Saturday, September 3, 2011

దరహాస చంద్రిక



నిన్న బద్దకంగా నిదుర లేచాను..
చల్ల గాలి వీడ్కోలు చెప్తూ వెళ్లి పోయింది!

కిరణాలు వెచ్చగా గుచ్చుకున్నై..
మెల్లగా వ్యాహ్యాళికి బయలు దేరాను!

అబ్బ! ఈ ప్రకృతి ఎంత అందంగా వుందో..
ఎత్తైన చెట్లు, చెట్టు మీద ఎగిరే గువ్వ పిట్టలు..

ఆ పచ్చటి కొండలు, పరగులేత్తే జింకలు...
నడకలో తెలియ కుండానే చాలా దూరం వచ్చేశాను!

పిల్లలు ఎంత చలాకీగా ఆటలాడు కుంటున్నారో..
స్నేహితులతో కబుర్లు చెపుతూ సాగి పోతున్నారు!

ఆ ఇంటి ముందు ఎర్ర గులాబి గాలికి అందంగా ఊగుతోంది!
ఎన్నెన్ని రంగులో.. ఎన్ని రూపాలో...

రంగు రూపు ఆకృతి లేని నన్ను చూసుకుని
దుఖ్ఖ భారంతో క్రుంగి పోయాను..

నాన్నూ ఆ జీవన స్రవంతి లొ కలిపేయమని
భగవంతుణ్ణి వేడుకున్నాను!

ఇదేమిటి? ఇలా నీలంగా మారిపోతున్ననేమిటి?
క్షణ క్షణానికి ఎలా బరువైపోతున్ననేమిటి?

ఇంతకు మునుపెప్పుడూ ఇలా లేదే!
నా రూపం కరిగినీరై... నేల పైకి జారిపోతున్నాను..

నేను దరి చేరగానే... ఆ చిన్ని విత్తనం మొలకై పోయి౦దేమిటి
నా సంతోషం మొగ్గ తొడిగి... సిరమల్లై పూసింది
ఆ పరిమళం మీ పెదవులపై దరహాస చంద్రికై నిలిచింది!

ఇంతకూ నన్ను గుర్తు పట్టారా..
ఒకప్పటి మేఘాన్ని నేను!!




తొలి ప్రచురణ కౌముదిలో....

2 comments:

  1. మేఘం గురించి బలే రాశారు అండి

    ReplyDelete
  2. తెలుగు పాటలు గారూ ఇప్పటి వరకు వ్యఖ్యలేని టపా ఇదొక్కటేనండీ. అగ్రిగేటర్లు ఉంటాయని తెలియను రోజుల్లోది పెట్టింది. వెనక్కెళ్ళి మరీ చదివారు. మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.