Friday, October 7, 2011

నిను చూడక నేను౦డలేనూ...

నీవు లేక క్షణమైనా మనగలనా..
నిన్ను వదిలి ఎలా వెళ్ళను?

నేను నీ కోసమే పుట్టానన్నావు
నా తోడిదే నీ లోకమన్నావు!

మనం పాడుకున్న పాటలు
కలబోసుకున్న కబుర్లు ఇందుకేనా?

నేనొక్క ముద్దు పెడితేనే పరవశించి పొయ్యేదానివి
నా సమక్షమే నీకు స్వర్గమనేదానివి!

నా కోసమా! నా మంచి కోసమేనా!
నీవు దరిలేని మంచి నాకెందుకు?

మనం కలసి తిరిగిన చెట్టు చేమలు
నువ్వు వంటరిగా వెళితే బెంగపడవూ..

ఆ చెట్టుమీద పిట్ట, పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద
నా గురించి అడిగితే నువ్వేమని చెప్తావ్?

నాకు నువ్వు తప్ప ఎవరూ ఇష్టం లేదు
నేను ఇక్కడ తప్ప ఎక్కడా ఉండలేనే...

నువ్వు మాత్రం, నన్నొదిలి ఉండగలవా?
ఈ ఒక్కసారికీ నీ మనసు మార్చుకోవా...

నీ మాట వినలేదన్న కోపమా
ఇంకెప్పుడూ అలా చేయ్యనుగా...నమ్మవా?

నిన్నెవ్వరితోనూ మాట్లాడనివ్వట్లేదనా
అన్నీ నువ్వనుకున్నట్టుగానే చేద్దాం!

నీ ఒడే నా బడి నాకింకేమీ వద్దు
నన్ను బడికి పంపించకమ్మా!!
   

          బాబును స్కూల్ కి పంపించినపుడు వాడి గుండె కరిగి నీరయితే దొరికిన 'అక్షరాలి'వి. నలుగురు పిల్లల్ని పోగేసి,  కాగితం మీద రంగులూ, చిన్న చిన్న బొమ్మలూ వేయించేదాన్ని. చిన్న టేబుల్ దగ్గర కూర్చుని చేసేవాళ్ళు. అది పూర్తవగానే 'అమ్మా చూడు' అంటూ వెనక్కి తిరిగి చూపించడం వాడికలవాటు. ఒకసారి స్కూల్ లో కూడా... వేసిన బొమ్మ పూర్తవగానే అలవాటుగా 'అమ్మా చూడు' అంటూ వెనక్కి తిరిగాడట, చెమ్మగిల్లిన నా మనసు 'ఆ' అక్షరాలకిచ్చిన రూపం ఇది.

10 comments:

 1. బాగుందండీ ఇలాంటివి స్వానుభవం కలిగినప్పుడు ఇంకా ఆస్వాదించగలనేమో!

  ReplyDelete
 2. బాగుందండి.మా అబ్బాయి పాఠశాలకెళ్ళేటప్పుడు వాళ్ళమ్మతో నేను స్కూలుకెళ్తే ఇంట్లో నువ్వెట్లమ్మా అని ఏడ్చేవాడు :)

  ReplyDelete
 3. పంచుకున్న ప్రాణము ఇలా పరవసమైతే అ భావనకు పేరు అమ్మ అని చెపొచు...
  మీ అక్షరాలే కాదు అమ్మ మనసు చాలా బాగుందండి..

  ReplyDelete
 4. అవును..రసజ్ఞ గారు చెప్పింది నిజం. కొన్ని భావనలని అనుభవించాల్సిందే..ఒక్కొక్కసారి వాటికి మాటలు కూడా ఉండవు. చాలా బాగా చెప్పారు జ్యోతి గారు..

  ReplyDelete
 5. @ రసజ్ఞ గారూ..థాంక్ యు

  @ విజయమోహన్ గారూ బాబుని బడికి పంపించినప్పుడు ఇంత చిన్న పిల్లలకి అప్పుడే బడి ఎందుకు అనిపించేద౦డీ..దానికి తోడు బాబు అలా అనేసరికి..చాలా రోజులే పట్టింది మా ఇద్దరికీ అలవాటవడానికి. ధన్యవాదాలు విజయమోహన్ గారు.

  @ మంచి వాఖ్య ధన్యవాదాలు కళ్యాన్ గారూ..

  @ సుభా టపా పెట్టిన వెంటనే పలకరించే మీ వ్యాఖ్య చాలా సంతోషం కలిగిస్తుంది. మీకు బోలెడు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. శీర్షిక చూసి ప్రేమ కవితేమో అనుకుంటూ వచ్చాను...ప్రేమే..కాని అమలిన ప్రేమ. అమ్మ మాత్రమే పంచగలిగిన ప్రేమ.
  చెమ్మగిల్లిన తల్లి మనసుకు సాంత్వన కలిగేది బిడ్డ అభివృద్ధి చూశాకనే :). అదీ మీ అక్షరాల్లో చూడగలిగిన రోజు త్వరలోనే రావాలని ఆశిస్తూ ...

  ReplyDelete
 7. మానస గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు.

  ReplyDelete
 8. బుజ్జాయిలని బడికి పంపించాలంటే, ఏంటో బాధగా తప్పు చేస్తున్నట్టుంటుంది తల్లికి. పిల్లలకి ఎలా ఉంటుందో అనుకునే దాన్ని. మీరు చూపించారు మీ కవితలో!

  వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యరూ! వ్యాఖ్య రాయడం సులువవుతుంది.

  ReplyDelete
 9. బాగుందండీ.అమ్మ మనసుప్రతి అక్షరంలోనూ కనిపించింది.

  ReplyDelete
 10. @ కొత్తావకాయ: స్వాగతమండీ. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నాను మీకోసం. వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. వర్డ్ వెరిఫికేషన్ తీసేశాను.

  @ శైల గారూ ధన్యవాదాల౦డీ.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.