Monday, October 3, 2011

అలా మొదలైంది...

         
              నేను వ్రాసిన కవితలు బావున్నాయా? అసలు ఎవరికైనా నచ్చుతాయా? అనే అనుమానం వుండేది. నా హితులూ, స్నేహితులూ బావున్నాయనే వారు, కాని నా మీద ప్రేమతో చెప్తున్నారేమో అని సందేహం. కౌముదికి పంపించాను.

             'కిరణ్ ప్రభ గారు' "Good concepts and very good expressions.. Keep writing Jyothirmayi Garu...."  అని పంపించినప్పుడు అంత గొప్ప సంపాదకులకు నచ్చాక నా సందేహం తీరిపోయింది. నా కలం కదలడానికి ప్రోత్సాహమిచ్చిన 'కిరణ్ ప్రభ' గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

           ఓ రోజు అలవాటుగా 'చిమటామ్యూజిక్.కాం' లో పాటలు వినడానికి వెబ్సైటు ఓపెన్ చేసాను. అక్కడ కొన్ని పాటలకు 'నిషిగంధ' గారి వ్యాఖ్యానం చదివాను. చాలా చాలా నచ్చింది. ఆ సైట్ లోనే ఆవిడ పొయెట్రీ అని కనిపించి౦ది. వెళ్లి చదవడం మొదలు పెట్టాను. ఆ కవితల్లో నన్ను నేను మరచి పోయాను. ఆవిడ కవితల్లో ప్రతి వాక్యంలో భావుకత వెల్లివిరుస్తుంది. పారిజాతాలు మన మనసులోనే  విచ్చుతున్న అనుభూతి కలుగుతుంది.

ఆవిడ కవితల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.....

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!

ఈ కవితలో సామీప్యానికి సాన్నిహిత్యానికి ఉన్న తేడా అవిడ వివరించిన శైలి....అద్భుతం. అలాగే వెన్నెల గురించి ఆవిడ వాక్యాలు

'చుక్కల నవ్వుల్ని తోడిచ్చి
జాబిలి దోసిలి నించి
జారవిడిచింది..'

ఈ వాక్యాలలో ఎంత ప్రేమ భావం నిండియున్నదో చూడండి.

'ఏ దిగంతాల అవతల
నీ అడుగుల సడి వినబడిందో
పువ్వు నించి పువ్వుకి
ఆనందం వ్యాపిస్తోంది..'

ఇలా ఎన్నెన్నో...

           ఇక ఈ కవితల వ్యాఖ్యలు. నాకు ఇంకో ప్రపంచం చూపించాయి. అలా కనిపించిందే 'స్నేహమా' రాధిక గారి బ్లాగు. ఆవిడ  చిన్న చిన్న పదాల అల్లికతో కవితలు ఎంత బాగా వ్రాశారో! ప్రతి కవితకి ఒక చిత్రం ఆ కవితలకు అదనపు ఆకర్షణ. ఆవిడ 'గాయ పడిన నమ్మకాలు' కవితలో అంటారూ ..

'గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను'

మనసుని కదిలించే సన్నివేశం మన కళ్ళ ముందు ఆవిష్కృతమౌతుంది. ఇక 'ఊరు' కవితలో

'ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు'

ఇది చాలు ఆవిడ కవితల గురించి చెప్పడానికి.

       నాకు బ్లాగ్ పెట్టాలన్న ఆలోచన అప్పుడు మొదలైంది. బ్లాగుపెట్టి వ్రాస్తుంటే తెలియని ఆనందం నాలో. ఇంతటి ఆనందం నాకు కలగడానికి ఈ బ్లాగు పెట్టడానికి స్ఫూర్తి నిచ్చిన నిషిగంధ గారికి, రాధిక గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

       . మొదలుపెట్టాక "నా బ్లాగుకి వచ్చి వ్యాఖ్యతో పలకరించకపోతే...ఎంత అద్భుతమైన రచనని చదవకుండా ఉండేదాన్నోకదా" అంటూ 'ఇల్లాలి ముచ్చట్లు' సుధ గారి వ్యాఖ్య చూశాక ఎంత ఆనందం కలిగి౦దో మాటల్లో చెప్పలేను. అలాగే మధురవాణి గారు కామెంట్ పెట్టటమే కాక నాతో చెలిమికి తన రాధ నిచ్చిన తొలి నెచ్చెలి, తరువాత 'వెన్నెల్లో గోదారి' శైల బాల గారు నా రెండో అతిధి. ఈ మధ్యనే 'కడలి' సుభ గారు కూడా...

        మధుర వాణి గారికి, శైల బాల గారికి, సుభ గారికి...ఇంకా బ్లాగుకు వచ్చి కామెంటిచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.

జ్యోతిర్మయి

4 comments:

  1. మీ అనుభూతి చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.స్నేహమా బ్లాగ్లొ నాకు నచ్చిన కవితలొని భాగాలే మీకు నచ్చాయి అని చెపుతుంటే సంతొషంగా ఉంది. మీరు నిజంగా బాగా వ్రాస్తున్నారు అభినందనలు

    ReplyDelete
  2. మీ స్పందనకు థాంక్స్..వనజ గారూ.

    ReplyDelete
  3. బాగు..బాగు జ్యోతిర్మయి గారు.. మీకు నా హృదయపూర్వక ' సుభా ' కాంక్షలు.

    ReplyDelete
  4. ఆకాంక్షతో ఎదురుచూసిన నాకు ఏకా౦క్ష లేకుండా ఆపేక్షతో 'సుభా'కా౦క్షల౦దించారు. ధన్యవాదములు..సుభ గారూ..

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.