Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Saturday, October 1, 2011

కౌముదిలో నా కవిత 'ఎడబాటు'


ఈ దారిలోనే కదూ నా చిన్నారి
బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీసింది!
అదిగో ఆ తోటలోనే మునుపెన్నడో
ఊయల ఊగిన సందడి!

ముచ్చటైన సైకిలును చూసి
మోమున మెరిసిన సంతోషం!
చారడేసి కళ్ళతో బెంగగా
స్కూలుకు వెళ్ళిన వైనం!

శాంతాతో ఫోటోలు, జింజెర్ బ్రెడ్ హౌసులు,
హాలోవీన్ డ్రస్సులు, ఈస్టర్ ఎగ్ హంట్లు,
కోరస్ పాటలు, టెన్నిస్ ఆటలు
ఓహ్! ఎన్నెన్నో!
అవన్నీ నిన్న మొన్నలా లేదూ!

ప్రతి మలుపులో వేలు పట్టుకుని నడిపించాను!
మలుపులన్నీ దాటి చూద్దును కదా
ఆ చివర మలుపు తిరుగుతూ
ప్రగతి పథంలో తాను!

తన జ్ఞాపకాల బాసటగా
ఈ చివర నేను!

నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'అక్టోబర్ 'సంచికలో ప్రచురితమైంది.

నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Thursday, September 29, 2011

మా ఊరి ముచ్చట్లు

గున్న మావి కొమ్మల్లోన కోయిలమ్మ రాగాలు
పంటచేల దారుల్లోన పైరగాలి సరాగాలు!

సందె గాలిలో తేలియాడే సన్నజాజి పరిమళాలు
పైరు నిండుగ విరగబూసే బంతిపూల సోయగాలు!

కొండ మీద గుడిలోన జే గంటల సవ్వడులు
చెరువు కింద వాగులోన బాల కృష్ణుల కేరింతలు!

అరుణారుణ సమయాన వెనుతిరిగే గోమాతలు
మర్రిచెట్టు ఊడలతో ఆటలాడే మర్కటాలు!

కార్తీకాన చెరువుల్లో ప్రాతఃకాల  దీపాలు
పుష్య మాస వేకువల్లో వెల్లి విరిసేటి రంగవల్లులు!

ఎదురొచ్చి పలకరించే అమ్మమ్మల అనురాగాలు
ఎనలేని ప్రేమగల తాతయ్యల  ముద్దుమురిపాలు!

ఇలా ఎంత చెప్పినా తరగవు
మా వూరి ముచ్చట్లు!!



Wednesday, September 28, 2011

మావ ముచ్చట్లు


ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!

పచ్చ చీరాగట్టి వనలచ్చిమోలు౦టే
చీరలోనున్నట్టి 'పడుగు' తానంటాడు!

రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటే
గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు!

ముత్యాల పేటతో ముచ్చటగ నేను౦టే
పేటలో నున్నట్టి 'పూస' తానంటాడు!

ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలేను౦టే
పుడక మీదున్నట్టి 'మెరుపు' తానంటాడు!

కురులేమో సిగచుట్టి సిరిలచ్చిమోలుంటె
సిగలోన ఉన్నట్టి 'మల్లె' తానంటాడు!

కాలి పట్టీ లెట్టి కలహంస వోలుంటే
పట్టీల నున్నట్టి 'మువ్వ' తానంటాడు!

ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!!


ఎప్పుడో విన్న 'మల్లి ముచ్చట్లు' ఆధారంగా...

Sunday, September 25, 2011

మధురస్మృతులు


ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం
సత్యమవుతున్న సుందరస్వప్నం!

మధురమైన ఊహలు....తరగిపోని ఊసులు
పసిపాప నవ్వులతో....కలల కలవరింతలు!

కనుల ఎదుట కలలపంట
సుమధురయానం మనదేనట!
     
          * * * * *
ఎంత ఆశ్చర్యం....
ఎలా వెళ్ళిపోయింది ఈ ఐదేళ్ళ కాలం!

బోసినవ్వుల్ని దాచుకోలేదు...
బుడి బుడి నడకల గురుతులే లేవు!

చిన్నారి పలుకుల్ని తనివి తీరా విననే లేదు,
అక్షరాలు దిద్దించనే లేదు!

చందమామ కధలు చెప్పనే లేదు..
వెన్నెల్లో పాలబువ్వలు కొసరనే లేదు!

ఉరుకులు పరుగుల జీవిత౦లో...
ఏవీ మధురస్మృతుల ఆనవాళ్ళు?

Tuesday, September 20, 2011

నిరీక్షణ


ఈ రేయి ఎన్నటికి తరిగేనో...
నా ఉద్వేగం చూసి
క్షణాలన్నీ చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నై!

చీకటి చిక్కనై చిందులు వేస్తోంది!
వెన్నల చిన్నబోయి
మబ్బుల మాటున మోము చాటేసింది!

విరిసిన మల్లెలు
గుసగుసలు పోతున్నై!
నిశీధి అంచుల్లోకి
నిశ్శబ్దం మెల్లగా జారిపోతోంది!!

వెలుగు రేఖ ఒక్కటి
అలవోకగా తొంగి చూసింది...
నిదురించిన తోట
బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది!

ఏమయిందో ఏమో
చుక్కలు మెల్లగా తప్పుకున్నై!
రేతిరి తన రాజ్యాన్ని వదిలి...
తెలియని తీరాలకు తరిలి పోయింది!

ఎదురు చూసిన యెదలో
సందడి మొదలైయ్యింది...
తూరుపు దిక్కున
సన్నాహాల కోలాహలం!

వాకిట వేచిన నెచ్చెలి కోసం
వెలుతురు బాటలో సూరీడు!!


తొలి ప్రచురణ కౌముదిలో...

Saturday, September 3, 2011

దరహాస చంద్రిక



నిన్న బద్దకంగా నిదుర లేచాను..
చల్ల గాలి వీడ్కోలు చెప్తూ వెళ్లి పోయింది!

కిరణాలు వెచ్చగా గుచ్చుకున్నై..
మెల్లగా వ్యాహ్యాళికి బయలు దేరాను!

అబ్బ! ఈ ప్రకృతి ఎంత అందంగా వుందో..
ఎత్తైన చెట్లు, చెట్టు మీద ఎగిరే గువ్వ పిట్టలు..

ఆ పచ్చటి కొండలు, పరగులేత్తే జింకలు...
నడకలో తెలియ కుండానే చాలా దూరం వచ్చేశాను!

పిల్లలు ఎంత చలాకీగా ఆటలాడు కుంటున్నారో..
స్నేహితులతో కబుర్లు చెపుతూ సాగి పోతున్నారు!

ఆ ఇంటి ముందు ఎర్ర గులాబి గాలికి అందంగా ఊగుతోంది!
ఎన్నెన్ని రంగులో.. ఎన్ని రూపాలో...

రంగు రూపు ఆకృతి లేని నన్ను చూసుకుని
దుఖ్ఖ భారంతో క్రుంగి పోయాను..

నాన్నూ ఆ జీవన స్రవంతి లొ కలిపేయమని
భగవంతుణ్ణి వేడుకున్నాను!

ఇదేమిటి? ఇలా నీలంగా మారిపోతున్ననేమిటి?
క్షణ క్షణానికి ఎలా బరువైపోతున్ననేమిటి?

ఇంతకు మునుపెప్పుడూ ఇలా లేదే!
నా రూపం కరిగినీరై... నేల పైకి జారిపోతున్నాను..

నేను దరి చేరగానే... ఆ చిన్ని విత్తనం మొలకై పోయి౦దేమిటి
నా సంతోషం మొగ్గ తొడిగి... సిరమల్లై పూసింది
ఆ పరిమళం మీ పెదవులపై దరహాస చంద్రికై నిలిచింది!

ఇంతకూ నన్ను గుర్తు పట్టారా..
ఒకప్పటి మేఘాన్ని నేను!!




తొలి ప్రచురణ కౌముదిలో....

Friday, September 2, 2011

చందమామ సాక్షిగా...

చినుకు... చినుకు... మధ్య కలసి చిందులేశా౦
రావి ఆకుల గలగలలో.. రాలుగాయిలమై తిరిగాం!

వెన్నెల్లో.. చెమ్మ చక్క లాడాం
కోయిలతో... గొంతులు కలిపాం!
భేతాలుడి పొడుపు కధలు విప్పాం
ఇసుక తిన్నెల్లో... గవ్వలెన్నో ఏరాం!

ఎక్కడికేళ్లి పోయింది... ఎప్పుడెళ్లిపోయింది?
పంట చేను గట్టు మీద పైరగాలై పోయిందా..
అమ్మ పెట్టిన గోరింటాకులో.. చందమామై పోయిందా..

కారులొద్దు మేడలొద్దు
మిడిమేలపు పయనమొద్దు!
పొరుగు తెలియని బ్రతుకులొద్దు
కాలంతోటి పరుగులొద్దు!

అయ్యయ్యో
ఇప్పుడెలా...ఎక్కడని వెతకను?
చుక్కల పరదా చాటునా...మబ్బుల పల్లకి లోనా...
విరజాజి పరిమళంలోనా..సెలయేటి గలగలల్లోనా...

మీక్కనిపిస్తే  కాస్త జాడ చెప్పరూ...
ఎక్కడున్నా తెచ్చుకుంటా!
నా బాల్యాన్ని గుండెల్లో దాచుకుంటా!
చందమామ సాక్షిగా...వెన్నెలమ్మ మీదొట్టు!

తొలి ప్రచురణ తెలుగు నాడిలో.....

చేజారిన స్వప్నం


ఆనవాలు కోసం ...అంతులేని ఆరాటం
నేనడచిన దారి... నన్ను విస్మరించింది
ముక్కలైన నమ్మకం...మంటలు రేపుతోంది!!

మాధుర్యం..మమత...స్వరూప౦ శూన్యం 
స్మృతులన్నీ..చెదల పాలయ్యాయి
ముసుగు తీసిన మమకారం...వికటాట్టహాసం చేస్తోంది!

జీవనయానంలో ..అనుక్షణం 
ఆస్థిత్వానికై... అన్వేషణ
గుట్టలుగా దొరికిన నిరాశా శిధిలాలు!

చేజారిన స్వప్నం..దిగులు పాట పాడింది 
భారమైన కాలం.. మౌనానికి నేస్తమైంది!!

తొలి ప్రచురణ