Wednesday, October 5, 2011

ఒక ఆకు వెయ్యొచ్చుగా..

చిక్కటి చీకటిలో ఒక కారు రోడ్ మీద వెళుతూవుంది. దూరంగా బ్రిడ్జి కనిపిస్తూ ఉంది. కారు వేగంగా బ్రిడ్జ్ మీదకు వచ్చేసింది. అది టీవిలో కనిపిస్తున్న దృశ్యం. ఏం జరగబోతోంది ఇప్పుడు? సోఫాలో ఆ చివర నున్న చిట్టితల్లి ఇటు జరిగి అమ్మకు దగ్గరగా కూర్చు౦ది. చిట్టితల్లి చేతిలో పాప్ కార్న్ గిన్నె, చేతిలోకి తీసుకున్న పాప్ కార్న్ నోటిదాక వెళ్ళక మధ్యలోనే ఆగిపోయింది. వేగంగా బ్రిడ్జ్ మీద వెళుతున్న కారు నీళ్ళ లోకి దూకేసింది. టీవి లో శబ్దం ఒక్కసారిగా ఆగిపోయి అంతటా నిశ్శబ్దం. ఇంతలో ఎక్కడో దూరంగా అంబులెన్స్ వస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంబులెన్స్ రంగు రంగుల లైట్స్ కనిపిస్తున్నాయి. అంబులెన్స్ దగ్గరగా వచ్చేసింది. రెండు ఫైర్ ట్రక్కులు కూడా వచ్చేశాయి. ఒక్కసారిగా అక్కడ హడావుడి మొదలైంది. కారు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద హుక్ నీళ్ళలో వేసారు. చిట్టితల్లి అమ్మకు ఇంకా దగ్గరగా జరిగి కూర్చుంది.

అమ్మయ్య! కారు కొంచెం నీళ్ళ లోంచి బయటకి కనిపిస్తోంది. అయ్యొయ్యో మళ్ళీ మునిగిపొతో౦దే. మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అమ్మయ్య ఈసారి కారు మొత్తం కనిపిస్తోంది. ఫైర్ ఫైటర్స్ కార్ ను బ్రిడ్జ్ మీదకు చేర్చేసారు. ఇంతవరకు చేతిలోనే పట్టుకున్న పాప్ కార్న్ పాప నోట్లోకి వెళ్ళింది.

ఒక్క క్షణం నిశ్శబ్ద౦ తారువాత "ఆకు వెయ్యొచ్చుగా" హఠాత్తుగా అంది చిట్టితల్లి.
"ఏమిటీ?" అమ్మకు అర్థం కాలేదు.
"అదే అమ్మా, నీళ్ళలోకి ఒక ఆకు వేస్తే ఆ కారు ఆకు మీదెక్కి వచ్చేస్తు౦దిగా." వివరించింది చిట్టితల్లి.
"హ..హ..హ.." అర్థమైన అమ్మ గట్టిగా నవ్వేసింది.

నేను మా చిట్టితల్లి టివి లో '911' ప్రోగ్రాం చూస్తూ ఉండగా చిట్టితల్లిచ్చిన సలహా...మరి వాళ్ళకు ఆ 'పావురం..చీమ' కథ తెలియదుగా... మీకా కథ తెలుసా? మీకెవరైనా ఫైర్ ఫైటర్స్ తెలిస్తే వాళ్ళకీ ఈ కథ చెప్పండి. హుక్స్ అవీ కాకుండా ఆకులు నీళ్ళలో వేస్తారు.

                               పావురం......చీమ

అనగనగా ఒక అడవిలో ఓ పెద్ద చెట్టు. 'ఒక్క చెట్టేనా' అని ఆశ్చర్య పోకండి మా అమ్మాయిలా. చాలా చెట్లు ఉన్నై, మన కథ ఈ చెట్టు దగ్గర మొదలవుతుందన్నమాట. ఆ చెట్టు మీద ఓ పావురం అందమైన గూడు కట్టుకుని ఉంటుంది. ఆ చెట్టుకింద పుట్టలో ఒక చీమ ఉంటుంది. అవి రెండూ కూడా మంచి స్నేహితులు. ఒక రోజు చల్ల గాలి వీస్తూ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నై. మన చీమకి పాటల౦టే మహా ఇష్టం. 'చల్ల గాలి అల్లరి ఒళ్ళ౦త గిల్లి' అంటూ డాన్స్ చేస్తూ చెట్టు నొదిలి దూర౦గా వెళ్ళింది. ఈ ముచ్చట౦తా మన పావురం చెట్టు మీద నుండి ముసిముసి నవ్వులు నవ్వుతూ సినిమా చూసినట్టు చూస్తూ ఉంది.

ఈ లోగా చినుకులు మొదలయ్యాయి. మన చీమ 'అమ్మ బాబోయ్ వర్షం' అంటూ చెట్టు దగ్గరికి పరిగెట్టి౦ది. ఎంతైనా చీమ నడకలు కదా! పాపం ఇంకా అది దానింటికి చేరనే లేదు. భోరున వర్షం మోకాలై౦ది. వర్షం నీళ్ళు చిన్న చిన్న కాలువలుగా మారిపోతున్నాయి. చీమ పరిగెడుతూ, పడుతూ, ర్లుతూ ఇల్లు చేరాడానికి చాలా కష్టాలు పడిపోతూవుంది. పావురం దాని బాధ చూస్తూ అయ్యో అనుకుంటూనే ఏం చెయ్యాలా అని ఆలోచించింది. అప్పుడు దానికి ఛమక్ మని ఓ ఆలోచన వచ్చింది.

ఒక ఆకును తుంచి చీమ ముందు పడేలా వేసింది. ఆకు పడుతుందా? గాలికి కొట్టుకు పోతుందా? పడుతుందా లేదా, పడుతుందా లేదా అని నాకనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా? అమ్మయ్య! చీమ ముందే పడింది. అప్పుడు మన చీమ ఆ ఆకు పడవ మీదెక్కి 'లాహిరి లాహిరి లాహిరిలో' అని పాడుకుంటూ చెట్టెక్కేసింది. అప్పుడు చీమ కిందకి చూస్తూ 'అమ్మయ్యో ఎన్ని నీళ్ళో' అనుకుని, పావురంతో 'నీవల్లే నేనివాళ బతికి బయట పడ్డానూ నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాను' అని చెప్పి౦ది. అప్పటి నుండి వాళ్ళు ఇంకా మంచి స్నేహితులైపోయారు.

ఒకరోజు పావురం తన మిత్రులతో కలసి, ఒక చెట్టుకింద గింజలు తింటూ ఉంది. 'ఆ మిత్రులలో చీమ లేదా' అన్న సందేహం మీకూ వచ్చిందా? మా అమ్మాయికి వచ్చింది. ఆ మిత్రులలో చీమ లేదు లెండి. చీమ, చీమ నడకలు నడుస్తూ మెల్లగా వస్తూ వుంటుంది. అప్పుడు ఒక వేటకాడు 'భలే చాన్సులే, భలె భలే చాన్సులే లలలాం లలలాం లక్కీ చాన్సులే' అనుకుంటూ' బాణం పావురం వైపు గురిపెట్టాడు. ఆ చెట్టు దగ్గరే ఉన్న చీమ ఆది చూసి వేట గాడి కాలుమీద గట్టిగా కుట్టేసింది. ఆ వేటగాడు 'చచ్చాను బాబోయ్' అని అరిచి బాణాన్ని పైకి వదిలేసాడు. ఇంకేముంది వేటగాడి అరుపువిని పావురాలన్నీ 'రయ్యిన' ఎగిరిపోయాయి.

అదన్న మాట కథ. కథ కంచి మనం ఇంటికి.

11 comments:

  1. బాగుందండీ ఎప్పుడో చదివిన కథ....దాన్ని మీ అమ్మాయి అన్వయించిన వైనం...:)

    ReplyDelete
  2. మీ అమ్మాయితో కలిసి టి.వి. చూస్తున్నారా? దగ్గరుండి బాగానే చెడగొడుతున్నారు(సరదాకి మాత్రమేనండోయ్.) ఇంతకీ కథ మీరు చెప్పిన విధానం బాగుంది. మీ అమ్మాయి భలే సందేహం వెలిబుచ్చిందిలెండి. హ హ హ..
    బాగుంది. బాగుంది..

    ReplyDelete
  3. @ భాను గారూ..దన్యవాదాలు

    @ సుభ గారూ..పిల్లలు చిచ్చరపిడుగులు కదండీ..థాంక్ యు

    ReplyDelete
  4. chala bagundandi katha.....mee website kooda chaala bagundi.

    ReplyDelete
  5. ఒక్క వ్యాఖ్య, ఒక్క చిన్న మాట ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. బ్లాగు నచ్చి౦దన్నారు..ధన్యవాదాలు మాధవిగారూ..

    ReplyDelete
  6. chaala baaga raasaaru vadhina telisina kathe ayina meeru cheppina vidhaanam baagundhi.

    ReplyDelete
  7. Dear Jyothirmayi garu,
    Thanks a lot. ee rojullo pillalaku kathalu cheppadam, goru muddalu thinipinchadam ..... excellent. Pillalu evaritho social gaa undadam ledani 1st std lone hostel lo vese thallulnichoosinanaaku meeroka ascharyam, mallee yashoda devi ni choosinantha santhoshanga undhi.kaneesam pillalanu itla kooda pencha vachu ane idea mee blog dwaara thelusthundi.
    -Latha

    ReplyDelete
  8. లతగారూ మీ అభిమానానికి ధన్యవాదాలు. మనం చెప్పే కథలను పిల్లలు అన్వయించుకునే తీరు చూస్తుంటే మనం వాళ్లకు చూపించే ప్రపంచం ఎంత అందంగా స్వచ్చ౦గా ఉండాలో అనిపిస్తుంది.

    ReplyDelete
  9. చాలా రోజుల తరువాత మీ పోస్ట్ చదివా.చాలా బాగుంది.ఇలా fb లో షేర్ చేయండి.చూస్తాము.
    పిల్లలు పెద్దయ్యాక వాళ్లలో అప్పటి అమాయకత్వం కనబడదు.పెద్దలు వాళ్ళ ముందు అమయకం గా కనబడతారు.సీన్ రివర్స్ అవుతుంది.

    ReplyDelete
  10. అందమైన కథ. కథను మలిచిన తీరు అద్భుతం జ్యోతి గారూ.. నో డౌట్. తల్లికి తగిన తనయ మీ అమ్మాయి.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.