Wednesday, November 30, 2011

కౌముదిలో నా కవిత 'నిర్వేదం'

చెట్టు మీద పిట్ట ఒకటి జాలిగా చూసింది
ఒంటరి నక్షత్రం బాధగా నిట్టూర్చింది!

ఆనవాలు లేని అలజడేదో...
తొంగి తొంగి చూస్తోంది!

ముక్కలైన రోజులన్నీ...
చీకటి మాటున మెసలుతున్నై!

నిన్న మానిన గాయం
కొత్త మందును కోరుతోంది!

మరచిపోయిన సంగతేదో...
దిగులుకు తోడై వచ్చింది!

అంతులేని విషాదానికి
పాత చిరునామా దొరికింది !

నిలకడలేని ఆలోచన
అంధకారాన్ని ఆశ్రయమడిగింది!

రాలిపోయే ఉల్కను చూసి
ఎగిసే అల విరిగి౦ది!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'డిసెంబర్ 'సంచికలో ప్రచురితమైంది. నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

28 comments:

  1. చదివితే ప్రతి పధం అర్ధం అయింది కానీ చివరకు ఏమి అర్ధం కాలేదు... నా ఉహాకు మీ కవిత అర్ధం కానీ అంత ఎత్తులో ఉన్నది అనుకుంటాను ..

    ReplyDelete
  2. Everything else is good but couldn't understand these two lines..Gayam manipote malli kotta mandu deniki

    ReplyDelete
  3. @ ధన్యవాదాలు తృష్ణ గారూ..

    @ తెలుగు పాటలు గారూ...చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. కవిత అందనంత ఎత్తులో కాదండీ..కవితయొక్క భావం నిరాశావాదంలో ఉంది..

    డిప్రెషన్ లో మునిగిన మనస్సు ఆలోచించే విధానాన్ని వర్ణించాను..బాధలో మునిగి అందులోనే ఉండిపోయే స్థితి...

    ఏదో తెలియని బాధ కలుగుతోంది
    పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి
    నిన్న మానిపోయిన గాయం మళ్ళీ రేగింది
    తెలియని దిగులుకు గతంలోని బాధ తోడయ్యింది
    అదుపులేని ఆలోచనలతో చీకటే బావుందనిపించే స్థితి.

    ఈ బాధలో ప్రకృతి కూడా అలానే కనిపించిందని వ్రాసాను.

    ReplyDelete
  4. అజ్ఞాత గారూ

    "నిన్న మానిన గాయం కొత్త మందును కోరుతోందంటే" ఆ గాయం మళ్ళీ రేగిందని అర్ధం. నిన్న ఆ బాధను మరిచిపోవడానికి ఏ విధంగా సమాధాన పడ్డానో అది ఈ వేళ కుదరడంలేదు.

    మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. బాగా రాస్తున్నారండీ, జ్యోతిర్మయి గారూ.. ఇప్పుడే మీ పోస్టులన్నీ చదువుతున్నా :-)

    ReplyDelete
  6. చెట్టు మీద పిట్ట ఒకటి నవ్వుతూ చూస్తోంది.
    ఒంటరి నక్షత్రం జాబిలిని చేరుకుంది
    అలజడి ఆనవాలే కోల్పోయింది
    నిన్న మానిన గాయమే కొత్త అనుభవం ఇచ్చింది
    ఆ అనుభవాల వెలుగులో
    విషాదం తన చిరునామా కోల్పోయింది
    నిశీధి నిలబడలేక ఎటో పారిపోయింది
    నిర్వేదం నిర్వాణమైపోయింది...
    జ్యోతి గారూ కౌముది లో మీ కవిత కనిపించాకా మీకు ఇలా అనిపించి ఉండాలే? నిజమే కదా..ఒప్పేసుకోండీ బాబూ... లేకపోతే నేను అలా ఐపోతాను మళ్ళీ.

    ReplyDelete
  7. నిషిగంధగారూ స్వాగత౦..ము౦దు తెలిసినా ఈ మందిరమిటులుండేనా..అని పాడుకోవాలి నేనిపుడు..బ్లాగు వెన్నెల్లు కురిసినంతకాలం రాక ఈ వడగాల్పుల్లో వచ్చారేమండీ! మీకు నా రాతలు నచ్చిన౦దుకు చాలా సంతోషం. ధన్యవాదాలు

    ReplyDelete
  8. సుభా రోహిణి కార్తె లాంటి నా కవితపై శ్రావణ మేఘం కురిసినట్లు నీ వ్యాఖ్య. కౌముదిలో కవిత కనిపించగానే నువ్వుచెప్పినట్లే అనిపించిది..బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. జ్యోతిర్మయి గారు సుభ గారు ధన్యవాదములు జ్యోతిర్మయి గారి కవిత.. సుభ గారి ప్రతి కవితా బాగుంది బాగుంది

    ReplyDelete
  10. కవిత బాగుందండీ.. అభినందనలు! :)
    సుభా గారి కామెంట్ బావుంది. నిజమే కదూ! ;)

    ReplyDelete
  11. నిర్వేదంలో ఉన్న వేదాన్ని చదువు
    నిరాశలో ఉన్న ఆశని మేల్కొలుపు
    అలజడిని జడత్వంతో కూడిన అలగా మార్చు
    అంధకారంలో దాగి ఉన్న ఆ కారాన్ని గుర్తించు
    గాయానికి మందు చేసే మాయని గమనించు
    ఆ లోచనలని యోచనతో మేల్కొలుపు
    నిరాశావాదంలో ఏమున్నది? ఆశావాదాన్ని చూపించు

    ReplyDelete
  12. hi akka

    mee blog chaala rojula tarvata choosanu...kani first choosinappudu kaligina feeling inka fresh gane undi...nijam ga meeru nannu telugu lo rayataniki chaala inspire chestunnaru kani naa telugu sangathi telisinde kada matladatame antha antha matram...inka rayatam ante bhayam vestundi..!!

    kani akka...the feeling between the lines is awesome...you have got a great pen dear...!!

    all the very best..!!

    ReplyDelete
  13. అప్పుడపుడు మానవులు నిరాశలో పడిపోతారు. కానీ అశావాదాన్ని మించిన మందులేదు

    ReplyDelete
  14. @ తెలుగు పాటలు గారూ, మధురవాణి గారూ మీ రాక మాకెంతో సంతోషం సుమండీ.. ధన్యవాదాలు..

    @ రసజ్ఞా చదివేశా, మేల్కొలిపా, మార్చేశా, గుర్తించేశా, గమనించేశా, మేల్కులిపేశా అమ్మమ్య ఆఖరికి చూస్పించేశా..సంతోషమేనా..ధన్యవాదాలు.

    ReplyDelete
  15. బాబయిగారూ మీరే..స్వాగతమ౦డీ..ఈ కవిత మిమ్మల్ని కూడా లాక్కొచ్చేసి౦దా..ఎప్పుడో రాసి౦దండీ..ఇవాళ లేవగానే మీ వ్యాఖ్య చూసి ఎంత ఆనందం వేసిందో! ధన్యవాదాలు.

    ReplyDelete
  16. @ Yamini..What a pleasant surprise..Thank you for your compliment. It's all because of people like you. Once again Thank You so much.

    ReplyDelete
  17. జ్యోతిర్మయీ,
    ఈ కవితలో భావం పట్టుకోల్పోకుండా వచ్చింది. అంతేకాదు భావన చిక్కగా ఉన్నప్పుడు, మాటలు కూడా కొత్త అర్థాలనీ, కొత్త అందాలనీ అందిస్తాయి భావానికి. ఉదాహరణకి నాకు ఈ లైను ఎంతో నచ్చింది.
    మరచిపోయిన సంగతేదో... దిగులుకు తోడై వచ్చింది! ...
    మామూలుగా చదివితే దీని అర్థం సుమారుగా ఇలా స్ఫురిస్తుంది: some forgotten idea has befriended grief. కాని, చమత్కారంగా, "సంగతి" అన్నది సంగీతానికి సంబంధించిన ఒక పదం. "తోడి" అన్నది ఒక రాగం. తోడి + ఐ = తోడై అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత అందమైన భావన అందిస్తోందో.
    "నిన్న మానిన గాయం కొత్త మందును కోరుతోంది!" కి మీరిచ్చిన సమాధానం సమంజసంగానే ఉంది. నాకూ ముందు Anonymous గారికి కలిగిన సందేహమే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పాఠకుడికీ- రచయితకీ మధ్య ఉండే "confidence-zone" పరిథిలోకి వస్తుంది. ఇదే ఒక లబ్దప్రతిష్టుడైన కవి రాసిన వాక్యం అయితే, అతని ఆంతర్యాన్ని కనిపెట్టడానికి మరింతసేపు ఆలోచిస్తాను. కాని, అపరిచితులైన కవులనగానే, కవితలో దానికి తగిన Substantiation ఉందా అని ఆలోచిస్తాను. ఇది ఒక బలహీనతే. కాని తప్పించుకోలేని బలహీనత.
    మొత్తానికి మంచి కవిత అందించినందుకు అభినందనలు.

    ReplyDelete
  18. మూర్తి గారూ... మీ విశ్లేషణ నాకు కొత్త కోణాలు చూపింది. ఈ కవిత రాసి చూసుకున్న తరువాత నాకు ఎందుకో ఒక విధమైన తృప్తి కలిగింది. మీకూ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  19. @జ్యోతిర్మయి గారు

    కదలని గాయాలను కదిలే మార్పులతో బంధించారు...
    వరద అంచులోని కెరటాలను సైతం కన్నీటితో సాము చేసి విరిచేశారు...
    అక్కరకు రాని సమయాన్ని ఇలా అక్షరాలతో పంచుకున్నారు...

    మీ టపాకు చాలా బాగుంది అనేది నా విమర్శ, ఆ విమర్శ మీ అనుభవసారాలకు స్నేహంతో వైద్యం చేయగలదు అనుకుంటున్నాను...

    ReplyDelete
  20. @ కళ్యాణ్ గారూ "అక్కరకు రాని సమయాన్ని ఇలా అక్షరాలతో పంచుకున్నారు..." ఎంత బాగా చెప్పారు. మీ వ్యాఖ్య నాకెప్పుడూ కొత్త కోణాలు చూపుతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  21. మీ ఆలోచన నుంచి జాలువారిన ఈ నిర్వేదం
    అలజడి రేపుతున్న మనోప్రశ్నలకు ఓ వేదం
    మీ పాటలోని ప్రతి పదసవ్వడిలో అంతర్లీనం ఆకర్షణమయం
    అంతః మదనానికి ప్రతీకైన ఈ కవనం రచించిన విరించిని మనసే జ్యోతిర్మయం...!!!

    ReplyDelete
  22. సంతోష్ గారూ..స్వాగతం..మీ వ్యాఖ్య నన్ను ఏవో తీరాలకు తీసుకువెళ్ళింది. మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  23. స్త్రీ అయినా, పురుషుడైనా కవిత్వంలో తనను తాను ఇముడ్చుకున్నంత, దాచుకోగలిగినంత సులభంగా మరే ప్రక్రియలోనూ చేయలేడనుకుంటాను! ఎంత క్లిష్టమైన భావమైనా, imagery అయినా, కేవలం నాలుగు లేదా అయిదు మాటలలో ఇమిడ్చి చూసుకొన గలిగే సౌలభ్యాన్ని కవిత్వం ఇవ్వడం ఇందుకు ఒక కారణం, బహుశా!

    ఈ కవితలో అలాంటి imagery చాలా వుంది. కవిత బాగుంది...అప్పుడప్పుడూ మీరే వెనక్కి వచ్చి ఒకసారి మళ్ళీ చదువుకోగలిగేంత బాగుంది!!

    ReplyDelete
  24. వెంకట్రావు గారూ..తొలిసారి బ్లాగుకు వచ్చారు స్వాగతం..కొన్ని కవితలు రాసినప్పుడు ఒకలాంటి సంతృప్తి కలుగుతుంది..చదివిన ప్రతిసారి 'ఇదీ' అని చెప్పలేని భావం..
    "అప్పుడప్పుడూ మీరే వెనక్కి వచ్చి ఒకసారి మళ్ళీ చదువుకోగలిగేంత" మీ మాటల్లో ఆ భావానికి ఒక రూపం దొరికింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  25. ఏమి అర్ధం కానట్టు ఉంది అంతలోనే ఎంతో అర్ధం అయినట్టు ఉంది.శుభ గారి కామెంట్ బావుంది.

    ReplyDelete
  26. శైలబాల గారూ ఆలస్యంగా సమాధానమిస్తున్నాను. ఏమీ అనుకోకండి. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.