేస్తున్నారు సుమా! సో, మనం అల్లాటప్పా గా కథల్ని చెప్పలేమన్నమాట ! మనము కూడా వారి తో బాటు వాల్డిస్నేయం 'వాచి'తే గాని , వారికి కథలు చెప్పలేం ! కాబట్టి మన ప్రస్తుత కర్తవ్యం వెంటనే బోల్డన్ని వాల్త్దిస్నేయం లు గబుక్కున చూసేయ్యడం.

    మన పిల్లలు వాళ్ళ పిల్లలకి కథలు చెప్పే కాలాన్ని నేను వూహించలేక పోతున్నాను. ఎలా ఉంటుంది చెప్మా ?

    ReplyDelete
  6. >>“ఆవులు మేస్తాయి మనం తినటాం”.
    “మనం ఎందుకు మెయ్యం?”

    హహ్హహ్హహ్హ very smart :)

    ReplyDelete
  7. మీరిప్పుడు కధని తెలుగులోచెప్పారా? :)

    ఇలాగే మిగిలిన కధల్ని కూడా ఎలాచెప్పారో/చెప్తారో చూడలనుంది. In short, మీ కధ నాకు నచ్చింది. ఇలాంటివి ఇంకొన్ని చెప్పండి.

    @Zilebi గారు: వాళ్ళు కధలు చెప్పరు. CDలు తెచ్చిచ్చి చూడమంటారు.

    ReplyDelete
  8. హహహ బాగుంది! రాజు గారి చీమలు కూడా పుట్టలని బంగారంతోనే కట్టుకుంటాయా? మరి మీ అబ్బాయి సందేహాలేనా మా సందేహాలు కూడా తీరుస్తారా?

    ReplyDelete
  9. @ కృష్ణప్రియ గారు చిన్నప్పుడు మనకూ సందేహాలు వచ్చాయేమో గుర్తురావడంలేదు...ఇప్పుడు మాత్రం పిల్లలకు కథలు చెప్తుంటే భలే సరదాగా ఉంటుంది. ధన్యవాదములు.

    @ అపర్ణ గారూ పిల్లలకు కథలు చెప్తూ బాగా ఎంజాయ్ చేస్తాను. వాడి సందేహాలు భలే సరదాగా ఉంటాయ్. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  10. @ వాల్డిస్నీయం కథలు చెప్పేస్తే మన 'తెనాలి రామలి౦గం' గారు 'మర్యాద రామన్న' గారు ఇంకా ఇలాంటి పెద్దలందరూ మనల్ని 'యై'అనరూ అందుకని మనం బుద్దిగా ఇలాంటి కథలే చెప్దాం. పెద్దయ్యాక వాళ్ళేం చెప్తారో వేచి చూడాలి మరి. ధన్యవాదాలు.

    @ నాగార్జున గారూ :):) ధన్యవాదములు.

    ReplyDelete
  11. @ ఇండియన్ మినర్వా గారూ కథను తెలుగులోనే చెప్పాను. అర్ధంకాని దగ్గర ఇంగ్లీషులో వివరి౦చాను.
    మీరు ఓపిగ్గా వినలే కాని ఇలాంటి కథలు బోలెడు. మా పాపకి చెప్పిన "ఒక ఆకు వెయ్యోచ్చుగా కథ చదివారా?" ఆ కథకి కొంచెం పాటలు తగిలించి బ్లాగులో పెట్టాను తనకు చెప్పినప్పుడు ఆ పాటల్లేవ్ అంతే తేడా.. ధన్యవాదములు

    ReplyDelete
  12. miss ur blog too much అండీ..మీ టపా లన్నీ ఇప్పుడే చూస్తున్నా. బహుశా నేను చాలా ఆలశ్యంగా వచ్చుంటాను.నాకూ చిన్నప్పుడు ఈ కథ వింటుంటే అన్ని సందేహాలు లేవు కానీ,అసలు రాజు గారి కొడుకులు వేటకి వెళ్ళి ఏ పులినో కొట్టుకురాకుండా ఇలా చేపల్ని పట్టుకొచ్చారేంటి చెప్మా అని.మొత్తానికి భలే చెప్పారు కథని. ఇంతకీ రసజ్ఞ గారు ఏదో సందేహం అడిగితే నాకు ఇంకో సందేహం వచ్చింది. ఆ చీమలు రాజు గారివా అని? ఈ సందేహం కూడా కాస్త తీర్చండి మరి.

    ReplyDelete
  13. @ రసజ్ఞా బాబు ఆ సందేహాలు అడక్కుండానే ఆఖరి నాలుగు వాక్యాలు 'మిస్టర్ పెళ్ళాంలో రాజేంద్ర ప్రసాద్' లా సూపర్ ఫాస్ట్ గా చెప్పి కథ పూర్తి చేశాను. ఇప్పుడు మీకు దొరికిపోయాను.మీ సందేహం తీరుస్తానుండండి. రాజు కదా చాలా రిచ్ అన్నమాట. వాళ్ళింట్లో చక్కెరకంతా బంగారంతో పూత వేయించేశారు. చీమలు ఆ చక్కర తెచ్చి ఆ తొడుగు తొలగించి చక్కెర తినేసి ఆ బంగారంతో పుట్టలు పెట్టుకున్నాయన్నమాట.

    ReplyDelete
  14. @ సుభ అయ్య బాబోయ్ ఇన్ని సందేహాలు తీర్చాలని తెలుసుంటే అసలు కథ చెప్పకనే పోదును. వాడికి రాని సందేహాలు కూడా మీకు వస్తున్నాయ్. ఒక పని చేయండి వాడికి కథ చెప్పే టైం కి మీరు మా ఇంటికి వచ్చేయండి అందరికీ ఒకేసారి సందేహాలు తీరుస్తాను. ధన్యవాదములు సుభా.

    ReplyDelete
  15. బావుంది మీ కథా సమయం. నాకూ ఎప్పుడూ అనుమానం ఉండేది వేటకి వెళ్ళి అని చెప్తారేమిటి అని. మా పిల్లలు కథని ఆసక్తిగా విన్నారు అనుమానాలు వ్యక్తం చెయ్యకుండా, అప్పుడైతే. ఐతే నేను దీన్నితెలుగు4కిడ్స్ కోసం చేసేటప్పుడు నాకే చాలా అనుమానాలు వచ్చాయి. మళ్ళీ పిల్లలని ఊహించుకుని అమాయకత్వాన్ని అరువు తెచ్చుకుని తయారు చేశాను. మా పిల్లల కోరిక మేరకు మళ్ళీ కథని వెనక్కి నడిపించి సుఖాంతం (చేప ఎండడం సుఖాంతమేనా అంటే?) చేశాను, కొన్నేళ్ళ క్రితం.
    చూడగలరు.
    కథలు చెప్పుకుంటూనే ఉన్నా అంతర్జాలంలో తెలుగు presence కూడా ఉండాలనీ, ఇంగ్లీషు కథలు మాత్రమే కాక తెలుగు కథలూ విరివిగా అందుబాటులో ఉండాలనీ ఇటువంటి ప్రయత్నం మొదలు పెట్టాను. (ఈ తరంలోనే సీడీలు అంటారేమోనని ముందు జాగ్రత్తగా...)
    ఆ మధ్య అమ్మ చెప్పిన కథలు బ్లాగర్లందరూ గుర్తు చేసుకుంటూ ఈ కథకి చివరన ఒక మెలిక ఉందని కూడా తెలియచేశారు. చివరికి పిల్లల బొడ్డులో వేలు పెట్టి (చీమలపుట్ట) కిత కితలు పెట్టాలి అనుకుంటా.

    ReplyDelete
  16. జ్యోతిర్మయి గారూ,

    మీ కథతో పాటు కొసరు (అదే, మధ్యే మధ్యే కామెంటు సమర్పయామి అంటూ మీరుచెసే వ్యాఖ్యలు) కూడా నవ్వించేయి.

    “నన్ను పశువులకాపరి అంటే ఎనిమల్స్ వాచ్ చేసేవాడన్నమాట విప్పలేదు”...

    ఈ కామెంటు చదవగానే నాకు కన్యాశుల్కంలో గిరీశం గుర్తొచ్చాడు. ఒకసారి పాపం గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో "Tell Man" అంటే, అగ్నిహోత్రావధాన్లు ఇంగ్లీషు అర్థంగాక "నేను మానులానున్నానంటావూ, గూప్పగలగొడతాను (గూబ + పగలగొడతాను) అని అన్నంతపనీ చెయ్యబోతాడు. మిగతావాళ్ళు అడ్డుకుని ఆ ప్రమాదం తప్పిస్తారనుకొండి. అదివేరే కథ. ఆ దెబ్బతో, నాటకంలో, అగ్నిహోత్రావధాన్లుతో ఎప్పుడుమాటాడినా, పొరపాటున ఇంగ్లీషుపదం దొర్లితే, వెంటనే తర్జుమాచేసిమరీ మాటాడుతుంటాడు. మీ విషయం లో (Case లో) అది తారుమారు (Reverse) అయిందనుకొండి.
    పైకి చాలా హ్యూమరస్ గా కనిపించినా, మీ కథాకథనం వెనక, మనం పెరుగుతున్నకొద్దీ, ఎన్నివిషయాలను ప్రశ్నించకుండా accept చేస్తుంటామో తెలుస్తుంది. This is a very interesting philosophical question.

    అభినందనలు.

    ReplyDelete
  17. బాగుందండి పిల్లల కోసం మీరు పడుతున్న, వారు పెడుతున్న కష్టాలు..ఇటువంటి ఇష్ట కష్టాలు ఎంతటి హాయో కదా !!

    ReplyDelete
  18. జ్యోతీ గారూ, మీరు పిల్లలకు చెప్పిన కథ చాలా సరదాగా వుంది. మీకు తెలియదని కాదు కానీ కొన్ని విషయాలు. పిల్లలకు సరదాగా చెప్పినా చెప్పే కథలో ఓ అర్థము తప్పక వుంటుందనే నా వుద్దేశ్యం.అలాగే వాళ్ళకు సరైన అర్థాలను వివరిస్తారని కూడా. ఈ వయసులో మనము చెప్పే ప్రతి కథా వారిపై తప్పక ప్రభావం చూపుతుంది.

    ఇక్కడ "వేట" అంటే అడవికి వెళ్ళి జంతువులను వేటాడమనే అర్థాన్నే చెప్పుకున్నారు కానీ , దేన్నైనా తరితరిమి పట్టుకోవడాన్ని కూడా వేట అనే అంటారనుకుంటాను. అలాగే బంగారము అంటే ఆభరణములకు వాడే ముడి పదార్థమనే అర్థమా? ప్రియము అని కూడా అర్థమేమో కదా?

    ReplyDelete
  19. @ లలిత గారూ తెలుగు కథల్ని మరచిపోకుండా ఉండాలని చేసిన మీ ప్రయత్నం చాలా బావుందండీ..అభినందనలు. మీ స్పందనకు ధన్యవాదములు.

    @ మూర్తి గారూ మీ వ్యాఖ్య ద్వారా గిరిశంని మరో సారి గుర్తుచేశారు. ధన్యవాదములు.

    @ అజ్ఞాత గారూ ఇష్టమైనపుడు అది కష్టమనే తలపే రాదు. ధన్యవాదములు.

    ReplyDelete
  20. @ భాస్కర రామిరెడ్డి గారూ..కథ చెప్పేప్పుడు నేను అంత లోతుగా ఆలోచించలేదు. వేట విషయం మీరు చెప్పింది సరి అయినదే. బంగారం గురించి రసజ్ఞతో సరదాగా జోక్ చేశాను. కొన్ని విషయల్లో తెలిసినా తప్పులు చేస్తుంటాం. సవరించినందుకు ధన్యవాదములు.

    @ డేవిడ్ గారూ ధన్యవాదములు.

    ReplyDelete
  21. చాలా బావుంది.మీరు ఓపికగా చెప్పడం...మీ బాబు ప్రశ్నలు బావున్నాయి.

    ReplyDelete
  22. జ్యోతిర్మయిగారు! “నాకు అవ్వ బువ్వ పెట్టలేదు”..తర్వాత మీ అబ్బాయి ప్రశ్నలు ఏమీ లేవు.. అప్పటికే తను నిద్రలోకి జారుకున్నాడ లేక మీరు వాటిని వినకుండా కథ ముగించారా? ఏదేమైనా ఈకాలం తల్లిదండ్రులకు కథ చెప్పేటప్పుడు ఇవన్నీ తప్పవనుకుంటాను.

    ReplyDelete
  23. @శైలబాల గారూ..ధన్యవాదములు.

    @ బాలుగారూ చివరలో కథ వేగంగా ముగించానండీ. ఈ కథ చెప్పడం ఓ మధురానుభూతి బాలుగారూ. బాల్యాన్ని దాటిన మనం తిరిగి ఆ అనుభూతిని పొందగలిగేది వారి బాల్యాన్ని చూస్తున్నప్పుడే..ధన్యవాదములు

    ReplyDelete
  24. మాధవి గారూ ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.