Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts

Tuesday, April 14, 2020

సంయమనం

"కరోనా సమయంలో ప్రయాణం అంటూ రాశావు. ఆ తరువాత చడీ చప్పుడూ లేదు. అంతా బాగేనా?" అంటూ మిత్రులు పలకరించారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మేమంతా బావున్నాము. మొదటి రెండు వారాలు 'మీకు మీరే మాకు మేమే' అనుకుంటూ ఎవరి గదుల్లో వాళ్ళం తలుపులు వేసుకుని ఉన్నా ఆ తరువాత అంతా మామూలే. బయలుదేరేప్పుడు మరీ హడావిడి చేస్తున్నామేమో అనిపించింది కానీ రెండు రోజుల్లోనే అలా వచ్చేసి చాలా మంచి పని చేశామని అర్థం అయింది.

ఇక ఇక్కడ అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే యూనివర్సిటీలకు వెళ్ళిన పిల్లలంతా మార్చ్ మొదటి వారంలోనే ఇళ్ళకు వచ్చేశారు. వారికి రోజూ ఆన్లైన్ లో తరగతులు జరుగుతున్నాయి, ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా ఉంది. హైస్కూల్, మిడిల్ స్కూల్ పిల్లలు కూడా బళ్ళకు వెళ్ళడం లేదు. హైస్కూల్ విద్యార్ధులకు కూడా రోజూ ఆన్లైన్ లో తరగతులు జరుగుతున్నాయి. మిడిల్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు హోమ్ వర్క్ మాత్రం పంపుతున్నారు. కొందరు టీచర్లు ప్రతి తరగతికీ ఓ అరగంటో గంటో విద్యార్ధుల సందేహాలు తీర్చడానికి కేటాయించారట. ఐటి ఉద్యోగులందరూ దాదాపుగా ఇంటి దగ్గరనుండే పనిచేస్తున్నారు. బండి నడుస్తూనే ఉంది, దారి మరిందంతే.

ఇక ఇళ్ళల్లో ఇడ్లీ, పులిహోర, పొంగళ్ళతో పాటు సూప్స్, సలాడ్స్, స్టిర్ ఫ్రైయ్స్ కూడా తయారవుతున్నాయి. వంటగది ఆధిపత్యాన్ని వదులుకున్న వారి ఇంటిలో తినే వాళ్ళూ, వండే వాళ్ళు సరిసమానం. సరుకులన్నీ ఆర్డర్స్ పెట్టి తెప్పించుకునే సౌకర్యం కల్పించారు, కర్బ్ సైడ్ పిక్ అప్ కూడా ఉంది. అంటే ముందే ఆర్డర్ పెట్టిన సరుకులు షాప్ దగ్గరకు వెళ్ళగనే బయటే కార్ ట్రంక్ లో లోడ్ చేస్తారన్నమాట. కారు దిగవలసిన పని కూడా లేదు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వసతి లేదట. మైయిల్ ప్రతిరోజూ వస్తోంది. చెత్త వారానికోసారి అంతకు ముందులానే తీసుకువెళ్తున్నారు.

రోజు వారీ పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకు, ఇల్లు వాకిలీ లేని వారికి గవర్నమెంట్, చారిటీ ఆర్గనైజేషన్స్, ఇంకా చేయగలిగిన వాళ్ళు చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రధాన రహదారులలో ఉదయం, సాయంత్రం రోడ్ మీద ట్రాఫిక్ కొంచెం ఉంటోంది. బహుశ లాండ్ స్కేప్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, హెల్త్ కేర్ డిపార్ట్ మెంట్ వాళ్ళు, ఇంకా గ్రాసరీస్, రెస్టారెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు, డెలివరీ ఇస్తున్న వాళ్ళు అయివుండవచ్చు. రెస్టారెంట్స్ లో 'డైన ఇన్' తీసేసి, 'టు గో' ఇస్తున్నారు. అన్ని షాపులూ కూడా పనివేళలను బాగా కుదించి వేశాయి.

మా ఇంటి వెనుకే ఉన్న చిన్న రోడ్డు మీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళ్తున్నట్లుగా శబ్దాలు వినపడతూ ఉన్నాయి. ఇక ఇంటి ముందు వసారాలోకి వెళితే సాయంత్రాలు ఒకరో ఇద్దరో నడుస్తూ కనిపిస్తున్నారు. అంతకు ముందు సాయంత్రం నాలుగైతే చాలు "చిల్డ్రన్ ఎట్ ప్లే" అనే బోర్డ్ రోడ్డుకు ఆ చివరా ఈ చివరా అడ్డంగా పెట్టి బోలెడు మంది పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ లాన్ లలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అటూ ఇటూ పరిగెడుతూ పిల్లలు ఆడుతూ ఉండేవాళ్లు. పిల్లలంతా ప్రస్తుతం పేపర్లను మడతలు పెట్టి, కత్తెర్లతో వైనంగా కత్తిరించి ఏ ఏనుగు బొమ్మనో, బాతు బొమ్మనో చేస్తూ ఉండి ఉంటారు. లేదా గిన్నెల్లో నీళ్ళు పోసి రంగులు కలిపి పేపర్ మీద యే బొమ్మకో రంగులు వేస్తూ ఉండి ఉంటారు. ఇక బోర్డ్ గేమ్స్, టీవి లాంటివి ఉండనే ఉన్నాయి. అన్నట్లు పిల్లలకు పుస్తకాలు ఉచితంగా చదువుకునే సదుపాయం కూడా కల్పించారు, చక్కగా ఐపాడ్ లో చదువుకుంటూ ఉండి ఉంటారు. అయినా బయటకు వెళ్ళి ఆడుకోలేక పోవడం వారికి చాలా ఇబ్బందిగానే ఉండి ఉంటుంది. 

ఉదయం పక్షుల కలకలం షరా మామూలే. కిలకిలారావాలు ఏమీ ఆపలేదు, సూర్యోదయం కాకముందే రివ్వున ఎగరిపోవడమూ మానలేదు. "అయినా మనం కదా దేనికీ టైమే లేదు, ట్రాఫిక్ లో సోషల్ గాదరింగ్స్ లో టైమంతా పోతోందని గొడవ పెట్టింది. ఇప్పడవేవీ లేవు ఏమి కావాలనుకుంటే అవి చేసుకునే టైమ్ అంతా మనదే". ఈ మాటలు నేనలేదు, సిస్టర్ శివాని చెప్పారు. ఊరికే మధన పడుతూ ఉంటే నెగటివ్ ఎనర్జీ పెంచుతామట. దొరికిన ఈ సమయంలో ఏం చెయ్యాలో ఆవిడ చక్కగా చెప్పారు. ఒకవేళ కుదరలేదనుకోండి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇదే మంచి తరుణం.

హైస్కూల్ పూర్తవగానే పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు, సెలవలకు వచ్చినా చుట్టం చూపుగానే అని కదా వాపోతుంటాం. ఆ సందర్భంగానే అప్పుడెప్పుడో "ఎడబాటు" అనే కవిత రాశాను. ఇప్పుడు మన పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుండి వెళ్ళిన తరువాత వారు చేసిన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు అనుభూతులూ స్వంతం చేసుకున్న యువతీ యువకులు వాళ్ళు. కాస్త సావకాశంగా వింటే కథలూ కబుర్లూ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. వారి నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ మాత్రం మనకు తెలీదా అనుకోకండి మనకు నిజంగానే తెలీదు. ఎందుకంటే మనం ఎందుకు ఏమిటీ అని ప్రశ్నించకుండా కథలూ కబుర్లూ విన్నాం కదా! ఇప్పటి పిల్లలు అలా కాదు ఈ కథ లో చిన్న పిల్లవాడు కూడా ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తీరూ, ఆ అలోచనా ధోరిణి గమనించండి.

రేపెలా ఉంటుందో తెలియదు. గడచిన ఇన్నేళ్ళలో మనమూ, మన కుటుంబమూ ఎన్నో సమస్యలను ఎదుర్కున్నాం. ఈ సమస్య కూడా అంతే, తీవ్రత ఎంతైనా మనందరం కలసికట్టుగా ఎదుర్కుంటాం. అంతవరకూ సంయమనం పాటిస్తూ సాంఘిక ప్రసార మధ్యమాలలో తెలిసీ తెలియని వార్తలు, వ్యాఖ్యలు, భయాందోళనలను కలిగించే వార్తలను ప్రచారం చేయకుండా ఉండడం ప్రస్తుతం మనం చేయవసింది.


Thursday, March 26, 2020

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 2

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1 

మా ప్రయాణం విషయం ఉదయాన్నే మా నాన్నకు, అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను. ఓ గంటలో మా తోడికోడలు ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నెల్లూరు వస్తామనీ, మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాక వెనక్కు వెళ్తామని చెప్పింది. చెప్పినట్లుగానే తను అత్తయ్యను, పిల్లలను తీసుకుని మధ్యాహ్నం వచ్చింది. అప్పటికే సర్దడం మొదలు పెట్టేసాను. ఇల్లంతా చిందర వందరగా పెట్టెలు వస్తువులు. కాసేపు అవీ ఇవీ సర్దాక "అక్కా, నువ్వు కావలసినవి తీసుకుని వెళ్ళిపో, నేను మరో వారం తరువాత వచ్చి ఇల్లు ఖాళీ చేస్తాను. ఎవరికైనా ఇవ్వవలసినవి ఉంటే చెప్పు అవన్నీ వాళ్ళకు పంపించేస్తాను" అని చెప్పింది. గొప్ప సహాయం కదూ! ఎలా పడితే అలా వదిలేసిన ఇంటిని ఖాళీ చెయ్యడమంటే మాటలా, ఎంతమంది చేయగలరలా? ఆ రోజంతా సర్దిన వాళ్ళం సర్దినట్లే ఉన్నాం. కావలసిన వాళ్ళను కలవడం,  ఫోన్లు చేయడంతో ఆ రోజంతా హడావిడిగా గడిచింది. 

శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా పిల్లలు "పెద్దమ్మా తమిళ నాడు బార్డర్ క్లోజ్ చేశారట. ఇప్పుడెలా?" అంటూ హడావిడి పడుతూ పేపర్ చూపించారు. నాకేమీ అర్థం కాలేదు. బార్డర్ క్లోజ్ చెయ్యడం ఏమిటి? వెళ్ళనీకుండా పెద్ద కంచె కానీ కట్టేస్తారా? ఎప్పుడూ ఇలాంటిది వినలేదే. "నిత్యావసర వస్తువుల వాహనాలనీ, ప్రభుత్వ వాహనాలను, శవ శకటాలను మాత్రమే బార్డర్ దాటనిస్తారట" అంటూ పేపర్ లో వ్రాసిన వార్తను పైకి చదివారు. ఇప్పటికప్పుడు బార్డర్ దాటలంటే ఓ శవాన్ని కానీ తీసుకుని వెళ్ళాలా అని జోకులు వేస్తున్నారు పిల్లలు. మేము అమెరికన్ సిటిజన్స్ మి అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాము కాబట్టి, బార్డర్ దగ్గర మమ్మల్ని ఆపకూడదు. అలా కాకుండా బార్డర్ దాటనీయలేదనుకోండి  ఏమిటి పరిస్థితి?

అలా తర్జని బర్జన పడుతూ సరే మన ప్రయత్నాలు మనం చేద్దాం అనుకున్నాం.  గత పద్నాలుగు రోజులుగా ఎటువంటి అనారోగ్యమూ లేదని మెడికల్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాం. అంతలో ఒక ఆలోచన వచ్చింది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ తో వెళితే బార్డర్ దగ్గర ఆపరు కదా అని. చెన్నై లో ఉన్న ఒక ఫ్రెండ్ ను సహయం అడిగాం. తను పాపం వెంటనే మమ్మల్ని బార్డర్ దాటించడానికి ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం ఏ మూడు గంటలకో చెన్నై బయలుదేరినా ఆరుగంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాం. కానీ ఆ రోజు ఒంటిగంటకే నెల్లూరి నుండి బయలుదేరాం. అదే సమయానికి మా ఫ్రెండ్  చెన్నై నుండి బయలుదేరారు. మధ్యలో సూళ్ళూరు పేట దగ్గర తన కారులో ఎక్కించుకుని బార్డర్ దాటించి ఎయిర్ పోర్ట్ లో దింపాలని ఆలోచన. కొంత దూరం పొయ్యాక తన నుండి ఫోన్ వచ్చింది. బార్డర్ దగ్గర ఇబ్బంది పెట్టారనీ, ఇప్పుడు కనుక బార్డర్ దాటి  ఏపి లోకి అడుగు పెడితే తిరిగి తమిళనాడు లోనికి రానీయ మన్నారట. అయినా రిస్క్ తీసుకుని వచ్చారు. సూళ్ళూరుపేట దగ్గర డ్రైవరలిద్దరూ మా సూట్ కేస్ లను తన కారులోకి మార్చారు. ఏదో స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలా అనిపించింది. మేము బార్డర్ దాటే దాకా మా డ్రైవర్ ను అక్కడే ఉండమని డ్రైవర్ కి చెప్పాం. మేము ఎయిర్ పోర్ట్ కు వెళ్ళగలమనే నమ్మకం పోయింది. 

తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కార్ ఆపారు. ఒక పోలీస్ విండో దించమని సైగ చేసి,  "బార్డర్ క్లోజ్ చేశాం ముందుకు వెళ్ళకూడదు" అన్నారు. ఆ రాత్రికే అమెరికా వెళ్తున్నామని మాకు అమెరికన్ పాస్ పోర్ట్ ఉందని చెప్పాము. పాస్ పోర్ట్ చూపించమన్నారు. పాస్పోర్ట్ లో మా ఫోటోలు మామొహాలు మార్చి మార్చి చూసి కారు రిజిస్ట్రేషన్ చూపించమన్నారు. అన్నీ చూసాక,  ఫ్లైట్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసారు. ఎయిర్ ఇండియా కాన్సిల్ అయింది ఎమిరేట్స్ కాదు అని మా ఫ్రెండ్ చెప్పారు. ఈ సంభాషణంతా తమిళంలోనే జరుగుతోంది. ఐటనరీ చూపించాము. కాసేపు అవీ ఇవీ చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని సరే వెళ్ళమన్నారు.

మళ్ళీ కొంతదూరంలో మరో చెక్ పోస్ట్, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కారు ఆగగానే ముందు కారు మొత్తం స్ప్రే చేసి, కారులో నుండి దిగమన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో బెంచి ఎక్కమని మాష్టారు చెప్తారే అలాగ. మాకందరికీ థర్మల్ చెక్ చేశారు. పొరపాటున కాస్త జ్వరం ఉంటే ఇంక బార్డర్ దాటనిచ్చేవాళ్ళు కాదేమో! మెడికల్ సర్టిఫికేట్ చూపించాము. ఇండియా ఎప్పుడు వచ్చామో, ఎందుకు వచ్చామో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో, మా అమ్మాయి ఎక్కడ చదువుతుందో అన్నీ అడిగి, మెడికల్ సర్టిఫికేట్ చూసి వెళ్ళమని చెప్పారు. అయితే ఎక్కడా ఆగకుండా ఎయిర్ పోర్ట్ కే వెళ్ళమని కండిషన్ పెట్టారు. డెస్టినేషన్ చేరాక సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని సలహా ఇచ్చి పంపించారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ ఎంప్లాయిస్ కాకుండా ఓ పది మంది పాసింజర్స్ ఉండి ఉంటారేమో! మేము టికెట్ తీసుకున్నప్పుడు ఫ్లయిట్ అంతా  ఖాళీగా ఉంది. అది కానీ కాన్సిల్ అవదు కదా అని కంగారూ పడ్డాము. ఒకవేళ కాన్సిల్ అయితే అప్పుడు తమిళనాడు దాటి ఆంధ్రలోకి కూడా వెళ్ళలేము. ఆరున్నరకు కౌంటర్ ఓపెన్ చేశారు. అంతవరకూ ఖాళీగా ఉన్న ఆ కౌంటర్ దగ్గరకు ఎక్కడ నుండి వచ్చారో బోలెడు మంది వచ్చేసారు.  ఫ్లయిట్ లోపలకు వెళితే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఇండియా నుండి బయలుదేరిన ఆఖరి ఫ్లైట్ అది. 

ఫ్లయిట్ లో అంతా మామూలుగానే ఉంది, ఒక్కటే తేడా ఏమిటంటే ఎవరైనా రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ లు లోపలకు వెళ్ళి సానిటైజ్ చేస్తున్నారు. దుబాయ్ చేరాం. అటూ ఇటూ తిరిగే ప్రయాణీకులతో, షాపింగ్ చేసే కస్టమర్స్, రెస్టారెంట్స్ తో  ఎయిర్ పోర్ట్స్ సాధారణంగా సందడిగా ఉంటాయి. అప్పుడు మాత్రం ఎవ్వరిలోనూ సరదా సంతోషాలు కనిపించక పోగా అక్కడ ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది. అందరూ మాస్క్ లు పెట్టుకుని ఉన్నారు, కొంత మందైతే పూర్తిగా పాలిథీన్ తొడుగులు వేసుకుని ఉన్నారు.

బోర్డింగ్ దగ్గర అందరికీ థర్మల్ చెక్ చేస్తున్నారు. అప్పుడు కూడా టెంపరేచర్ ఉంటే దుబాయ్ నుండి వెళ్ళనివ్వరట. నెల్లూరు కాదు, చెన్నై కాదు ఇప్పుడు దుబాయ్ లో ఉండి పోవల్సి వస్తుందా అని చాలా కంగారూ పడ్డాము. కానీ మేము భయపడ్డట్లు కాక ఇద్దరికీ టెంపరేచర్ నార్మల్ చూపించింది. అమ్మయ్య, ఇక యుస్ వరకూ ఇబ్బంది లేకుండా వెళ్తాం అనుకున్నాం. అక్కడ మాత్రం ఇంటికి వెంటనే వెళ్ళాక తప్పక క్వారంటైన్  చేయాల్సి వస్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయి ఓ ఆరుజాతల బట్టలు హ్యాండ్ లాగేజ్ లో పెట్టుకుని రెడీగా ఉన్నాం కూడా.  

వాషింగ్టన్ డీసీలో లాండ్ అయ్యాం. ఇమిగ్రేషన చెక్ లో ఇండియా కరెన్సీ, బంగారం, పచ్చళ్ళు లాంటివి ఏమైనా తెచ్చారా అని అడిగారు. అటువంటివేమీ లేవన్నాం. అయితే మీరిక వెళ్ళొచ్చు అన్నారు. ఆశ్చర్యం వేసింది, మేం అనుకున్నట్లు క్వారంటైన్ చేయమనలేదు సరికదా కనీసం థర్మల్ చెక్ కూడా చెయ్య లేదు. బహుశ మాకు తెలియని టెక్నాలజీ వాడి ఉంటారా? లేదూ అమెరికాలో అప్పటికే వ్యాపించి ఉండడంతో పరీక్షించనక్కరలేదు అనుకున్నారా? ఇండియాలో అలా కాదే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ని వెంటనే చెక్ చేస్తున్నారని విన్నాము. సరే వెళ్ళామన్నారు కదా అనుకుంటూ లాగేజ్ తీసుకుని బయటకు వచ్చాం. 

మాకు డిసి వరకే ఫ్లయిట్ దొరికింది. అక్కడి నుండి షార్లెట్ కు కారులో ఏడు గంటలు ప్రయాణం.
మా తమ్ముడు వాళ్ళు మేరీలాండ్ లో ఉంటారు. అక్కడి నుండి డిసి ఎయిర్ పోర్ట్ దగ్గర. మమ్మల్ని మా తమ్ముడు పికప్ చేసుకుని సగం దూరం తీసుకుని వెళ్తే షార్లెట్ నుండి బయలుదేరిన మా వారు, పండు మమ్మల్ని అక్కడి నుండి  పికప్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట. మాకు కనుక వైరస్ అటాక్ అయిఉంటే వీళ్ళందరికీ  సోకే ప్రమాదం ఉంది. మా అమ్మాయి, నేను ఫ్లయిట్ దిగాక కూడా మస్క్ లు తీయలేదు. 

దాదాపుగా మూడు గంటల డ్రైవ్ తరువాత వచ్చిన రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. అప్పటికే మా వారు, పండు అక్కడికి వచ్చారు. మా మరదలు  పులిహోర, దద్దోజనం, పూరీలు, ఊర్లగడ్డ కూర, ఉప్పు మిరపకాయలు, అన్నీ రెండు పూటలకూ సరిపడా పంపించింది. మా తమ్ముడి కూతురు బ్రౌనీలు చేసి పంపింది. రెస్ట్ ఏరియా దగ్గర ఆగి అందరం భోజనాలు చేసి కారు మారాం. మేము షార్లెట్ చేరేసరికి సాయంత్రం ఐదయింది. అంటే బయలుదేరిన ముప్పైఏడు గంటల తరువాత నాలుగు కార్లు, రెండు ఫ్లైట్స్ మారి ఇల్లు చేరాం. అప్పటినుండి ఒక వారం పాటు నేనూ మా అమ్మాయి చెరో గదిలో స్వయం నిర్భంధంలో ఉన్నాం.

మేము ఇల్లు చేరడానికి సహాయం చేసిన మా తోడికోడలికి, చెన్నైలోని మా ఫ్రెండ్ కు,  మా తమ్ముడికీ, మమ్మల్ని పికప్ చేసుకున్న వారికి కూడా  వైరస్ సోకే ప్రమాదం ఉన్నా మనస్పూర్తిగా మా తమ్ముడ్ని పంపిన మా మరదలికీ, ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈ ఐదు నెలలు మా వారిని, పండును తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్న అమెరికా స్నేహితులకూ ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అనుకున్నదానికంటే ఎంతో ముందు ఖాళీ చేస్తున్నా, ఖాళీ చేసే నెల వరకే  అద్దె ఇవ్వమన్నారు నెల్లూరులోని మా ఇంటి ఓనర్. అలా కాదని చెప్పినా వినక మీరు క్షేమంగా వెళ్ళడం ముఖ్యం ఇవన్నీ తరువాత అన్న మా ఇంటి ఓనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం అంతా డబ్బు మయం అని అంటుంటారు కాదా! అలా కాదని నిరూపించారు ఆవిడ. వైరస్ భయంతో ఎవ్వరూ ఇల్లు కదలని సమయంలో కూడా ఫ్లైట్ అటెండెంట్స్, కెప్టన్స్, ఇంకా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అంతా వారి కుటుంబాలను వదిలి ప్రమాదం ఉండవచ్చని తెలిసినా పనిచేస్తున్నారు. వారందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఎవరండీ రోజులు మారిపోయాయి, అప్పటి రోజులు, అప్పటి అనుబంధాలు ఇప్పుడేవీ అనే పెద్ద మనుషులు? ఇవన్నీ అనుబంధాలు కావూ! చూసే దృష్టే ఉండాలి కానీ, రోజులన్నీ ఒక్కటే. మేము నెల్లూరి నుండీ బయలు దేరిన దగ్గరనుండి ఎన్నో వాట్స్ ఆప్ మెసేజస్, ఫోన్ కాల్స్. ఎలా ఉన్నారు? గమ్యం చేరారా? అంటూ యోగక్షేమాలు అడిగిన అందరికీ వందనాలు.

ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే మీరు ఈ సమయంలో ఇండియా నుండి అమెరికాకు ఎలా వచ్చారు? ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయని, చాలా దేశాలు బార్డర్స్ క్లోజ్ చేశారని  విన్నామే, ఏ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి? ప్రయాణంలో ఏమీ ఇబ్బంది ఎదురవలేదా?  ఇలా గత ఐదు రోజులుగా వాట్స్ అప్ లోనూ ఫోన్ కాల్స్ లోనూ కుశలం అడిగిన మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ఈ టపా. 

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1

ఏ దేశమైన చూడాలి, అక్కడి జీవనసరళి తెలుసుకోవాలంటే కనీసం ఓ రెండు నెలలైనా ఆ దేశంలో ఉండాలని నా అభిప్రాయం. ఆ కోరిక నాకు ఇండియాలో తీరింది. అదేమిటి నువ్వు ఇండియన్ వేగా వేరుగా దేశం చూడడమేమిటి అనుకోకండి. నేను ఇండియన్ ని అయినా అమెరికాకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది. ప్రతి రెండేళ్ళకూ, లేదా ఇంకా తక్కువ వ్యవధిలోనో ఇండియా వెళ్తూ ఉన్నా నేను అక్కడ అతిథినే. చుట్టాలనూ, స్నేహితులనూ కలవడం అన్నీ అమర్చిపెడుతుంటే ఖుషీగా తిరుగుతూ అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని రావడం ఇలా అన్నమాట. అది ఇండియాలో ఉండడం ఎలా అవుతుంది?

ఈసారి ఆ కోరిక తీర్చుకోవడానికీ, మెడిసిన్ పూర్తి చేయబోతున్న మా అమ్మాయి దగ్గర ఉండడానికి రెండువేల పంతొమ్మిది అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. ఆరునెలలు అక్కడే ఉండి ఏప్రిల్ పదహారున తిరిగి అమెరికా వచ్చేట్లుగా అనుకున్నాము. నెల్లూరులో ఇల్లు  అద్దెకు తీసుకుని పాలు, నీళ్ళు, పేపర్ అన్నీ సమకూర్చుకుని, అక్కడి వాతావరణానికి, జీవనానికి అలవాటు పడుతూ, ఆస్వాదిస్తూ వున్నాను. ఫిబ్రవరి చివరి వరకూ అలాగే గడిచింది.  

అప్పటికే కరోనా గురించి అక్కడెక్కడో చైనాలో అలా ఉందీ, ఇటలీలో ఇలా ఉందీ అని వార్తలు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఒకరోజు హైదరాబాద్ లో కరోనా అని పేపర్లో చదివి "మన దేశానికి  కూడా వచ్చిందీ ఇది" అనుకున్నాను. ఆ వైరస్ సోకినతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందనీ, వాళ్ళందరినీ క్వారంటైన్ లో ఉంచారనీ తెలిశాక కొద్దిగా కంగారు మొదలైంది. 

టికెట్ ప్రీ పోన్ చేసికుని మార్చ్ నెలాఖరకే అమెరికాకు వచ్చేస్తే మంచిదేమో అన్నాను శ్రీవారితో. దానికి మా అమ్మాయి ప్రమాదమేమీ లేదంటూ ఆ వైరస్ గురించి వివరించింది. చైనాలో  మొదలైనప్పుడు అప్పటికి ఆ వైరస్ గురించి తెలియక అది  ఎక్కువగా వ్యాపించిందనీ, అందువలన వైరస్ లోడ్ ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించిందనీ చెప్పింది. మరే ఇతర దేశాలలో అంత ప్రమాదమేమి లేదని, పైగా అది మామూలు ఫ్లూ లాంటిదే ఆరోగ్యవంతులకు ప్రాణభయమేమి లేదని చెప్పింది. వైరస్ లోడ్ అంటే ఏమిటని అడిగాను. "వైరస్ లోడ్ అంటే మన అపార్ట్ మెంటే తీసుకో దాదాపుగా వందమంది ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నలుగురికి వస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అదే ఎనభై మందికి వచ్చిందనుకో వైరస్ అన్నిచోట్లా వ్యాపించి అది శరీరంలోకి ఎక్కువ కణాలుగా ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి సరిపోక అనారోగ్యం ఎక్కువవుతుంది. అప్పుడు వయసు, ఆరోగ్యస్థితితో సంబంధం లేకుండా ప్రాణహాని ఉంటుంది. దానికి పరిష్కారం జాగ్రత్తలు పాటించడమే. ప్రతి గంటకూ, బయటకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి" అని వివరించింది. 

మా సంభాషణ జరిగిన వారానికి అంటే మార్చ్ పదకొండున ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేస్ రిజిస్టర్ అయింది, అదీ నెల్లూరులోనే. ఆ వ్యక్తి ఇటలీ నుండి వచ్చి ఓ వారం చిన్న బజారులోనే ఉన్నాడని  తెలిశాక మొదలైంది అసలు కంగారు. నాకే కాదు నెల్లూరు వాసులందరికీనూ. ఎందుకంటే చిన్న బజార్ నెల్లూరులోని ప్రధాన వ్యాపార కేంద్రం. అక్కడ చిన్న, పెద్ద దుకాణాలు, ఇళ్ళు అన్నీ కిక్కిరిసి ఉంటాయి. అయితే అతని కుటుంబసభ్యులు ఎవరికీ ఈ వైరస్ వ్యాపించలేదనే సరికి కొద్దిగా కంగారూ తగ్గింది. 

అప్పటికే అమెరికాలో స్కూళ్ళు, యూనివర్సిటీలకు ఏప్రిల్ లో ఇవ్వవలసిన  స్ప్రింగ్ బ్రేక్ ముందుగా ఇచ్చేశారు. మేము నడుపుతున్న పాఠశాలకు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసికుని తరగతులను రద్దు చేసి తల్లిదండ్రులే పిల్లలకు పాఠాలు చెప్పేట్లుగానూ, ఈ ఏడాది వార్షికోత్సవం రద్దు చేసేట్లుగానూ నిర్ణయం తీసుకున్నాం. మరో వారం గడిచాక అమెరికన్ గవర్నమెంట్, విద్యార్ధులు ఎవరూ స్కూళ్ళ కు, యూనివర్సిటీలకూ రానక్కర్లేదనీ ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్పారు. యూనివర్సిటీ నుండి స్ప్రింగ్ బ్రేక్ కి ఇంటికి వచ్చిన బుజ్జి పండు మరి తిరిగి వెళ్ళలేదు.  

మార్చ్ రెండవ వారానికి వచ్చేసరికి నెల్లూరులో మరో కేసు రిజిస్టర్ అయింది. ఈసారి కూడా ఇటలీ నుండి వచ్చిన వారికే వచ్చింది.  ఇండియా నుండి ఇటలీ వెళ్ళిన విద్యార్థులు అందరూ తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజలకు ఈ వైరస్ పట్ల స్పృహ కలిగించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ లో ఖళ్ ఖళ్ మని దగ్గు, ఆ తరువాత ఓ అరనిముషం పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తున్నారు. టీవీలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. 

ప్రజలకు దీని సీరియస్ నెస్ బాగానే అర్ధం అయింది. రోడ్డు మీద వెళ్ళేవారు, కూరలమ్మే వాళ్ళూ, ఆటో వాళ్ళూ మాస్కులు వేసికుని జాగ్రత్తలు చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో అందరికీ  గొప్ప అవేర్ నెస్ వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా వెంటనే మెడికల్ ఆఫీసర్లకూ, హాస్పిటల్ కూ ఫోన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం, పైగా ప్రాణ భయం ఏమీ లేదన్న ధీమా ఉండేది. అప్పటికి బయట దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది. భారత దేశంలో పెద్దగా ఈ వ్యాధి వ్యాపించలేదు. బహుశ అక్కడి వేడి వాతావరణం కారణం కావచ్చు. లేదా ప్రజల ఇమ్యూనిటీ కావచ్చు. ఒకవేళ ఎక్కువమంది పేషంట్స్ వచ్చినా వైద్య సదుపాయం అందించడానికి వీలుగా గవర్నెమెంట్ మరియు ప్రయివేట్ హాస్పిటల్స్ అదనపు వార్డులు ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలిసింది. 

మార్చ్ పదిహేడువ తేదీ నుండి షిర్డీలోనూ, ఇరవైయ్యొవ తేదీ నుండి తిరుపతిలోనూ దర్శనాలు ఆపేశారు. మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇండియా నుండి ఇతరదేశాలకు విమానప్రయాణాల రాకపోకలు రద్దు అనే వార్త భారతదేశం ప్రకటించింది. ఆ వార్తలు విన్నాక  నాకు మళ్ళీ కలవరం మొదలయ్యింది. ఒకవేళ ఏప్రిల్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగా అని. అప్పటికే అమెరికాలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ పండు, వాళ్ళ నాన్న ఇద్దరే ఉన్నారు. మామూలుగా అయితే ఫ్రెండ్స్ రావడం, పోవడం ఏమి అవసరమైనా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉండేది. రాకపోకలు నిలిచిపోవడంతో వాళ్ళ గురించి నాకు కంగారుగా ఉండేది. 

అప్పుడు మా అమ్మాయి, "అమ్మా, నాన్న గురించి నువ్వు టెన్షన్ పడుతూ ఇక్కడ ఉండడం కంటే నువ్వెళ్ళు నేను తరువాత వస్తాను" అన్నది. దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నువ్వొక్క దానివే ఎలా ఉంటావు? ఇప్పటికిప్పుడు బయలుదేరవలసిన అవసరం లేదు నేనూ పండూ జాగ్రత్తగానే ఉన్నాం. ఒకటి రెండు వారాలు ఇలాగే ఉంటుంది తరువాత అంతా సర్దుకుంటుంది. ఏప్రిల్ పదహారు నాటికి అంతా మామూలయిపోతుంది. మీ ప్రయాణానికేమీ  ఇబ్బంది ఉండదు, అప్పుడు ఇద్దరూ కలిసే రండి అన్నారు. ఈ చర్చలన్నీ మార్చ్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగాయి.  

అదే రోజు రాత్రి రెండు గంటలకు శ్రీవారి నుండి ఫోన్, ఒక లింక్ పంపించాను చదువు అంటూ. లింక్  ఓపెన్ చేస్తే, అమెరికా ట్రావల్ 4 అడ్వైజరీ అంటూ ఓ వార్త  కనిపించింది. దాని సారాంశం ఏమిటంటే అమెరికా పౌరులు ఏ దేశాలలో ఉన్నా తిరిగి అమెరికా రావలసిందనిన్నూ రాని పక్షంలో ఆయా దేశాలల్లో అనిర్నీత కాలం ఉండేట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసింది అనిన్నూ. ఆ వార్త పూర్తిగా చదివే లోపలే "టికెట్ దొరికింది రేపు రాత్రికే మీ ప్రయాణం, ఐటనరీ ఇప్పుడే మెయిల్ పంపించాను" అన్నారు. మరీ మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అన్నాను. "లేదు, ఇప్పటికే అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయి. మన అదృష్టం కొద్దీ ఎమిరేట్స్ ఒక్కటే ఉంది. ట్రావెల్ ఫోర్ అడ్వైజ్ ఇచ్చారంటే అమెరికా కూడా త్వరలో లాక్ డౌన్ ప్రకటిస్తుంది. అప్పుడిక అమెరికా నుండి ఇతర దేశాలకు  రాకపోకలు నిలిచిపోవచ్చు. ఏప్రిల్ కి కూడా ఈ పరిస్థితిలో మార్పు లేకపోవచ్చు. నీవు ఊహించినదే నిజమయ్యేలా ఉంది" అన్నారు. 

శుక్రవారం వేకువ ఝామున టికెట్ బుక్ చేశారు, ఫ్లయిట్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిముషాలకు. అంటే మాకు మానసికంగా సంసిద్దమవడానికి, కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే వ్యవధి ఉంది. పాపకు హౌసీ పూర్తవడానికి ఇంకా వారం ఉంది. పైగా డిసెంబర్ లో తనకు డెంగ్యూ రావడంతో మరో వారం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా అత్యవరసరమైన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ ఇప్పుడు కనుక ఇండియాలోనే ఉండిపోతే మళ్ళీ ఆమెరికాకు ఎప్పటికి వెళ్ళగలమో తెలియని పరిస్థితి. టైలర్ల దగ్గర, లాండ్రీలో బట్టలు ఉన్నాయి. పాల వాళ్ళకు, పని మనిషికి, పేపర్ అతనికీ చెప్పాలి. ఇంటి ఓనర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్లకు ఈ విషయం చెప్పి వీడ్కోలు తీసుకోవాలి.  తెల్లవారేదాకా నిద్రలేకుండా ఇలా రకరకాల ఆలోచనలు.

మిగిలిన వివరాలు ఇక్కడ ...


Sunday, June 18, 2017

నాన్నా,

       మనం ఉత్తరాలు రాసుకుని చాలా కాలం అయింది కదూ! నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కేవలం నన్ను పలకరించడం కోసమే రోజుకో ఉత్తరం రాసేవాడివి. అప్పట్లో ఫోన్ వాడకం ముఖ్యమైన విషయాలకే పరిమితమై ఉండేది.

       తమ పిల్లల జీవితం నందనవనంలా ఉండాలని ప్రతి తల్లీతండ్రీ కోరుకుంటారు. ఆ నందనవనానికి నాందీ వాక్యం గురించి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి.

      ఓ మబ్బు పట్టిన సాయంత్రం...ఊరికే... కేవలం ఊరికే, మనకు అప్పుడు టివియస్ ఉండేది. నువ్వూ, నేనూ, తమ్ముడూ జిటి రోడ్డు మీద ఓ రెండు కిలోమీటర్లు వెళ్ళి చిన్న బ్రిడ్జి  దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవడం గుర్తొచ్చింది. ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు కాని ఆ సాయంత్రం మాత్రం అలా ఓ చక్కటి జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలతో అలాంటి అందమైన సాయంత్రాలు ఎన్నో కేవలం ఊరికే... తీరిగ్గా కూర్చుని గడపగలిగే అదృష్టానికి ఆ సాయంత్రం బీజం వేసింది. 

       అప్పుడప్పుడూ మమ్మల్ని నీతో పాటు మీ ఆఫీస్ కు తీసుకువెళ్ళేవాడివి. కోర్టు ఆవరణలోకి వెళ్ళగానే దారి పక్కగా కనిపించే పెరివింకల్ పువ్వుల రంగు, అవి దాటి లోపలకు వెళ్ళగానే గదిలో వినిపించే టైప్ మిషన్ టకటక శబ్దం ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయ్. అప్పుడు అనుకోలేదు కాని తరువాత మా జీవితాలను పిల్లలకు పరిచయం చెయ్యాలనే ఆలోచనకు పునాది ఆ జ్ఞాపకం.

     ఏ పండగో వస్తే బడికి సెలవొస్తుందిగా, రెండు జతలు బట్టలు బాగ్ లో పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్ళిపోవడమే. ఒక్కోసారి ఈ ఊరా ఆ ఊరా అని కూడా అనుకునేవాళ్ళం కాదు. కావలో, ఉలవపాడో, గుడ్లూరో... ముందుగా ఏ బస్ వస్తే ఆ ఊరికి అటు అత్తా వాళ్ళింటికి కాని నాన్నమ్మ వాళ్ళింటికి కాని, పిన్ని వాళ్ళింటికి కాని. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళెవరికీ కూడా చెప్పాపెట్టకుండా చుట్టాలొచ్చారు, ఇప్పుడెట్లా అనే భావం ఉండేది కాదు. మొహమంతా వెలిగిపోతుండగా "రాండి...రాండి. సరైన టయానికి వచ్చారు. తోట కాడ్నించి మామిడి పళ్ళు దెచ్చినారు, దక్షిణపు గట్ల మీద తాటికాయలు ముదిరుండాయి, నిన్నే మచ్చల బర్రె ఈనింది. జున్నెట్లా పంపాలా అనుకుంటుండాం, " అంటూ లోపలకు తీసుకెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఇంటికి ఎవరైనా వస్తే అదే భావంతో వారిని ఆహ్వానించగలుగుతున్నామంటే ఆనాటి ఆనుభూతి పదిలంగా మనసులో నిలిచిపోవడమే కారణం. 

        ఓ పత్రికో పుస్తకమో చదువుతూ నచ్చిన వాక్యాలు పెద్దగా చదివి వినిపించడం నీకు అలవాటు. వింటూ బావున్నాయని అనుకున్నానే కాని అవి నాలో సాహిత్యాభిలాష పెంచే విత్తనాలని తరువాత కదా అర్థం అయ్యింది. చందమామ, బాలమిత్రలతో మొదలై చతుర, విపుల, ఆంధ్రభూమి ఆ తరువాత యద్దనపూడి, ఆరెకపూడి, పురాణం సీత, మాలతీ చెందూర్, చలం ఇలాంటి పరిచయాలతోనేగా జీవితానికో నిర్దుష్టమైన అభిప్రాయం ఏర్పరిచింది. 

        నీకు ఏవేవో ఆశయాలు అవీ ఉండేవి. లంచం తీసుకోవడం తప్పు, అలాగే అప్పు చేయడం ఇక మద్యపానం అంటే మహా నేరం. ఆ రోజుల్లో నీ ఒక్కడికే కాక జనాంతికంగా కూడా అవే అభిప్రాయాలు ఉండేవి. మారినకాలంతో పాటు ఎన్నో మార్పులు... లక్షీదేవి ఆదిపత్యంలోకి వచ్చాక, మంచి చెడు మధ్యనుండే అడ్డుగోడను లౌక్యం మేఘంలా కమ్మేసింది. భౌతికంగా సుఖమయ జీవినప్రమాణస్థాయి పెరిగినా మానసికంగా అల్లకల్లోలమవుతున్నవారే ఎక్కువ. ఈ మార్పులకు లోనవక నిటారుగా నిలబడగలిగామంటే ఆ నాడు మీరాచరించి చూపిన విచక్షణే కారణం. 

        నాకు సరిగ్గా గుర్తులేదు కాని బహుశా నేను ఇంటర్ లో చేరినప్పుడనుకుంటాను ఓ రోజు ముందుగదిలో మనందరం కూర్చుని ఉన్నప్పుడు అతిశయోక్తి కాని, అబద్డంకాని కాని జోడించకుండా మన ఆదాయం ఖర్చు లెక్కలన్నీ  వివరంగా చెప్పావు.  అందువల్లనే నువ్వు వంద రూపాయలు చేతికిచ్చినా తమ్ముడికి కాని నాకు కాని పదే ఖర్చు చెయ్యాలని చెప్పకుండానే అర్ధం అయింది. అందులో మేము సర్దుకుని బ్రతికిందీ లేదూ, అలా అని చాలకపోవడమూ లేదు. అంతా సహజంగానే. ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ రోజు పేదగా బ్రతకలేదు. ఆనాటి మీ ఆ జీవిన విధానమే మాకు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కునే ధైర్యం ఇచ్చింది. 

       అమ్మాయి మైనస్ అబ్బాయి ప్లస్ అనుకునే రోజుల్లో కదా పుట్టాను. అందులో అవి పిల్లలను డాక్టర్లనో, ఇంజనీర్లనో చెయ్యాలనుకునే రోజులు కూడానూ. మమ్మల్నిద్దర్నీ సమానంగా చూడడమే కాక మీ అభిప్రాయాలను మా మీద రుద్దకుండా మా భవిష్యత్తు పూర్తిగా మా చేతుల్లో వదిలి మా నిర్ణయమేదైనా ఆమోదించారు. ఆ ఆత్మవిస్వాసంతోనే జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. ఒకవేళ నాకు జీవితాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం వచ్చినా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకుంటాను. 

         నలభై, యాభై యేళ్ల క్రితం ఎవరైతే నీకు ముఖ్య స్నేహితులో ఇప్పటికీ మీ మధ్య అదే స్నేహం. వాళ్ళ పట్ల నీ అభిప్రాయం మారలేదు. అది ఆ స్నేహం గొప్పతనమని నీవన్నా అది నీ గొప్పతనమేమని నాకనిపిస్తుంది. మనింట్లో ఓ వ్యక్తి  గురించి గాని, ఓ సంఘటన గురించి గాని పదే పదే చెడ్డగా మాట్లాడే అలవాటులేదు. అది బహుశా నాన్నమ్మ వాళ్ళింటి నుంచి వచ్చిన అలవాటు కావచ్చు. తాతయ్య పోయి ముప్పై ఏళ్ళయినా ఈ నాటికీ  ఆయనను గుర్తు చేసుకోవడం కోసం ఎడాదికో రోజు మీరంతా  కలుస్తున్నారు. "మాకే కష్టమొచ్చినా మా అన్నకు చెప్పుకుంటామమ్మా ఆయనేగా మాకు పెద్ద" అని అరవై యేడేళ్ళ బాబాయి అన్నప్పుడు అబ్బురంగా అనిపించింది, గుండె తడి అర్ధం అయింది. ఆ అనుబంధాల తీవ్రత ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మౌనంగా భరించగలిగి, మరిచిపోగలిగిన పరిణితి ఇచ్చింది. జీవిత కాలపు స్నేహాలను నిలుపుకోగలిన అదృష్టాన్నిచ్చింది.

       నాన్నా ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో నువ్వు నమ్మిన సిద్ధాంతాలు తారుమారవడం, విలువలకు అర్థాలు మారడం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోగలను. నీ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. బాధపడడానికి , నీ బాధ వ్యక్తం చేయడానికి సహేతుకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. కాని విధికి తలవంచి జరిగిన వాటిని తలచుకుంటూ కోర్చోక పరిస్థితులను ఎదుర్కొని సంతోషంగా గడపగలుగుతున్న నీ జీవితం మాకే కాదు ఎందరికో ఆదర్శం.   

      ప్రస్తుతం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఏవేవో  అనిపిస్తూ ఉన్నాయి. వీధిలో చెత్త వేసినట్లు సోషల్ మీడియాల్లో విషం చిమ్మడం చూస్తుంటే బాధ వేస్తోంది. ప్రముఖులమని చెప్పుకుంటున్న వారు వేస్తున్న పిల్లిమొగ్గలను చూసి బాధతో కూడిన నవ్వు వస్తోంది. ముఖ్యంగా నలుగురిలో గుర్తింపు కోసం తమ కోరికలను పిల్లల మీద రుద్దడం చూసి బాధనిపిస్తోంది. తల్లిదండ్రుల ప్రోద్భలంతో సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకున్న వారు సంతోషంగా ఉండగలుగుతున్నారా? సంతృప్తితో జీవితాన్ని గడపగలుగుతున్నారా?   

      "నేనెలాంటి నిర్ణయం తీసుకున్నా మా నాన్న సమర్ధిస్తారు. నా అడుగులు తడబడినప్పుడు ఫరవాలేదులే అని భుజం తడతారు, నన్ను నన్నుగా మా నాన్న ఆమోదిస్తారు". ఇలాంటివి కదా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేది. అదిలేని వారు ఎంత గొప్ప పదవులలో ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నా అత్మన్యూనతతో బాధపడుతూ జీవితాన్ని కోల్పోతారని ఎంత మంది నాన్నలకు తెలుస్తుంది? 

     అక్షరాలు అందంగా రాయడం నేర్పింది అమ్మయితే ఆ అక్షరాలకు అర్ధం చెప్పింది నువ్వు. 

                                Happy Fathers Day Nanna. 


Sunday, June 12, 2016

అనుకోలేదేనాడూ...

"సమయం ఐదవుతోంది నిద్ర పట్టడం లేదామ్మా?" అనడిగాడు పండు. జీవితంలో కొన్ని రోజులు సప్త వర్ణాల్ని ఒంటికి అద్దుకుని ఇంద్రధనస్సు మీద  ఊయలలు ఊగుతాయట. వినడమే కాని ఆ రోజులెలా ఉంటాయో నిన్నటి వరకు తెలియలేదు. అంతటి భాగ్యాన్ని చవిచూసిన నాడు ఇక నిద్రెలా పడుతుంది? నిన్న సాయంత్రం నుండి జరిగిన ప్రతి అంశమూ మధురంగా మనసును ఊపేస్తూ... ఒక్కొక్క జ్ఞాపకం మెత్తగా మనసులో ఇంకుతుంటే ఇది నిజమా! నిజమేనా? అని ఇంకా అనుమానంగానే ఉంది.  
అక్కడ ప్రతి టేబుల్ మధ్యలోనూ కొలువు తీరాయే తెల్ల గులాబీలు, లిల్లీలు ఇక్కడ తీరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరూ లేరనుకున్నాయో ఏమో ఏమిటేమిటో కబుర్లు. వాటికి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలని కోరిక ఉండేదట. ఆ చుక్కలు, చంద్రుని సమక్షంలో నిన్న జరిగిన సంబరం చూశాక ఆ కోరిక తీరిపోయిందట. "మా సుధీర్, శిరీష లాంటి తమ్ముడు, మరదలు, శ్రీదేవి, కేశవరావు గారి లాంటి స్నేహితులు ఉంటే ఆ బ్రహ్మ దేముడు మాత్రం స్వర్గంలో ఎందుకు ఉంటానంటాడు... వెంటనే దిగి భూలోకానికి వచ్చెయ్యడూ" అంటూ గుసగుసలు పోతున్నాయ్.
             *            *          *         *           *            *          *         
ఖాళీగా ఉండే బ్రిడ్జ్ హామ్టన్ క్లబ్ హౌస్ ఆ అలంకరణతో ఏకంగా ఆకాశంతోనే పోటీ పడిందంటే అతిశయోక్తి కాదు. మా ఫొటోలన్నీ ఎలా సేకరించారో అద్భుతమైన ఫోటో సైన్ ఇన్ ఆల్బం తయారు చేశారు. షాండ్లియర్, సెంటర్ పీసెస్, బాక్ డ్రాప్, నక్షత్రాలతో కిటికీ తెరలు....  
ప్రతిదీ శ్రద్దగా తయారుచేసిన శ్రీదేవి, కేశవ్ రావు గారి తీరు చూసి ఆ అనుబంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. అసలీ ఋణానుబంధం ఏనాటిదో అనే సందేహం కలుగుతోంది. 

మా జీవితాన్నే చిత్రంగా చలన చిత్రంలా మలచి మమ్మల్ని కూర్చోపెట్టి మరీ చూపించారు. అందులో నటించిన విజయ, కృష్ణ, అనురాధ, రామారావు, రఘు, సూర్య, రాఘు గారి పేరెంట్స్ నటనా కౌశలం అమోఘం. 



ఆరునెలల క్రితమే ప్రణాలిక సిద్దమైనా పదేళ్ళ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రహస్యాన్ని పదిలంగా కాపాడడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతెంత దూరలనుండో స్నేహితులు అభిమానంతో వచ్చారు. ఎంతో మంది ఉత్సాహంగా ఎన్నో చేశారు. వారందరి ఆత్మీయతకు గుండె తడి తెలుస్తోంది. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉందంటే అభిమానాలు, సంబంధాలు అన్నీ ఎండమావులే అనుకునే బలహీన క్షణాలు ఉంటాయిగా అవి మొహం ముడుచుకుని ఇక తిరిగి రామంటూ పారిపోయేటంత. 

సంతోషాల శిఖరాలు ఎక్కినప్పుడే కాదు, అవరోధాల అగాధాలు దాటినప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపించిన ఆత్మీయుల సమక్షంలో మా పాతికేళ్ళ వివాహ వార్షికోత్సవం జరగడం తలుచుకున్న కొద్దీ మహా సంబరంగానూ ఉంది.  

ఏమన్నారు మంజుల... "ఎవరేమి చేస్తారో తెలియదు కాని ప్రతిదీ ఇద్దరిదీని" అని. ఆ ఈశ్వరునికి శరీరంలో సగభాగం పార్వతికి ఇవ్వడమే తెలుసు. నా ఈశుడు తన ఆత్మలో నన్నే నిలుపుకున్నాడు అందుకే ప్రతి పనిలోనూ ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. బిందు అనుకుంటుందీ "మా అక్క చిచ్చుబుడ్డీ. తను తల వంచదు, మా రఘు బావను తల వంచనివ్వదు" అని. పిచ్చి బిందూ ఆ నాడు దాక్షాయణి పరాభవాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయింది. ఈశ్వరుడిలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, జరగబోయే ఘోరాన్ని ముందే పసిగట్టి దక్షుని మనసును సైతం మార్చగల ముందు చూపు మీ బావకు ఉండబట్టే నాకు దక్షాయణిలా పరాభవాన్ని చవిచూడాల్సిన అవసరం కలగలేదు.  తలవంచని తనం నాదే కాని ఆ అవసరాన్ని రానివ్వని చాకచక్యం మీ బావది.  

ఈ పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు... అనుబంధాలు. అవి తలచుకున్న కొద్దీ మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. లేలేత పరిచయాలు... ఆ స్నేహ పరిమాళాల ఘుమఘుమలతో ఈ రేయి తెల్లవారబోతోంది. రంగులు అద్దిన 'నేడు' ఇంద్రధనస్సుపై సవారి చేస్తోంది.

"అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
గుండెల్లో ఇన్నాళ్లు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా!"

ఆ చందమామ మీద కూర్చుని ఆత్మీయుల అభిమానంలో తడిసి ముద్దవుతున్నప్పుడు నా మనసులో మెదిలిన భావాలకు అద్దం ఈ పాట.   

మాతో వారి అనుబంధాన్ని నలుగురితోనూ పంచుకున్న ఆత్మీయులకు, ఈ అనుభవాన్ని మాకు పదిలంగా అందించిన ఆత్మబంధువులకు కృతజ్ఞతలు చెప్పి దూరం పెట్టలేను. మీ స్నేహ సంతకాన్ని బ్రతుకు పుస్తకంలో చివరి పేజీలో సైతం పదిలంగా దాచుకుంటాను. 

Wednesday, April 6, 2016

అంత అదృష్టం నాకెక్కడిది?

        ఇదిగో మిమ్మల్నే, ఇడ్లీ చల్లారిపోతోంది త్వరగా రండి. కాఫీ తాగేసి వెళ్తారా, ట్రావల్ మగ్ లో పోసివ్వనా? ఎనిమిదైపోతోందని రోజూ హడావిడి పడకపోతే ఓ పావుగంట ముందు లేవచ్చుగా! ఏమిటీ...ఇవాళ ఆఫిసుకు వెళ్ళక్కర్లేదా... వర్క్ ఫ్రం హోమా? ఆ విషయం రాత్రే చెప్తే హాయిగా ఏ మసాలా దోసెలో వేసుకునే వాళ్ళంగా. సర్లే రండి, ఆకలి దంచేస్తోంది... ఇడ్లీ తింటూ మాట్లాడుకుందాం.
            *                       *                    *                       *  
        నిన్నలేదూ.... ఎందుకా నవ్వూ! అర్థమైంది లెండి. నిన్న లేదూ అన్నాననేగా. నిన్నెప్పుడూ ఉంటుంది. రేపే ఎంతమందికి ఉంటుందో తెలీదు. నిన్న రేపు సంగతెందుకుగాని అసలు విషయం చెప్పమంటారా? అది చెప్పబోతుంటేనే మధ్యలో మీ నవ్వు....ఇంతకీ ఏం చెప్పాలనుకున్నానబ్బా. ఆ మధ్యలో మాట్లాడకుండా విషయం పూర్తిగా వినండి. నిన్నా........ఇప్పుడే రావాలా ఆఫీస్ కాల్. ఇక మధ్యాహ్నం వరకు దొరకరు అయ్యగారు. 
           *                       *                    *                       *         
         నేను బయటకు వెళ్తున్నాను. షాప్ లో కొన్ని రిటర్న్స్ ఇవ్వాలి. అలాగే లైబ్రరీలో కొంచెం పనుంది, వచ్చేసరికి ఆలశ్యం అవుతుందేమో! కూరలన్నీ కౌంటర్ మీదే పెట్టాను, రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశాను. మీరు భోంచేసెయ్యండి. పనిలో పడి మొన్నట్లా మూడింటివరకూ తినకుండా ఉంటారేమో! షుగర్ డౌన్ అయితే కష్టం. ఏమిటీ అలా చెయ్యరా సరే! అయినా ఒంటిగంటకు ఫోన్ చేసి గుర్తు చేస్తాలే. మరి నా సంగతంటారా? బయటే ఏదో ఒకటి తినేస్తాను. 
           *                       *                    *                       *         
         అయ్యో! ఫోన్ చేయడం మార్చేపోయాను. ఏమిటీ... లంచ్ చేసేశారా?  గిన్నెల్లో గరిటెలు సింకులో పెట్టి మూతలు సరిగ్గా పెట్టారా? గుర్తు చెయ్యక్కర్లేదా. సరే! పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోకండి సాయంత్రానికి పుల్లగా అయిపోతుంది. అసలే ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కూడా! 

        అన్నట్లు ఇవాళ సాయంత్రం సుగుణా వాళ్ళింట్లో గెట్ టు గెదర్ ఉంది. ఏడింటికల్లా రమ్మన్నారు. ఐదున్నరకు జిమ్ కి వెళ్దామా? త్వరగా వచ్చేస్తే రెడీ అవడానికి టైం ఉంటుంది. ఏమిటీ ఇవాళ జిమ్ కి వెళ్ళాలని లేదా! రోజూ ఇలా ఏదో ఒక వంకతో జిమ్ మానేయాలని చూస్తే ఎలా? రేపు హైకింగ్ వెళ్దామంటారా. సరేలే. రమేష్ వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కోండి....ఓ ఆల్రెడీ కనుక్కున్నారా. మరీ...ఆరింటికి బయలుదేరితే సరిపోతుందిగా! ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవనుకుంటాను, టార్గెట్ లో తీసుకుని వస్తాలెండి. గ్రనోలా బార్స్ కూడా తేనా? ఏమిటీ ఎక్స్ట్రాకేలరీస్ ఎందుకంటారా? సర్లే ఆపిల్స్ తీసుకెళ్దాం. ఏమంటున్నారు....సరిగ్గా వినపడట్లేదు. కట్ అవుతోంది....ఇక్కడ సిగ్నల్ బాగా లేనట్లుంది...... కాన్ఫరెన్స్ కాల్ కి టైం అవుతోందా ... సర్లెండి బై మరి.  
           *                       *                    *                       *         
         ఇవాళ వర్క్ త్వరగా అయిపోయినట్లుందే, టీ తాగుతారా? ఏమిటీ... మీరే పెడతారా? సరే నాకు గ్రీన్ టీ వద్దు. నార్మల్ టీ కావాలి, అసలే మధ్యాహ్నం లంచ్ సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదంటారా?....డెలీలో ఫ్రెంచ్ బ్రెడ్ తీసుకున్నాను. అది గట్టిగా  రాయిలా ఉంది. అసలే పళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయ్ దాంతో తినలేక పోయాను. ఏమిటీ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళమంటారా. వద్దులెండి వెళ్తే విజ్డమ్ టీత్ అన్నీ పీకేయ్యాలంటాడేమో! ఇవాళ పనులన్నీ పూర్తయినట్లేనా? ఓ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడారా. మొన్న నేను మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టమన్నారు. మీకు రెండొందలకే ఎలా ఒప్పుకున్నారబ్బా!... ఫేస్ వాల్యూ అంటారా! వాళ్ళతోగాని ఫేస్ టైం చేశారా ఏమిటి? లేదా. చేశారేమో వాళ్ళు కూడా నాలానే మిమ్మల్ని చూసి అమాయకులని మోసపోయారనుకున్నాను.  

         సర్లెండి కబుర్లు తరువాత చెప్పుకుందాం, ఆరయిపోతోంది, ముందు మీరు డ్రెస్ ఛేంజ్ చేసుకుంటే నేనెళ్ళి చీరకట్టుకునొస్తాను... ఆల్రెడీ మార్చుకున్నారా. ఈ కార్గో షార్ట్స్ ఏమిటి లాన్ మొవ్ చెయ్యడానికి వెళ్తున్నట్లుంది. ఇదిగో ఈ పచ్చగళ్ళ చొక్కా, మొన్న కొన్న  చినో పాంట్ వేసుకోండి బావుంటుంది. 
           *                       *                    *                       *         
        పదకొండవుతోంది పడుకుందామా! .....ఫ్రైడేనేగా సినిమా చూద్దామంటారా. సరే యుట్యూబ్ లో సర్చ్  చేయండి, అయినా ఏం మంచి సినిమాలున్నాయ్ అన్నీ చెత్త. అయితే పుస్తకం చదువుకుందామంటారా!.... ఓ ఆల్రెడీ పుస్తకం తెచ్చేశారే... మళ్ళీ గోదావరి కథలేనా...ఇది ఆరోసారి కదూ చదవడం!.....అలా గోదారొడ్డున తిరిగి రావడం కోసం ఎన్నిసార్లయినా చదవొచ్చునంటారా. నిజమే! తలుపు తీస్తున్నారెందుకు? ఇప్పటికిప్పుడు గోదారెళ్దామంటారా ఏం? వెన్నెల పుచ్చపువ్వులా ఉందా..... కాసేపలా వాకింగ్ కి వెళ్ళొద్దామంటారా....ఇంత రాత్రి నాకు భయం బాబూ! నేను రాను. మీరొక్కళ్ళే వెళ్ళొస్తానంటున్నారా?  ఏ పిశాచాలన్నా ఎత్తుకుపోగలవు జాగ్రత్త. ఏమిటీ.... అంత అదృష్టం మీకెక్కడదంటారా?  
           *                       *                    *                       *    

        మరీ నిశ్సబ్దంగా ఉంది ... సందడంతా ఏమైపోయిందని ఇల్లేమో దిగులు పెట్టేసుకుంది. ఆ టికెట్టేదో కొంచెం ప్రీపోన్ చేసుకుని త్వరగా వచ్చెయ్యకూడదూ!


Monday, February 29, 2016

ఏమిటీ పాఠశాల??

         "ఎక్కడా అడ్వర్ టైజ్ మెంట్ లేదు. ఏ టివిలోనూ చూడలేదు, వార్తా పత్రికలోనూ చదివిన గుర్తులేదు. ఈ 250 మంది విద్యార్ధులేమిటీ! 45 మంది టీచర్లేమిటీ! మూడు ఊర్లలో ఈ తరగతులేమిటీ! ఏడాదికి ఏడాదికీ రెట్టింపు సంఖ్యలో విద్యార్ధులు పెరుగడమేమిటీ? ఏడువందల మందితో వార్షికోత్సవమా! పైగా ఇంతమంది కార్యకర్తలు ఏదో తమ కుటుంబంలో పనిలా చకచకా చేసేస్తున్నారు, అచ్చ తెలుగు వంటకాలు వండి తీసుకుని వచ్చి మారీ విందుభోజనం పెడుతున్నారు. ఎలా సాధ్యం అవుతోంది ఇదంతా?" అంటూ వేరే ఊరు నుండి మా ఊరు వచ్చిన వారు, నిన్న జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో కలసినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానంగానే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. 

      "పాఠశాల అంటే ఏమిటి? ఏం చేస్తున్నామిక్కడ?" అన్న విషయానికి వస్తే బంధాలు, బంధుత్వాలు గురించి చెప్పుకోవాలి. మనిషి సంఘజీవి. సుఖమైనా దుఃఖమైనా పంచుకునే వారుండాలి, మన వాళ్ళైతే మరీ సంతోషం. రక్త సంబంధీకుల మధ్యైనా సరే అనుబంధం బలపడాలంటే అర్ధం చేసుకునే భాష ప్రధానం. మన పిల్లలకు మన పెద్దవాళ్ళతో అనుబంధం ఏర్పడడానికి అవరోధంగా ఉంది ఈ భాష. మాతృభాష మనం పిల్లలకు నేర్పించినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చుననే ఉద్దేశ్యంతో 2009 జనవరిలో చార్లెట్ లో మొదలైంది పాఠశాల. 

       అయితే ఇప్పటి విద్యావిధానం అటు ఇండియాలో కానీయండి ఇక్కడ కానీయండి కేవలం బ్రతుకు తెరువు చూపించే చదువుల పట్ల శ్రద్ధ వహిస్తున్నాయి కాని, మానవ సంబంధాలు, అనుబంధాలు, మానసిక వికాసం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనం చిన్నప్పుడు నలుగురి మధ్య పెరిగిన వాతావరణం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రోజులో ఎక్కువ శాతం చదువు, వారి క్లాసులు వాటితోటే వారికి సమయం గడిచిపోతోంది. మిగిలిన సమయం ఎలెక్ట్రానిక్స్... పిల్లలకు మంచీ, చెడూ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా పూర్తిగా మనమీదే ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు వారిని గమనించి తెలుసుకున్న అంశాలు. అందుకే తెలుగు నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్న పాఠశాల విద్యావిధానంలో నీతి శతకాలు, మంచి విషయాలు, సుభాషితాలు చేర్చడం జరిగింది. ఈ శతకాలు నేర్చుకోవడం వలన మరో ప్రయోజనం భాషలో స్పష్టత పెరగడం. 

      భాష భావం భవిత...ఇవి పాఠశాల లక్ష్యాలు. మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలు పెంపొందించి భవితను సన్మార్గం వైపు నడిపించడమే పాఠశాల ముఖ్యోద్దేశ్యం.

       ఏడేళ్ళ క్రితం తెలుగు నేర్పించాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురైన సమస్య ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి? పుస్తకాలు లేవు, ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు తెలుగు రాయడం నేర్పించడానికి ఉపయోగపడుతున్నాయి కాని మాట్లాడడం నేర్పడానికి కాదు. అప్పుడే సిలబిస్ స్వంతంగా తాయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపకల్పనే ఈ నాటి నాలుగు తరగతుల పాఠ్యాంశాలు. ఆ తరువాత పిల్లలకు ఆసక్తి కరంగా ఉండేలా వర్క్ షీట్స్ తాయారు చేయడం జరిగింది. ఈ అభ్యాసాలు పూర్తిచేయడం వలన వారికి రాయడం, చదవడమే కాక చక్కని తెలుగు మాట్లాడానికి కూడా తేలిక అయింది.


      "నేను ప్రొఫెసర్ ను కాను, లక్చరర్ ని కాను, చివరకు టీచర్ ని కూడా కాను మరి నాకున్న పరిమితజ్ఞానంతో తాయారు చేసినటువంటి ఈ సిలబస్ సరైనదేనా? ఎవరైనా తెలిసిన వారు చూసి చెపితే బావుణ్ణు" అని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఓ ఆరు నెలల క్రితం "తెలుగు ఎందుకు నేర్పించాలి?" అన్న చర్చలో పాల్గొనడం జరిగింది. అదే చర్చలో పాల్గొన్నటువంటి కేతు విశ్వనాధ రెడ్డి గారి మాటల ద్వారా వారు పలు విద్యా సంస్థల సిలబస్ ను పరిశీలించినట్లుగా అర్ధం అయింది. వారు డా|| బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటి డైరెక్టర్ గా పని చేసిన వారూ, ప్రముఖ కథకులు, విమర్శకులు కూడానూ. వారికి విషయం చెప్పాను. ఆయన వెంటనే "తప్పకుండానమ్మా పంపించండి చూద్దాం"  అన్నారు. సిలబస్ పంపించాను. 

     వారు క్షుణ్ణంగా పరిశీలించి, సిలబస్ లోని ప్రతి వాక్యాన్ని వివరిస్తూ దాదాపుగా మూడు గంటలు నాతో మాట్లాడారు. వారేమన్నారంటే "పరభాషా మాధ్యంలో పెరుగుతున్న పిల్లలకు ముందుగా నేర్పవల్సింది మాతృభాషలో మాట్లాడడం. అది కూడా చాలా సులువుగా ఉండాలి. వారి తల మీద బరువులా ఉండకూడదు. బాగ్ ని సంచి అని, టేబుల్ ని బల్ల అని, సాక్స్ ను మేజోళ్ళు అని  నేర్పనవసరంలేదు. వాడుక భాష నేర్పినట్లయితే వారు సులభంగా నేర్చుకోగలుగుతారు. మీ సిలబస్ సరళంగా నేర్చుకునేలా ఉంది. ఇలాగే ఉండాలి కూడా". అంటూ అక్కడా చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మాటతో గొప్ప ఉత్సాహం వచ్చింది. 

       షికాగో, విస్కాన్సిన్, అగస్టా, మెంఫిస్... ఇలా చాలా ప్రాంతాల వారు మా పాఠశాల విద్యావిధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సిలబస్ అడిగితే సంతోషంగా ఇస్తున్నాం. అయితే ఒక్క షరతు ఈ సిలబస్ ను విజ్ఞానం పంచడానికి ఉపయోగించాలే తప్ప వ్యాపారంగా మార్చుకోవడానికి కాదు. అంటే తెలుగు నేర్పించడానికి మా సిలబస్ తీసుకున్నట్లయితే వారికి పాఠాలు ఉచితంగా చెప్పాలి. న్యూ జెర్సీ లోని జై గురుదత్త సంస్థ వారు పాఠశాల సిలబస్ నుపయోగించి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు.  

      మాకు తెలుగు నేర్పించడమే ప్రధానం. అందుకే మా ఉపాధ్యాయులే విద్యార్ధుల దగ్గరకు వెళ్తారు. అర్ధం కాలేదా? మా పాఠశాలకు స్కూల్స్ అవీ అవసరం లేదండీ. ఉపాధ్యాయుల ఇళ్ళే తరగతులు. ఆరుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులు, అంతకు మించితే ఇద్దరు ఉపాధ్యాయులు. సంఖ్య ఎక్కువైన కొద్దీ విద్యార్ధులందరినీ పట్టించుకోవడం కుదరదు.  

      భాష కోసం ఏమైనా చెయ్యాలనే తపన ఉన్నవారు కొందరైతే, ఎలాగూ మన పిల్లలకు నేర్పాలనుకుంటున్నాం మరికొంత మందితో కలిసైతే ఉత్సాహంగా నేర్చుకుంటారని అనుకునే వారు మరికొందరు. పాఠశాల వలన మా పిల్లలు మా పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు ప్రతిగా పాఠశాలకు ఏమైనా చెయ్యాలనుకునే వారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు ఆలోచించుకుని పాఠాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు.  

       ఎక్కడా అడ్వర్టైజ్ మెంట్ లేదేమిటి? అని వారిడిన ప్రశ్నకు మా సమాధానం అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వడానికి ఇది వ్యాపార సంస్థ కాదు. పిల్లలకు తెలుగు నేర్పించండి అని మేమెవ్వరికీ చెప్పం. పిల్లలకు తెలుగు నేర్పించాలనుకోవడం స్వవిషయం. తెలుగు నేర్పించాలనుకునే వారికి సహాయం చేస్తాం. మా పాఠశాల తల్లిదండ్రులకు కూడా ఒక్కటే చెప్తాం. "మీరే మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు దానికి సులువైన మార్గం చూపిస్తారు."     
  
        కొలంబియా తెలుగు అసోసియేషన్ వారు పోయిన సంవత్సరమే పాఠశాల తరగతులు మొదలు పెట్టారు. ఈ ఏడాది అక్కడ నలభైకి పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. రాలేలో ఈ ఏడాదే పాఠశాల మొదలైంది. అక్కడ కూడా పాతిక మంది వరకు విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు తెలుగు నేర్చుకోవడం చూస్తుంటే మాతృభాష మీద పెరుగుతున్న మమకారానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. 


Monday, February 15, 2016

పచ్చిగాలి కావద్దూ...

"ఏమిటీ?"
"ఆలోచనాధోరణి....ఎందుకిలా?"
"అంతే మరి."
"అదే ఎందుకు?"
"ప్రశ్న వేయకపోవడమే సర్దుబాటు."
"ప్రశ్నించడం తప్పా?"
"కాదు. ప్రశ్నించకపోవడం సుఖం."
"మరి ముందు ముందు ఎలా?"
"నడుస్తుంది."
"ఎలా?"
"ఎలాగోలా. సూర్యుడు లేనంటాడా...చెంద్రుడు రానంటాడా"
"దానికి ఇంత హడావిడి అవసరమా?"
"దేనికి?"
"ఎలాగోలా నడవడానికి?"
"కాదు."
"మరి?"
"గుర్తింపు కోసం"
"స్వార్ధం పాళ్ళే ఎక్కువ గాదూ"
"......."
"పదిలో నలుగురు సరే....ఎనిమిది మందీనా? "
"అంత ఆశ్చర్యమేం! మరికాస్త లోతుగా వెళ్ళలేవూ.."
"మూర్ఖత్వం."
"ఉహు..."
"మరి?"
"అమాయకత్వం అనుకోరాదూ....తెలియదు పాపమని జాలి పడలేవూ"
"ఇరవై ఏళ్ళ క్రితం విన్నానీమాట"
"ఎక్కడా"
"సత్యం మామయ్య నాన్నతో చెప్తుంటేనూ!"
"అర్ధమైందా?"
"అవుతూ ఉంది . కానీ.."
"ఒక్కమాట చెప్పనా..."
"చెప్పు"
"ఇదేం స్వాతంత్ర్యపోరాటం కాదు, ఆ  తరువాత మొదలైన స్వార్ధపోరాటం"
"అంటే"
"సమస్య ఎవరి జీవితాలకు ఇబ్బంది కలిగించేది కాదుగా"
"అయితే?"
"స్పందన ఉండదు."
"ఇప్పుడు లేదు. కాని భవిష్యత్తు మాటేమిటి?
"తెలుస్తుంది"
"ఎలా?"
"గంజాయి మొక్క మీదుగా తులసి గాలి వీస్తుందా?"
"తెలిసినవారు చెప్పొచ్చుగా?"
"రెండూ ఒక్కటే అంటారు"
"అదెలా"
"రెండూ మొక్కలు కాదేమిటి?"
"మరెలా...గొడ్డలి పట్టడమేనా మార్గం?"
"విషపు చెట్లు వందలు వేలు పెరిగి అడవి తయారయ్యింది. ఒక్క గొడ్డలి సరిపోతుందా"
"కర్తవ్యం"
"విత్తనాలు లేవూ"
"ఉంటే?"
"నాటుదాం"
"విషపు చెట్ల నీడలో తులసి మొక్కలు ... కష్టం కదూ"
"సైనికుడు కష్టాన్ని తలుస్తాడా?"
"పోరాటమా?"
"నీలా నువ్వుండాలంటే యుద్ధం తప్పదు మరి!"
"ఎవరితో"
"నీతోనూ.. చుట్టూ వున్న సమాజంతోనూ"
"అంతేనంటావా?"
"పైగా అది విషమని తెలిసి కొట్టేసే రోజు కోసం..... "
"ఊ...రోజు కోసం?"
"ప్రాణం నిలవడానికి కాస్త పచ్చిగాలి కావద్దూ"


Monday, September 14, 2015

ఎందుకు, ఏమిటి, ఎలా?

        "ఇలా ఎందుకు జరిగింది?" ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న రాకమానదు. ఎక్కువగా పరిస్థితులు అనుకూలించనప్పుడే, "అరెరే ఎందుకిలా జరిగింది?" అనుకుంటూ ఉంటాం. "ఇలా జరగడానికి కారణాలు ఏమిటి?" అని ఆలోచించడం ఓ పధ్ధతి. అయితే చాలా సార్లు ఈ ఆలోచన రాకముందే, అసలే ఆలోచనా రాకముందే చటుక్కున అడుగు ముందుకు వేసి, తీరిగ్గా "అడుసు తొక్కనేల కాలు కడగనేల" అని వాపోతూ ఉంటాం. ఆ తరువాత ఎప్పటికో తెలివొచ్చి "అసలు ఇది ఎలా జరిగింది!" అని ఆశ్చర్యపోతాం. అప్పటికే జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతాయి.

      అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేమిటంటే ఎందుకో ఒకందుకు కొన్ని జరుగుతాయి. వాటిలో మన ప్రమేయం ఏమీ ఉండదు, కాబట్టి ఆ ప్రశ్న పక్కన పెట్టి జరిగిందేమిటి? దాన్ని ఎలా పరిష్కారించాలి? అని కాస్త నిదానంగా ఆలోచిస్తే సమస్య దూదిపింజలా తేలి పోకపోయినా శ్రావణమేఘంలా కురుసిపోతుంది. అంటే చివరకు ఎలాగోలా పోతుందన్నమాట. సమస్యకు కుదురులేదు మరి, మన పక్కనే అది ఇల్లు కట్టుకుని కూర్చోదు.

ఈ ఎందుకు? ఏమిటి? ఎలా? ప్రశ్నలు ఈవారంలో నాకు రెండు సార్లు ఎదురయ్యాయి.

   ఒకటి కాజా సురేశ్ గారి దగ్గరనుండి నాలుగు రోజుల క్రితం ఒక మెయిల్ వచ్చింది. మేము ఈ వారాంతం 'హమారా' వేదిక ద్వారా ఒక కార్యక్రమం చేస్తున్నాం. మీరు దానిలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పాలి అన్నారు.

     వెంటనే పై మూడు ప్రశ్నలు వరుసగా దర్శనమిచ్చాయి. అయితే వాటి కర్తను నేను కాదు కాబట్టి సమాధానం వారి నడిగే తెలుసుకుందామని సురేశ్ గారికి ఫోన్ చేశాను. హమారా ద్వారా వారు వివిధ ప్రాంతాల వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నామని, దానికోసం ఎవరూ పనికట్టుకుని రానక్కరలేకుండా ఇంట్లోనే కెమెరా ఆన్ చేసుకుంటే చాలని చెప్పారు. చాలా ఆనందం కలిగింది. వారు నన్ను ఆహ్వానించినందుకు కాదు! ఇలాంటి ఓ పద్ధతికి శ్రీక్రారం చుట్టినందుకు. ఇక ఎలా, ఏమి చెప్పాలన్న విషయానికి నాకు తోచింది, తోచినవిధంగా చెప్పొచ్చని అర్ధమైంది.

     ఇంతకూ అసలు విషయం మీకు చెప్పనే లేదు కదూ! అదేనండీ వారు నాతో ప్రస్తావించిన కార్యక్రమం గురించి. మన పిల్లలకు తెలుగు ఎందుకు నేర్పించాలి?  ఎలా నేర్పించాలి? ఎంతవరకు నేర్పించాలి? ఇవీ అంశాలు.

    ఆ మొదటి ప్రశ్న చాలా సర్లే విన్నాము, మాకు తోచిన సమాధానం  చెప్పాము. ఇప్పుడీ చర్చద్వారా పలువురి అభిప్రాయాలు తెలుసుకోవచ్చని ఆసక్తి కలిగింది. ఇక ఎలా నేర్పించాలి? ఎంతవరకు నేర్పించాలి? అన్న ప్రశ్నలకు మేము ఆచరిస్తున్న విధానాన్నే చెప్పొచ్చు. పైగా అవన్నీ తల్లిదండ్రుల సలహా మేరకు మేము అనుసరిస్తున్నవిధానాలు, విద్యార్ధులు ఆమోదం తెలిపిన బోధనా పద్ధతులూనూ.

        ఈ శనివారం మధ్యాహ్నం గంటన్నర అనుకున్న చర్చ రెండున్నర గంటల పాటు ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాలన్నీ హమారా సైట్లో వున్నాయి. పైగా ఏ నిముషానికి ఏమి మాట్లాడామో చాలా ఓపిగ్గా అక్కడ పొందుపరిచారు. ఆ సంభాషనంతా యూ ట్యూబ్  మేము మాట్లాడుతున్నప్పుడే ప్రసారం చేశారు. మీరు కూడా విని మీ అభిప్రాయలు మాతో పంచుకుంటే అవి ఎంతో మందికి ఉపయోగపడొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏమి చెప్పాలన్న విషయాలపై వారు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో అవన్నీ మా పాఠ్యాంశాలలో ఉన్నవే. మేమేమీ మార్చుకోనక్కర్లేదని అర్ధమైంది. ఆ సంభాషణ విన్న మా ఉపాధ్యాయులందరూ కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు.

ఇక ఆ ప్రశ్నలు రెండవ సారి నిన్న రాత్రి ఎదురయ్యాయి.

      జ్యోతి వలభోజగారు "మీ ఫేస్ బుక్ వాల్ ఒకసారి చూసుకోండి." అని మేసేజ్ పెట్టారు. ఏమిటా అనుకుంటూ  వెళితే అక్కడ ఆవిడ షేర్ చేసిన నవతెలంగాణా లింక్ కనిపించింది. చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎలా వ్రాశారో చూద్దామని అని ఆ లంకె పట్టుకుని వెళితే 'అక్షర కుసుమం' అంటూ ఇదిగో ఇది కనిపించింది.






సమస్య ఎలా ఇల్లు కట్టుకుని మన పక్కనే పాతుకుని ఉండలేదో, సంతోషం కూడా అంతే. కాని ఆ అనుభూతి మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుభాళిస్తూనే ఉంటుంది.

ఆ విధంగా ఈ వారంలో రెండు సార్లు ఆ ప్రశ్నలు శుభ సందర్భంలోనే ఎదురయ్యాయి. హమారా టీం కు, నవతెలంగాణా పత్రికకు, శ్రమ తీసుకుని ఈ బ్లాగులను పరిచయం చేసిన భారతిగారికి ధన్యవాదాలు.


Friday, July 24, 2015

రంగుల కల

       అందమైన కల ఇచ్చే అనుభూతే వేరు, అది నిద్రలో కాని, మెలుకువలో కాని. నాకు బాగా గుర్తున్న కల.. బుజ్జిపండు ఇక రెండు నెలల్లో పుడతాడనగా వచ్చిన పసుపు పచ్చని పులిహోర కల. నవ్వకండి! నిజంగానే. తెల్లవారి లేచి మామూలు కన్నా కొంచెం ఎక్కువ పసుపుతో పులిహోర కలిపి తినేశాను. ప్రస్తుతం నా కలల్లో రంగులు కనిపించడం లేదు. పోనీ కలలకే రంగులు వేస్తే! ఏమిటీ..  వేయలేం కదూ! అందుకే చుట్టూ ఉన్న పరిసరాలకు అంటే ఇంటి గోడలకు రంగులు వేయాలనిపించింది. ఆ కథా కమామీషంతా ఓ సహస్రం నడిచింది. టూకీగా విశేషాలు చెప్తాను.

             *            *            *            *            *            *    

"ఇవాళ రంగులు చూసి వద్దామా?" తో ఓ రోజు మొదలైంది. ఆ వసంతమాసపు ఉదయం ఉత్సాహంగా 'షెర్విన్ విలియమ్స్' లోకి అడుగు పెట్టాం. కావలసిన రంగులేలో కార్ట్ లో  పెట్టుకుని తెచ్చేద్దాం అనుకుంటూ.
"కెన్ ఐ హెల్ప్ యూ?" సేల్స్ గర్ల్ వచ్చింది.
"మేము ఇంటికి రంగులు వేయాలనుకుంటున్నాం."
"మరి రంగులు ఎంచుకున్నారా?" అని అడిగింది. "ఇంకా లేద"నగానే రంగుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏ రంగులైతే ఒకదానిపక్కన ఒకటి సఖ్యంగా ఉంటాయో, సాధారణంగా ఏఏ గదులకు ఏఏ రంగులు వాడతారో ... అన్నీ చెప్పడం మొదలెట్టింది. పూర్తయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ పూటకు రంగుల వేట చాలించి  ఆ మర్నాడు కొత్తగా రంగులు వేసిన మా స్నేహుతుల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటాయన వాళ్ళ గదులన్నీ ఉత్సాహంగా చూపించి అన్ని గదులకు కలిపి మొత్తం పదహారు రంగులు వాడినట్లుగా చెప్పాడు. మరో ఇంటికి వెళ్ళాం, వాళ్ళూ అంతే. అంటే ఈ రంగుల ఎంపిక అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదని అర్ధం అయింది. "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది" అన్నట్లుగా మేమొకటి అనుకుంటే మా పిల్లల అభీష్టం మరొకటని అర్ధం అయింది. ఎలాగంటారా...  

"నీ రూమ్ కే రంగు వేద్దాం అమ్మలూ",
"పింక్ అండ్ పర్పుల్"
"ప్రెట్టీ కలర్స్, చ్యూజ్ వన్"
"ఐ వాంట్ బోత్"
"బుల్లి రూమ్ కి రెండు రంగులు ఏం బావుంటాయిరా?"
"బావుంటాయమ్మా" అమ్మని ఒప్పించాలంటే ఏ భాషలో మాట్లాడాలో అమ్మాయికి బాగా తెలుసు. 
సరే అందులో షేడ్స్ చూడు. 
"లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్..  ఐ మీన్ ఫషియా"
"ఫషియా .... ఫషియా అంటే దగ్గర దగ్గరగా నేరేడుపండు రంగు... ఇంకో సారి ఆలోచించరా"
"బాత్ రూమ్ కి లావెండర్ కలర్."
వెంటనే ఓకె  చెప్పేశాను. ఆలస్యం చేస్తే కిటికీ అంచులకీ, డోర్ నాబ్ కి కూడా వేరే రంగులు చెప్పెయ్యగలదు. 
"నీకు పండూ"
"ఐ వాంట్ ఓన్లీ వన్ కలర్. బ్లూ"
"ఓకే. గుడ్"
"డా...ర్క్ బ్లూ".
"రూమంతా అదేనా?" నడి సముద్రంలో మునిగిపోతున్న ఫీలింగ్ తో అడిగారు నాన్న.  
"ఆక్చ్యువల్లీ . ఐ వాంట్  హైపర్ బ్లూ".
"ఒద్దురా బాబూ. ఆ రంగువేస్తే  రూమంతా చీకటై పోతుంది." 
"నాకదే కావాలి. బాత్ రూమ్ అండ్ కోజెట్స్ బ్రైట్ ఆరంజ్"
"నో వే" రామ్ గోపాల్ వర్మ సినిమా చూడకుండానే ముచ్చెమటలు పోశాయి.
"ఎస్."
"ఆ..సరే కానియ్."
ఆ 'నో వె' కి... 'సరే కానియ్' కి మధ్య చాలా అంతరాలు దాటాల్సి వచ్చింది.

మిగిలిన గదులన్నింటికీ ఏ రంగులు వేయాలా? అని ఇంటర్ నెట్  అంతా వెతుకుతూ ఓ రోజు బయటకు చూసేసరికి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో చెట్లు హోలీ ఆడినట్లు రంగులే రంగులు. ఫాల్ కలర్స్ తో ఆకులు రంగులు మార్చుకున్నాయి కాని మా గోడలకు ఆ భాగ్యం కలగలా. . ఇక లాభం లేదని పెయింటర్ ని ఇంటికి పిలిచి సలహా అడిగాం. ఏ రంగు బావుంటుందో చూడాలంటే ముందు సాంపిల్స్ తెచ్చి వేసి చూడమన్నాడు. వేశాం. ఏ గోడమీద చూసినా ఎక్సర్ సైజ్ చేస్తున్న ఇంద్రధనస్సులే.

మళ్ళీ వసంతం వచ్చిన కొన్ని రోజులకు గోడలకున్న పటాలన్నీ కిందకు దిగాయి. సోఫాలు, మంచాలన్నీ ముందుకు జరిగాయి. ఏ గదిలోకి వెళ్ళినా గోడమీద నృత్యం చేస్తున్న రంగులు పులుముకున్న కుంచెలు...అర్ధం కాని భాషలో ఆ కుంచెలు పట్టుకున్న వారి కబుర్లు. ఒక్కో గోడకు రంగు వేస్తుంటే అది ఎలా మారుతుందో ఆశ్చర్యంగా చూడడం. నచ్చకపోతే షెర్విన్ విలియమ్స్ కి పరిగెత్తి కొత్త రంగు తెచ్చుకోవడం. ఇలా ఓ వారం గడిచాక...

    మంచి గంధానికి రెండు చుక్కలు లవంగనూనె కలిపినట్లు మధ్య గది, తొలకరి జల్లులో మెరిసే మైదానంలా వంటగది, కుంకుమ పువ్వు పులుముకుని ముందుగది, నడివేసపు చల్లని సాయంత్రంలో మెరిసేటి నీలి సంద్రంలా మరో గది.... ఇలా గది గదిలో ప్రకృతికాంత విన్యాసాలతో నా రంగులకల పూర్తయ్యింది.

నేర్చుకున్న పాఠాలు:

  • ఎవరి ఇంట్లోనైనా అందంగా అనిపించిన రంగు మన ఇంటికి సరిపోకపోవచ్చు. వెలుతురును బట్టి రంగు అందం మారుతూ ఉంటుంది. 
  • ఇంటికి రంగులు వేసిన తరువాత సామాన్లు కొనడం ఉత్తమం.
  • పెయింట్ గోడ మీద చూడాలనుకుంటే పోస్టర్ బోర్డ్ మీద వేసి గోడకు అంటించాలి. అంతే కాని నచ్చిన దగ్గర పులిమేయకూడదు.   
  • చీకటిగా ఉన్నాయి కదా అని క్లోజెట్స్  కి లేత రంగులు వేయక్కర్లేదు. ముదురు రంగులు కూడా బావుంటాయి. లైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది. 
  • గోడలమీద వున్న నొక్కులు, చొట్టలు సరిచేసిన తరువాత  రంగు వేస్తే మంచిది. ఈ విషయం మీ పైంటర్ మీకు చెప్పకపోవచ్చు.
  • ముదురు రంగులు వేయడం చూస్తూ ఉన్నప్పుడు గది చీకటై పోతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. మరేం ఫరవాలేదు. తెల్లని గోడపక్కన అలా అనిపిస్తుంది కాని గది మొత్తం వేసినప్పుడు అసలు రంగు తెలుస్తుంది.  
  • లేత రంగు ఎంచుకునేప్పుడు ఆ షీట్స్ తెలుపు రంగు కాగితం మీద పెట్టి చూస్తే రంగు ఎలాంటిదో సరిగ్గా అర్ధం అవుతుంది.

Monday, July 28, 2014

సాహితీ బంధువులు

"అసలు బంధువులతోనే నాలుగు మాటలు మాట్లాడడానికి తీరిక లేకపోతుంటే ఇంకా ఈ సాహితీ బంధువులేమిటి?" అనుకుంటున్నారా. మన బంధువుల సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ ఈ సాహితీ బంధువుల గురంచి మాత్రం మీకు చెప్పకుండా ఉండలేక పోతున్నాను. 

*                        *                         *                       *                         *

"మనమో కుగ్రామంలో ఉంటున్నాం కదూ!" నాటా సభల నుండి బయలుదేరి కారు ఊరిదారి పట్టగానే మా వారితో అన్నాను.
"అదేం? మన ఊర్లో కూడా హారిస్ టీటర్, వాల్మార్ట్, లోవ్స్ అన్నీ ఉన్నాయిగా?" ఆశ్చర్యపోయారు.
"అవన్నీ కాదు. అట్లాంటాలో నెలనెలా సాహితీ సభలు జరుగుతాయట. ఇండియా నుండి సాహితీ వేత్తలు వచ్చినప్పుడు కూడా అందరూ సమావేశమవుతారట." 
"మనమూ మొదలుపెడదాం. పైగా రమణి గారు కూడా వస్తున్నారుగా" సబ్ వే ముందు కారు ఆపుతూ అన్నారు.
"మన ఊళ్ళో పుస్తకం చదివేవాళ్ళని, అందులో తెలుగు పుస్తకం చదివేవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు." అన్నాను.
"ఫణిగారు, మాధవ్ గారు జులై ఆఖరి వారం రమణి గారిని అట్లాంటా తీసుకువెళ్ళడానికి వస్తామన్నారు. వారికిష్టమైతే ఆ వారాంతం సాహితీ సదస్సు ఏర్పాటు చేద్దాం" 
"అలాగే కాని ఎవరైనా వస్తారంటారా? " 
"ఏమో! ఇలా సాహితీ సదస్సు  జరుగుతుందని మెయిల్ పంపిద్దాం. ఆసక్తి ఉన్నవాళ్ళు వస్తారు".


"సాహితీ మిత్రులకు అభినందనలు, 

మన ఊరికి ప్రముఖ సినీ రచియిత, నంది అవార్డు గ్రహీత బలబద్రపాత్రుని రమణి గారు వచ్చారు, వారితో పాటు హాస్య కథల రచయిత ఫణి డొక్కా గారు, మరియు మరో రచయిత మాధవ్ దుర్భగారు అట్లాంటా నుంచి వస్తున్నారు. మనం ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకుని ఒక సాహితీ సదస్సు ఏర్పాటు చేసుకుంటే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది, వచ్చిన వెంటనే మీరు గుర్తు వచ్చారు. ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంట్లో సదస్సు జరుగుతుంది. మీకు తెలిసిన సాహిత్యాభిమానులను కూడా ఆహ్వానించగలరు" అంటూ మెయిల్ పంపించాము.

*                        *                         *                       *                         *

రమణి గారు ఓ పది రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు. అప్పటినుండి మా తోట పువ్వులు పుయ్యడం మానేసి నవ్వులు పుయ్యడం మొదలెట్టింది. బంధు మిత్రులతో ఇల్లంతా సందడే. ఒక్కరేగా వచ్చింది మరి ఈ సందడేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఆ ఒక్కరూ మొత్తం సినీ ఫీల్డ్ ని, కాదు కాదు యావత్ ప్రపంచాన్నే వెంటబెట్టుకుని వచ్చేశారు. 

ఈ శనివారం మధ్యాహ్నానికి ఫణి గారు, మాధవ్ దుర్భా గారు వచ్చారు. భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకున్నామో, కబుర్లే భోంచేశామో చెప్పడం కష్టమే! ఒక్క క్షణంలో టైం మూడున్నరైంది. 

"ఇంతకూ మేం దేనిగురించి మాట్లాడాలి? "అడిగారు ఫణి గారు. 
"ఏదైనా హాస్య ప్రధానంగా అయితే బావుంటుందేమోనండి. నిజజీవితంలోగాని, సాహిత్యంలోగాని మీ ఇష్టం" చెప్పారు రఘు.
"జ్యోతిర్మయి గారూ సుమారుగా ఎంతమంది వస్తారండి? " అడిగారు మాధవ్ గారు.
"సాహిత్యం అంటే ఆసక్తి ఉండొచ్చని మేం అనుకున్న వాళ్ళకి మెయిల్ పంపాపండి. ఓ పది మంది రావచ్చు." అని సమాధానం ఇచ్చాను. వారు కూడా రారేమోనని మనసులో సందేహమే!

మరో పావుగంట గడిచింది. ఓ నలుగురు మిత్రులు వచ్చి అతిధులను పరిచయం చేసుకుని, మా మధ్యగదిలో ఓ ముప్పై మంది కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేసేశారు. ఓ ఇద్దరమ్మాయిలు వంటగదిలోకి దూరిపోయి వద్దన్నా వినక ఫ్రీజర్ లోని స్వీట్ కార్న్ ని, అరలోని టీపొడిని పొయ్యెక్కించారు. "మీరెళ్ళి ఆ వచ్చేవాళ్ళను చూసుకోండి" అంటూ నన్నా ప్రాంతాల నుండి తరిమేశారు.

మరో పావుగంటకు ఒకరొకరూ రావడం మొదలెట్టారు. వేసవిలో తల్లిదండ్రులు అమెరికాలోని పిల్లల దగ్గరకు రావడం మామూలే. అలా వచ్చిన పెద్దవారిలో లైబ్రేరియన్, తెలుగు ప్రొఫెసర్, సోషల్ వర్కర్ ఇలాంటి వాళ్ళు రావడం సభకు నిండుదనం తెచ్చింది. పరిచయాలతో మొదలై,  చలం సాహిత్యం, సెన్సార్ బోర్డ్, ప్రస్తుతం వస్తున్న సీరియల్స్, వాటి తీరుతెన్నులు,  సినిమా వెనుక కష్టాలు, మంచి కథలు ఇలా అన్ని అంశాలను హాస్యంలో రంగరించి వచ్చిన ఆ ముగ్గురూ మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళారు. నవ్వులు, చప్పట్లు, ప్రశ్నోత్తరాలతో సమయం ఎలా గడిచిందో! రాత్రి ఎనిమిదైనా ఎవరికీ కదలాలని లేదు. 


 

అందరూ వెళుతుండగా మాధవ్ గారన్నారు. "సాహితీ సదస్సులకు ఫోన్ చేసి పిలిస్తేనే రావడం కష్టం. అలాంటిది మీ ఊర్లో ఒక్క మెయిల్ పంపితే దాదాపుగా ముప్పై మంది రావడం...ఇలా ఇన్ని గంటలు ఆసక్తిగా వినడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇకనుండి మా సాహితీ సభలు మీ ఊర్లో పెట్టుకోలనిపిస్తుంది" అని. "రావడం మా ఊరి విశేషమైనా వారిని ఆసక్తిగా కట్టిపడేసిన ఘనత మీదేనన్నాను". 

పుస్తకాల్లో ఇంత హాస్యం ఉంటుందా అని మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓ ఇద్దరు స్నేహితులు నన్ను పక్కకు పిలిచి "ఫణి గారు, మాధవ్ గారు అట్లాంటాలోనే ఉంటారు కదండీ. వారిని మన వేదిక మీద ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం చేస్తే బావుంటుందని" వారి మనసులో మాట చెప్పారు. ఇంకో నలుగురు "ఇకనుండీ మనం ప్రతి నెలా కలిసి ఒక పుస్తకం గురుంచో ఒక కథ గురుంచో మాట్లాడుకుందాం" అని చెప్పారు. "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" అని మనసులోనే పాడుకున్నాను.

అందరూ వెళ్ళాక సినిమాల గురించి మాట్లాడుతుండగా ఫణిగారన్నారు "మంచి సినిమాలు వస్తున్నాయి కాని వాటిని చూసి ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడంతో ఎవరికీ వాటిని తీసే ఉత్సాహం ఉండట్లేదని". 
"నిజమే కదా!" అనిపించింది. ఎందుకంటే మిధునం లాంటి సినిమాలు మా ఊర్లో రిలీజ్ కూడా అవవు. 
దానికి ఆయన చెప్పారు "ప్రతి ఊరిలో ఓ వందమందిమి కలసి మంచి సినిమా తీస్తే మేము తప్పకుండా చూస్తామని చెప్తే ఆ సినిమా తీసేవాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళకు నష్టమూ రాదు" అని. 
గొప్ప పరిష్కారం! సమస్య గురించి వందసార్లు మాట్లాడడం కన్నా పరిష్కారం వైపు ఓ రెండు అడుగులు వేస్తే సమస్య ఇట్టే తేలిపోతోంది. ఏమంటారు?

అవండీ సాహితీ బంధువుల విశేషాలు. అలా నిన్నంతా మా ఇంట్లో హాస్య రసం యేరులై ప్రవహించింది. ఇప్పడు కూడా ఏ వైపు చూసినా నవ్వులే కనిపిస్తున్నాయ్.  



Tuesday, June 24, 2014

కాఫీ కప్పు.....కాపర్ హెడ్డు

      మొన్నో రోజు మధ్యాహ్నం పూట ఎవరో బెల్ కొట్టారు. తలుపు తెరిచాను. ఆకుపచ్చ రంగు చొక్కా, ఖాకీ పాంట్ వేసుకుని తలుపుకు రెండడుగులు దూరంగా ఒకతను నిలబడి ఉన్నాడు. చొక్కామీదేదో బాడ్జ్ ఉంది.

       "మీ తోటలో చీమల పుట్టలున్నాయ్, మీ చూరు కింద కందిరీగ తిరుగుతోంది" అన్నాడు. బెల్ కొట్టి మరీ ఈ విషయం చెప్పాలా? అనుకుంటుండగా అతను "నా పేరు స్కాట్. ఫలానా పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకో నలభై డాలర్లిస్తే వాటిల్నిమీ ఇంటి వైపు రాకుండా చేస్తాం" అన్నాడు.

      మా ఊర్లో చీమలంటే అలాంటిలాంటివి కాదు కరెంట్ చీమలు. తోటలో అక్కడక్కడా తవ్వేసి పుట్టలు పెట్టేస్తాయి. చూడకుండా కాలేస్తే ఇక అంతే కాలిపైకెక్కి చటుక్కున కుట్టేశాయంటే కాలంతా దద్దుర్లే. అయితే మాత్రం చీమలు పోవడానికి నెలకు నలభై డాలర్లా. రాణి చీమను చంపే మందుందిగా దాన్ని కాస్త పుట్టమీద చల్లితే చాలు. చీమలు అమాయకంగా దాన్ని తీసుకువెళ్ళి రాణి చీమకివ్వడం, అది చచ్చిపోవడం, దానితో ఈ చీమలు మరో స్థావరం వెతుక్కోవడం చేస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది ఈ విధంగానే చీమలను తరిమేస్తూ ఉంటాం.

     "చీమలకు, కందిరీగలకు మందు వేస్తూ ఉంటాం. మాకు మీ సర్వీసెస్ అక్కర్లేదు" అని చెప్దామనుకుంటూ ఉండగా స్కాట్, గులాబీలను చూపిస్తూ "జపనీస్ బీటల్స్ కూడా రాకుండా చేస్తాం" అన్నాడు. ఎండాకాలం మొదలవడం ఆలస్యం, ఈ జపనీస్ బీటల్స్ పొలోమని కుటుంబాలతో సహా వలస వచ్చేస్తాయి. ఇక తోటలో ఆకులన్నీ జల్లళ్ళే. గులాబీల పరిస్థితి మరీ దారుణం, రేకు రేకులో బీటిల్స్ దాక్కుని మరీ వాటిని భోంచేస్తుంటాయి. ఇంతకుముందు పుల్లగా ఉందనేమో ఎర్ర గోంగోరను వదలిపెట్టేసేవి. వాటికీ రుచి తెలిసినట్లుంది ఇప్పుడు గోంగోర, బెండ, సొర ఒకటేమిటి అన్నింటినీ తినేస్తున్నాయ్. వాటి కోసం మందులేవో తెచ్చి చల్లి చూశాం. చల్లినప్పుడు పారిపోయి నాలుగురోజులు పోయాక మళ్ళీ వచ్చేస్తాయ్. గులాబీ మొగ్గ కొంచెం రేకు విచ్చగానే అందులో దూరిపోవడం...

       పనిమీద బయటకెళ్ళిన ఇంటాయన కారు దిగడంతోనే స్కాట్ ఆయన్ను అక్కడే ఆపేసి, టర్మైట్స్ గురించీ, అవి ఇంటిని నాశనం చేసే తీరు తెన్నులు గురించి చెప్పేసి, ఈయన్ను ఊదరగొట్టేసి అవునననిపించుకుని ఇంటి చుట్టూ మందు కొట్టేసి వెళ్ళిపోయాడు.

       ఓ నాలుగురోజులు ఎక్కడా చీమ, పురుగు కనిపించలేదు మొన్న శుక్రవారం మాత్రం మళ్ళీ ఓ నాలుగు బీటిల్స్ కానిపించాయి. "చూశారా అతను ఉట్టి కబుర్లు చెప్పి వెళ్ళాడు. నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చాయివి" అంటూ కత్తెర పట్టుకుని బయలుదేరాను ఆ బీటిల్స్ ఉన్న పూలు కత్తిరించడానికి. "వాటినేం చెయ్యకు పెస్ట్ కంట్రోల్ వాళ్ళకు ఫోన్ చేస్తాను. వాళ్ళే వచ్చి మందు వేస్తారు" అన్నారు.

      ఇవాళ ఉదయం సుమారు పదిగంటల ప్రాంతంలో వచ్చాడు స్కాట్. "మొక్కలకు మందు వేస్తున్నాను" అని చెప్పి పెరట్లోకెళ్ళాడు. అలా చెప్పకపోతే "ఏ అగంతకుండో పెరట్లో దూరాడు" అనుకుంటానని కాబోలు! ఓ పావుగంట తరువాత చీమల పుట్టలకు, బీటిల్స్ కి మందు వేశానని రాసున్న కాగితాన్ని ఇచ్చి సంతకం పెట్టమన్నాడు. ఆ పని పూర్తవగానే వెళ్ళడానికి రెండడుగులు వేసి వెనక్కి తిరిగి

"బైదవే మీ తోటలో ఆ వైపు పాముంది" అన్నాడు.
"పామా? ఏం పాము? ఎక్కడ?" కొంచెం కంగారుగా అడిగాను.
"అదిగో అక్కడ వర్షం నీళ్ళు పడడానికి గొట్టం కింద పచ్చగా ట్రే పెట్టేరుగా దాని కింద. మందు చల్లేప్పుడు చూశాను"
"అమ్మయ్య పెస్ట్ కంట్రోల్ తీసుకోవడం మంచిదయ్యింది" అనుకుంటూ "ఏం పామది? నీళ్ళ పామేనా?" అడిగాను.
"కాదు. కాపర్ హెడ్"
"అయ్య బాబోయ్. కాపర్ హెడ్డా. చాలా విషపూరితమైంది కదూ! నువ్వు చూడబట్టి సరిపోయింది. సాయంత్రమైతే వీధిలో పిల్లలంతా గడ్డిలోనే ఆడుతూ ఉంటారు." అన్నాను.
"యా చిన్న పామే. నేను దాన్ని కదిలించలేదు" అన్నాడు.
అతనేం అంటున్నాడో నాకర్ధం కాలేదు. "ఇంకా బతికే ఉందా? అంటే నువ్వు చంపలేదా?" కొంచెం భయంగా అడిగాను.
"నో...నో మేం కేవలం చీడపురుగులనే చంపుతాం. పాముల్ని పట్టుకోవాలంటే యానిమల్ కంట్రోల్ వాళ్ళను పిలవాలి."

        కారు దగ్గరకు వెళ్ళి యానిమల్ కంట్రోల్ నంబరున్న పేపరొకటి తెచ్చి నాచేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను పాముందని చెప్పిన వైపు చూస్తే దట్టంగా హైడ్రాంజియా, కమేలియా పొదలున్నాయి. మూడొందల అరవై రోజులు ఇంటి నుండి పనిచేసి అవసరమైన అర్రోజులే ఆఫీసుకి వెళ్ళడం అయ్యవారికి అలవాటు. ఫోన్ చేశాను. ఏ అత్యవసర సమావేశంలో ఉన్నారో ఫోన్ తియ్యలేదు. మెసేజ్ పెట్టాను. పోయిన సంవత్సరం తెలిసిన వాళ్ళింట్లో కాపర్ హెడ్ చంపారని గుర్తొచ్చి అతనికి ఫోన్ చేశాను.

     "మా ఇంటి ముందు పాముందట, యానిమల్ కంట్రోల్ కు ఫోన్ చెయ్యనా?" "వాళ్ళు వెంటనే రారు. అటువైపు వెళ్ళకండి. సాయంత్రం చూద్దాం" అని సలహా ఇచ్చారు.

      ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. "పాము కనిపిస్తే ఏం చెయ్యాలి?" గూగులమ్మను అడిగాను. ఏం చెయ్యొద్దు దాన్ని కదిలించకుండా ఉంటే దాని దారిన అదే పోతుంది అని సమాధానం వచ్చింది. "దాని దారిన అదే పోతుందా! ఎక్కడికి పోతుంది? ఏమో!" "అసలు పాములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?" ఈ సారి ప్రశ్నను కొంచెం మార్చాను. ఈ ప్రశ్నకు చాలా సమాధానాలే ఉన్నాయి.



      "పిల్లిని పెంచాలి". "పిల్లినా బాబోయ్! పిల్లలతోనే క్షణం తీరిక ఉండడంలేదు. ఇక పిల్లులూ, కుక్కలూ ఎక్కడ. అయినా పిల్లిని పెంచితే పాములు రావా" అనుకుంటూ అసాంతం చదివాను. పిల్లుల వలన ఎలుకలూ, చుంచులూ, పక్షులు రావు కాబట్టి వాటిని ఆహారంగా తీసుకునే పాములు కూడా రావని ఉంది. ఇంట్లో ఎలుకలూ, చుంచులూ లేవు కాబట్టి పిల్లిని పెంచడం పరిష్కరం కాదు.

       "పందిని పెంచాలి." మా 'హెచ్ ఓ ఏ' బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు.
"నెమలిని పెంచాలి" ఏమిటీ పామును చంపడానికి నెమలిని పెంచాలా? అదెక్కడ దొరుకుతుంది? దొరికినా డిసెంబర్ లో ఇక్కడి చలికి తట్టుకుంటుందా! అయినా పామును ఒదిలించుకోవడానికి ఇవన్నీ పెంచుకోవాలా?

       వాటి గురించి చదువుతున్నా మనసంతా బయటున్న పాము మీదే ఉంది. అదింకా అక్కడే ఉందా? ఒకవేళ అదిగాని పొదల్లోకి వెళ్ళిందంటే దాన్ని పట్టుకోవడం కష్టమే. గరాజ్ లోకి కాని వెళ్ళదుకదా! అక్కడ చెప్పులన్నీ ఉన్నాయి. స్టాండ్ మీదే ఉన్నాయి కాని చిన్నపామంటున్నారు, వేసుకునేప్పుడు చూసుకొని వేసుకోవాలి.

       ఇలా లాభం లేదని పామును దూరంగా తరిమేసే మందు కోసం వెతికాను. రకరకాల మందులు కనిపించాయి. అమ్మయ్య ఇవి తెచ్చి ఇంటి చుట్టుపక్కలంతా చల్లేస్తే చాలు. ఆ పాములు పారిపోతాయి అనుకునేంతలో 'ప్రిజర్వింగ్ వైల్డ్ లైఫ్' అట ఆ సైట్ లో అసలు అవేవీ పనిచేయవనీ, పాములు దాక్కోవడానికి వీలులేకుండా చూసుకోవడమే ఉత్తమమైన మార్గమని రాసుంది.

      పెరట్లో సొర, బీర ఇప్పుడిప్పుడే చాటలంత ఆకులతో పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. నిద్రలేస్తే ఆకు పిందె చూస్తూ, కలుపు తీస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాను. వాటికింద నీడగా ఉందని పాములు అక్కడికి వచ్చేస్తే? రాకుండా ఉండాలంటే ఇప్పుడా మొక్కలు పీకేయ్యలా?

     "మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం" అనుకుంటూ ఇంకొన్ని సమాధానాలు చదవడం మొదలెట్టాను. "ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పిల్లలకు పాముల గురించి ఎందుకు చెప్పకూడదు?". ఏమిటీ పిల్లలకు పాముల గురించి చెప్పడానికి పెరట్లో పాముని చూపించాలా? ఇదెక్కడ చోద్యం? "మీ పిల్లలు కుక్కల గురించి, పిల్లుల గురించి భయపడడం లేదు. మరి పాములను చూసి ఎందుకు భయపడాలి. వాటి గురించి మీరు వారికి వివరించొచ్చు కదా!" అని ఉంది. పిల్లలకు వాటి గురించి చెప్తాం. వాళ్ళు చూసుకోకుండా పొరపాటున వాటిని ముట్టుకుంటే, లేకపోతే వాటిమీద కాలేస్తే అవి కుట్టకుండా ఊరుకుంటాయా? భలే వాళ్ళే అనుకుంటుండగా గరాజ్ తెరిచిన చప్పుడు వినిపించింది.

        తలుపు తెరిచి చూసేసరికి ఇంకెవరు? ఇంటాయనే మెసేజ్ చూసుకున్నట్లున్నారు దొరికిన గడ్డపార పట్టుకుని హడావిడిగా పొదల దగ్గరకు వెళుతున్నారు. పిల్లలకు చెప్పమన్నారు కదా! పైగా ఒక్కళ్ళే వెళితే ప్రమాదం కూడాను అని బుజ్జిపండును పిలిచాను. పండంటే మూడేళ్ళ వాడు కాదండోయ్. ఆరడుగులకు పైమాటే..ఈ మధ్య జిమ్ కెళ్ళి బస్కీలవీ తీస్తున్నాడు. వాళ్ళనాన్నతో రోజుకోక్కసారైనా కుస్తీ పట్లు వేయడం ప్రస్తుతం వాడి హాబీ.

    ఉదయాన్నే టెన్నిస్ ఆడి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నాడు. వాడి గదిలోకి వెళ్ళి "పండూ, నాన్న పామును చంపుతున్నారు. నువ్వు కూడా వెళ్ళు" అని చెప్పాను. దుప్పటి పక్కకు తీసి నిద్ర కళ్ళతో "వాట్ పామా... నాన్నను ముందు ఫోటో తీయమని చెప్పు" అని దుప్పటి మళ్ళీ ముసుగు పెట్టేశాడు.

       ఏమిటి ఇంతకీ పామేమయిందా అని చూస్తున్నారా? ఇంకెక్కడి పాము అది ఎప్పుడో తప్పుకుంది. ఎటు పోయిందో! రేపు ఉదయం కాఫీ కప్పు పట్టుకుని చెట్లమధ్య దూరే సాహసం మాత్రం చెయ్యలేను.



Wednesday, March 20, 2013

ముఖాముఖి

"శర్కరీ"
"ఊ..."
"మల్లీశ్వరి గారు చిన్న ముఖాముఖి  ఏర్పాటుచేశారు"
"ఎవరిదీ?"
"ఎవరిదంటే..."
"తెలిసి౦ది లేవోయ్...నీదే కదూ"
"నాది కాదు మనది"
"మనదా?"
"ఆ మనదే...మన గురించి నాలుగు మాటలడిగారు"
"అన్నీ సరిగ్గా చెప్పావా లేక..."
"అబ్బే.... అడిగినవాటన్నటికీ సూటిగా సమాధానాలు చెప్పాను"
"అందరికీ చక్కని పేర్లిస్తున్నారట. నిన్నేమన్నారేమిటి?"
"'బుద్దిమంతురాలినని మెచ్చుకున్నారు"
"నీ గురించి నాకు తెలియదా...నిజంగా బుద్దిమంతురాలివే"
"   :-)  "
"సరే వచ్చినవాళ్ళకు జాజిమల్లి బ్లాగుకు దారి చూపించు" 

ఇలా ముఖాముఖి వెంట వెళ్ళామనుకోండి జాజిమల్లి బ్లాగుకు వెళ్ళొచ్చు.

రెండు మెట్లు పైకెక్కుతున్నామంటే నాలుగు మెట్లు కిందకులాగే ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో చెయ్యిపట్టి నిచ్చెన ఎక్కిస్తున్న మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేయడం చిన్నమాటే అవుతుంది. మనసులో భావాన్ని తెలుపడానికి నాకంతకంటే పెద్దపదం తెలియదు. నన్ను పరిచయం చేస్తునందుకు మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 



Thursday, November 29, 2012

అనగనగనగనగా ఓసారి...

"ఈ కార్తీకంలో పంచమి గురువారం నాడు సత్యన్నారాయణ స్వామి వ్రతం జేసుకుంటున్నామొదినా. మీరందర్రావాల." అంటూ ఊర్లో నలుగురినీ పిలిచింది సావిత్రమ్మ. వ్రతం రోజున చుట్టాలు, పక్కాలు, చుట్టూ వున్న నాలుగిళ్ళవాళ్ళు సాయానికొచ్చారు. అందరూ సరదాగా కబుర్లాడుకుంటూ కలసి పనిచేస్తున్నారు.

                   *              *               *                *

"అమ్మాయ్ ఆ దబర ఇటు అందుకోవే"
"దిట్టంగుంది. యాడగొన్నావొదినా?"
"నేనేడగొన్నానా, నాయుడిగారి రాంసుబ్బులు మొన్న టౌనుకు బోయినప్పుడు సుబకార్యాలకు పనికొస్తుందని గొనిందంట. ఇవాళ మనకక్కరకొచ్చింది."
"చిట్టెమ్మావ్ చిక్కుళ్ళు మరీ అంత చిన్నగా తుంచబాకే. కూరముక్కలు కోసే సరికే పోద్దుగూకేటట్టుంది. కొంచెం పెద్దముక్కలు జెయ్." 
"చేసే వాళ్ళకు అడ్డంగాకపోతే నీకేం వంటొచ్చనిమే పోతండావా, అన్నాడక్కా" ముక్కలు తరుగుతూ కాస్త నిష్టూరంగా చెప్పింది జయ. 
"ఎవరుమే అనింది?" అడిగింది పెద్దొదిన.
"ఇంకెవరా, మీ తమ్ముడే"
"అందరూ ఒండేవాళ్ళయితే రుజ్జూసేదెవరని జెప్పలా నువ్వు" మేలమాడింది జానకి. 
"నువ్వుగూడా అట్టనే అంటావేందొదినా" ఉడుక్కుంది జయ. 
"గమ్మునుండండిమే, మనందరమూ కాపురానికొచ్చిన ఇన్నేళ్ళగ్గదా చేస్తండావ, ఆ పిల్లగూడా నేర్చుకుంటదిలే. అయినా ఆ పిల్ల గోసినట్టు కూరగాయలు ఎవరైనా కొయ్యగలరా అంట" సాయానికొచ్చింది పెద్దత్త. 

"పప్పుకు ఇన్ని మావిడికాయలు ఎందుకకా, అసలే ఈ కాయలు పులుసు రొడ్డు. రెండు జాలు." 
"సోలెడు పప్పుకు రెండు కాయలేడ జాల్తాయక్కా?"
"నువ్వట్ట జూస్తావుండు. పప్పుదిన్నాక అదే కరట్టనొప్పుకుంటావు"
"వదినా బూందీకి తోకలొస్తండాయ్ ఇటొచ్చి జూడోసారి." పెరట్లోంచి చిన్నక్క కేకేసింది.
"కాసిని నీళ్ళు చిలకరించి పల్సన జేద్దాం. సరోజా ఆ స్టీలు గిన్నెలో నీళ్ళు దీసకరా!" అని పిండిలో మరికాసిని నీళ్ళు కలిపింది జానకి.
"ఆ..ఆ..పిండి మరీ అలా రైలింజన్లా తొందరతొందరగా దిప్పమాకు. గూడ్సుబండిలా కాస్త మెల్లంగా దిప్పు జయమ్మా."
"ఆ ఇప్పుడు గుండ్రంగా ముత్యాల్లాగా వస్తున్నాయొదినా."
"అకా, ఈ పాకం సరిపోద్దా?"
"ఆ సరిపోద్ది, పాకం ముదిరితే లడ్డు పైన చక్కెర తెల్లంగా పేరుకు పోద్ది. తొందరగా పూస పోసెయ్ అందులో."
"దాన్నట్టా ఒదిలేసి ఇటు రండి, పచ్చడి నూరదాం. వేడిమింద చెయ్యి గాల్తది, బాగా ఆరినాక లడ్లు జుట్టొచ్చులే తొందర్లా."

"ఒదినా ఈ అల్లం, కొబ్బరా, మిరపకాయలూ కాస్త రోట్లో మెత్తంగా దంచీ."
"జానకా ఈ బీన్స్ కూర రుజ్జూడవే."
"నువ్వు బీన్సూ, చనగలు కలిపి కూరచేద్దాం అంటే "ఇదేం కూరా" అని కాస్త ఇచిత్రంగా అనిపించింది గానొదినా, కూర బెహ్మాడంగా కుదిరిందనుకో."
"పెదమ్మా పులుసుకిన్ని ముక్కల్జరిపోతయ్యా?"
"ఆ..అ.. చాల్లే, రాధమ్మోవ్ పులుసుగాస్త చింతపండు నానెయ్"
"రసంగూడా తీసి పెట్టానత్తా. నువ్వింక పొయ్యిమింద బాండలి పెట్టు."
"పిన్నీ ఇదిగో ఈ కొత్తిమీరాకు దుంచి చారులోఎయ్యి కమ్మని వాసనొస్తది." అందించింది జయ.
"ఆ గోంగోరపచ్చట్లో కాసిని ఎరగడ్డలేసి దంచు, కమ్మంగుంటది."
"పన్నెండు గావొస్తుంది, ఈ బీరకాయలకు చెక్కుదీసి చక్రాల్లా గుండ్రంగా కొయ్యి జయమ్మా." 
"బీరకాయ కూర మా అత్త బ్రహ్మాడంగా జేస్తది. అత్తచేతి వంట తిని శానా రోజులైంది. ఆ కూర నువ్వు చెయ్యత్తా." అప్పుడే వచ్చిన అత్తనడిగింది నిర్మల.
"తమ్ముడూ మరదలూ ఒస్తున్నారంటనా"
"ఇంట్లో వ్రతం జేసుకుంటా వుంటే వాళ్ళు రాకుంటే ఎట్టా"

               *                   *                   *                *

"ఏం జేస్తండారు. పనంతా ఐపోయిందా?" అంటూ వచ్చింది పద్మావతమ్మ.
"ఇచిత్రంగా మాట్టాడతండావే. నువ్వురాకుండా పనెట్టా పూర్తవుద్దా."
"నిన్నటినుండి వద్దామనుకుంటున్నానొదినా, యాడా పన్దేమిల్తేగా, ఆ పెద్దగిన్నిటీ కాసిని బంతిపూలు గోసుకొచ్చి మాలగడతా."
"నీ వొక్కదానివల్ల  యాడవద్ది, చెట్లానిండా ఇరగబూసుండాయు. పద నేంగూడొస్తా."
"శానా పూలైనాయే. మాల నేన్గడతాగాని నువ్వు ఇంటి ముందుర నీళ్ళుజల్లి ముకర్ర గీ."
"ఈ మామిడాకులు దీసకపొయ్యి గుమ్మానికి తోరణం కట్టన్నా."
"అందరూ కూర్చునేదానికి కుర్చీలు, బల్లలూ తేను బోతుండాం. ఇంకేమన్నుంటే ఇట్టీండి, కట్టేసి తొందరగ బొయ్యొస్తం."
"పూజ సామానంతా దీసుకొచ్చినట్టేనా! ఆ టెంకాయిటీ పీచు దీస్తా."
"పేరంటాల కివ్వడానికి జాకెట్ ముక్క, పుసూగుంకం, ఆకులు, వక్క రెండరిటిపళ్ళు పొట్లాలలో యేసినం. అంతేనా ఇంకేమైనా ఎయ్యల్నా"
"ఇచ్చేటప్పుడు స్వామికాడ పువ్వోటేసివ్వు. కాస్త నీళ్ళుబోసుకునొచ్చి అక్షింతల బియ్యం ఆ గిన్నెలో గలిప్పెట్టు. అట్టనే సాయంకాలం ప్రసాదానికి, పులుసన్నానికి రవ్వ, బియ్యం అన్నీ పక్కన కొల్చిపెట్టుకో. పనంతా అయినట్టేగా, ఇంక తొందరగా తయారవ్వండి. మేం ఇంటికిబోయి పిలకాయల్ని దీసుకొస్తాం."
"వచ్చినంక రొంత ఎసట్లో బియ్యం బొయ్యడం మర్చిపోబాక."
"అట్నేలె."

                   *                 *             *                *
         ఈ సందడంతా ఇరవై ఏళ్ళ క్రితం మా నాయనమ్మా వాళ్ళింట్లో అనుకుంటున్నారా...కాదండీ పోయిన వారం మేం వ్రతం చేసుకున్నాం. పిలుపులే తేడా సంభాషణలన్నీఅవే. ఈ కాలంలో అమెరికాలోకూడా ఇలాంటి వారి మధ్య ఉన్నామంటే ఎంతదృష్టమో కదా! సుమారుగా వంద మందికి ఇలా ఇంట్లోనే వంటలు చేసేశాం. ఆహుతులందరూ కూడా ఏదో ఒక సాయం అందించిన వారే! వంట, వడ్డన, కుర్చీలు, బల్లలు తేవడం, చివరకు మిగిలిన కూరలు సర్దడం వరకూ అన్ని పనుల్లో సహాయం చేశారు. మా ఊర్లో ఎవరింట్లో ఏ శుభకార్యమైనా ఇలాగే చేసుకుంటాం. పుజారిగారు శాస్త్రోక్తంగా పూజ చేయించారు. వ్రతానికి వచ్చినవారి గోత్రనామాలు అడిగి మరీ వారిని కూడా ఆ దేవుడికి పరిచయం చేశారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని అందరికీ తాంబూలాలివ్వడంతో వ్రతం పూర్తయ్యింది. 

               *                   *                   *                *

ఇంతకూ వ్రతానికొచ్చిన బంధు మిత్రులేమన్నారో చెప్పలేదు కదూ...

"వంటలన్నీ బ్రహ్మాడంగా కుదిరాయి."
"లడ్లు రుచి అమోఘం."
"వ్రతం చాలా బాగా చేయించారు. ఈ పూజారి గారిని మనూర్లో ఎప్పుడూ చూడలేదే."
"కొత్తగా వచ్చారండీ తెలుగు పూజారి కదా మన పద్దతులు అవీ వారికి బాగా తెలుసు."
"ముఖ్యంగా కథ చదవమని పేపర్లు మన చేతిలో పెట్టకుండా ఆయన చెప్పడం చాలా నచ్చింది."
"కార్తీక పౌర్ణమినాడు పూజారి గారికి మా ఇంట్లో వ్రతం చేయించడానికి  వీలవుతోందేమో కనుక్కోవాలి."