ఈ రేయి ఎన్నటికి తరిగేనో...
నా ఉద్వేగం చూసి
క్షణాలన్నీ చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నై!
చీకటి చిక్కనై చిందులు వేస్తోంది!
వెన్నల చిన్నబోయి
మబ్బుల మాటున మోము చాటేసింది!
విరిసిన మల్లెలు
గుసగుసలు పోతున్నై!
నిశీధి అంచుల్లోకి
నిశ్శబ్దం మెల్లగా జారిపోతోంది!!
వెలుగు రేఖ ఒక్కటి
అలవోకగా తొంగి చూసింది...
నిదురించిన తోట
బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది!
ఏమయిందో ఏమో
చుక్కలు మెల్లగా తప్పుకున్నై!
రేతిరి తన రాజ్యాన్ని వదిలి...
తెలియని తీరాలకు తరిలి పోయింది!
ఎదురు చూసిన యెదలో
సందడి మొదలైయ్యింది...
తూరుపు దిక్కున
సన్నాహాల కోలాహలం!
వాకిట వేచిన నెచ్చెలి కోసం
వెలుతురు బాటలో సూరీడు!!
బాగుందండీ!
ReplyDeleteధన్యవాదములు రసజ్ఞ గారూ...
ReplyDeleteచాలా బాగుందండీ.. మీ నిరీక్షణకి అందమైన సూర్యోదయంతో తెర పడిందన్నమాట! :)
ReplyDeleteనిరీక్షణ నాదేనంటారు.....
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు మధుర గారూ...
ఎలా రాస్తారు అండి ఈ పద ప్రయోగం నాకు కూడా వస్తే ఎంత బాగుండ్డునో
ReplyDeleteతెలుగు పాటలు గారూ ఇంత ఓపిగ్గా ఇన్ని చదివి వ్యాఖ్యలు పెట్టారు. మీ ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరిచిపోలేను. మీకు బోలెడు ధన్యవాదాలు.
ReplyDelete