Saturday, November 26, 2011

చుక్కల కింద చక్కని రోజులు..తరువాయి భాగం

      తరువాత రోజు నిద్రలేచి టెంట్ బయటకు రాగానే అత్భుతమైన దృశ్యం, తెలిమంచు తెరల్లో ప్రకృతి. చెట్ల మధ్యలో దోబూచులాడుతూ రవి కిరణాలు ఎంత  అందంగా వున్నాయో! కాళ్ళ కింద మెత్తగా తగులుతున్న మట్టినేల, స్వాగతమంటున్న చల్లగాలి, చూపులు సాగినంత మేరా నిర్మలమైన ఆకాశం. రాత్రి చీకట్లో కనిపించలేదు కానీ, మధ్యలో స్థలం వదిలి, చుట్టూ టెంట్లు వేసికున్నాం, ఒక పక్కగా కారు దగ్గరకు వెళ్ళడానికి దారి, మరో పక్క పిక్నిక్ టేబెల్,  బార్బిక్యూ గ్రిల్, కొంచెం దూరంగా షెల్టర్, 

             మాలాగే కా౦పింగ్ కి వచ్చిన వాళ్ళ టెంట్స్ దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఓ ఇరవయ్ అడుగుల దూరంలో రెస్ట్ రూమ్స్, ఓ ఫర్లాంగ్ దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. సైట్ మొదట్లో ఓ చిన్న స్టోర్, అందులో ఫైర్ వుడ్, సాల్ట్, వాటర్, మెడిసిన్స్, స్నాక్ పాకెట్స్ లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అన్నీ అధిక ధరల్లోనే ఉన్నాయనుకోండి. అన్ని సైట్లకూ మధ్యగా వాలీబాల్ కోర్ట్. చెట్ల మధ్యగా వాకింగ్ ట్రైల్స్ కనిపిస్తున్నాయి. 

        ఇవన్నీ చుట్టేసి వచ్చి ఇక పనిలో పడ్డాం. ఒకళ్ళు సిలిండర్ బిగిస్తే, ఇంకొకరు దోశపిండిని ఐస్ బాక్స్ లోంచి తీశారు, మరొకరు టేబుల్స్ సర్దారు ఇలా తలా ఒక పని ఆడుతూ పాడుతూ చేశాసామన్నమాట. ముందుగా దోశెల కార్యక్రమం మొదలు పెట్టాం. చిరుచలిలో వేడివేడి కారం దోసలు, ఆమ్లెట్ దోసెలు, ఉల్లిదోసెలు ఇలా రకరకాల దోసెలు. మాలో 
బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళు కొందరు. వాళ్ళు అవి కూడా వేయడం మొదలు పెట్టారు. ఇలా టిఫిన్ సెక్షన్ ఎంజాయ్ చేశాం. తరువాత హికింగ్ పేరుతో చెట్టూ, పుట్టా తిరిగేసి పిట్టల్ని పలకరించి వచ్చి, కే౦పింగ్ చైర్స్ లో సెటిల్ అయ్యాం. ఉత్సాహం కాస్త ఎక్కువ పాళ్ళలో వున్నవాళ్ళు బైక్ రైడింగ్ కెళ్ళారు.  


        ఆ తర్వాతేముందీ, ఓపెన్ ఎయిర్ లో కడిగిపారేసి, తాట తీయడాలు,  తొక్కు వలవడాలు చేస్తుంటే భలే వుందిలే! "వారెవ్వా.. ఎవరినీ?” అంటారా, కూరగాయలనండీ. కళ్ళు మూసి తెరిచేంతలో టొమాటో పప్పు, దొండకాయ వేపుడు, పచ్చడితో వేడి వేడి భోజనం రెడీ(ఎంత సేపు కళ్ళు మూశామో మీరడగకూడదూ మేం చెప్పకూడదూ). అందరం భోజనాలు కానిచ్చి, ఆ వెచ్చటి మధ్యాహ్నపువేళ, చల్లగా చెట్ల కింద కూర్చుని చిన్నప్పటి కబుర్ల చెప్పేసుకుని, ఎప్పుడో మరచిపోయిన మధురఫలాలు తేగలు, రేగుపండ్లు, ఈతకాయలు, నేరేడుపళ్ళూ లాంటి వాటిని గుర్తుచేసికుని, అలా బాల్యంలోకి విహారానికి వెళ్ళాం. ఇక జూనియర్స్, వాళ్ళిష్టం వచ్చినట్లు చెట్లూ పుట్టలూ ఎక్కేసి దూకేసి, పరిగెత్తి ఆకలేసినప్పుడు దొరికినవేవో తినేసి అసలు సిసలు పిల్లలైపోయారు.. కేంప్ సైట్ లో వారు ఎక్కడికైనా తప్పిపోతారన్న కంగారు వుండదు.

          మధ్యాహ్నం దేశవాళీ వంటలు తిన్నాంగా, సాయంత్రం బార్బిక్యూ గ్రిల్ మీద ముష్రూమ్స్, కాప్సికమ్స్, ఆనియన్స్, కార్న్, యాం లాంటి వాటిని గ్రిల్ చేశాం. పాటీస్ గ్రిల్ మీద పెట్టి లెటస్, టొమాటోస్, మేయొనైజ్ లతో బర్గర్ ఫిక్స్ చేసి డిన్నర్ కానిచ్చాం. అన్నీ సర్దేసరికి సందెపొద్దు నల్లనై౦ది. ఆ చీకట్లో అంత్యాక్షరి  పేరుతో ఇష్టమైన పాటలన్నీ పాడుకున్నా౦. ఘంటసాల గారు ముఖ్య అతిధి.

       ఆరుబయట పండువెన్నెల.....వెలుగులు చి౦దుతూ అందాల చందమామ...చుక్కలచీర కట్టిన నల్లని ఆకాశం... చిత్తరువులై నిలిచిన పొడవాటి చెట్లు...చుట్టూ నిశ్శబ్దం... మంచుకురుస్తూ చిరుచలి....ఆ వెన్నెలరాత్రి ఎంత బావుందో! అమెరికా సిటీస్ లో ఆకాశం, అర్ధరాత్రికూడా నీలంగానే ఉంటుంది నియాన్ లైట్ల మహిమేమో. ఇలా అందమైన నక్షత్రాల్ని చూడడానికైనా సంవత్సరానికోసారి క్యాంపింగ్ కి వెళ్ళాలనుకున్నాం. 


మరిచేపోయాను క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నామండోయ్. ఆ ఫైర్ లొ పిల్లలు 'మాష్మల్లోస్' వేడిచేసి 'గ్రాండ్ క్రేకర్స్', 'చాకొలేట్'తో స్నాక్ కూడా చేసుకున్నారు. అక్కడ సర్దడానికి, పెట్టడానికి ఏం వుండవుకదా కారులో కొన్ని, టెంట్ లో కొన్ని, ఐస్ బాక్స్ లో కొన్ని, వస్తువులు పెడతాం. దీనితో పది నిముషాల్లో చేసే పనులన్నీ ఓ గంటపట్టి ఈ ఫాస్ట్ లైఫ్ ని కొంచెం స్లో డౌన్ చేస్తాయి. ఆ రోజు బ్రేక్ ఫాస్ట్ పూరీ కూరా, సీరియల్, పీనట్ బటర్ సాండ్ విచ్.  

         బ్రేక్ ఫాస్ట్ తరువాత ఔత్సాహికులందరూ వాలీబాల్ ఆడి, బాల్ భరతం పట్టారు. కొందరేమో పిల్లల్తో  కలసిపోయి గుజ్జనగూళ్ళూ, కోతికొమ్మచ్చి ఆడారు. ఆ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ కుర్మాతో భోజనం. భుక్తాయాసం తీరగానే అందరం సరదాసరదాగా 'డంషార్ ఆర్ట్స్' ఆడాం, ‘జూ లకటక’ సినిమా ఆ రోజు హైలైట్. ఇక రాత్రికి పావుభాజీ పలహారం. ఆ విధంగా కాలం వైపన్నా చూడక ఆ రోజు కూడా గడిపేశాం. 
  
       ఇక ఆదివారం, మెల్లగా కదిలింది కాలం. వస్తువులన్నీ సర్ది తిరగి కార్లెక్కించేసరికి  మధ్యాహ్నం అయ్యింది. ఆ ప్రదేశాన్ని వదలడం కార్లక్కూడా ఇష్ట౦లేనట్లు భారంగా కదిలాయి. తిరిగి వచ్చేదారిలో ఒక అత్భుతాన్ని చూశాం.  అదే 'షా౦డ్లియర్ ట్రీ', సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న చెట్టు. పంతొమ్మిది వందల ముప్ఫైలో ఆ చెట్టుబెరడుని తొలిచారట. అందులోనుండి కార్లు కూడా వెళ్ళొచ్చు. అంత పెద్దపెద్ద చెట్లున్న ఆ పార్క్ చాలా నచ్చింది.

          అందరం ఇలా కలసి మెలసి మూడు రోజులు ఒక కుటు౦బంలా మెలగడం ఎక్కువ ఎంజాయ్ చేసామో..కేంపింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసామో చెప్పడం కష్టం. పిల్లలకు అమ్మ నాన్నలు కాకుండా మిగిలిన వారితో అనుబంధం ఏర్పడడానికి నాంది ఇలాంటి విహారాలనే చెప్పొచ్చేమో! అలా మా తొలి కేంపింగ్ అనుభవాల్ని పదిలంగా మూట కట్టుకుని ఇంటికి చేరాం. తరువాత ప్రతి సంవత్సరం కేంపింగ్ కి వెళ్తున్నాం కాని, ఈ కేంపింగ్ మాత్రం చాల ప్రత్యేకంగా మా మనుసుల్లో నిలిచిపోయింది.           



15 comments:

  1. బాగున్నాయి మీ అనుభూతులు! మీ మొదటి చిత్రం చూస్తుంటే నాకు తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా అని పాట పాడాలనిపించింది. నిజమే ఇలాంటి విహార యాత్రలకి అందరితో కలిసి వెళ్ళడం వలన జనాలతో ఎలా కలిసి మెలిసి ఉండాలో తెలుస్తుంది. అందువలననే మనకి కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేశారు కదా!

    ReplyDelete
  2. వావ్ అదరగొట్టేసారండీ.. చూసినంత పనయ్యింది.
    ఓపెన్ ఎయిర్ లో కడిగిపారేసి, తాట తీయడాలు, తొక్కు వలవడాలు చేస్తుంటే భలే వుందిలే! "వారెవ్వా.. ఎవరినీ?” అంటారా, కూరగాయలనండీ.
    ఎప్పుడో మరచిపోయిన మధురఫలాలు తేగలు, రేగుపండ్లు, ఈతకాయలు, నేరేడుపళ్ళూ లాంటి వాటిని గుర్తుచేసికుని, అలా బాల్యంలోకి విహారానికి వెళ్ళాం.
    అమెరికా సిటీస్ లో ఆకాశం, అర్ధరత్రికూడా నీలంగానే ఉంటుంది నియాన్ లైట్ల మహిమేమో.
    ఇలాంటి కొసమెరుపులు బాగున్నాయండీ. మొత్తానికీ మమ్మల్ని కూడా మీతో కాంపింగ్ కి తీసుకెళ్ళినందుకు చాలా థాంకులు మీకు.

    ReplyDelete
  3. చాలా బాగుంది.. ప్రపంచాన్ని మరచి మీరందరూ మరో ప్రపంచమై ఆడి,పాడి,వండి,వడ్డించుకుని .. మనసారా ఆస్వాదించిన అనుభవాలు మాకు పంచి.. ఆ అనుభూతిని మాకు అందించి.. ఇలా ఎవరైనా కూడా అప్పుడప్పుడు రొటీన్ లైఫ్ కి భిన్నంగా ప్రకృతిలో సేద దీరడం ద్వారా.. మనలని మనం రీచార్జ్ చేసుకోవడం ని మీరు చెప్పిన విధం బాగా నచ్చిన్దండీ! ధన్యవాదములు.

    ReplyDelete
  4. Nice! నాకు కాంపింగ్ లో అన్నింటికన్నా నచ్చేది తిండి. అదేంటో ఏం చేసినా, తిన్నా భలే రుచి గా ఉంటుంది.

    ReplyDelete
  5. చాలా బాగుంది

    ReplyDelete
  6. మీ తొలి కేంపింగ్ అనుభవాలు కళ్ళకికట్టినట్టు రాశారు, బాగుంది.

    ReplyDelete
  7. బాగా ఎంజాయ్ చేశారన్నమాట, వెరీ నైస్

    ReplyDelete
  8. >>> ఆరుబయట పండువెన్నెల.....వెలుగులు చి౦దుతూ అందాల చందమామ...చుక్కలచీర కట్టిన నల్లని ఆకాశం... చిత్తరువులై నిలిచిన పొడవాటి చెట్లు...చుట్టూ నిశ్శబ్దం... మంచుకురుస్తూ చిరుచలి...

    బాగున్నాయండి మీ మొదటి కేంపింగ్ అనుభూతులు. అలాంటి అనుభూతి తరువాత భావుకత అలా పొంగి వచ్చేస్తుందనుకుంటాను... దహా.(దరహాసం)

    ReplyDelete
  9. మీ కేంపింగ్ విషయాలు చాలా బాగున్నాయండి! మంచు దుప్పట్లో టెంట్ కింద మీరందరూ వున్న ఫోటో చూట్టానికి చాలా ఆహ్లాదకరంగా వుంది.

    ReplyDelete
  10. @ రసజ్ఞా కాంపింగ్ లో బాగా నచ్చేది... టివి, ఫోన్, వీడియో గేమ్స్ లాంటి వేవీ లేకుండా రెండు మూడు రోజులు మిగతా వారితో కలసి ఉండడం.ధన్యవాదాలు.

    @ సుభా మాతో వచ్చి మా అనుభూతులు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    @ వనజగారూ.."రొటీన్ లైఫ్ కి భిన్నంగా" సరిగ్గా చెప్పారు..మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందకరమైన విషయం. మళ్ళీ కాంపింగ్ వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు.

    ReplyDelete
  11. @ కృష్ణప్రియ గారూ..కాంపింగ్ లో నచ్చేది తిండే..నేను ఈ పోస్ట్ వ్రాసాక ఒక ఫ్రెండ్ కి చూపించాను మొత్తం చదివి మీరు తినడానికే వెళ్లినట్లుంది అన్నారు..ఆ తిండి పోర్షన్ చాలా వరకు తగ్గించి పెట్టాను..మీరు చెప్పింది అక్షరాలా నిజం. ధన్యవాదాలు...

    @ శర్మ గారూ, లతా గారూ ధన్యవాదాలు.

    @ చిట్టి, పండు గార్లకు స్వాగతం..మా కాంపింగ్ అనుభవాలు దర్శించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. >>.ఆ తిండి పోర్షన్ చాలా వరకు తగ్గించి పెట్టాను.

    చాల ఐటమ్స్ మిస్సయ్యామన్న మాట. :)

    ReplyDelete
  13. @ బులుసు సుబ్రహ్మణ్యం గారూ స్వాగతం..మిమ్మల్ని నా బ్లాగులో చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ దరహానికి ధన్యవాదాలు..

    @ బాలు గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @జ్యోతి గారు
    సరదా సరదా పిక్నిక్కు
    జ్యోతి గారు వెళ్ళిన పిక్నిక్కు
    కొండలు ధాటి మంచును చేరి
    గుడారాలలో దాగిన పిక్నిక్కు
    సరదా సరదా పిక్నిక్కు
    జ్యోతి గారు వెళ్ళిన పిక్నిక్కు

    వంటలు వార్పుకు సెలవనుకుంటే
    అక్కడ కూడా వదలని పనులు
    పిల్ల పాపతో సరదాగా
    గడిపే సమయం ఇచ్చిన పిక్నిక్కు
    సరదా సరదా పిక్నిక్కు
    జ్యోతి గారు వెళ్ళిన పిక్నిక్కు

    రానే వచ్చే ఆదివారం
    తప్పని బారంతో తిరిగు ప్రయాణం
    గడచినా జ్ఞాపకాల మూటలతో
    కష్టంపై వీడుకోలు చెప్పిన పిక్నిక్కు
    సరదా సరదా పిక్నిక్కు
    జ్యోతి గారు వెళ్ళిన పిక్నిక్కు

    ReplyDelete
  15. @ మౌళి గారూ..చాలా మిస్ అయ్యరండీ..ధన్యవాదాలు.

    @ కళ్యాణ్ గారూ పిక్నిక్ మీద పాటే అల్లేశారుగా..చాలా బావుంది...మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.