Friday, September 2, 2011

ప్రేమ లేఖ

ప్రియమైన శ్రీవారికి,

       నిన్న ఉదయం కిటికీ తీయగానే ఇంకా చీకటి పోలేదులా వుంది. చలి చలిగా వుంది. ఓ కప్పు కాఫీ కలుపుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాను. బయట చీకటి కరిగి పల్చని వెలుతురు పరుచుకు౦టో౦ది. ఆకాశం మబ్బు పట్టి ఎంత బావుందో! నింగి నేలా అంతా కలసి పోయినట్లు...ఒకరోజు మీకు గుర్తుందా ఉదయం నిద్రలేచి కళ్ళు తెరవగానే వర్షం పడుతూ కనిపించింది. 'వీపింగ్ విల్లో' మీద నుంచి చినుకులు పడడం.... సిడి లో మంచి పాటలు వింటూ... ఓహ్! ప్చ్ ఇప్పుడు కూడా ప్రక్కన మీరుంటే బావుండేదనిపించింది. ఇలా ప్రకృతిని చూస్తూ జీవితమంతా గడిపేయొచ్చు కదూ! ఓ సారి తెల్ల తెల్లని మంచు కురుస్తూ, మరో సారి ఫాల్ కలర్స్ తో, ఇంకోసారి  రంగు రంగుల పువ్వులు, వాటి కోసం వచ్చే సీతాకోక చిలుకలు, బుల్లి బుల్లి పక్షులు.... కాని ఏమైనా వర్షం అందం వర్షానిదే. ఇలాంటి వర్షంలోనే కదూ మనం కారులో షికారు కెళ్ళే వాళ్ళం. 

         ఎందుకో మన పెళ్లి రోజు గుర్తొచ్చింది.  పెళ్ళిపీటల మీద కూర్చుని తలంబ్రాలు పోసుకున్నది నిన్న మొన్నలా లేదు. ఓ సారి నేనిలా అంటే ఏం లేదు...మనం యుగ యుగాలనుండీ కలిసి ఉన్నట్లుగా వుంది అన్నారు. అదీ నిజమే 'ఈ నాటి ఈ బంధమేనాటిదో' అని ఆత్రేయగారన్నట్లు...  మనబంధం ఏ నాటిదో  అనిపిస్తుంది.  ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. వర్షం తగ్గిపోయిందని వాకింగ్ కి బయలు దేరాను.  

        రోడ్డు మీద వెళుతూ వుంటే పక్కన మీరున్నట్లే అనిపించింది. ఆ  పూల గురించి...పిట్టల గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో కదా! ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. వచ్చీ రాగానే 'అమ్మడూ కాఫీ' అనడం మీకలవాటు. స్నానం లేదు, పూజ లేదు దిగాలుగా కూర్చుండి పోయాను. బైట సన్న  సన్నగా తుంపర మొదలైంది. ఎప్పటి సంగతో 'చినుకు చినుకు సందడితో చిట పాట చిరు సవ్వడితో' పాట వింటూ వర్షం చూసిన ఉదయం మదిలో భారంగా మెదిలింది. వర్షం చూస్తూ పుస్తకం చదవడమంటే మీ కిష్టం, నేనేమో పుస్తకంలో మునిగేతే బైట వర్షమే పడుతుందో వరదలే వస్తున్నాయో ఎవరికి తెలుస్తుందని పోట్లాదేదాన్ని కదూ. జాజి పూల మాలకడుతూ ఎన్నెన్ని ఊసులల్లుకున్నమో కదూ! 

            నా ఊహలలో నేను౦డగానే  పన్నెండయ్యి౦ది. అప్పటికి నేనింకా మెయిల్ కూడా చూడలేదు. మెయిల్ ఓపెన్ చెయ్యగానే మొన్న రాత్రి మీరు  పంపిన పాట 'నీవు రావు నిదుర రాదు' విన్నాను. మరీ దిగులేసి మన ఆల్బం ముందు వేసుకుని కూర్చున్నాను. 'షానన్ ఫాల్స్'  లో రాళ్ళ మీద నడిచిన రోజులు, 'మయామి బీచ్' లో గవ్వలేరిన క్షణాలు, 'నయాగరా'లో మన నయగారాలు, తీపి గుర్తులు నెమరువేస్తూ ఉండిపోయాను.

       సంధ్య దిగులుగా వెళ్ళింది. గుండెల్లో గుబులు  చీకటై విశ్వమంతా వ్యాపించిది. దిగులేసిన చెంద్రుడు నాతో చెలిమికి వెన్నెలతో రాయబారం పంపాడు. కిటికీ పక్కగా కుర్చీ వేసుకు కూర్చున్నాను.  బయట వెన్నెల ఎంత అందంగా వు౦దనుకున్నారూ... మీతో కలసి 'వెన్నెల రేయి ఎంతో చలి చలి' పాట వినాలని పించిది. ఎదురు చూసిన చుక్కలు వెల వెలబోతూ తప్పుకున్నై. క్షణాలే   శత్రువులై నా మీద దాడి చెయ్యడం మొదలెట్టాయ్.  ఎంతకీ తరగని రాత్రి ఏవేవో ఆలోచనలతో గడిపేశాను...అన్నీ మీ  గురించే.

        ఇవేమీ తెలియని ఉష గంతులేస్తూ వచ్చేసింది. సంతోషాల తోరణాలు కడుతూ పసిడి కిరణాలు సందడి చేసాయ్.  మొక్కల సరదా చూద్దామని అలా బయటకు వెళ్లాను. మన మినీ రోజెస్ ఇవాళ ఎన్ని పూలు పూశాయో! లోపలికి వస్తూ మీకిష్టమైన ఎర్ర గులాబీలు తెచ్చి వేజ్ లో  పెట్టాను. చిత్రంగా లేదూ పదిహేనేళ్ళ క్రిందటి మాట. మీరప్పుడనేవారు  గుర్తుందా. మన మధ్య ప్రేమ రోజు రోజుకూ పెరుగుతుంది కాని తగ్గదని. ఎన్నటికీ వాడిపోని మన ప్రేమ కుసుమాల సాక్షిగా

          నిను చూడక నేనుండలేనూ ఈ జన్మలో మరి ఆ  జన్మలో మరి ఏ జన్మకైనా ఇలాగే....
                                                          
మీ 
శ్రీమతి 


తొలి ప్రచురణ వాహినిలో....

8 comments:

 1. ఈ విరహ వేదన ఎన్ని రోజులో పాపం :)

  ReplyDelete
 2. తెలుగమ్మాయి గారూ...నిరీక్షణ ముగిసే వరకూ నండీ..థాంక్ యు..

  ReplyDelete
 3. mee lekha baagundi, intha manchi blogs inni rojulu miss aiyinanduku feel avuthunnanu. inthaki sharkari ante naaku ardham teliyadu dayachesi cheputhaara?

  ReplyDelete
 4. గీత-యశస్వి గారూ..స్వాగతం. మీకు నా బ్లాగ్ నచ్చిననదుకు చాలా సంతోషంగా ఉంది. చాలా వెనుకకు వెళ్లి ఈ లేఖ చదివారే. ఈ 'ప్రేమలేఖ' తోనే బ్లాగు మొదలు పెట్టాను..ధన్యవాదాలు.

  'శర్కరి' అంటే 'లేఖిని' అని అర్ధం. పర్యాయపదాలు..అక్షరజనని, కలము, గంటము, పేనా, అక్షరాతూలిక, వర్ణమాత, వర్ణిక.

  ReplyDelete
 5. చాలా చక్కగా , సునిశితంగా , ఆర్దృంగా బాగుంది మీ లేఖ.......
  ఈ విరహం ఎన్ని రోజుల వరకు సాగింది....?

  ReplyDelete
 6. మాధవి గారూ లేఖ నచ్చినందుకు సంతోషం. ఆ విరహం ఎంతవరకూ సాగిందంటారా...నిరీక్షణై..చుక్కపొడిచే వేళ దాకా..

  ReplyDelete
 7. మీ అనురాగానికి మా వందనాలు... మీలాగా ప్రతి ఒకరు ఉంటె ఎంతబాగుంటుందో..

  ReplyDelete
 8. తెలుగు పాటలు గారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.